స్మార్ట్ చోరీ | Smart phone theft | Sakshi
Sakshi News home page

స్మార్ట్ చోరీ

Published Mon, Oct 17 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

కాలేజీ అమ్మాయిలకు జాగ్రత్తలు చెబుతున్న ఢిల్లీ పోలీసు అధికారి

కాలేజీ అమ్మాయిలకు జాగ్రత్తలు చెబుతున్న ఢిల్లీ పోలీసు అధికారి

జాగ్రత్త!


అది.. ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్. యూనివర్సిటీ విద్యార్థులు భుజానికి బ్యాగ్‌లు తగిలించుకుని, చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని, ఇయర్‌ఫోన్స్ చెవిలో అమర్చుకుని ఎవరికి వారు ఎక్కడో ఉన్న మిత్రులతో కబుర్లలో ఉన్నారు. అంతలో వారి ఎదురుగా ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి అత్యాధునికంగా కనిపిస్తోందో మహిళ. ఆమె కారు ఆపి, అద్దాలు దించి చక్కటి ఇంగ్లిష్‌లో తన ఫోన్ చార్జ్ అయి పోయి డెడ్ అయిందని, అర్జంటుగా ఓ కాల్ చేయాల్సి ఉందని, దయచేసి ఓ సారి ఫోన్ ఇస్తే అర్జంటు కాల్ చేసుకుంటాను అని దివ్య కుమారి అనే స్టూడెంట్‌ని ఎంతో సంస్కారవంతంగా అడిగింది. దివ్య వెంటనే తన ఫోన్‌ని కారులో ఉన్నామెకిచ్చింది. ఆమె ఏదో నంబర్ డయల్ చేయడం చూసి ఫోన్ వినడం సభ్యత కాదన్నట్లు కొద్దిగా పక్కకు జరిగింది. ఆమె ధ్యాస పక్కకు మళ్లడం గమనించిన కారులోని నవనాగరికురాలు కారును ఒక్కసారిగా కదిలించింది. ఫోన్‌తోపాటు పారిపోయింది!

 స్మార్ట్ ఫోన్, బర్త్‌డే కానుకగా అమ్మానాన్నలను బతిమిలాడి మరీ కొనిపించుకున్న ఫోన్... కళ్ల ముందే మాయం కావడంతో గుండె గుభేలుమందా అమ్మాయికి. వెంటనే అలర్ట్ అయి, ‘దొంగ దొంగ’ అని అరుస్తూ సహాయం కోసం చూసింది. అక్కడే ఉండి అంతా గమనిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నరేశ్‌కుమార్ రంగంలోకి దూకాడు. బైక్‌తో కారును వెంబడించాడు. అప్పటికే కొద్దిదూరం వెళ్లిన కారును ఓవర్‌టేక్ చేసి ఆపాడు. మరికొద్ది సేపట్లో దివ్య కుమారి ఎదురుగా పోలీస్ నరేశ్‌కుమార్, ఆయన పక్కనే హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్. వాళ్లిద్దరి పక్కన ఆ  కిలాడీ లేడి. ఆ లేడీ చేతిలో దివ్య దగ్గర దొంగిలించిన స్మార్ట్ ఫోన్. ఆ లేడీ పేరు గురుదీప్ కౌర్. ఆమె సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్!

 
ఢిల్లీలో గత గురువారం ఈ సంఘటన జరిగింది. ఇదంతా ఢిల్లీ పోలీసులు చేసిన మాక్‌డ్రిల్. సెల్‌ఫోన్ దొంగల బారిన పడకుండా ఢిల్లీ టీనేజర్‌లను అప్రమత్తం చేయడానికి చేసిన ప్రయత్నమిది. సెల్‌ఫోన్ దొంగలు అనుసరిస్తున్న పద్ధతినే ఢిల్లీ పోలీసులు చేసి చూపిస్తూ టీనేజర్‌లలో అవేర్‌నెస్ తెస్తున్నారు. ఈ సంఘటనలో పోలీసులు యూనిఫామ్ లేకుండా మఫ్టీలో ఎవరికీ సందేహం రాని విధంగా కథ నడిపారు. ఎందుకిలా అంటే...

 
గత కొంతకాలంగా ఢిల్లీలో సెల్‌ఫోన్ దొంగతనాలు ఎక్కువయ్యాయి. దాదాపుగా నూటికి తొంభై మంది సెల్‌ఫోన్‌ని చేతిలోనే పట్టుకుంటూ ఉంటారు. దుండగులు బైక్, కార్లలో వచ్చి చేతిలో ఫోన్ ఉన్న వారి పక్కనే ఆగుతారు. అదికూడా ఖరీదైన ఫోన్ ఉన్న వారి దగ్గరే ఆగుతారు. తమ ఫోన్ చూపిస్తూ చార్జింగ్ లేక ఆఫ్ అయిపోయిందని చెప్తారు. ఒక్కసారి ఫోన్ ఇస్తే కాల్ చేసుకుని ఇచ్చేస్తామని రిక్వెస్ట్ చేసి, ఫోన్ చేతికి రాగానే ఉడాయిస్తున్నారు. ఈ టైపు మోసాల గురించి అవగాహన లేకపోవడంతో చాలామంది, ముఖ్యంగా టీనేజర్లు మోసపోతున్నారు. ‘అందుకే ఈ అవేర్‌నెస్ డ్రైవ్’ అంటున్నారు ఢిల్లీ మోరిస్‌నగర్ పోలీసులు. మోసగాళ్లు ఎలా మోసాలు చేస్తున్నారో తెలిస్తే, ప్రజలు అమాయకంగా మోసపోకుండా జాగ్రత్తపడతారని చెప్తూ...  ‘ఎవరైనా వచ్చి చార్జింగ్ లేక తమ ఫోన్ ఆగిపోయిందనే కారణం చెప్పి ఫోన్ అడిగితే... తమ ఫోన్ కూడా ఆగిపోయిందని తప్పించుకోవడమే సులువైన మార్గం’ అంటున్నారు. మరో ప్రత్యామ్నాయంగా ఫోన్‌ను పైకి కనిపించనివ్వకుండా బ్యాగ్‌లోనో, జేబులోనో పెట్టుకుని ఇయర్ ఫోన్ ద్వారా మాట్లాడుకోమని చెప్తున్నారు. 

 
ఇది వరకు అమ్మాయిలకు అబ్బాయిల నుంచి ఓ బెడద ఉండేది. అదేంటంటే... ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటానని అడిగి తీసుకుని, అమ్మాయి ఫోన్ నుంచి తన ఫోన్‌కి రింగ్ చేసుకునే వారు. అలా ఆ అమ్మాయి నంబరును సంపాదించి, ఆ తర్వాత తరచూ ఫోన్ చేసి వేధించేవాళ్లు. పైన చెప్పుకున్న ఢిల్లీ తరహా సెల్‌ఫోన్ దొంగతనం ఫోన్ పోవడంతో ఆగకపోవచ్చు. ఆ ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న అందరినీ ఆ ఫోన్ కొట్టేసినవారు వేధింపులకు గురిచేసే ప్రమాదమూ లేకపోలేదు. టీనేజర్లూ జాగ్రత్త.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement