
శ్రియానుభవాలు
పదిహేనేళ్లు ఇండస్ట్రీ. వితౌట్ సింగిల్ బ్రేక్! మినిమమ్ పదిహేను మంది హీరోలతో చేసింది.
పదిహేనేళ్లు ఇండస్ట్రీ. వితౌట్ సింగిల్ బ్రేక్! మినిమమ్ పదిహేను మంది హీరోలతో చేసింది. వితౌట్ బ్రేక్! రోజుకో గాసిప్ పుట్టే ఇండస్ట్రీలో.. పదిహేను వసంతాలు. అన్ని క్యారెక్టర్లూ చేసింది. ఇంత క్యారెక్టర్ కూడా పోగొట్టుకోలేదు. ఇవిగోండి.. శ్రియానుభవాలు.
హాయ్ శ్రియాగారూ.. పదేళ్ల క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు.. సీక్రెట్?
మా అమ్మ నాన్నల జీన్స్ వల్లే ఇలా ఉన్నా. వాళ్లిద్దరూ స్లిమ్‌గా ఉంటారు. ఎంత తిన్నా బరువు పెరగను. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. యోగా చేస్తాను. నేను కథక్ డ్యాన్సర్‌ని. వీలున్నప్పు డల్లా ఇంట్లో కథక్ ప్రాక్టీస్ చేస్తాను. జిమ్ కంపల్సరీ. డైటింగ్ చేయను కానీ, ఏం తింటున్నాం అనే విషయంలో మాత్రం కేర్ తీసుకుంటాను. రైట్ ఫుడ్ తింటాను. రైట్ ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో రైట్ టైమ్‌కి ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్.
ఓకే... త్వరలో రిలీజ్ కాబోతున్న ‘పైసా వసూల్’లో మీ క్యారెక్టర్ గురించి చెబుతారా?
ఇందులో నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ని. స్వీట్ అండ్ సింపుల్ క్యారెక్టర్. ఒక మహిళా జర్నలిస్ట్ అంకితభావంతో పనిచేయాల్సి రావడం, అనుకున్నది సాధించాలన్న పట్టుదల వంటి అంశాలు నచ్చాయి. అందుకే ఈ పాత్రను ఎంజాయ్ చేశాను.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో చేసిన పాత్రకు భిన్నమైనది ‘పైసా వసూల్’ పాత్ర. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి?
‘గౌతమిపుత్ర...’లో యువరాణిని. ‘పైసా వసూల్’లో నేటి తరం అమ్మాయిని. జర్నలిస్ట్‌ని. వెంట వెంటనే ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని క్యారెక్టర్స్ చేయడం థ్రిల్ అనిపించింది. ఏ ఆర్టిస్ట్‌కైనా ఇలా చేయడం ఓ చాలెంజ్. ఇలాంటి సవాళ్లు ఎన్ని వస్తే అంత హ్యాపీగా ఉంటా. పూరి జగన్నాథ్‌గారితో నాకిది ఫస్ట్ మూవీ. ఆయన టేకింగ్‌ని ఎంజాయ్ చేశాను.
పదిహేనేళ్లుగా సినిమాలు చేస్తున్నారు.. ఇప్పుడు తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ. ఏమనిపిస్తోంది?
వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనందపడే విషయాలు చాలా ఉన్నాయి. యాక్టింగ్‌ని ప్రేమిస్తాను. అయితే కెమేరా ముందు మాత్రమే. చేసే పని మీద ప్రేమ ఉన్నప్పుడు ఎన్నేళ్లుగా పని చేస్తున్నాం అనే లెక్కలు వేసుకోం.
మీ కెరీర్‌ని ఎనలైజ్ చేస్తే, ఇండిపెండెంట్‌గా ఎదిగినట్లు అనిపిస్తుంది.. మీ అమ్మానాన్న ఎప్పుడూ మీ పక్కనే ఉంటూ గైడ్ చేయలేదు?
మా అమ్మగారు కొన్నిసార్లు నా షూటింగ్ డేట్స్ చూశారు. అయితే మీరన్నట్లు అదే పనిగా పెట్టుకుని నన్ను గైడ్ చేయలేదు. నన్ను నమ్మారు. కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తూ డేట్స్ మేనేజ్ చేయడం కష్టం. నాకు మేనేజర్ ఉన్నారు. ఇంకా హెల్ప్ చేయడానికి నా చుట్టూ మనుషులు ఉన్నారు. ఏదేమైనా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి ఉంది. అందరి మీదా ఆధారపడి పైకి రావడం కన్నా ‘సెల్ఫ్ మేడ్’ అనిపించుకోవడంలో ఓ తృప్తి ఉంటుంది.
ఈ జర్నీలో చేదు అనుభవాలు?
హరిద్వార్‌లో సింపుల్ ఫ్యామిలీలో పుట్టాను. ఢిల్లీ, లేడీ శ్రీరామ్ కాలేజీలో బీఏ చేశాను. సినిమాలనేది నేను ఊహించలేదు. సడన్‌గా ఈ ప్రపంచంలోకి వచ్చాను. ముందు కొంచెం తికమకగానే అనిపించింది. లక్కీగా నాకెలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదురవ్వలేదు. ఇప్పటివరకూ నేను పని చేసిన హీరోలు, డైరెక్టర్లు... అందరూ నాకు బాగానే సపోర్ట్ చేశారు. దాంతో ఇబ్బంది అనిపించలేదు. ఒకవేళ ఒక చిన్న చేదు అనుభవం ఎదురైనా అందులోంచి బయటకు రావడానికి కొంచెం టైమ్ పట్టేది. ఈ లాంగ్ జర్నీలో అలాంటి ‘టైమ్’ రాకపోవడం నా లక్. అఫ్‌కోర్స్ కొన్ని చిన్ని చిన్ని చేదు అనుభవాలు ఉన్నాయనుకోండి. ఏది ఏమైనా ఆ దేవుడు చల్లగా చూస్తున్నాడనుకుంటున్నా.
చేదు అనుభవాలు అన్నారు... ఉదాహరణకు?
కెరీర్‌లో ‘ఫ్లాప్’కి మించిన చేదు అనుభవం మరొకటి ఉండదు. ఫ్లాప్ మూవీస్ నా లిస్టులో చాలానే ఉన్నాయి. మొదట్లో తేరుకోవడానికి టైమ్ పట్టేది. రాను రాను హిట్టూ ఫ్లాప్స్‌కి అతీతంగా రియాక్ట్ అవ్వడం మొదలైంది.
చెప్పిన టైమ్‌కి శ్రియ షూటింగ్‌కి రాలేదు... ఫలానా హీరోతో ఎఫైర్ అనే వార్తలు రాలేదు. గాసిప్స్ రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు?
ఏమీ చేయనప్పుడు ఎందుకు మేనేజ్ చేయాలి? టైమింగ్స్ వైజ్‌గా పర్‌ఫెక్ట్‌గా ఉంటాను. షూటింగ్ స్పాట్‌లో ఇబ్బంది పెట్టను. ఎవరితోనూ ఎఫైర్లు లేవు. అందుకే నా గురించి వార్తలు రావు.
అలాగే సినిమాల్లో చేసే క్యారెక్టర్‌ని బట్టి ఆ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ‘ఇలా ఉంటుంది’ అని కొందరు ఎనలైజ్ చేస్తుంటారు.. దాని గురించి?
అది నిజమే. సినిమాల్లో వెస్ట్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తే... విడిగా అలాంటివే వేసుకుంటామని అనుకుంటారు. ప్రతిరోజూ పార్టీకి వెళతామని ఫిక్స్ అయిపోతారు. ఒకవేళ చీరల్లో కనిపిస్తే సాధ్వి అంటారు. సినిమాల్లో ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు ప్రవర్తిస్తాం. రియల్‌గా మేం వేరేలా ఉంటాం. ఆన్ స్క్రీన్ మమ్మల్ని చూసి, ఆఫ్ ది స్క్రీన్ కూడా అలానే ఉంటామని ఊహించు కునేవాళ్ల ఆలోచనా విధానం మారాలి.
ఈ ప్రపంచంలోనే మీరెక్కువగా ఇష్పడే వ్యక్తి?
