చదువుల సిరి విద్య
సక్సెస్ స్టోరీ
ఆ చదువుల తల్లికి వనరులు వడ్డించిన విస్తరే. కానీ విజయం మాత్రం కాదు. తన తండ్రి డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం నెలరోజులు వేచి చూడాల్సిన ఘటన.. బాల్యంలోనే ఆమెపై ఎంతో ప్రభావం చూపింది. ఎలాగైనా డాక్టర్ కావాలనే పట్టుదలకు పురికొల్పింది. అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యానికి చేరువ కావాలనే దిశగా వేసిన అడుగులు ఆమెను జాతీయస్థాయిలో అగ్రగామిగా నిలిపాయి. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకుతో విజయదుందుభి మోగించింది.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని.. పట్టిసపు శ్రీవిద్య. ఆమె విజయ ప్రస్థానం తన మాటల్లోనే..
కుటుంబ నేపథ్యం
మాది విశాఖపట్టణం. సీతమ్మధారలో ఉంటున్నాం. నాన్న పీవీఎస్ ప్రసాద్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. తల్లి రాజ్యలక్ష్మి కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. చెల్లెలు.. దివ్య ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతోంది.
విద్యాభ్యాసం
ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పెదవాల్తేరులోని కిడ్స్ క్రియేట్ పాఠశాలలో చదివాను. ఆరు నుంచి 8వ తరగతి వరకు కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ పాఠశాలలో, 9, 10 తరగతులు సీతమ్మధార శ్రీప్రకాశ్ పాఠశాలలో విద్యనభ్యసించాను.
ఆస్వాదిస్తూ చదివా
ఉదయం 7-30 నుంచి సాయంత్రం 7-30 వరకు కాలేజ్‌లోనే ఉండేదాన్ని. చివరి ఆరునెలల స్టడీ ప్లాన్‌లో ప్రతిరోజు ఎంతసేపు చదవాలనేదానికన్నా ఎంత ఎక్కువ అర్థమయ్యే విధంగా చదివానో చూసుకునేదాన్ని. అధ్యాపకులు బోధించేటప్పుడు వారు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వినేదాన్ని. ప్రతి చిన్న అంశాన్ని వదలకుండా ఆస్వాదిస్తూ చదివాను. ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మక పద్ధతిలో అన్వయించుకుంటూ అధ్యయనం చేశాను.
సందేహాలు అడిగేదాన్ని
కాలేజీలో నిర్వహించే ప్రతి చిన్న పరీక్షను ఫైనల్‌గా భావించేదాన్ని. అందుకు తగ్గట్టుగా సాధన చేసేదాన్ని. ప్రతి టర్మ్ ఎగ్జామ్‌లోనూ ప్రథమ స్థానంలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని చదివాను. ఇది ప్రవేశ పరీక్షల్లో బాగా ఉపయోగపడింది. లెక్చ రర్లను సందేహాలు అడిగేందుకు ఎప్పుడూ జంకే దాన్ని కాదు. మా అధ్యాపకులు ఈ విషయంలో నాకు బాగా సహకరించారు. కాలేజీలో ఇచ్చే మెటీరియల్‌తోపాటు ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడెమీ పాఠ్యపుస్తకాలను బాగా అధ్యయనం చేశాను. అందుబాటులో ఉన్న ఏ మెటీరియల్‌ను వదల్లేదు.
ఫస్ట్ ర్యాంకు ఊహించలేదు
ఎయిమ్స్ ప్రవేశపరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కష్టపడి చదివాను. సీటు సంపాదిస్తాననే నమ్మకం ఉంది. చేసిందల్లా ఒకటే. పరీక్షలో 22 మార్కులకు సమాధానాలు తెలియక తప్పులు చేయడమెందుకని వదిలేశాను. తెలిసినవాటికి మాత్రమే సమాధానాలిచ్చా. ఇలా చేయడం వల్లే మొదటి ర్యాంకు వచ్చిందని అనుకుంటున్నాను. ప్రశ్నపత్రం కూడా సులువుగానే ఉంది. మొదటి ర్యాంకు సాధనలో ఎంసెట్ కోసం చేసిన ప్రిపరేషన్ కూడా ఉపయోగపడింది. ఎంసెట్ అయిన ఎనిమిది రోజులకు ఎయిమ్స్ పరీక్ష జరిగింది. ఈ ఎనిమిది రోజుల్లోనూ క్లిష్టంగా ఉన్న అంశాలను విశ్లేషణాత్మకం చదివాను. ముఖ్యాంశాలను ఔపోసన పట్టాను.
ఒత్తిడిని ఇలా జయించాను
నాకు బాగా అలసటగా ఉన్నప్పుడు, బోర్‌గా అనిపిస్తే ఎక్కువ గా ఇంగ్లిష్ ఫాంటసీ నవలలు చదువుతా. సినిమాలు కూడా చూస్తాను. ఆయిల్ పెయింటింగ్స్ కూడా బాగా వేస్తాను.
భవిష్యత్ లక్ష్యం
ఎంసెట్, జిప్‌మెర్, మణిపాల్‌లో సీటు వచ్చినా వాటిల్లో చేరను. ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్‌లో చేరతాను. తర్వాత మాలిక్యులర్ బయాలజీలో పరిశోధన చేస్తాను.
అకడెమిక్ ప్రొఫైల్
టెన్త్ సీబీఎస్‌ఈ - 10 గ్రేడ్ పాయింట్స్
ఇంటర్ బైపీసీ - 984 మార్కులు
ఎంసెట్ - 7వ ర్యాంక్
జిప్‌మెర్ - 8వ ర్యాంక్
మణిపాల్ - 9వ ర్యాంక్
ఏఐపీఎంటీ - 59వ ర్యాంక్