నేనే రియల్‌! నేనే ఇమేజ్‌!! | Special interview with daggubati rana | Sakshi
Sakshi News home page

నేనే రియల్‌! నేనే ఇమేజ్‌!!

Published Sat, Jul 29 2017 11:15 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

నేనే రియల్‌!  నేనే ఇమేజ్‌!! - Sakshi

నేనే రియల్‌! నేనే ఇమేజ్‌!!

నన్ను, నా ఇమేజ్‌ని.. అంటే... నా ప్రతిబింబాన్ని విడదీయలేం. నాకు ఒక ఇమేజ్‌ ఉంది.. అది నాది. మీకో ఇమేజ్‌ ఉంది.. అది మీది. నేను డ్రగ్స్‌ తీసుకుంటాననో... ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన అమ్మాయితో నాకు సంబంధం ఉందనో... బాలీవుడ్‌లో నాకు వ్యవహారాలున్నాయనో... ఇలా నా గురించి మీకో ఇమేజ్‌ ఉంటే ఉండొచ్చు. దాన్ని నేను సృష్టించలేదు. సృష్టించిన వాళ్లకే తెలుసు. నేను బాగా నమ్మేది నా వెంట ఎప్పుడూ ఉండే నా నీడనే. అందుకే నేను నమ్మిందే చేస్తా. నా మీద ఇంకొకరికి ఉన్న ఇమేజ్‌ని మార్చాలని ఏమీ చేయను. నేనే రానా.. నేనే రానా... నేనే రియల్‌... నేనే ఇమేజ్‌...

ఫిల్మ్‌ ఇండస్ట్రీ సినిమాల గురించి కాకుండా ఇప్పుడు డ్రగ్స్‌ అంటూ వేరే విషయాల గురించి వార్తల్లో ఉంటోంది.. గమనిస్తున్నారా?
రానా: నిజం చెప్పాలంటే గమనించే తీరిక లేదు. కాకపోతే సొసైటీలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి కాబట్టి, కొంత ఫాలో అవుతున్నా. అయినా ఒక్క సినిమా ఇండస్ట్రీవాళ్ల గురించే ఎందుకండి? బయటివాళ్లు చాలామంది ఉంటారు కదా. మాట్లాడుకోవడానికి చాలా విషయాలుంటాయి. కాని మీడియా ఫోకస్‌  ఫిల్మ్‌ ఇండస్ట్రీ పైనే ఎక్కువగా ఉంది.

సినిమాల గురించి చెబుతున్నట్లే ఇతర సమాచారాన్ని కూడా మీడియా ఇస్తోంది. అందులో తప్పేముంది?
కొన్ని స్కూళ్లలో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని, అమ్ముతున్నారని విని, షాకయ్యా. నిజంగా డేంజరస్‌ మేటర్‌ అది. మా ఇంట్లో పిల్లలు, మా చిన్నాన్న పిల్లలు, కజిన్స్, ఫ్రెండ్స్‌ పిల్లలు స్కూల్స్‌కి వెళ్తున్నారు. 30, 40 ఏళ్ల వ్యక్తులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారనుకోండి... వాళ్లు తెలిసే తీసుకుంటున్నారని ఊహించవచ్చు. కానీ, పిల్లల వ్యవహారాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. 

మీడియా ఈ ఇష్యూని ఇండస్ట్రీ విషయం కంటే ఎక్కువ హైలైట్‌ చేయాలి. తెలుగు ఇండస్ట్రీ ఏమైపోతోంది? అంటూ రాస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఏమీ కాదు. సిటీలో సమ్‌థింగ్‌ ఏదో జరుగుతోంది. ఎవరూ దాని గురించి చెప్పడం లేదు. అందరికీ నోటీసులు ఇస్తున్నారంటే అసలా నోటీస్‌లో ఏం ఉందో తెలుసుకోవాలని చూశా. ‘ఇట్స్‌ ఎ రిక్వెస్ట్‌ ఫ్రమ్‌ ద పోలీస్‌ టు ద సివిలియన్స్‌ టు హెల్ప్‌ ఇన్‌ దేర్‌ ఇన్వెస్టిగేషన్‌’ అని ఉంది. అందులో ఏం ఉందో తెలుసుకోకుండా అరెస్ట్‌ చేసేస్తారని హైలైట్‌ చేస్తున్నారు.  

దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్న కుటుంబాల్లోని వారసులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారట.... మీ పేరు కూడా వినిపిస్తున్నదని అంటున్నారు.
రూమర్స్‌ నాకు కొత్తేమీ కాదు. రెండు మూడేళ్ల క్రితం డ్రగ్స్‌ ఇష్యూ వచ్చినప్పుడు నా పేరొచ్చింది. నేను పట్టించుకోలేదు. ర్యాండమ్‌ న్యూస్‌కి, గాసిప్స్‌కి తేడా ఉంది. నా గురించి ఎవరు రాసినా, ఏం రాసినా నేను పట్టించుకోను. అవి పట్టించుకుంటే నా పనులను నేను సవ్యంగా చేసుకోలేను.