మా అమ్మగారు. నన్ను పెంచి, పెద్ద చేసి, నేనింతవరకూ రావడానికి కారణం తను. కూతురి జీవితం బాగుండాలని తపన పడింది. అమ్మ గురించి మాట్లాడ్డానికి రోజులు చాలవు. నేను చదువుకునేటప్పుడు తనూ స్టూడెంట్ అయింది. నా మానాన నన్ను వదిలేయకుండా పక్కనే కూర్చుని చదివించేది. నాతో పాటు డ్యాన్స్ స్కూల్‌కి వచ్చేది. హీరోయిన్ అయినప్పుడు తోడుగా షూటింగ్ స్పాట్‌కి వచ్చింది. ‘స్పా’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ మొదలుపెడతానన్నప్పుడు సపోర్ట్ చేసింది. నేనివాళ ఇలా ఉన్నానంటే తనే కారణం.
ఇప్పటివరకూ మీ ‘మిస్టర్ రైట్’ మీకు తారసపడలేదా?
(నవ్వుతూ). తక్కువ టైమ్‌లోనే తను నా లైఫ్‌లోకి వస్తాడన్న నమ్మకం ఉంది.
ఎలాంటి లక్షణాలున్న అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటున్నారు?
అతను నాకు మంచి ఫ్రెండ్‌లా ఉండాలి. అతనితో నా మిగతా జీవితాన్ని సాఫీగా గడప గలగాలి. మానసికంగా, ఆధ్యాత్మికంగానూ అతనితో నా ప్రయాణం బాగుండాలి.
ఫైనల్లీ... పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి?
మహిళల జీవితంలో పెళ్లి, పిల్లలు అనేది చాలా ముఖ్యమైన విషయం. జరగాల్సి నప్పుడు తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతానికి చేసే పనిని నేను లవ్ చేస్తున్నాను.
సెప్టెంబర్ 11న మీ బర్త్‌డే.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు?
(నవ్వుతూ). ఇంకా చాలా టైమ్ ఉంది. ఏమీ అనుకోలేదు. అయితే ఒకటి మాత్రం నమ్ముతాను. ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు అనేది చాలా ముఖ్యమైనది. నా గత పుట్టినరోజున మా ఇంట్లో వినాయకుడు ఉన్నాడు. పోయిన ఏడాది సెప్టెంబర్ 5న వినాయక చవితి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. నా బర్త్‌డే నాడు మా ఇంట్లో వినాయకుడు ఉన్నాడు. అందుకని ఆ రోజున గణపతికి పూజ చేశాను.
ఇప్పటివరకూ జరుపుకున్న వాటిలో బెస్ట్ బర్త్‌డే?
నా చిన్ననాటి పుట్టినరోజులు బెస్ట్. ఎందుకంటే అమ్మ చాలా హడావిడి చేసేది. కేక్ కట్ చేయించేది. నాకు శాండ్‌విచెస్ ఇష్టం. బర్త్‌డే నాడు తప్పనిసరిగా అవి చేసేది. నా స్నేహితులు మా ఇంటికి వచ్చేవారు. సింపుల్‌గా చేసినా బాగా అనిపించింది. ఇప్పుడూ అమ్మ హడావిడి చేస్తుంది కానీ, చిన్నప్పుడు ఉన్నంత ఎగ్జయిట్‌మెంట్ ఉండదు కదా.
సమాజంలో మద్యం, డ్రగ్స్, సిగరెట్స్ అంటూ.. చెడు వీరవిహారం చేస్తోంది... పిల్లలకు మీరిచ్చే సలహా?
జీవితానికి హాని చేసేవాటి పట్ల ఎట్రాక్ట్ కావడం మంచిది కాదు. చదువు మీద ఏకాగ్రత చూపించాలి. కెరీర్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఆ కెరీర్ పట్ల బాధ్యతగా ఉండాలి. కుటుంబంలో ఒక్కరు చెడు అలవాట్లకు బానిస అయినా అందరూ బాధపడాల్సి వస్తుంది. చెడు అలవాట్లు ఉంటే... వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయినా దూరం కాలేకపోతున్నారంటే... డాక్టర్‌ని సంప్రదించాలి. ఆ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నింటికన్నా జీవితం ముఖ్యమైనది.
వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ పండగకి సంబంధించిన చిన్నప్పటి గుర్తులేమైనా ఉన్నాయా?
ఒకే ఒక్క ఇన్సిడెంట్ అంటే చెప్పలేను. వినాయక చవితి అంటే మా ఇంట్లో సందడిగా ఉంటుంది. హరిద్వార్, ఢిల్లీ, ఆ తర్వాత ముంబైలో... ఇలా ఎక్కడ ఉన్నా పండగ చేసుకోవడం అలవాటు. స్వాతంత్య్రం రాక ముందు ప్రజలు స్వాతంత్య్ర సాధన కోసం బోల్డన్ని చర్చా వేదికలు పెట్టుకునేవాళ్లు. అందరూ కలసి మంచీ చెడూ మాట్లాడుకునేవాళ్లు. స్వాతంత్య్రం సాధించాక అలాంటి మీటింగ్స్ తగ్గాయి. క్రమంగా ఎవరి దారిన వాళ్లు బతకడం మొదలైంది. కానీ, ఇలాంటి పండగలు అందర్నీ కలుపుతాయి. గణేశుణ్ణి ప్రతిష్టించి, భారీ పందిళ్లు వేసి, ఏడు, తొమ్మిది రోజులు వైభవంగా పూజలు జరిపి, నిమజ్జనం చేసేవరకూ.. అందరూ కలుస్తారు. ప్రసాదాలు పంచుతారు. మనుషులను దగ్గర చేసే ఈ పండగ అంటే ఇష్టం.
మట్టి గణేశుడినే పూజించారా?
పర్యావరణానికి హాని కలిగించకూడదు. అందుకే మట్టి గణపతిని పూజించా. మా ఇంట్లో ఉన్న వాటర్ ఫౌంటెన్‌లో నిమజ్జనం చేయడం అలవాటు.
నాగార్జునగారు ఫస్ట్ సూపర్ స్టార్
మీ సెకండ్ సినిమా (‘సంతోషం’)కే నాగార్జునగారి సరసన నటించారు. ఆ తర్వాత ఆయనతో ‘నేనున్నాను’, ‘మనం’ సినిమాల్లో జతకట్టారు.. ‘ఊపిరి’లోనూ నాగ్‌తో కాసేపు కనిపించారు..ఈ 29న ఆయన బర్త్‌డే. నాగ్ గురించి కొన్ని విశేషాలు?
నా ఫస్ట్ సూపర్‌స్టార్ నాగార్జునగారే. ఆయన సినిమాలు చూస్తూ పెరిగినదాన్ని. సౌత్ మూవీస్ హిందీలో రిలీజయ్యేవి. అలా ‘శివ’ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసినప్పుడు చాలా చిన్నపిల్లని. భవిష్యత్తు గురించి ఎలాంటి ఊహలు లేవు. కట్ చేస్తే... ఆయన పక్కన హీరోయిన్‌గా నటించగలిగాను. అది కూడా నా సెకండ్ సినిమాకే. ‘సంతోషం’ నా కెరీర్‌కి సంతోషాన్నిచ్చిన మూవీ. ఆ సినిమా తర్వాత నేను ఫుల్ బిజీ.
నాగ్ వైఫ్ అమలగారితో మీ ఈక్వేషన్?
అమలగారు లవ్లీ. నాతో సన్నిహితంగా ఉంటారు. ఆమె సలహా మేరకే నేను విపశ్శన యోగ చేశాను. నా లైఫ్‌లో నేను అందుకున్న మంచి సలహాలలో అమలగారి నుంచి ఈ సలహా ఒకటి. విపశ్శన ధ్యానం చేశాక నేను మారాను. అంతకు ముందు కన్నా ప్రశాంతంగా ఉంటోంది. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగు తున్నాను.
నాగార్జునగారి పక్కన నటించినప్పుడు సినిమాల వైజ్‌గా మీరు కిడ్. ఎలా అనిపించింది?
భయం అనిపించలేదు. ఎందుకంటే, నాగార్జునగారు తానో స్టార్ అనే ఫీలింగ్‌తో మాట్లాడేవారు కాదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. యూనిట్ మొత్తం అలానే ఉండేది. దాంతో సంతోషంగా పని చేశా. నా కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నాగ్ సార్‌తో చేసిన సినిమాలు ఉన్నాయి. ఆయనకు ‘సాక్షి’ ద్వారా మనస్ఫూర్తిగా బర్త్‌డే విషెస్ చెబుతున్నా.
– డి.జి. భవాని