లాలనగా... పాలనగా..!
కొంతమంది తల్లితండ్రులు పిల్లలను బాల్యం నుంచి చాలా క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు. వాళ్లు కదిలితే తప్పు, మెదిలితే తప్పు అన్నట్టుగా చూస్తుంటారు. వారు ఏ మాత్రం అల్లరి చేసినా, కాల్చేసేలా చూస్తారు. అవసరమైతే నాలుగు తగిలిస్తారు. అయితే చిన్నప్పటి నుంచి తలిదండ్రుల దండనతో పెరిగిన పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో లోపాలు చోటు చేసుకుంటాయని మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడిలో ఉపాధ్యాయుల కర్రపెత్తనం వచ్చిన పిల్లలు అమ్మానాన్నలను చూడగానే ఆనందంతో ఎగిరి గంతులు వేసేలా ఉండాలి కానీ, పెద్దపులిని చూసి భయపడినట్లు ఉండటం అటు పిల్లలకే కాదు, ఇటు పెద్దలకూ మంచిది కాదని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా వారు తలిదండ్రుల ప్రవర్తన- పిల్లల ఎదుగుదలపై చేసిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. పిల్లలను ప్రేమగా చూస్తూ, వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే తల్లితండ్రులను చూసి ‘స్ట్రిక్ట్ పేరెంట్స్’ తప్పు పడుతుం టారు. పిల్లలకు చనువిస్తే చంకనెక్కి కూచుంటారని, చెప్పిన మాట వినరని అంటుంటారు. కానీ, వారి వాదన తప్పని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.
చైనాలోని ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థ హంగ్జువా ఏమి చెబుతోందంటే - తల్లితండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కోరుకోవటంలో తప్పు లేదు, అయితే అది మోతాదు మించి, పిల్లల పాలిట క్రమ‘శిక్ష’ణలా పరిణమించకూదు. దాని మూలంగా వారి లేత మనస్సులు తీవ్రమైన ఒత్తిడి కి గురై, పక్కతడపటం, నత్తిగా, నంగి నంగిగా మాట్లాడటం, పక్కచూపులు చూడటం, బిక్కచచ్చిపోవటం వంటి ప్రవర్తనా లోపాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి తల్లితండ్రులు తమ పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి తప్పితే, కోపంతో దండించకూడదు. అల్లరి చేసినప్పుడు సున్నితంగా హెచ్చరించాలి. మారాం చేసినప్పుడు మెల్లగా బుజ్జగించాలి. దానివల్ల క్రమంగా పిల్లలే తమ తప్పును తెలుసుకుని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలా పెరిగిన పిల్లలు తాము పెద్దయ్యాక తోటివారితో కూడా ప్రేమగా మెలగుతారని సర్వేలు చెబుతున్నాయి.