మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా!
శ్రీకృష్ణపాండవీయం (1966) చిత్రంలో భీముడు ఒక సన్నివేశంలో నిద్రపోతూ వుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి, భీముడిని మేల్కొలిపి, కౌరవుల నుండి రాబోయే ప్రమాదాన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలని తెలియజేసే గీతం ‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా’... నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి. ఈ మాటలు ఆ సందర్భంలో చెప్పించిన దర్శకుడు ఎన్టీఆర్. మహాకవి కొసరాజు... భగవద్గీత సారాన్ని, భర్తృహరి సుభాషితాల సారాన్ని కలగలిపి మనకు అందించారు.
అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి/ అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి/ ముందుచూపు లేనివాడు ఎందునకూ కొరగాడు/ సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు... ఈ నాలుగు వాక్యాలూ సగటు మనిషి నుంచి ప్రధాన మంత్రి, అమెరికా అధ్యక్షుడు వరకూ అందరికీ ఉపయోగపడేవే. ఏ వివరణలూ, వ్యాఖ్యానాలూ లేకుండానే సూటిగా మనసులో నాటుకునే సుభాషితాలివి. పాటను రాసిన కొసరాజుగారి సంస్కారం, దూరదృష్టి అద్భుతం.
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా/ ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా... అనే పల్లవిలో ప్రతివాడూ ఏదో ఒక మత్తులో ఉంటాడు. అది నిద్దురమత్తు కావచ్చు. డబ్బు, అధికారం, దుర్వ్యసనాలు ఏవైనా కావచ్చు. లౌకికంగా, ఆధ్యాత్మికంగా అహంకార మమకారాలు కూడా మత్తే. మూఢభక్తి, సోమరితనం కూడా ఈ కోవలోకే వస్తాయి. వీరందరూ పొద్దున్నే లేస్తూనే ఈ పాటవినాలి. మొహం కడుక్కుంటూ వినాలి. స్నానం చేశాక దేవుడి పూజకి ముందు వినాలి. ప్రయాణం చేసేటప్పుడు వినాలి. ఉద్యోగస్తులు ఆఫీసులోకి వెళ్లే ముందు విని తీరాలి. మధ్యాహ్నం ఎప్పుడు కునుకు తీయాలనిపించినా సెల్‌ఫోన్లో రికార్డు చేసుకుని వినాలి. లేకపోతే జీవితమంతా గమ్మత్తుగా చిత్తవుతారని కొసరాజు గారి హెచ్చరిక.
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు/ మిగిలిన
ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అనే వాక్యాలను...
ఆయువు నూరు వత్సరములందు గతించు సగంబు నిద్రచే
ఆ యరలో సగంబు గతమయ్యెడు బాల్యజరాప్రసక్తిచే
పాయక తక్కినట్టి సగపాలు గతించు ప్రయాసవృత్తిచే...
అనే భర్తృహరి పద్యంలోని భావాన్ని ఇలా మలచారు ఈ పాటలో కొసరాజు.
అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు/ పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు... అతి నిద్రవల్ల, మూర్ఖంగా
ప్రవర్తించడం వల్ల తనకు భగవంతుడు ఇచ్చిన శక్తిని తెలుసుకోలేక, తెలిసినా సద్వినియోగం చెయ్యలేక అనవసరంగా చెడిపోతారని హెచ్చరించారు కొసరాజు. ఇక్కడ ‘వ్యర్థంగా చెడతాడు’ అనే వాక్యం లోతు వివేకవంతుడే కొలవగలడు.
తనకున్న గొప్పశక్తిని అల్పమైన విషయాలకు ఉపయోగించి వాటిల్లో విజయాలు పొందుతూ, ఆ కొద్దిపాటి విజయాలనే ఆస్వాదిస్తూ దశాబ్దాల తరబడి అలాగే జీవిస్తూ కారణజన్ములమనుకోవడమే వ్యర్థంగా చెడిపోవడం.
సాగినంతకాలము నా అంతవాడు లేడందురు/ సాగకపోతే ఊరక చతికిలపడిపోదురు... ఈ వాక్యాలు ప్రముఖ రంగాలలోని పెద్దలకు, సామాన్యులకు వర్తిస్తాయి.
చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా/ పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా... ఈ వాక్యాలను ప్రతి ఒక్కరూ నిత్యం మననం చేసుకోవాలి. చివరగా భగవద్గీతలోని ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’, ‘యోగక్షేమం వహామ్యహం’ వంటి శ్లోకపాదాల భావాలతో ‘కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు’ అని ధైర్యాన్ని కలిగిస్తూ... ‘చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం’ అని తన మార్కు వ్యంగ్యాన్ని కూడా చాటారు కొసరాజు. ఆ మహాకవికి, క్రాంతి దర్శియైన దర్శకుడు ఎన్టీయార్‌కి, దివ్యచైతన్యాన్ని ఈ కలిగించే గీతానికి నా నమస్కారాలు.
- సంభాషణ : నాగేష్