అప్పు.. ఆరు రకాలు
అర్జెంటుగా డబ్బు అవసరమైందనుకోండి. ఠక్కున గుర్తొచ్చేది పర్సనల్ లోనే. అసలు పర్సనల్ లోన్స్ ఉన్నదే వ్యక్తిగత అవసరాల కోసం కదా..!! కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీటిపై వడ్డీ రేటు ఎక్కువ. ఇపుడు వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతున్నాయి కనుక మరేంటి దారి? ప్రత్యామ్నాయమేంటి? ఉండకేం!! ఉన్నాయి. మార్కెట్లో తక్కువ వడ్డీకి వచ్చే రుణాలు చాలా ఉన్నాయి. అవసరమైన సందర్భాల్లో వాటిని ఆశ్రయించవచ్చు కూడా. అలాంటి మార్గాల విశ్లేషణే ఈ కథనం...
బంగారంపై రుణం
బంగారం ధరిస్తే అందం పెరుగుతుంది. అంతేకాదు! ఇది అవసరానికి ఆదుకుంటుంది కూడా. అందరికీ తెలిసిందే అయినా... వ్యక్తిగత రుణానికి సరైన ప్రత్యామ్నాయం గోల్డ్ లోనే. ఈ రుణాలపై వ్యక్తిగత రుణాలకన్నా వడ్డీ రేటు తక్కువ. ప్రస్తుతం బంగారు నాణేలు, ఆభరణాలపై ముత్తూట్, మణప్పురం వంటి ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణమిస్తున్నాయి.
ఈ బంగారం రుణాలపై వడ్డీ రేట్లు రెండంశాలపై ఆధారపడి ఉంటాయి. మొదటిది సెక్యూరిటీగా ఉంచే బంగారం విలువ ఎంత ఎక్కువ ఉందన్నది. రెండోది తీసుకునే రుణ మొత్తం. అంటే బంగారం విలువకు, తీసుకునే రుణానికి మధ్య తేడా పెద్ద ఎక్కువ లేదనుకోండి. వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. అదే ఎక్కువ విలువైన బంగారాన్ని పెట్టి తక్కువ రుణం తీసుకుంటే వడ్డీ తగ్గుతుంది. ఈ రుణాలకు చాలా తక్కువ ప్రాసెసింగ్ సమయం పడుతుంది. 24 గంటల్లోపే రుణం మంజూరవుతుంది కూడా. తక్కువ డాక్యుమెంటేషన్, అతి తక్కువ ప్రీప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై..
అత్యవసర సమయాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను బ్రేక్ చేయాల్సిన అవసరం లేకుండా వాటిపైనా రుణం తీసుకోవచ్చు. చాలా బ్యాంకులు డిపాజిట్ మొత్తంలో 75 శాతం నుంచి 85 శాతం దాకా లోన్ ఇస్తాయి. ఇలాంటి రుణాలపై వడ్డీ రేటు విషయానికొస్తే.. సాధారణంగా ఎఫ్‌డీపై ఇచ్చే దానికన్నా 1-2 శాతం దాకా అధికంగా బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తుంటాయి. అంటే.. మీ ఎఫ్‌డీపై 8 శాతం వడ్డీ వస్తోందనుకుంటే.. ఆ ఎఫ్‌డీ మీద తీసుకున్న రుణంపై 9 శాతం నుంచి 10 శాతం దాకా వడ్డీ కట్టాల్సి వస్తుంది. మరో విషయం.. డిపాజిట్ మెచ్యూరిటీ తేదీలోగా రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
బీమా పాలసీలపై రుణం
వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇది కూడా మంచి ప్రత్యామ్నాయమే. ఎండోమెంట్ సహా మనకుండే బీమా పాలసీలను తనఖా పెట్టడం ద్వారా ఆ పాలసీల సరెండర్ విలువలో 90 శాతం వరకూ రుణంగా పొందొచ్చు. ఈ రుణాలపై వడ్డీ రేటు 9 నుంచి 13 శాతంగా ఉంటుంది. అయితే మూడేళ్లు అంతకుమించిన కాలానికి రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లించిన పాలసీలపైనే ఇలాంటి రుణాలు తీసుకునే అవకాశముంది. ఇక రుణం రావడానికి రెండు, మూడు రోజులు పడుతుంది.
పెట్టుబడులపై రుణాలు..
షేర్లూ, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల మీద కూడా లోన్ పొందడానికి అవకాశం ఉంది. వీటిని గ్యారంటీ పెట్టి రుణం తీసుకోవచ్చు. అయితే, అన్ని రకాల షేర్లూ, డిబెంచర్లకు ఇది వర్తించదు. అప్పు ఇచ్చే సంస్థ ఏయే ఫండ్లు, షేర్లపై రుణాలు ఇవ్వవచ్చన్నది ఒక లిస్టు పెట్టుకుంటాయి. వాటి మీద మాత్రమే ఇస్తాయి. మరో విషయం, వీటి విలువ రోజు రోజూ మారిపోతుంటుంది కనుక అధిక మార్జిన్లు తీసుకుంటాయి. కాబట్టి పది లక్షల విలువ చేసే షేర్లకు పది లక్షల రుణం రాదు.. అంతకంటే తక్కువే చేతికి అందుతుంది.
స్థిరాస్తిపై..
ఇల్లు, ప్లాటు, కార్యాలయం వంటి స్థిరాస్తులపైనా రుణాలు లభిస్తాయి. బ్యాంకులు ఆయా ప్రాపర్టీ మార్కెట్ విలువలో 50 శాతం నుంచి 60 శాతం దాకా మాత్రమే రుణం ఇస్తుంటాయి. సాధారణంగా రుణాలిచ్చే సంస్థలు ప్రాపర్టీ విలువను చాలా తక్కువగా లెక్కగట్టే అవకాశం ఉంది కాబట్టి.. మరింత అధిక రుణం పొందాలంటే.. థర్డ్ పార్టీతో వేల్యుయేషన్ చేయించుకుంటే మంచిది. వీటిపై వడ్డీ రేట్లు దాదాపు పర్సనల్ లోన్స్‌పై ఉన్నంత స్థాయిలోనే ఉంటున్నాయి. ప్రాసెసింగ్‌కి వారం, పదిరోజులు సమయం పట్టవచ్చు.
కంపెనీ నుంచి లోన్..
ఆర్థిక అవసరాల సమయంలో మీరు పనిచేసే కంపెనీలో శాలరీ అడ్వాన్స్ కోసం ప్రయత్నించడం మరో మెరుగైన ఆప్షను. చాలా మటుకు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇలా లోన్‌లు ఇస్తుంటాయి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని నెలకి ఇంత చొప్పున జీతంలో నుంచి జమ చేసుకుంటుంటాయి. వీటిపై వడ్డీ రేటు లాంటిదేమైనా ఉన్నా.. అది చాలా తక్కువగా 4 శాతం నుంచి 10 శాతం స్థాయిలో ఉంటుంది. పెపైచ్చు.. మిగతా మార్గాల్లోలాగా వీటికి సవాలక్ష షరతుల్లాంటి సమస్యలు ఉండవు.