ఫుట్‌బాల్‌లో రాణిస్తున్న దుర్గారావు
కోలా దుర్గారావుకు రెండు చేతులూ లేవు.. కడు పేదరికం కారణంగా అనాథ శరణాలయంలో చదువుకున్నాడు.. అక్కడే ఫుట్‌బాల్‌పై దృష్టి సారించాడు. వైకల్యం ఉంటేనేం.. అందరికన్నా మిన్నగా దూసుకెళ్లాడు. ఎంతలా అంటే దుర్గారావు లేకుండా జిల్లా జట్టు బయట టోర్నీలకు వెళ్లలేనంతగా... అటు చదువులోనూ ఏమాత్రం తగ్గకుండా ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక డిగ్రీలో యూనివర్సిటీ స్థాయిలో మెరవాలని ఆకాంక్షిస్తున్నాడు..
-రాజ్‌కుమార్, విజయవాడ
విజయవాడలోని రాజరాజేశ్వరీపేటలో నివాసముండే దుర్గారావుది పేద కుటుంబం. ఊహించని రీతిలో తన రెండు చేతులను కోల్పోవాల్సి వచ్చింది. తెలిసీ తెలియని వయసులో గాలిపటం కోసం కరెంట్ స్తంభం ఎక్కి ప్రమాదానికి గురయ్యాడు. తన వెనుకే మరికొందరు అదే స్తంభం ఎక్కగా కింద ఉన్న వాడు అదుపు తప్పుతూ దుర్గారావు కాళ్లు పట్టుకుని లాగాడు. దీంతో తను తీగలపై పడ్డాడు.
అంతే ఒక్క క్షణం వాటికి అతుక్కుపోయి తర్వాత ధబేలున కిందపడిపోయాడు. పెద్ద ఆస్పత్రికి వెళ్లే స్తోమత లేక స్థానికంగా ఓ వైద్యుడి దగ్గర చికిత్స తీసుకున్నాడు. సాయంత్రానికి రెండు చేతులు రంగు మారి కొన్ని రోజులకు కుళ్లిపోయాయి. వీటిని తీసేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. అయితే చుట్టుపక్కల వారు చూసే జాలి చూపులను తట్టుకోలేకపోయేవాడు. ఏదో రీతిన ప్రత్యేకత చాటుకుని సెహబాష్ అనిపించుకోవాలని తపించసాగాడు.
దుర్గారావు తండ్రి గణపతి రిక్షా కార్మికుడు. కొడుక్కి చదువు చెప్పించే స్తోమత లేకపోవడంతో విజయవాడ సమీపంలోని బుద్ధవరం కేర్ అండ్ షేర్ అనాథ సంస్థలో చేర్చాడు. ఆట పాటల్లో చురుకుగా ఉంటూ ఇక్కడే ఫుట్‌బాల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఇతడి ఆసక్తికి కోచ్ సురేష్ శిక్షణ తోడయ్యింది. ఆయన పర్యవేక్షణలో దుర్గారావు రాటుదేలాడు. చిన్నప్పటి నుంచీ ఏదో సాధించాలనే తపనను ఈ ఆట ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. అద్భుత ఫిట్‌నె స్‌ను సొంతం చేసుకుని బంతిని తన అదుపులో ఉంచుకున్నాడు.
అందరిలా బంతితో రకరకాల విన్యాసాలు చేస్తాడు. ఫార్వర్డ్ ఆటగాడిగా ప్రతీ మ్యాచ్‌లోనూ దాదాపు తనే తొలి గోల్ సాధించే స్థాయికి ఎదిగాడు. వాస్తవానికి తను లేకుండా బయటి జిల్లాల్లో జరిగే ఓపెన్ ఆహ్వానిత టోర్నీలకు జట్టు వెళ్లదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రా లయోలా కాలేజీలో చదివి ఇంటర్ ప్రథమస్థాయిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక ఈ ఏడాది డిగ్రీ స్థాయిలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ టోర్నీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు తరఫున ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
కొస మెరుపు: చేతుల్లేకపోయినా దుర్గారావు అన్ని విషయాల్లోనూ అందరికన్నా ముందుండాలని ప్రయత్నిస్తుంటాడు. తాటి, కొబ్బరి చెట్లు ఎక్కడమే కాకుండా బైక్‌పై రివ్వున దూసుకుపోగలడు. రెండు చేతులు కలిపి పెన్ను పట్టుకొని రాయగలడు.