వంటలో ఈ మంట లేకపోతే రుచి ఉండదు. ఘాటు నషాళానికి అంటితే తప్ప తృప్తి కలగదు. కారం భోజనానికి అలంకారం. పచ్చి మిర్చిది అందులో ప్రథమ భాగం. సాధారణంగా మిరపకాయను ఒక కాయగూరగా చూడరు. చూస్తే ఇన్ని వండచ్చు. మైమిరిచి తినొచ్చు.
షాహీ హరీ మిర్చి
కావలసినవి: పచ్చి మిర్చి – 8 (పెద్దవి); వేయించిన పల్లీలు – అర కప్పు; వేయించిన నువ్వులు – పావు కప్పు; వేయించిన కొబ్బరి ముక్కలు – అర కప్పు; నూనె – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిర్చి – 4; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి మిర్చి – 3; కరివేపాకు – రెండు రెమ్మలు; అల్లం ముద్ద – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; పెరుగు – ఒక కప్పు; చింత పండు గుజ్జు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – చిన్న కట్ట.
తయారీ:
►పచ్చి మిర్చిని మధ్యకు చీల్చి పక్కన ఉంచాలి
►వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, వేయించిన కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక మిరప కాయలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద మరొక బాణలిలో పావు కప్పు నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముద్ద ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాక, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి, తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని జత చేసి కలియబెట్టాలి
►ఉప్పు, మూడు కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి ఉడికించాలి
►కొద్దిగా చిక్కబడిన తరవాత, కప్పు పెరుగు జత చేసి రెండు నిమిషాల పాటు మూత ఉంచి ఉడికించాలి
►చింతపండు గుజ్జు, బెల్లం పొడి, కొత్తిమీర తరుగు జత చేసి మరోమారు కలియబెట్టాలి
►మిశ్రమం చిక్కబడుతుండగా, వేయించి పెట్టుకున్న మిర్చి జత చేసి, కలియబెట్టి మరోమారు మూత ఉంచాలి
►సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాక, ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
గ్రీన్ చిల్లీ వెజిటబుల్ రెసిపీ
కావలసినవి: పచ్చి మిర్చి – 200 గ్రా.; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – అర టేబుల్ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; సోంపు పొడి – అర టేబుల్ స్పూను; ధనియాల పొడి – అర టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర టీ స్పూను
తయారీ:
►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి
►పచ్చి మిర్చి తరుగు జత చేసి వేయించాలి
►పసుపు, ఉప్పు, మిరప కారం, సోంపు పొడి, ధనియాల పొడి జత చేసి బాగా కలిపి, ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిందనిపించాక నిమ్మ రసం, పంచదార జత చేసి, మరో రెండు నిమిషాల పాటు ఉడికించి, దింపేయాలి
►వేడి వేడి చపాతీలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
పచ్చి మిర్చి – సెనగ పిండి కూర
కావలసినవి: లేత పసుపు రంగులో ఉండే పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; సెనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు; ముదురు ఆకు పచ్చ రంగు పచ్చి మిర్చి తరుగు – పావు కప్పు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆమ్‌చూర్ పొడి – ఒక టీ స్పూను; సన్నగా పొడవుగా తరిగిన అల్లం ముక్కలు – అలంకరించడానికి తగినన్ని.
తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►అల్లం వెల్లుల్లి తరుగులు జత చేసి బాగా వేయించాలి
►లేత రంగు పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలియబెట్టాక, ముదురు రంగు పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు కలపాలి
►సోయా గ్రాన్యూల్స్, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి
►మిగిలిన నూనె, సెనగ పిండి వేసి బాగా కలిపాక, ఆమ్‌చూర్ పొడి వేసి కలిపి, మూత ఉంచాలి
►సెనగ పిండి గోధుమరంగులోకి వచ్చిన తరువాత దింపేసి, ఒక ప్లేట్‌లోకి తీసుకుని, అల్లం ముక్కలతో అలంకరించాలి
►అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.
స్టఫ్‌డ్ పచ్చిమిర్చి కూర
కావలసినవి: పచ్చిమిర్చి – 7 (పెద్దవి); జీలకర్ర – 4 టీ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; ఆమ్‌చూర్ పొడి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – రెండు టీ స్పూన్లు.
తయారీ:
►స్టౌ మీద బాణలి వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి
►మిరప కారం, ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు జత చేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేసి ప్లేటులోకి తీసుకోవాలి
►పచ్చిమిర్చికి ఒక వైపు గాట్లు పెట్టాలి ∙గింజలు వేరు చేయాలి
►తయారుచేసి ఉంచుకున్న పొడిని అందులో స్టఫ్ చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారు చేసి ఉంచుకున్న పచ్చి మిర్చిని అందులో వేసి వేయించి, మూత ఉంచాలి
►కాయలు బాగా మెత్తగా వడలినట్లు అయ్యేవరకు నూనెలో వేయించాలి
►నిమ్మ రసం జ చేసి దింపేయాలి
►రోటీలలోకి, అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.
రాజస్థానీ మలై మిర్చి
కావలసినవి: పచ్చి మిర్చి – పావు కేజీ; నూనె – 2 టేబుల్ స్పూన్లు; తాజా క్రీమ్ – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఆమ్‌చూర్ పొడి – ఒక టీ స్పూను.
తయారీ:
►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, తడి ఆరాక, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక జీలకర్ర, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి, ఉప్పు, పసుపు, వేసి దోరగా వేయించాలి
►తరిగిన పచ్చి మిర్చి ముక్కలు జత చేసి బాగా వేయించి, మూత పెట్టాలి
►క్రీమ్ వేసి బాగా కలియబెట్టి, బాగా ఉడికిన తరవాత దింపేయాలి
►అన్నం, రోటీలలోకి రుచిగా ఉంటుంది.
గ్రీన్ చిల్లీ సాస్
కావలసినవి: పచ్చి మిర్చి – 100 గ్రా.; అల్లం తరుగు – రెండు టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – చిటికెడు; అజినమోటో – 2 టీ స్పూన్లు; వైట్ వెనిగర్ – 4 టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ – 2 టీ స్పూన్లు.
తయారీ:
►పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
►మిక్సీలో... వెల్లుల్లి తరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినన్ని నీరు పోసి మెత్తగా చేసి, ఒక కుకర్‌లోకి తీసుకుని, స్టౌ మీద ఉంచి, ఈ మిశ్రమానికి చిటికెడు ఉప్పు జతచేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉంచి, రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి
►విజిల్ తీసి పచ్చిమిర్చిని చల్లారబెట్టాలి ∙రెండు చిటికెల అజినమోటో జత చేయాలి
►4 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ జత చేయాలి
►మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి
►రెండు టీ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ తీసుకుని, నీళ్లలో కలిపి, ఉడుకుతున్న సాస్‌లో వేయాలి ∙బాగా ఉడికిన తరవాత, స్టౌ మీద నుంచి దింపేసి చల్లారనివ్వాలి
►బాగా చల్లారాక ఒక పాత్రలోకి తీసుకోవాలి
►ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది.
పచ్చి మిర్చి ఊరగాయ
కావలసినవి: పచ్చి మిర్చి – అర కేజీ; మెంతులు – 2 టీ స్పూన్లు; ఆవాలు – 100 గ్రా.; ఇంగువ – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – ఒక టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లు
తయారీ:
►ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి
►తొడిమలు వేరు చేసి, పచ్చి మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
►స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక, ఆవాలు, మెంతులు వేసి సన్నని మంట మీద దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారబెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
►ఒక పాత్రలో మిరప కారం, మెత్తగా చేసిన ఆవపొడి, మెంతి పొడి, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి
►తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసి కలియబెట్టాలి
►కాచి చల్లారబెట్టిన నూనె, నిమ్మరసం రెండూ ఒకదాని తరవాత ఒకటి ఇందులో పోస్తూ, కలుపుతుండాలి
►ఒక గంట తరవాత ఈ మిశ్రమాన్ని గాలిచొరని జాడీలోకి తీసుకోవాలి
►ఈ ఊరగాయ సుమారు పదిరోజుల వరకు నిల్వ ఉంటుంది. (నూనె పైకి తేలుతూంటే, ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది).
Comments
Please login to add a commentAdd a comment