మీ ఇంట్లో వాళ్లకు బాధగా ఉంటుందేమో?
వాళ్లు అస్సలు పట్టించుకోరు. మీడియా గురించి మా ఇంట్లోవాళ్లకు తెలీదా! ఏ సంస్థ లేనప్పుడు, హైదరాబాద్‌లో ఒక న్యూస్‌ పేపర్, దూరదర్శన్‌ ఛానల్‌ ఉన్నప్పుడు వచ్చిన ఇండస్ట్రీ ఇది. రాళ్లు, రప్పలు కొట్టి స్టూడియో కట్టాం. హైదరాబాద్‌కి వచ్చిన ఫస్ట్‌ ఇండస్ట్రీ అంటే మా సినిమా ఇండస్ట్రీయే. ఇండియా మ్యాప్‌లో ఈ ఊరు ఎందుకొచ్చిందంటే... తెలుగు చలనచిత్ర పరిశ్రమ వల్ల వచ్చింది. అప్పట్లో ఐటీ కంపెనీలు, గట్రా ఏం లేవు. మా ఇంటి నుంచి పోలీస్‌ స్టేషన్‌కి 14 కిలోమీటర్లు. అలాంటి చోట ఉండేవాళ్లం. సో, ఇలాంటివి మాకు కొత్త కాదు. అస్సలు డిస్ట్రబ్‌ చేయవు. రాసుకునేవాళ్లకు ఆనందం, ఛానళ్లకు టీఆర్పీలు పెరుగుతాయేమో కానీ, మాకేం కాదు.

ఆ మధ్య ఎయిర్‌పోర్ట్‌లో మీరో అమ్మాయితో కనిపిస్తే.. అదో హాట్‌ టాపిక్‌ అయింది...
అవునండి. నన్ను బాగా నవ్వించిన టాపిక్‌ అది. ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా ఎయిర్‌పోర్ట్‌లో రానా వెనకాల వçస్తున్న అమ్మాయి ఎవరు? తనకీ, రానాకీ సంబంధం ఏంటి? అని రాశారు. ఆ అమ్మాయి నా మేనేజర్‌. పాపం లగేజీలు మోసుకుంటూ తను  హడావిడిగా వెళుతుంటే.. తనని కూడా వదల్లేదు. ‘ఇలా కూడా రాస్తారా?’ అనుకున్నా. ప్రొఫెషనల్స్‌ రాయరనుకుంటున్నా.

అసలేం లేనిదే ఏ వార్తలూ రావు కదా?
కొందరు ఏమీ లేకపోయినా సృష్టిస్తారు. వాళ్ల ఊహ నిజమనుకుంటారు. మీడియా ఫోకస్‌ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ‘నేనే రాజు నేనే మంత్రి’కి ఫస్ట్‌ టైమ్‌ ఒక అగ్‌మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీని తీసుకొచ్చాం. లాస్ట్‌ వీక్‌ అంతా ఎకనామిక్‌ టైమ్స్, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వాళ్లు వచ్చి, ఆ టెక్నాలజీ గురించి అడిగి, ఆర్టికల్స్‌ రాశారు.  తెలుగులో రాసినదాని కంటే పది శాతం ఎక్కువ మిగతావాళ్లు రాశారు. మరి మనమేం చేస్తున్నాం? మన తెలుగు ఇండస్ట్రీ ఒక టెక్నాలజీని ఇంట్రడ్యూస్‌ చేస్తే దాన్ని పట్టించుకోలేదు.

‘ప్లీజ్‌... మమ్మల్ని అర్థం చేసుకోండి. మా ప్రయత్నాలను ఫోకస్‌ చేయండి’ అనుకున్నా. అలాగని డ్రగ్స్‌ ఇష్యూ కాదా అంటే ఇష్యూనే. మొన్న చెన్నై వెళ్లా... అక్కడ ఏం మాట్లాడారో తెలుసా? ‘మీ మీడియా మిమ్మల్ని బాగా బ్యాడ్‌ చేస్తోంది’ అని వ్యంగ్య ధోరణిలో అన్నారు. బాధ అనిపించింది. వెంటనే ‘మా మీడియా మమ్మల్ని బ్యాడ్‌ చేస్తుంది. మమ్మల్ని గుడ్‌ చేస్తుంది’ అన్నాను. ‘తెలుగు ఇండస్ట్రీకి బ్యాడ్‌ నేమ్‌ వచ్చింది కదా?’ అన్నారు. ‘అరే.. కొన్ని నెలల క్రితం ‘తెలుగు ఇండస్ట్రీ ‘బాహుబలి’ తీసింది. ప్రపంచంలో అన్ని ఇండస్ట్రీల కంటే తెలుగువాళ్లు తోపు’ అని రాసింది మీరే. ఇప్పుడు ఇంకొకటి రాస్తున్నారు. ఇంకో వారం తర్వాత ఇంకొకటి రాస్తారు. మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. మాపై రాళ్లు వేస్తారు. అవి మాకు తగలవు. చాలా సాలిడ్‌గా ఉంటాం. ముందుకెళ్లడమే మా ప్రయత్నం’ అని చెప్పి, వదిలేశా.

