సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు
పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు.
ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
పథకం ఏదైనా అదే తీరు..
డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు.
చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం.
పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి..
ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట
పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు.
అర్హతలున్నా ఎంపిక చేయలేదు..!
ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది.