ఉమెన్ ఇండియా c/o ఐశ్వర్య | special chit chat with rajinikanth doughter Aishwarya | Sakshi
Sakshi News home page

ఉమెన్ ఇండియా c/o ఐశ్వర్య

Published Sat, Sep 3 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

ఉమెన్ ఇండియా c/o ఐశ్వర్య

ఉమెన్ ఇండియా c/o ఐశ్వర్య

ఐశ్వర్య డెరైక్టర్.. డాన్సర్.. ప్లేబ్యాక్ సింగర్.. పాత సంగతే.
ఐశ్వర్య రజనీకాంత్ కూతురు.. ధనుష్ భార్య.. తెలిసిన సంగతే.
ఐశ్వర్య ఇప్పుడు అంబాసిడర్!! కొత్తేముంది? బ్రాండుకో అంబాసిడర్.
కానీ ఐశ్వర్య బ్రాండ్ అంబాసిడర్ కాదు.
ఉమన్ పవర్‌కి ఇండియాను ఒక గ్రాండ్ నేమ్‌గా మార్చబోతున్న అంబాసిడర్.
ఎలా తెలుసు మార్చబోతోందని! ఇంటర్వ్యూ చదవండి.
మీకో కొత్త ఐశ్వర్య కనిపిస్తుంది. మీలోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది.

మహిళా సంరక్షణ, సాధికారిత కోసం ఐరాస దూతగా ఎంపిక కావడం అంటే బరువైన బాధ్యత. మీరు న్యాయం చేస్తారన్నది చాలామంది నమ్మకం...
ఐశ్వర్య: అవును. నమ్మకం లేకపోతే ఈ బాధ్యత నాకివ్వరు. అది నాకు బాగా తెలుసు. ఈ బాధ్యతను నాకెందుకు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన నన్ను తీసుకున్నారు? అని నేను ఆలోచించలేదు. ఎంత బాగా చేయగలమనే ఆలోచనలో పడ్డాను. ఇలాంటివి పండగ చేసుకునే బాధ్యతలు కాదు. వెంటనే పనిలో పడాల్సినవి. చదువు విలువ తెలియని వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లల్లో ఓ పది మంది పిల్లలు స్కూల్‌కి వెళ్లేలా చేసినా నేను సక్సెస్ అయినట్లే. అలాగే, ఇంటికే పరిమితమైన స్త్రీలలో ఓ పది మంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగం చేయాలనే భావన కలిగించినా నా పదవికి నేను న్యాయం చేసినట్లే.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లయిన ఈ సందర్భంలోనూ ఇంకా స్త్రీ-పురుష సమానత్వం, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడాల్సి రావడం బాధాకరమైన విషయమే అనాలి...
ఐశ్వర్య:బాధాకరమే. కానీ, సంతోషించదగ్గ విషయం ఏంటంటే.. గడచిన పదేళ్లతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి. తమకు ఎదురైన సమస్యలను బహిరంగంగా చెప్పుకోవడానికి పదేళ్ల క్రితం ఆడవాళ్లు వెనకాడేవాళ్లు. సమస్యలన్నింటినీ మనసులోనే దాచుకునేవాళ్లు. ఇప్పుడు బయటికొస్తున్నారు. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో ఇంకా మంచి మార్పొలొస్తాయి.

అసలు మహిళలు ఎదగడానికి మగవాళ్లు సపోర్ట్ చేయాలని ఎదురుచూడడం ఎందుకు? అక్కడే మహిళ బలహీనురాలని తేలిపోతోంది కదా?
ఐశ్వర్య : కరెక్టే. ఎవరో ఎంకరేజ్ చేయాలని ఎదురు చూడకూడదు. స్వశక్తితో ఎదగాలి. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. ఇంట్లో ఉన్న మగవాడి సపోర్ట్‌ని ఆడవాళ్లు ఆశించడం తప్పు కాదు. అలాగే, మగవాడు కూడా ఆడవాళ్ల సపోర్ట్‌ని ఆశించడం తప్పు కాదు. ‘ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది’ అనే సామెత మనకు తెలిసిందే. అలాగే, ప్రతి మహిళ విజయం వెనక ఒక మగాడు ఉండటం తప్పు కాదు. అయితే, ఆ మగాడు ‘నా వల్లే నీకీ జీవితం’ అంటే అది తప్పు అవుతుంది. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. ఒకరి మీద మరికొరికి గౌరవం ఉన్నప్పుడు ఇద్దరూ సమానమే అనిపిస్తుంది. ఒక కుటుంబం బాగుండాలంటే ఇంట్లో ఉండే ఆడా, మగా కృషి చేయాలి. ఒక్కరి వల్ల ఏదీ సాధ్యం కాదు.

మనది పురుషాధిక్య సమాజం. స్త్రీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని మగవాళ్లే ఎక్కువ..
ఐశ్వర్య : అఫ్‌కోర్స్ అది నిజమే. రాను రాను ఈ ధోరణిలో కూడా మార్పు కనిపిస్తోంది. ఎవరో తట్టుకోలేరని మనం ఆగిపోకూడదు. ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. రీసెంట్‌గా జరిగిన రియో ఒలింపిక్స్‌లో మహిళలు పతకాలు గెల్చుకు వచ్చారు. వాళ్లు దేశానికి గర్వకారణం. చాలామంది ఆడవాళ్లకు వీళ్లు ఓ ఇన్‌స్పిరేషన్.

మీ ఇంటి వాతావరణం గురించి చెబుతారా?
ఐశ్వర్య : నా జీవితంలో ఇద్దరు పురుషులు కీలకం. పెళ్లి కాక ముందు నాన్న (రజనీకాంత్), పెళ్లైన తర్వాత ధనుష్ (భర్త). మా నాన్న మాకు మా కాళ్ల మీద నిలబడటం నేర్పించారు. ఆత్మనూన్యతా భావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో బతికేలా పెంచారు. నా భర్త ధనుష్ ఆడవాళ్లను గౌరవించే వ్యక్తి. పెళ్లై, ఇద్దరు బిడ్డలకు తల్లయాక కూడా దర్శకురాలిగా కొనసాగుతున్నానంటే దానికి కారణం మా ఇంట్లో మంచి వాతావరణం ఉండటమే. ‘నాన్న సూపర్ స్టార్. భర్త కూడా అంతే. అలాంటప్పుడు ఈవిడ పని చేయాల్సిన అవసరం ఏంటి?’ అని చాలామంది అనుకుంటారు. కానీ, నాకూ ఒక లక్ష్యం ఉండాలి కదా. ఆర్థికంగా బాగున్న మహిళలు పని చేయకూడదనీ, లేని మహిళలు ఉద్యోగాలు చేసుకుని బతకాలనీ కాదు. ఎవరికైనా ఒక టార్గెట్ ఉండాలి. సంపాదన ముఖ్యం. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సొంత డబ్బుతో పిల్లలకు కావాల్సినవి కొన్నప్పుడు, చీరలు, నగలు కొనుక్కున్నప్పుడు, ఇంటి అవసరాలకు ఖర్చు పెట్టినప్పుడు లభించే తృప్తే వేరు.

మీరన్నది కరెక్టే. కానీ, ప్రపంచం ఇంత వేగంగా ఎదుగుతున్నా.. కొంతమంది మహిళలు ఇంకా ఇంటికే పరిమితం కావాలనుకుంటున్నారు. అలాంటివాళ్లకు ఏం చెబుతారు?
ఐశ్వర్య : అవగాహన కలిగించాలి. ఇంట్లో ఉండేవాళ్లను నేను తక్కువ చేయడం లేదు. గృహిణులు చాలా పవర్‌ఫుల్. ‘ఇవాళ నేను ఇంటి బాధ్యతలకు సెలవు చెబుతున్నా’ అని ఒక్క రోజు అనమనండి. ఇంటిల్లిపాదీ షాకైపోతారు. ఇల్లు మొత్తం తలకిందులవుతుంది. ఒకవేళ ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో ఆనందం ఉందనుకుంటే ఓకే. కానీ, బయటికొచ్చి ఉద్యోగం చేయాలంటే భయపడే ఆడవాళ్లు మాత్రం ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిందే. తాము సంపాదించడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనుకున్నప్పుడు ఉద్యోగం చేయాలి. బయట ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోవడానికి కావల్సిన ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి?

ఆత్మకథతో  ‘స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్’
ఐశ్వర్య : ఓ సెలబ్రిటీ కూతురిగా, స్టార్ భార్యగా, ఫిల్మ్ మేకర్‌గా, తల్లిగా.. ఇప్పటివరకూ తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో ‘స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్’ పేరుతో ఐశ్వర్యా ధనుష్ ఆత్మకథ రాస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పలు అంశాలను ఐశ్వర్య ఈ పుస్తకంలో ప్రస్తావిస్తున్నారు. ఎత్తు-పల్లాలు, ఆగ్రహావేదనలు.. ఇలా పలు భావాలను ఈ స్వీయచరిత్రలో వ్యక్తపరుస్తున్నారు. ‘‘ఈ ఏడాది చివర్లో ఈ పుస్తకం బయటికొస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు.



స్టార్ హీరో కూతురు, స్టార్ హీరో భార్య కాబట్టి లైంగిక వేధింపులు ఎదురయ్యే అవకాశం మీకు లేదేమో. స్వీయానుభవాలు లేనప్పుడు ఇతరుల సమస్యలోని గాఢత మీకు తెలిసే అవకాశం ఉందా?
ఐశ్వర్య : ఒక స్త్రీ సమస్య ఇంకో స్త్రీ అర్థం చేసుకోవడానికి స్వీయానుభవాలు అవసరం లేదని నా ఫీలింగ్. మనలాంటి అమ్మాయే కదా అనే ఫీలింగ్ ఉంటే చాలు. ఉదాహరణకు మన కళ్లెదుట నిప్పు  ఉందనుకోండి. అది టచ్ చేసి దాని తాలూకు బాధ తెలుసుకోవాలనుకోం కదా. తాకితే బాధ ఖాయం అని తెలుసు. ఇది కూడా అంతే. మనం అనుభవించకుండానే గాయం తాలూకు బాధ ఎలా ఉంటుందో అనుభవించగలుగుతాం. సెలబ్రిటీ ఉమన్ అయినా.. మామూలు మహిళ అయినా.. ఆడవాళ్లకు సాటి స్త్రీ బాధ తెలుసుకునే అద్భుతమైన వరం ఆ దేవుడు మనకు ఇచ్చాడు.

కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు అవుతారు. రోడ్డు మీదకొచ్చి సమస్యలు చెప్పుకునే మహిళలను వాళ్లే విమర్శిస్తారు...
ఐశ్వర్య : అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకుని కూడా కొంతమంది ఆడవాళ్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెనకాడతారు. అందుకే సమస్యలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే, ఎవరూ మన జీవితాల్ని ఉద్ధరించరు. విమర్శించేవాళ్లు మనం మాట్లాడినా ఎద్దేవా చేస్తారు.. మాట్లాడకపోయినా చేస్తారు. అందుకే అంటున్నా.. ‘మీ ఇంట్లో మగవాళ్ల కారణంగా సమస్య వస్తే.. బయటికి వచ్చి చెప్పండి. సమస్యను పరిష్కరించు కోండి. జీవితాన్ని మాత్రం త్యాగం చేయొద్దు’.

ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్లల్లో ఆ విపరీత ధోరణికి కారణం ఏమనుకుంటున్నారు. పెంపకం లోపం అనుకోవచ్చా?
ఐశ్వర్య : పెంపకం ఓ కారణం మాత్రమే. పరిసరాల ప్రభావం ఓ కారణం అవుతుంది. అలాగే, చిన్నప్పట్నుంచీ మైండ్ సెట్ ఎలా ఉంది? అనేది ఇంకో కారణం. పెంపకం గురించి చెప్పాలంటే... ఇంట్లో ఆడపిల్లలను పెంచేటప్పుడు సేఫ్టీ పేరుతో ప్రతిదానికీ ఆంక్షలు పెడతారు. ‘ఆడపిల్లవి...’ అంటూ చాలా విషయాలకు ‘నో’ చెప్పేస్తారు. దాంతో ఆడపిల్ల తన ఇష్టాలను బలవంతంగా అణిచేసుకుంటుంది. ‘నో’ అనే పదానికి అలవాటు పడిపోతుంది. కానీ, మగపిల్లలు ఏం చేసినా ‘నో’ అనరు. దాంతో ఎవరైనా వాళ్లకి ‘నో’ చెబితే, అహం అడ్డొస్తుంది. పంతం నెగ్గించుకోవాలనుకుంటారు. దానికోసం ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడరు. అందుకే ఆడపిల్లలకు పెట్టినట్లుగా మగపిల్లలకు కూడా కొన్ని ఆంక్షలు పెట్టాలి. అలా పెంచితే ఏది పడితే అది చేసినప్పుడు ‘నో’ అనే ఆంక్ష ఎదురైనా... భవిష్యత్తులో ఎక్కడైనా తిరస్కరణకు గురైనా, పెద్ద బాధ అనిపించదు.
అందుకే నాన్న చాలా ఆనందపడ్డారు!
ఐశ్వర్య : డెరైక్టర్‌గా ‘3’తో నా తొలి అడుగు సునాయాసంగా పడింది. దానికి కారణం నా బ్యాగ్రౌండ్. ప్రతిభ నిరూపించుకోవడానికి మార్గం దొరికింది. సో.. నా అంతట నేనుగా అవకాశం సంపాదించినట్లు కాదు. కానీ, యూఎన్‌కు ఉమెన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం అనేది నేను సొంతంగా సాధించుకున్నది. ఇండిపెండెంట్‌గా అచీవ్ చేశాను కాబట్టి నాన్న చాలా ఆనందపడ్డారు. ‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నారు. మా అమ్మ (లతా రజనీకాంత్) వండర్‌ఫుల్. క్లుప్తంగా చెప్పాలంటే అమ్మా నాన్న ఇద్దరూ నాకు ఆదర్శం.

