నల్లబడ్డ చర్మం నార్మల్‌గా మారాలంటే..!
స్కిన్ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. ప్రతిరోజూ టూ వీలర్ మీద ఎండలో చాలా దూరం ప్రయాణం చేస్తుంటాను. ఎండకు ఎక్స్‌పోజ్ అవుతున్న రెండు చేతులు చాలా నల్లగా (డార్క్‌గా) అవుతున్నట్లు గుర్తించాను. అలాగే ముఖం, కాళ్లు, మెడ భాగం కూడా నల్లగా మారుతున్నాయి. దుస్తులు కప్పుతున్న భాగంలోనూ, మిగతా భాగాల్లోనూ చర్మం రంగుకు చాలా తేడా ఉంది. ఈ నలుపు తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి.
- సురేశ్‌కుమార్, విశాఖపట్నం
మీరు ఎండలో చాలా ఎక్కువ సేపు ప్రయాణం చేస్తుండటం వల్ల దుస్తులు కప్పి ఉంచని భాగాల్లో మీ చర్మం దెబ్బతింటోంది. ఒకేసారి కాకుండా క్రమంగా జరిగిన పరిణామమిది. మీ చర్మానికి జరిగిన నష్టాన్ని తగ్గించడానికి చేయాల్సినవి...
భౌతికంగా జరిగే నష్ట నివారణ కోసం...
* వీలైనంత వరకు చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించండి. పాదాలకు సాక్స్ ధరించండి. దీంతో నేరుగా మీకు ఎండ వల్ల కలిగే నష్టం సంభవించదు.
* శరీరం ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే భాగాల్లో 50 కంటే ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ రాయండి. మీరు బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు ఇది రాసుకోండి. ఇదే ప్రక్రియ ప్రతి మూడు గంటలకు ఒకసారి చేయండి.
చికిత్స పరంగా చేయాల్సినవి...
* డాక్టర్‌ను కలిసి ప్రతిరోజూ భోజనం తర్వాత తీసుకోవాల్సిన యాంటీఆక్సిడెంట్ ట్యాబ్లెట్లను ప్రిస్క్రయిబ్ చేయించుకోండి. వాటిని మూడు నెలలు కొనసాగించండి.
* కనీసం నెల రోజుల పాటు విటమిన్-సి టాబ్లెట్లను వాడండి. శాండల్‌వుడ్ కలిగి ఉండే సబ్బులకు, క్రీమ్స్‌కు దూరంగా ఉండండి. మైల్డ్ అలోవీరా, షియాబటర్ ఉన్న షవర్ జెల్ వాడండి. ప్రతిరోజూ స్నానం తర్వాత కోకోబటర్, విటమిన్-ఈ కలిగి ఉన్న మాయిష్చరైజర్లను వాడండి. ప్రతి రోజూ రాత్రిపూట... విటమిన్-సి, విటమిన్-ఈ, లికోరైస్, కోజిక్ యాసిడ్, టెట్రా హైడ్రోకర్క్యుమిన్, అర్బ్యుటిన్ వంటి స్కిన్‌లెటైనింగ్ ఏజెంట్స్ కలిగి ఉన్న క్రీమ్‌ను చర్మం నల్లబారిన చోట ఒంటిపై రాసుకోవాలి.
* ఒకవేళ నలుపు మరీ ఎక్కువగా ఉంటే కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలను కనీసం 3 - 6 సెషన్లు చేయించుకోవాలి. లేదా లేజర్ టోనింగ్‌ను ఆరు సెషన్లు చేయించవచ్చు. లేదా మైక్రోడెర్మాబ్రేషన్ ప్రక్రియను ఎనిమిది సెషన్లు చేయించుకోవాలి. ఒకవేళ అప్పటికీ చర్మం రంగు మారకపోతే ఫ్రాక్షనల్ లేజర్ ప్రక్రియ చేయించుకోవచ్చు. ఈ చికిత్స ప్రక్రియలను అనుసరించాక కూడా కొంతకాలం పాటు మెయింటెనెన్స్ సెషెన్స్ కూడా అవసరమవుతాయి. కెమికల్ పీలింగ్ ప్రక్రియ ప్రతి మూడు మాసాలకు ఒకసారి, లేజర్ ప్రక్రియ ప్రతి రెండు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి.
ఆహారపరమైన జాగ్రత్తలు ఇవి...
* మేని సంరక్షణలో ఆహారం కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆహారంలో క్యారట్, బీట్‌రూట్, కాప్సికమ్ (ఎల్లో అండ్ రెడ్), బొప్పాయి, అవకాడో, టొమాటో, ఉసిరి వంటి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.
* పైన పేర్కొన్న వాటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చర్మం ఆరోగ్యానికి ఎంతైనా అవసరం.
- డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్