పృథ్వీ షా (PC: BCCI/IPL)
‘‘అతడొక అద్భుతమైన పిల్లాడు. కానీ తనని అందరూ అపార్థం చేసుకునేందుకు అన్ని విధాలా ఆస్కారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటి కుదుపు ఒకటి అవసరం. షాక్ తగలాల్సిందే. అతడు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత ప్రతిభావంతమైన బ్యాటర్ అని కితాబులు అందుకుంటూ పెరిగాడు.
ప్రపంచంలో సచిన్, కోహ్లి తర్వాత ఎంఆర్‌ఎఫ్ బ్యాట్‌ను సొంతం చేసుకున్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నాడు. కొంతమంది అతడిని లారా అన్నారు. మరికొందరేమో మరో సచిన్ అని కీర్తించారు. ముంబై క్రికెట్ మొత్తం అతడి గురించే మాట్లాడేది. సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలను ముంబై అందించింది.
అతడు కూడా వారి స్థాయికి ఎదుగుతాడని అంతా భావించారు. కానీ.. పృథ్వీకి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఇలా జరగాల్సిందే. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అతడికి కాంట్రాక్టు ఉండేది. కానీ ఇప్పుడు అసలు తన పేరే ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ అన్నాడు. భారత క్రికెటర్ పృథ్వీ షాను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలి
ఇప్పటికైనా పృథ్వీ కఠినంగా శ్రమించి.. మునుపటి కంటే గొప్పగా తిరిగి రావాలని పార్థ్ జిందాల్ ఆకాంక్షించాడు. ఫిట్‌నెస్ సాధించడంతో పాటు క్రమశిక్షణతో మెలుగుతూ పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని అతడిని ఉద్దేశించి ఇండియా టుడేతో స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.
కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. అయితే, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా క్రమక్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు.
టీమిండియాలో చోటు కరువు
శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్ల రాకతో ఓపెనర్‌గా మళ్లీ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు.. ఐపీఎల్‌లోనూ మంచి ఆరంభమే అందుకున్నా.. ఇప్పుడు కనీస ధరకు కూడా అమ్ముడుపోని దుస్థితికి చేరుకున్నాడు.
ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలంలో పృథ్వీ షా రూ. 75 లక్షలకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి వైపు కన్నెత్తి చూడలేదు. ఆరంభం నుంచి అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ కూడా పృథ్వీని మొత్తానికే వదిలించుకుంది.
క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌లేమి
ముంబై క్రికెట్ జట్టులోనూ పృథ్వీ షాకు సుస్థిర స్థానం లేదు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌లేమి ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శల వర్షం కురుస్తుండగా.. పార్థ్ జిందాల్ పైవిధంగా స్పందించాడు.
కాగా 2018లో ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున అడుగుపెట్టిన పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2024లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడి సేవల కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. కానీ పూర్తిగా నిరాశపరచడంతో వేలానికి ముందు విడిచిపెట్టింది.
చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో అత్యంత చెత్త రికార్డుతో శార్దూల్!.. రహానే దంచికొట్టినా..
Comments
Please login to add a commentAdd a comment