ఇద్దరు కొడుకులకు తల్లిగా మీ బిడ్డలను మీరెలా పెంచుతున్నారు. మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎలా పెంచారు?
ఐశ్వర్య : మా అమ్మా నాన్న ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తులు. వాళ్ల పెంపకం ఎంత మంచిదో నాకు చిన్నప్పుడు తెలియలేదు. నేను తల్లయ్యాక అర్థమవుతోంది. మా అమ్మానాన్నల్లా నా పిల్లలను నేను పెంచుతున్నానా? అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ మాటకొస్తే పెంపకం విషయంలో ఎవరికీ పోలిక పెట్టలేం. ఎందుకంటే, ఆ ఇంటి పరిస్థితులను బట్టి పిల్లల పెంపకం ఉంటుంది. ‘నేను ఇలా పెంచుతున్నాను. మీరు కూడా ఇలా పెంచండి’ అని ఎవరికీ సలహా ఇవ్వకూడదు. ఏ తల్లిదండ్రైనా పిల్లల మంచి గురించే ఆలోచిస్తారు. పిల్లలు చెడిపోవాలని ఆనుకోరు. నేను నా పిల్లలిద్దరికీ ఆడవాళ్లను గౌరవించాలనే విషయాన్ని పర్టిక్యులర్‌గా చెబుతాను. చిన్నప్పట్నుంచీ చెప్పి, పెంచితే పెద్దయ్యాక మహిళలను గౌరవించడం అలవాటవుతుంది. ఆడ-మగ సమానం అనే ఫీలింగ్ వాళ్లల్లో నాటుకుపోయేలా పెంచుతాను.

మా ఇంట్లో  ఆ తేడా లేదు
ఐశ్వర్య : మా ఇంట్లో ఆడ-మగ అని అడుగడుగునా తేడా చూపించే పరిస్థితులు ఉండవ్. నేను నా పనితో బిజీగా ఉన్నప్పుడు మా ఆయన పిల్లలను చూసుకుంటారు. ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. భార్యాభర్తలకు ఒకరి పని మీద ఇంకొకరికి గౌరవం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నేనీ రోజున డెరైక్టర్‌గా చేయగలుగుతున్నానంటే దానికి కారణం మా ఇంట్లో ఉండే మగవాళ్లే (తండ్రి, భర్తని ఉద్దేశించి).

అంతరిక్షయానం చేయడానికి ఆడవాళ్లు వెనకాడని ఈ రోజుల్లో ఇంటి గడప దాటని ఆడవాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లను చైతన్యపరచడానికి మీ వంతుగా ఏం చేయాలనుకుంటున్నారు?
ఐశ్వర్య : లక్కీగా నేను ఉన్నది చాలా పవర్‌ఫుల్ మీడియా. సినీ దర్శకురాలిగా నేను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సినిమాలు చేస్తాను. యూఎన్‌కు ఉమన్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా మహిళలను మోటివేట్ చేసేలా డాక్యుమెంటరీలు తీయాలనుకుంటున్నాను. అలాగే, ఇవాళ సామాజిక మాధమ్యం ఓ వరం. సోషల్ మీడియా కారణంగా ప్రపంచం చిన్నదైపోయింది. ఐదారేళ్ల క్రితం ఎక్కడైనా జరగరానిది జరిగితే అది వెలుగులోకొచ్చేది కాదు. ఇప్పుడలా కాదు. మారుమూల గ్రామాల్లో జరిగే లైంగిక దాడుల గురించి మొత్తం ప్రపంచానికి తెలుస్తోంది. అందుకే ఈ మీడియాని మంచి వేదికగా వాడుకోవాలనుకుంటున్నాను.

దర్శకురాలిగా మీ ఫ్యూచర్ ఫ్లాన్స్?
ఐశ్వర్య : ఇప్పటివరకూ చేసిన ‘3’, ‘వై రాజా వై’ చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమాలు చేయబోతున్నాను. రెండు కథలు రెడీ చేశాను. ఈ ఏడాది చివర్లో ఒక సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది.
- డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement