అది నన్ను కలిచివేసింది:లారా
దుబాయ్: వెస్టిండీస్ మేటి క్రికెటర్లలో ఒకడైన శివనారయణ్ చందర్పాల్ కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం నిజంగా బాధాకరమని ఆ దేశ లెజెండ్ క్రికెటర్ బ్రియాన్ లారా పేర్కొన్నాడు. ఒక్క టెస్టు మ్యాచ్ లో అతనికి అవకాశం కల్పించి ఘనంగా ఫెర్వెల్ చెబితే బాగుండేదన్నాడు. వెస్టిండీస్ టెస్టు జట్టు నుంచి అతన్ని తొలగించడమే కాకుండా, వీడ్కోలుకు చెప్పకపోవడం తనను కలచివేసిందని లారా తెలిపాడు. చందర్పాల్ నిజంగా ఒక మంచి క్రికెటర్. 20సంవత్సరాల నుంచి జట్టుకు సేవలందిస్తున్న చందర్పాల్ కు ఇంకా స్థానం కల్పించాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ వీడ్కోలు చెప్పే క్రమంలో అతనికి ఒక అవకాశం ఇవ్వాల్సింది. ఇది చందర్పాల్ను కూడా తీవ్రంగా బాధించి ఉంటుంది'అని లారా తెలిపాడు. ఈ సందర్భంగా తన సమకాలీన క్రికెటర్ అయిన చందర్పాల్ తో ఆడిన క్షణాలను లారా గుర్తు చేసుకున్నాడు.
ఇటీవల చందర్పాల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మెట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చందర్ పాల్ తప్పుకున్నాడు. తన కెరీర్ లో 164 టెస్టు మ్యాచ్లు ఆడిన చందర్పాల్ 30 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీల సాయంతో 11, 867 పరుగులు చేసి విండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో టెస్టు క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. అతని కంటే ముందు బ్రియాన్ లారా(11,953) ఉన్నాడు.