సైజులో పెద్దన్న
తిండిగోల
తెలుగువారికి ఇష్టమైనది, కూరగాయలన్నింటిలోకీ అతి పెద్ద పరిమాణం కలిగినదీ గుమ్మడి. పులుసులో గుమ్మడి ముక్కలు వేస్తే ఆ రుచే అదుర్స్. హిందువులు గృహప్రవేశం, దిష్టితీయడం వంటి కార్యాలలో గుమ్మడి పెద్ద పాత్రే పోషిస్తుంది. తమిళంలో పూషిణి అని, కన్నడంలో కుంబల అని, హిందీలో ఖద్దూ అని, సంస్కృతంలో కూష్మాండమనీ, ఆంగ్లంలో పంప్కిన్ అనీ పిలుచుకునే గుమ్మడి ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ పండుతుంది. భారతదేశ సంప్రదాయక వంటకాలలో గుమ్మడికి మంచి స్థానమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతి ప్రాచీన కాలం నుంచి ఉన్న గుమ్మడిలోని వివిధ పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం వల్ల ఆయుర్వేదమందుల తయారీలో విరివిగావాడతారు. ఎన్నో రకాల విటమిన్లు, మినరల్సు కలిగి ఉన్న గుమ్మడి గింజలను తినడం చాలా మంచిదని అల్లోపతి వైద్యులు కూడా చెబుతారు.
గుమ్మడిపండునే కాదు, వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. అయితే కొంచెం పైత్యం కలిగించే గుణం కలిగినందువల్ల దీనిని మితంగానే తీసుకోవడం మంచిదని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తారు. గొబ్బెమ్మలకు అలంకరించే పూలలో గుమ్మడి పువ్వుదే అగ్రస్థానం. అన్నట్టు గుమ్మడి డొల్లతో వీణ, తంబూరా వాంటి వాద్యపరికరాలు కూడా తయారు చేస్తారు. బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి అని రెండు రకాలున్న గుమ్మడిలో రెండింటిలోనూ ఇంచుమించు సమానమైన ఔషధ విలువలున్నాయి. కూరలు, పులుసుల్లో, స్వీట్ల తయారీలో రెండింటినీ వాడతారు. కానీ మంచిగుమ్మడికి మరింత మంచిస్థానం ఉంది.