మీ గ్రాఫ్ పడిందా? | special chit chat with director krishna vamsi | Sakshi
Sakshi News home page

మీ గ్రాఫ్ పడిందా?

Published Sun, Jul 31 2016 12:25 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

మీ గ్రాఫ్ పడిందా? - Sakshi

మీ గ్రాఫ్ పడిందా?

నాట్ ఫర్ సేల్
అమ్మకం.. అమ్మకం.. అమ్మకం..
సినిమా అంటే... కథ అమ్మాలి.
స్క్రీన్‌ప్లే అమ్మాలి... మాటలు అమ్మాలి.
ఫీల్ అమ్మాలి... టేకింగ్ అమ్మాలి.
అయ్యో.. మర్చేపోయాం.
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టికెట్లు అమ్మాలి.
‘‘ఇన్ని అమ్మే క్రమంలో డెరైక్టర్ తన ఉనికిని అమ్ముకోవాలా?’’
అని అడుగుతున్నారు కృష్ణవంశీ.  


‘గులాబి’ రిలీజై ఈ ఏడాదికి 20 ఏళ్లయింది. ఇప్పుడు చేస్తున్న ‘నక్షత్రం’తో కలిపి మీవి 20 సినిమాలే. లెక్క తక్కువ..?
సినిమా నాకు ఉద్యోగం కాదు.. జీవితం కూడా కాదు. నేను సినిమా తీయాలంటే మంచి పాయింట్ దొరకాలి. దొరికేంతవరకూ వెయిట్ చేస్తా. ఆ సినిమాకి ఎంత టైమ్ పడితే అంత తీసుకుంటా. ఎక్కువ డబ్బు సంపాదించాలని, వంద సినిమాలు తీసేయాలనే టార్గెట్ లేదు. చేసే సినిమా నాకు ఆత్మసంతృప్తిని అయినా ఇవ్వాలి లేదా వందలో పది శాతం ప్రేక్షకుల్లో ఒక ఆలోచన, మంచి భావం రేకెత్తించే విధంగా ఉండాలి.


ఆత్మసంతృప్తి సరే.. ఆర్థిక సంతృప్తి..?
దానికి లిమిట్ ఏంటి? డబ్బు కోసమే అయితే మనసుకి నచ్చని సినిమాలు తీయాల్సొస్తుంది. నిర్మాత కోసం కొన్ని సూత్రాలు పాటించాల్సి వస్తుంది. వాటితో సినిమాలు తీయాలంటే నాకు మనస్కరించదు. తలొంచి సినిమా తీస్తే వ్యభిచారం చేసినట్లుగా ఫీలవుతా. మనిషిని సమూలంగా చంపేసే వృత్తి వ్యభిచారం అని నా ఫీలింగ్. డబ్బు కోసం చూసుకుంటే ‘సిందూరం’, ‘అంతఃపురం’, ‘ఖడ్గం’ లాంటి సినిమాలొస్తాయా? నేనెవర్నీ తక్కువ చేయడంలేదు. అందరికంటే నేనే గొప్ప అనడంలేదు. అందరూ ఒక రూట్‌లో వెళితే ఈ రూట్‌లో ఎవరు వెళతారు?


సెపరేట్ రూట్‌లో వెళ్లడంవల్ల, నిక్కచ్చిగా ఉండటంవల్లే కొంతమంది నిర్మాతలు మీతో సినిమాలంటే భయపడతారేమో?
నేనేం కొట్టి చంపేయను కదా. ఏదైనా స్ట్రైట్‌గా, ఓపెన్‌గా మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ కావాలి. దానివల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి గట్స్ లేదా నేను చేస్తున్నది కరెక్ట్ అని నమ్మగలిగే మూర్ఖత్వమైనా ఉండాలి. ‘నేనేం తప్పు చేయలేదు.. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అది దేవుడైనా సరే’ అని ‘మురారి’లో డైలాగ్ చెప్పించాను. దాన్ని నమ్మాను కాబట్టే ఆ డైలాగ్ రాశాను. అలాంటి నేచర్ ఉన్నప్పుడు నిర్మాతలు భయపడతారనో, విమర్శిస్తారనో నా ఒరిజినాల్టీని చంపేసుకుని, నక్క వినయాలు నటిస్తూ, మాయ చేస్తే అప్పుడు నాకోసం నేను బతికినట్లవ్వదు. ఇతరుల కోసం బతకలేను.

మరి... మిమ్మల్ని మాయ చేసిన నిర్మాతలు ఉన్నారా?
కొందరు మోసం చేశారు. వాళ్లకు డబ్బులొచ్చినా రాలేద ని నా దగ్గర్నుంచి తీసుకున్నారు. ఒకడు తన నాలుగైదేళ్ల కూతురు మీద ఒట్టేసి సినిమా చేయించుకున్నాడు. అయిపోయిన తర్వాత 4 కోట్లకు టెండర్ పెట్టాడు. అబద్ధమాడుతున్నాడు, మోసం చేస్తున్నాడని తెలుసు. కానీ, నా సెంటిమెంట్‌కి కమిట్ అయ్యాను. నేను రోడ్డు మీద పడలేదు. వాడు బాగుపడి అంబానీ అవ్వలేదు. నాలుగు కోట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. సరిగ్గా ఉండుంటే ఇంకో మంచి సినిమా చేసేవాణ్ణి. జన్మలో ఇక వాడితో సినిమా చేయను.

స్టార్ డెరైక్టర్లు దాదాపు స్టార్ హీరోలతోనే సినిమా తీస్తారు.. ఇప్పుడు మీరు సందీప్ కిషన్‌తో సినిమా చేస్తున్నారు.. మీ గ్రాఫ్ పడిందా? సందీప్‌ది పెరిగిందా?
నాకు స్టార్ అయినా నాన్-స్టార్ అయినా ఒకటే. కథకు సూటయ్యేవాళ్లతోనే తీశాను. పేర్లెందుకు కాని కథకు సూట్ కాని వాళ్లతోనూ చేశాను. కానీ, అది చేస్తున్నప్పుడు ‘మనకిది కరెక్ట్ కాదు’ అనిపించింది. నేను రామ్‌చరణ్‌తో చేస్తే పెద్ద డెరైక్టర్ అన్నట్లా? సందీప్‌తో సినిమా చేస్తే చిన్న డెరైక్టర్ అన్నట్లా? నేను పడ్డానా? పెరిగానా? తగ్గానా? అని తెలియడంలేదు. నా వరకు నేను ప్రొఫెషనల్‌గా సక్సెస్ కావడం అంటే ‘చందమామ’, ‘నక్షత్రం’ లాంటి సినిమాలు తీయగలగడం. 60 కోట్లతోనూ సినిమా తీయగలను. 15 కోట్లతోనూ తీస్తాను. 85 లక్షల్లో ‘డేంజర్’ చేశాను. నాకు సినిమా ఇంపార్టెంట్. దానికి పెట్టే పెట్టుబడి, వచ్చే బజ్ నాకు ముఖ్యం కాదు.

ఏది పడితే అది కాకుండా ఎలాంటి సినిమా తీస్తున్నామనే విషయంలో దర్శకుడికి సామాజిక బాధ్యత ఉండాలి కదా?
కచ్చితంగా. నాకు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, విజిల్స్ ముఖ్యం కాదు. ఆ తర్వాత ఆ ప్రేక్షకుడి మైండ్‌లో ఆ సినిమా ఎలా తిరుగుతుందన్నదే ముఖ్యం. నా హీరో రౌడీయో, పోరంబోకో,  సిస్టమ్‌ని లెక్క చేయనివాడో, జేబుదొంగో, హంతకుడో ఉండడు. నా 20 సినిమాల్లో ఒక్క ‘రాఖీ’ సినిమాలోనే హీరో హత్య చేస్తాడు. దానికి రీజన్ ఉంటుంది. ఒకళ్లు మనల్ని ఫాలో అవుతున్నారని తెలిసినప్పుడు మంచి చెప్పాలి. అందుకే ఎంజీఆర్‌గారు, రజనీకాంత్, కమల్‌హాసన్ తమ సినిమాల్లో  పది మంచి మాటలైనా చెప్పాలని ఇన్‌సిస్ట్ చేస్తారట. మనం ఎందుకు దాన్ని ఆచరించడంలేదు? నావి ఫెయిల్యూర్ సినిమాలున్నాయి. కానీ, డెరైక్టర్‌గా నా టాపిక్ ఫెయిల్ కాలేదు. ఎందుకంటే నేనెప్పుడూ బ్యాడ్ ఫిల్మ్ తీయలేదు. లెక్చరర్స్, ఫాదర్స్, మదర్స్ మీద సెటైర్లు వేస్తూ సినిమాలు తీయలేదు. నా బ్రదర్స్ కోసమో, సిస్టర్ కోసమో, నా కొడుకు కోసమో, బంధువుల కోసమో సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలిగా. నాకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. వాణ్ణి వెళ్లి, లెక్చరర్‌ని చంపేయమని చెప్పలేను కదా. అందుకే చూపించను.

బౌండ్ స్క్రిప్ట్‌తో కాకుండా లొకేషన్లో సీన్లు వండుతారట...?
నాతో సినిమా చేసిన హీరోనో, ప్రొడ్యూసరో, టెక్నీషియనో నాతో నేరుగా ఈ మాట అంటే సమాధానం చెబుతా. వాళ్లెవరూ కాదు.. ఎవరో అన్నారనుకుందాం. వాడికి ఏం తెలుసని అంటాడు? బౌండ్ స్క్రిప్ట్‌తో ఎన్ని సినిమాలు తీస్తున్నారో తెలుసా? అసలు బౌండ్ స్క్రిప్ట్‌తో తీసిన సినిమాల్లో ఎన్ని ఆడాయో తెలుసా? బౌండ్ స్క్రిప్ట్ అంటే వాడికి తెలుసా? ఆ మాట్లాడేవాడి తాలూకు అర్హత ఏంటి? వాడెవడో తెలిస్తే వాడికి తగ్గట్టుగా సమాధానం చెబుతా. బౌండ్ స్క్రిప్ట్‌తో తీశారా? అక్కడికక్కడ వండి తీశారా? అనేది ప్రేక్షకుడికి అనవసరం. ప్రేక్షకుడికీ, ఫిల్మ్ మేకర్స్‌కి ఉండే అనుబంధం టికెట్. వాళ్లకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవడు పడితే వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి మీదైనా రాళ్లు వేయడం ఈజీ. వాళ్లకి వేరే పనిలేదు. ఏసుక్రీస్తుని, గాంధీ మహాత్ముడిని చంపేసిన ప్రపంచం ఇది. మహాశక్తిని ఆపడానికి ఒక్క పిచ్చోడు చాలు. అలాంటి కోట్లాదిమంది పిచ్చోళ్లు ఉన్న దేశం మనది. నన్ను మాట అనడం వల్ల సంతృప్తి దక్కుతోందంటే నో అబ్జక్షన్.


మీతో పనిచేయడానికి మీ డెరైక్షన్ డిపార్ట్‌మెంట్, ఇతర టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్.. ఎవరు బాగా ఇబ్బంది పడతారు?
నాకు తెలిసి నాతో పని చేస్తున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగని చెప్తారు కూడా. నిజమా? అబద్దమా? నాకు తెలీదు. ఛీఫ్ టెక్నీషియన్ ఆఫ్ ది ఫిల్మ్ కాబట్టి.. నా కథ, ఊహలకు తగ్గట్టు పని చేయమని చెప్తాను. ఉదాహరణకు.. ‘మురారి’లో పెళ్లి పాట చివరిది. అప్పటికి ఓ 20 ఏళ్లుగా చివరి పాట మాంచి మాస్ బీట్ వస్తోంది. హీరో, నిర్మాత, యూనిట్ అందరూ అలాంటి సాంగ్ కావాలని పట్టుబట్టారు. పెళ్లి పాట ఏంటని విసుక్కున్నారు. దాంతో ‘వేరే దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్‌తో మీకు కావలసిన పాట తీసుకోండి. నా పేరు తీసేసి సినిమా రిలీజ్ చేసుకోండి. ఆ సాంగ్ మినహా ఫస్ట్ కాపీ ఇచ్చేస్తాను. ఇప్పట్నుంచి ఈ సినిమాకి ఎవరు డెరైక్షన్ చేసినా.. నాకు ఓకే. నో అబ్జక్షన్ లెటర్ కూడా ఇస్తాను’ అన్నా. ఇంతవరకూ చేసిన తర్వాత అలా ఎలా కుదురుతుందన్నారు. ‘అలాగైతే ఈ పాటే ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోండి’ అన్నాను. ఆ పాట మన పెళ్లిళ్ల స్ట్రక్చర్ మార్చేసింది. ఆ పాట పెట్టాలనే నా పట్టుదలను పొగ రుబోతుతనం అంటామా? నమ్మకం అంటామా?
 

ఇతరుల మాట వినకుండా, మీరు నమ్మి తీసినవాటిలో ఫెయిలైనవి ఉండే ఉంటాయ్. అప్పుడు మీ ఫీలింగ్?
‘నువ్ చేస్తున్నది పూర్తిగా తప్పు’ అని నేను నిజంగా గౌరవించే వ్యక్తులు ‘శ్రీఆంజనేయం’ తీసేటప్పుడు చెప్పారు. కొందరు ఈ లోకంలో కూడా లేరు. ఆ రోజున్న నా మానసిక స్థితికి ఎక్కలేదు. నేనే కరెక్ట్ అనుకున్నాను. నిర్మాతను కూడా నేనే కావడంతో కష్టనష్టాలు భరిద్దామనుకున్నాను. ‘మీరు చెప్పినట్టు చేసుంటే బాగుండేదేమో’ అని విడుదల తర్వాత నా తప్పు ఒప్పుకున్నాను. నేను తప్పు ఒప్పుకోవడానికి భయపడను. 
 

మీ మనస్తత్వాన్ని మార్చుకోమని రమ్యగారు అనలేదా?
యాజ్ ఎ వైఫ్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.. ‘ఎందుకిలా? కరెక్ట్ కాదు’ అంటుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ‘సరేలే.. ఏం చెప్పి నిన్ను మార్చగలం’ అని సెలైంట్ అయిపోతుంది. ‘అది చూసే కదా నువ్వు పడ్డావ్. ఇప్పుడు మారమని ఎందుకు అంటున్నావ్?’ అనడుగుతా (నవ్వుతూ). ఆవిడ ఏంజిల్ అండి.
 

‘శ్రీఆంజనేయం’కి రమ్యగారి డబ్బులు పెట్టారనే టాక్ ఉంది?
ఇప్పటివరకూ తనది ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ‘ఐ డోంట్ కేర్’. తీసుకోలేదు కాబట్టే, మా జీవితం హాయిగా సాగుతోంది. ఆవిడ డబ్బులు టచ్ చేసిన మరుక్షణం నేను చనిపోయినట్లే. ఆ పరిస్థితి ఇప్పటివరకూ రాలేదు. ఎప్పటికీ రాదు కూడా.
 

మీ లవ్‌స్టోరీ తెలుసుకోవాలని ఉంది..
మా ఇద్దరి మధ్య ఉన్న ఓ అపురూపమైన అందమైన విషయం అది. చెబితే మా స్పేస్ మిస్సవుతుంది. ముందు ఎవరు ప్రేమలో పడ్డారు? ఎవరు పడేశారు? అనేవి పంచుకునే విషయాలు కావు. కొన్ని అమ్మే విషయాలుంటాయి. కొన్ని అమ్మకూడని విషయాలుంటాయి. కొన్ని అమ్మరానివి ఉంటాయ్. దిసీజ్ నాట్ ఫర్ సేల్ (నవ్వుతూ).
 

మీ సినిమాల్లో పెళ్లిళ్లు చాలా అందంగా చూపిస్తారు. కానీ, మీ పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకున్నారు.
నా దృష్టిలో పెళ్లి అంటే అంతే. ‘మురారి’ సినిమాలోని పెళ్లిలో కూడా కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. నా ఫీలింగ్ అది. అందుకే, నా పెళ్లి కూడా అలా చేసుకున్నాను. నేను, రమ్య పెళ్లికి పిలవడం మొదలుపెడితే.. ఎన్ని ఇండస్ట్రీలను పిలవాలి. ‘నువ్వు, నేను పెళ్లి చేసుకున్న ఫీలింగ్ మనలో కలగాలంటే.. బయట వ్యక్తులు ఎవరూ వద్దు. నీకు బాగా దగ్గరైన, నాకు బాగా దగ్గరైన ఫ్రెండ్స్‌ని పిలుద్దాం’ అని రమ్యతో చెప్పాను. సీతారామ శాస్త్రి గారు, రాఘవేంద్రరావు గారు, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్.. ఇలా కొందరి, మా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం.

 
సింపుల్ మ్యారేజ్ అంటే రమ్యకృష్ణగారు ఒప్పుకున్నారా?

మొదట ‘ఉహూ..’ అంది. తర్వాత లాజిక్ చెప్పాను. పెళ్లికి వచ్చినోళ్లలో 90 శాతం మంది ‘భలేవాణ్ణి పట్టిందిరా రమ్యకృష్ణ అని నిన్ను.. ఏం అమ్మాయిని పట్టాడని నన్ను’ జోకులేస్తారు. ఇంతకు మించి ఎవ్వరైనా ఏమైనా అనుకుంటారని నీకుందా? అన్నాను. ‘అందరూ ఇదే అనుకుంటారు’ అని చెప్పింది. ‘మరి గ్రాండ్‌గా ఎందుకు?’ అన్నాను. పిలిచిన తర్వాత అందరికీ మర్యాదలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అని టెన్షన్ కూడా ఉంటుంది. అలాగే డబ్బులు ఖర్చు. ‘పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అంతా డొనేట్ చేద్దాం. కంఫర్ట్‌గా పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. నాలుగు గంటలు హోమాలు, పూజలు చేసుకుంటూ, కంగారు లేకుండా, చాలా ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నాం.  

     
మీడియాలో మీరూ, రమ్యకృష్ణ విడాకులు తీసుకుంటున్నారని, గొడవపడ్డారనీ వార్తలు వస్తుంటాయి. మీ రియాక్షన్?
సీరియస్‌గా తీసుకోం. ఏం న్యూస్ దొరికినట్టు లేదు మాపై పడ్డారనుకుంటా. రమ్యకు తెలుగు రాదు కాబట్టి, చదివి వినిపిస్తా. విని, ‘అవునా?’ అని కూల్‌గా అంటుంది.

ఇద్దరూ బయట ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించరేం?
ఫంక్షన్‌కి వెళ్లాలనుకుంటే ఇద్దరం కలిసే వెళతాం. అంతేగానీ, నువ్ సపరేట్‌గా వెళ్లు.. నేను సపరేట్‌గా వెళతా.. అని ఎప్పుడూ అనుకోం. నేనంత అవుట్‌డోర్ మనిషిని కాదు. కొంచెం షైగా ఉంటాను. భార్యభర్తల అనుబంధం అనేది పది మందికి చూపించే పబ్లిక్ డిస్‌ప్లే కాదు. మేమిద్దరం జనాలకు భయపడి బతికేవాళ్లం కాదు. ఇద్దరం కలసి కనిపించి చాలా రోజులైంది, జనాలు ఏమనుకుంటారో? అనే ప్రస్తావన మా మధ్య ఉండదు. ‘నాకు నువ్వు.. నీకు నేను’ అనుకున్నప్పుడు మూడో వ్యక్తి ఏమనుకుంటున్నాడు? అనేది అనవసరం. ఓ అబద్దాన్ని సృష్టించి వాడు హ్యాపీగా ఫీలవుతుంటే.. చావనీ అనుకుని వదిలేస్తా.


పవన్‌కల్యాణ్... లాంటి కొందరు అగ్రహీరోలతో మీరు ఎందుకు సినిమాలు చేయలేకపోయారు?
అలాంటి వారితో పని చేస్తేనే నాకు వ్యక్తిత్వం, అస్తిత్వం ఉన్నట్టా? పవన్‌కల్యాణ్ ఓ క్రౌడ్ పుల్లింగ్ హీరో. కొన్ని కోట్లమంది జనం అతనంటే విపరీతంగా రియాక్ట్ అవుతారు. అంటే.. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తారు. ఆ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ నేను చేయాలి. హీరోతో పాటు అభిమానుల్ని శాటిస్‌ఫై చేయడం కోసం సినిమా తీయాలా? నాకనిపించిన పాయింట్ మీద సినిమా తీయాలా? నా పాయింట్‌కి సూట్ అయితే, వెళ్లి అడగడానికి రెడీ.


‘నక్షత్రం’ సినిమా విడుదల ఎప్పుడు?
దసరాకి విడుదల చేయాలనుకుంటున్నాం.


మీకు హిందూ భావజాలం ఎక్కువట?
హిందూ మతం దేవుళ్లకు సంబంధించిన అంశం కాదు. ఓ జీవన విధానం. ఎలా బతకాలి? ఎలా బతికితే బాగుంటుంది? తక్కువ సమస్యలు ఉంటాయి? సంతోషంగా ఎలా బతకొచ్చు? అని చెప్పే ఓ జీవన విధానం. ఇస్లాం, క్రిస్టియానిటీ.. ఏ మతం అయినా ఇలా బతకండని చెబుతుంది. చిన్నప్పట్నుంచి హిందూ మతం తాలూకు పరిసరాల్లో పుట్టాను, పెరిగాను కాబట్టి హిందూ భావజాలం నాలో ఉంది. మనం చేయబోయే పనికి మన తాలూకు లేదా బయట నుంచి వచ్చే ఆటంకాలను తట్టుకోవాలంటే ఓ ఫోర్స్ కావాలి. విఘ్నేశ్వరుడికి దణ్ణం పెడితే.. విఘ్నాలు ఉండవనే ధైర్యం వస్తుంది. దీన్ని హిందూ మతం అంటే నో అబ్జక్షన్. అలాగే డబ్బులు కావాలంటే డబ్బులొచ్చే పని చేయాలి. దాంతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. దీన్ని హిందూ మతం అంటే నో అబ్జక్షన్. గాయత్రీ మంత్రంలో ఉండే బీజాక్షరాల్లో ప్రతి అక్షరానికి ఓ వైబ్రేషన్ ఉంది. బాడీలో ప్రకంపనలొస్తాయి. ఎనర్జీ ఫామ్ అవుతుంది. ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. మంత్రం చదవకుండా నాకు ఎనర్జీ, ధైర్యం వచ్చిందని కొంతమంది అంటారు. అందువల్ల, మంత్రం తప్పని నువ్వెలా అంటావ్? నీకు డ్రైవింగ్ వచ్చు, నాకు రాదు.

అందుకే డ్రైవర్ హెల్ప్ తీసుకుంటా. అదే దేవుడు అనుకుంటా. అరబు దేశాల్లో పుట్టి ఉంటే ముస్లిం, అమెరికాలోనో, యూరోప్‌లోనో పుట్టుంటే క్రిస్టియన్ అయ్యేవాణ్ణి. నీ పుట్టుకను బట్టి నీ మతం డిసైడ్ అవుతున్నప్పుడు, ఇది తప్పు, రైట్ అనడానికి నువ్వెవరు? నీ తల్లితండ్రులను కానీ, మతాన్ని కానీ నువ్వు డిసైడ్ చేయలేదు. హిందూ భావజాలాన్ని అంటరానితనంగానో, పాపం కిందో ఫీల్ అవ్వకూడదు. మనం పుట్టి పెరిగిన భావజాలం. ‘ఖడ్గం’లో ఇదే మాట్లాడడానికి ప్రయత్నించాను. ఇంకొకరిది తప్పు అనడం లేదు. ఇది తప్పు? ఇది రైటు? అని మనం ఎలా అంటాం? ఒక్కో చోట ఒక్కో అలవాటు. కొన్ని వేల సంవత్సరాలుగా సెటిల్ అయిపోయి ఉంది. దాన్ని మార్చాలంటే మళ్లీ మార్టిన్ లూథర్ కింగో, గాంధీగారో వచ్చి చెప్పాలి.


మీ అబ్బాయి రిత్విక్ గురించి?
బాగా షార్ప్, చార్మింగ్, అల్లరి. మా ఇద్దరి లక్షణాలు సమానంగా వచ్చేశాయి. 4 భాషలు మాట్లాడతాడు.

     
హీరోని చేస్తారా? దర్శకుణ్ణి చేస్తారా?

నేను, రమ్య సెల్ఫ్‌మేడ్. మీరు ఇది అవ్వాలని చెబితే.. అయినవాళ్లం కాదు. మా అబ్బాయి ఓ రోజు ఆస్ట్రోనాట్, ఓ రోజు స్పేస్ మెకానిక్, మరో రోజు కార్ డ్రైవర్, ఇంకో రోజు టెన్నిస్ ప్లేయర్ అంటాడు. ఇంతవరకూ హీరో అవుతానని, దర్శకుడు అవుతానని మాత్రం చెప్పలేదు. డెస్టినీ అనేది ఒకటుంటుంది. ‘వాట్ లైఫ్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్’ అనేది మనకు తెలియదు.
- డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement