అటువంటి రోజు రాకూడదు... ఎవరికైనా | Should such a day ... to anyone | Sakshi
Sakshi News home page

అటువంటి రోజు రాకూడదు... ఎవరికైనా

Published Sun, Mar 20 2016 3:28 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

అటువంటి రోజు రాకూడదు... ఎవరికైనా - Sakshi

అటువంటి రోజు రాకూడదు... ఎవరికైనా

విద్య - విలువలు
 
ఒక బ్యాట్స్‌మన్ చాలా గొప్పవాడు కావాలంటే-కేవలం చాలా బాగా ఆడగలడు కాబట్టి గొప్ప బ్యాట్స్‌మన్ కాడు. అతన్ని అందరికీ మార్గదర్శకుడిగా ఎప్పుడు చెబుతారంటే అతనికి-ఏ బాలు కొట్టాలో దాన్ని మాత్రమే కొట్టడం, ఏది కొట్టకూడదో దాన్ని వదిలివెయ్యడం తెలిసి ఉండాలి. అలా ఆడినప్పుడే అతను గొప్పవాడవుతాడు. సునీల్ గవాస్కర్ నిజానికి పొట్టివాడైనా, క్రీజులో నిలుచున్నప్పుడు ఇమ్రాన్‌ఖాన్ వేసిన బౌన్సర్‌ను కూడా వదిలివేస్తాడు తప్ప సరదాగా బ్యాట్‌తో ముట్టుకోడు. ఏది వదిలిపెట్టాలో తెలియాలి. ఏది ముట్టుకోవాలో తెలిసుండాలి. ఏది ముట్టుకోవాలో తెలిసున్నప్పుడు ఆ బాల్‌ను కొట్టకుండా వదలకూడదు. ఏ బాల్‌ను కొడితే ప్రమాదమో దాన్ని ముట్టుకోవడానికి ఉత్సాహం ప్రదర్శించకూడదు. హిత శక్తి ఎటువంటిదంటే... మనిషిని ఆ క్షణంలో ఆకర్షిస్తుంది. సమాజంలో చాలామంది విద్యార్థులు కానీ, మరెవరైనా కానీ లక్ష్యసిద్ధిలో హిత శత్రువు చేత పాడవుతారు.

ఈ రాత్రికి ఇది నేను చదువుకుంటాను... అని నిర్ణయించుకుంటాడు. ఈలోగా క్రికెట్ మొదలౌతుంది. ఈ ఒక్క ఓవర్ చూస్తానంటాడు. 50 ఓవర్లు చూస్తాడు. అయిపోయింది. అది హిత శత్రువు. ఆ క్షణంలో దాని జోలికి వెళ్లకూడదు. అప్పటికి బాగున్నట్టుంటుంది. అది ముట్టుకున్నాడు. అంతే పోయింది పరీక్ష. నాకు బాగా తెలిసున్న విద్యార్థి ఒకడు నా దగ్గరికి ఓ రోజు ఏడుస్తూ వచ్చాడు. ‘‘సార్ ! ఎంసెట్ పరీక్ష రాస్తున్నాను. దూరంగా నాకు బాగా ఇష్టమైన పాత పాటలు వేశారండీ. నేనింట్లో  ఎంత సాధన చేశానో అంత వేగంగా పరీక్ష రాయలేకపోయాను. దానితో చాలా బిట్లు మిగిలిపోయాయి. పది బిట్లు  చాలు కదండీ... మెడిసిన్‌లో రావలిసిన సీటు రాకుండా పోవడానికి. అదే జరిగింది’’ అన్నాడు. దూరం నుంచీ వచ్చిన ఒక పాట ఒక విద్యార్థి జీవితాన్ని బలి తీసేసుకుంది. అప్పటికి చాలా బాగున్నట్లు అనిపించినా ఆ క్షణంలో వినకూడనిది విన్నాడు. అంతే! పాడయిపోయాడు.

మధుమేహం ఉన్నవాడు మామిడిపండు తిన్నట్లు. అప్పటికి బాగుంటుంది, మామిడిపండు. తర్వాత లేనిపోని ప్రమాదానికి కారణమౌతుంది. ఎక్కడైనా సరే, ఆకర్షణీయమైనవి ఏవి ఉంటాయో అవి మనిషిని ప్రలోభంలోకి లాగేస్తాయి. ఇది మనమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దాన్ని నిగ్రహించగలిగిననాడే విజయం సాధించగలరు. కానీ ఇప్పుడు మనకున్న భయంకర వాతావరణమంతా ఎక్కడుందీ అంటే... అందరం వేదాంతం దగ్గర్నుంచీ సమాజం వరకు ఒక్క మాటే చెబుతుంటాం. వేదాంతం గురించి చెప్పమంటే... కామ క్రోధాదులను విడిచిపెట్టండి అని మొదపెడతారు ఎవరైనా. వాటిని విడిచిపెట్టడానికి నేను పట్టుకుంటే కదా వాటిని! నేను పట్టుకోలేదు. అవే నన్ను పట్టుకున్నాయి. ‘పిల్లలు బాగా చదువుకోవాలి. మంచి శీలంతో ఉండాలి.

ప్రతివాడూ దేశానికి గర్వకారణమైన విద్వాంసుడు కావాలి’... ఇవే కదా అందరం ఒకే కంఠంతో చెప్పే మాట. కానీ అలా కావడానికి అవసరమైన వాతావరణం మనం ఇస్తున్నామా? వాడు కన్ను విప్పితే ఏది చూడకూడదో చూడకుండా నిగ్రహించగలుగుతున్నామా? వాడి చెవితో ఏది వినకూడదో అది వినిపించకుండా చేయతగిన నియమాలేవయినా మనకున్నాయా? ఆపడానికి ఏమైనా అధికారాలున్నాయా? ఎక్కడైనా దానికి సంబంధించి మనకు ప్రత్యేక మార్గదర్శకాలేమైనా ఉన్నాయా? లేవు. ఎవరు ఏదైనా చూడొచ్చు, ఏదైనా వినొచ్చు, తినొచ్చు, ముట్టుకోవచ్చు. మరి అందరూ ఎలా బాగుపడగలరు? ఎవడో... ఎక్కడో... ఒక్కడికి ఉంటుంది ఆ నిగ్రహ శక్తి. సమాజంలో విచక్షణా జ్ఞానమనేది శూన్యమైపోతున్నది. చదువు కాదు, చదువు కన్నా ముఖ్యం ఏమైపోయిందంటే... అసలు దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదో తెలియని స్థితిలో, అమాయకత్వంతో చాలా మంది పాడైపోతున్నారు.

ఉద్యోగులు కానివ్వండి, విద్యార్థులు, పెద్దలు, పిల్లలు, చదువుకున్నవారు... ఇలా ఎవరిని తీసుకున్నా, ఎక్కడికెళ్లినా వారికి లక్ష్యసిద్ధికి సంబంధించి వివేకాన్ని నేర్పగల విషయాలు లేవు. ఏవి నేర్వగలిగిన సమర్థత కలిగి ఉన్నాయో వాటిని పాఠ్యాంశాలలో పొందుపరచడం లేదు. మరి ఆ విచక్షణ ఎలా అందుతుంది? మరి అందనప్పుడు వాడు దేశానికి పనికివచ్చేవాడెలా అవుతాడు? సంకల్పం అనేది ఒకటి ఏర్పడినా, ప్రలోభ కారకమైనవి సమాజంలో ప్రతిక్షణం కనబడుతున్నప్పుడు దాన్ని నిలబెట్టుకుని సాధించగల శక్తి ఎలా పొందుతాడు?
పూర్వం రైతు ఆరుగాలం శ్రమించి పంట ఇంటికి తీసుకొచ్చి అప్పుడు సుఖపడేవాడు. ఈవేళ పొద్దున మొదలుపెడితే సాయంకాలానికి డబ్బులు కనబడాలి. ఎలా సంపాదించావన్న దానికన్నా ఎంత సంపాదించవన్నది ప్రధానమైపోయిన నాడు విచక్షణ ఎలా ఉంటుంది?

ఉద్యోగంలో కానీ, విద్యార్జనలో కానీ తేలికగా పాడు చేసేది ఏదంటే - అడ్డదారి అని ఒకంటుంది. అడ్డదారిలో కాదు, సంకల్ప శుద్ధి, సిద్ధి కలగాలంటే లోభకారకమైన విషయాలకు దూరంగా జరుగుతూ రహదారిలో వెళ్లు. సంపాదించిందేదయినా ధార్మికంగా సంపాదించు, ధార్మికంగానే ఖర్చుపెట్టు. అంతే తప్ప నీవు చేసేది నీకే నచ్చని రోజు, నీవు చేసేదానిని గురించి నీవే ధైర్యంగా నిలబడి మాట్లాడలేని రోజు, నీ పిల్లల దగ్గరకెళ్లి నీవిలా ఉండకూడదు’ అని చెప్పే అధికారం పోయిన రోజు... అటువంటి రోజు రాకుండా బతుకు. నీ కొడుక్కి చెప్పడానికి, నీ అల్లుడికి, నీ మనవలకు చెప్పడానికి నీ అధికారం ఎప్పుడూ నిలబడాలి. ‘మీరెవరండీ మాకు చెప్పడానికి’ అని అన్పించుకునే రోజు రాకూడదు. ఆ రోజున...
 
ఆఖరి రోజున... ఆ భగవంతుడు తీర్పిచ్చే రోజున... ‘‘నీవు శరీరం ఇచ్చావు, శాస్త్రాన్ని పట్టుకుని చెయ్యగలిగిన మంచి పనులన్నీ చేశాను. ఎన్నడూ నేను చెడు చెయ్యలేదు’’ అని పరమ ధైర్యంతో గుండెల మీద చెయ్యి వేసుకుని వెళ్లిపోగలగాలి.  మీరు ఏ పని మీద బయల్దేరినా, ఏ లక్ష్యం మనలో పెట్టుకున్నా మీకు ఎదురయ్యేవి, మిమ్మల్ని అడ్డుకునేవి, మిమ్మల్ని పాడుచేసేవి రెండుంటాయి-ఒకటి హిత శత్రువు, రెండవది అహిత శత్రువు. హిత శత్రువంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది. కానీ అది శత్రువు. పాడు చేసేస్తుంది. అహిత శత్రువు. అది కూడా శత్రువే. అదికూడ పాడు చేసేస్తుంది. ఒకటి తెలియకుండా, మరొకటి తెలిసి పాడు చేసేస్తాయి. అంటే ఇది పట్టుకుంటే నేను పాడయిపోతానని తెలుస్తుంటుంది. కానీ పట్టుకోకుండా ఉండలేని మన బలహీనతను ఆసరాగా చేసుకుని వశపరచుకుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement