
మంత్రి గారింటి మహాలక్ష్మి బడ్జెట్
కేంద్ర బడ్జెట్ పద్దులు తెలిసిపోయాయి. ఇక మిగిలింది రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్లే! తెలంగాణలో ఆ భారమంతా ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌కి వదిలేసి, వాళ్లింట్లో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే ఆయన సతీమణి జమునా రాజేందర్‌ను కదిలిద్దాం. ఇంటి పద్దులను ఆమె ఎలా ప్లాన్ చేసుకుంటారు? గృహిణిగా, వ్యాపారవేత్తగా... ఆర్థిక సమస్యల్ని, సంక్షోభాలను ఎలా పరిష్కరించుకుంటారు? అసలు ఆమె నిర్వహణ ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఈటెల వారి ఇంటి ఫైనాన్స్ మినిష్టర్ మాటల్లోనే తెలుసుకుందాం.
మాది ప్రేమ వివాహం కావడంతో అటు నుంచి, ఇటు నుంచి, ఎటు నుంచీ ఆసరా లేదు. కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. మా లక్ష్యమూ అదే! దానికనుగుణంగానే మా జీవన శైలిని మలచుకున్నాం. మా ఇంటి బడ్జెట్టూ అట్లాగే ఉండేది.. ఉంటోంది.. ఉంటుంది కూడా! గృహ నిర్వహణ, వ్యాపార నిర్వహణ రెండూ ఒకేసారి నేర్చుకున్నా.
1 అవసరాలకే ప్రాధాన్యం
ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం కచ్చితమైన ప్రణాళిక. మొదట్లో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ సమయంలోనే వ్యాపార అభివృద్ధి గురించి రకరకాల ఆలోచనలుండేవి ఆయనకు. ఇంట్లో ఏ లోటూ రాకుండా చూసుకోవాలి, అదే సమయంలో వ్యాపారంలో ఆయనకు నైతిక మద్దతుగా ఉండాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలంటే కచ్చితమైన ప్రణాళిక ఉండాలి కదా.
అందుకే విలాసాలకన్నా, అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేదాన్ని. బంగారు నగలు కావాలని నేనెప్పుడూ పట్టుబట్టలేదు. ఇప్పటికీ ఆభరణాల మీద ఆసక్తి తక్కువే. నిశ్చలంగా ఉండిపోయే వేటి మీదా డబ్బు మదుపు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో అయినా, వ్యాపారంలో అయినా ఇదే సూత్రం ఫాలో అవుతాను. అలాగే అవసరాలకు తగ్గట్టు డబ్బు సర్దుబాటు కానప్పుడు డబ్బుకు తగ్గట్టే అవసరాల ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకుంటాను.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు (ఇప్పుడు అబ్బాయి నితిన్ బీబీఏ గ్రాడ్యుయేట్, అమ్మాయి నేహ మెడికో) డబ్బు ఇబ్బంది ఉంటే వాళ్ల పుట్టినరోజులకు పదిమందిని పిలిచి ఘనంగా వేడుక చేసేవాళ్లం కాదు. చక్కగా ఇంట్లోవాళ్ల మధ్యే కేక్ కట్ చేయించి, ఆనందాన్ని పంచుకునేవాళ్లం. అలాగే ఇప్పటికీ హోటళ్లలో పార్టీలంటే అంతా దూరంగా ఉంటాం. ఎంతమంది వచ్చినా ఇంటికే పిలిచి వాళ్లకు నచ్చిన వంటలను వండి వడ్డిస్తాను. దీని వల్ల ఇటు ఆరోగ్యం, అటు పొదుపు! అంతేకాదు, ఇంటికి వచ్చిన అతిథులూ తమకు సాదర గౌరవం దొరికిందని ఫీలవుతారు. వండి పెట్టడమనే శ్రమను ఓర్చుకుంటే ఇంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు.
2. చదువు, ఆరోగ్యాల కోసం..
మాకు వచ్చే ఆదాయంలో పిల్లల చదువు, ఆరోగ్యం, అత్యవసర ఖర్చులకు ఎప్పుడూ వాటా ఉండేది. ఆదాయంలో చదువుకి కచ్చితంగా ఐదు శాతం పక్కన పెట్టేదాన్ని. అరోగ్యం, ఇతర అత్యవసర ఖర్చులకూ ఐదు శాతానికి అటూ ఇటూగా దాచేదాన్ని. వీటిని మినహాయించిన తర్వాత మిగిలే డబ్బులనే ఇతర అవసరాలకు వాడేదాన్ని. ఇంటికి సంబంధించిన అవసరాలకు మించి దేనిమీద ఖర్చుపెట్టినా వృథాగానే భావిస్తాన్నేను.
అందుకే షాపింగ్‌లాంటి అలవాట్లకు చాలా దూరంగా ఉంటాను. మా పిల్లలకూ అదే నేర్పాను. చిన్నప్పటి నుంచి మా వ్యాపార విషయాలను, ఆర్థిక వ్యవహారాలను, దానికనుగుణంగా ఉన్న మా జీవనశైలిని వాళ్లకు కథల రూపంలో చెప్పేదాన్ని. దీనివల్ల మా ఇంటి పరిస్థితులను వాళ్లు చాలా తేలిగ్గా అర్థం చేసుకున్నారు. అందుకే ఎప్పుడైనా వాళ్లు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు నేను వద్దు అంటే మారాం చేయకుండా ఊరుకునేవారు. ఎందుకు వద్దంటున్నానో అర్థంచేసుకునేవాళ్లు. అలా వాళ్లూ చిన్నప్పటి నుంచే డబ్బు విలువని తెలుసుకున్నారు. పాకెట్ మనీని వేస్ట్ చేసేవాళ్లు కాదు.
3 అప్పు ఇంటికి చేటు...
ఇంటికి, వ్యాపారానికి సంబంధించి గడ్డు రోజుల్ని కూడా చూశాం. కానీ ఎప్పుడూ డీలా పడలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండదు అనే నమ్మకం ఉండేది. డబ్బు బాగా ఉన్నప్పుడు కూడా సంయమన శక్తి ఉండేది. ఈ రెండింటినీ మావారి నుంచే నేర్చుకున్నాను. ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా ఫాలో అయ్యాను. ఇంటికి సంబంధించి ‘అప్పు’ అనే ఊబిలో ఎప్పుడూ పడలేదు. ఇంటి అవసరాల కోసం అప్పు చేయడమనే తప్పు నేనెప్పుడూ చేయలేదు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడమంత ఉత్తమం ఇంకోటి లేదు. ఒక్కసారి అప్పు చేస్తే అది అలవాటుగా మారుతుంది.
ఇంటి బడ్జెట్ మిగులు లేకపోయినా పరవాలేదు కానీ లోటులో పడకూడదని అంటాను. అప్పులు ఆ లోటును పెంచుతాయి. అందుకే ఎవరమైనా అప్పులకు సాధ్యమైనంత దూరంలో ఉండాలి. అయితే వ్యాపారానికి ఈ సూత్రాన్ని కొంచెం మార్చుకోవచ్చు. బిజినెస్‌లో అప్పుతోనే అభివృద్ధి. అదీ ఎప్పుడు, ఎంత అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. చేస్తున్న వ్యాపారం ఇంకా పుంజుకునే అవకాశం ఉండీ సరిపడా డబ్బులేనప్పుడు అప్పు చేసయినా దాన్ని నిలబెట్టుకోవాలి. అదీ మన దగ్గర 70 శాతం పెట్టుబడి ఉన్నప్పుడు మిగిలిన 30 శాతాన్ని అప్పుతెచ్చుకోవచ్చు. ఈ 30 శాతాన్ని అత్యవసర పరిస్థితుల్లో 50 శాతానికి పెంచుకోవచ్చు. అంతే.. అంతకంటే ఎక్కువ అప్పు చేసి వ్యాపారంలో పెట్టినా వృథానే!
4. డెడ్ ఇన్వెస్ట్‌మెంట్..
ఇందాక చెప్పినట్టు కదలని మెదలని వాటిమీద మేమెప్పుడూ డబ్బుని మదుపు చేయలేదు. వ్యాపారంలో వచ్చిన లాభాన్ని భూమ్మీద ఇన్వెస్ట్ చేశాం. ఉన్న వ్యాపారాన్నే అభివృద్ధి చేసుకునేందుకు ఖర్చుపెట్టాం. అంతే తప్ప ఇంటి నిర్మాణం కోసమైతే పెట్టలేదు. పిల్లలకు ఐదారేళ్లు వచ్చేటప్పటికే కారు కొనుక్కున్నాం కానీ ఇల్లు కట్టుకోలేదు. కారు ఖర్చు కాదా అంటారేమో.. కానీ ఆ ఖర్చుని టైమ్‌తో లెక్కేసుకున్నప్పుడు ఆ పెట్టుబడి వృథా కాదు.
ఎందుకంటే అప్పుడు మాకు టైమ్ చాలా ముఖ్యం. ఇంటి నిర్మాణం మీద డబ్బు పెట్టడమనేది నా దృష్టిలో డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ కిందే లెక్క. ఇప్పుడు పిల్లలు పెళ్లీడుకొచ్చారు అని ఈ మధ్యే ప్లాన్ చేసి ఇల్లు మొదలుపెట్టాం. నేను చెప్పేది ఒకటే.. గృహిణి గుడ్ మేనేజర్. ఇంట్లో లేమి భర్తకు కూడా తెలియకుండా నెట్టుకొస్తుందంటే ఆమె ఎంత గొప్ప మేనేజర్ అయి ఉంటుంది! బయటకి వెళ్లి సంపాదించే అవకాశం లేకపోయినా ఇంట్లో ఖర్చులను నియంత్రించుకుంటూ ఉంటే చాలు.. అది ఆదాయం కిందే! ఆ నైపుణ్యం స్త్రీ సొంతం. చదువుకున్న మహిళలు హోమ్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు.
వీలుకాకపోతే తమ పిల్లలకు చెబితే.. ట్యూషన్ ఖర్చు ఆదా అయినట్టే కదా. కుట్టుపనిలో ఆసక్తి ఉన్నవాళ్లు బ్లవుజులు కుట్టొచ్చు. బయటివాళ్లకు కుట్టడం ఇష్టంలేకపోతే ఇంట్లోవాళ్లవే కుట్టొచ్చు. అదీ ఆదా కిందే జమ అవుతుంది. ఇంట్లో ఉన్న కొద్ది స్థలంలోనే కూరగాయల మొక్కలేసుకోవచ్చు. ఇంటిల్లిపాదికీ తాజా కూరల భోజనమూ దొరుకుతుంది.. కూరగాయల ఖర్చూ మిగులుతుంది. ఆలోచిస్తే మార్గాలెన్నో.. మనసు లగ్నం చేస్తే చాలు! మన బడ్జెట్ ఎప్పుడూ మిగులే!