మీడియా మొత్తాన్ని అంటున్నారా? ఓ సెక్షనాఫ్‌ మీడియా చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటోంది..
అవును. అది నిజమే. ప్రిన్సిపుల్‌ ప్రెస్‌ అని ఉంటుంది. వాళ్లంతా రెస్పాన్సిబుల్‌ గానే ఉంటారు. ఒకప్పుడు కొన్ని న్యూస్‌ ఛానల్సే ఉండేవి. కొన్ని పత్రికలే ఉండేవి. నిరూపించుకుని, ఒక స్థాయికి వచ్చినవాళ్లు అందులో పని చేస్తుంటారు. అలాంటివాళ్లు సొసైటీకి ఏం కావాలో అదే చెప్పాలని, చూపించాలని అనుకుంటారు. ఇప్పుడు మీడియా పెరిగిపోయింది. ఇప్పుడూ అలాంటివాళ్లు ఉన్నారు. వాళ్లతో పాటు అసలే మాత్రం అవగాహన లేనివాళ్లూ ఉన్నారు. వాళ్లల్లో కొంతమందికి సొసైటీలో జరిగే విషయాల మీద పెద్దగా ఫోకస్‌ ఉండదు. ఏది పడితే అది రాస్తారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీకి, జనాలకు మధ్య మీరో (మీడియా) చెయిన్‌ లాంటివారు. ఆ చెయిన్‌ని బ్రేక్‌ చేయొద్దని కోరుతున్నా. నిజమైన వార్తలనే ఇవ్వండి. ఏమీ లేనిదానికి హడావిడి చేయొద్దని.. ఎవరైతే చేస్తున్నారో ఆ సెక్షన్‌ని కోరుతున్నా.

మీకేమైనా చెడు అలవాట్లున్నాయా? మానడానికి ప్రయత్నించినవి ఏవైనా?
నాకు సిగరెట్‌ తాగే అలవాటు ఉండేది. అది మానాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఈ మధ్య ‘నేనే రాజు నేనే మంత్రి’కి డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు వాయిస్‌లో తేడా వచ్చింది. మామూలుగా నేను డబ్బింగ్‌ చాలా బాగా చెబుతా. కానీ, ఈ మధ్య చెబుతుంటే స్లైట్‌గా దగ్గు వచ్చింది. హండ్రెడ్‌ పర్సంట్‌ వాయిస్‌ రాలేదు. దాంతో డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను. ‘సిగరెట్‌ తాగుతారా?’ అని అడిగితే, ‘అవును’ అన్నా. వెంటనే మానేయండన్నారు. అంతే.. మానేశాను. నాకున్న ఒకే ఒక్క బ్యాడ్‌ హ్యాబిట్‌ అది. ప్రొఫెషన్‌కి అడ్డొచ్చిందని మానేశాను. అలా నా ప్రొఫెషన్‌కి ప్రాబ్లమ్‌ అవుతుందనిపిస్తే ఏదైనా మానేస్తా.

అసలు సిగరెట్‌ ఎప్పుడు అలవాటైంది? అంత ఈజీగా క్విట్‌ చేయగలుగుతారా?
‘లీడర్‌’ సినిమా అప్పుడు అలవాటైంది. ఆ సినిమాలో సిగరెట్‌ తాగే సీన్స్‌ ఉన్నాయి. సినిమా కోసం మొదలుపెట్టా. అది అలవాటుగా మారింది. చాలాసార్లు మానాలనుకున్నా, సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు ప్రొఫెషన్‌కి సమస్య అవుతుందని ఫుల్‌స్టాప్‌ పెట్టేశా.

 చెడు అలవాట్లను దూరం చేసుకోవడం అంత ఈజీ కాదని వ్యసనపరులు అంటుంటారు...
ఏదైనా మానేయాలంటే మానేయొచ్చు. అదేమంత కష్టం కాదు. మామూలుగా సిగరెట్‌ మానడానికి దానికి ఆల్టర్నేటివ్‌గా ఏదో ఒకటి తీసుకుంటారు. కానీ, నేనలాంటివి చేయలేదు. నేను మెంటల్లీ స్ట్రాంగ్‌. బాస్‌... మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కావాలని చెడగొట్టుకుంటారో.. ఆరోగ్యంగా జీవిస్తారో. అది మీ ఇష్టం. ఆరోగ్యంగా జీవిస్తే ఎంత బాగుంటుందో ఊహించండి. మన ఆరోగ్యానికి చేటు చేసిది ఏదీ మంచిది కాదు.

మీ మాటలు కొంచెం ఆనెస్ట్‌గా ఉంటాయి... మీకో కన్ను కనిపించదనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నిజాయితీగా ఒప్పేసుకున్నారు. జనరల్‌గా లోపాలను ఒప్పుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.. పైగా హీరోలు?
(మధ్యలో అందుకుంటూ..) నేను హీరో కంటే ముందు మనిషిని. నేనో షోకి వెళ్లినప్పుడు ట్యూమర్‌ వల్ల మా అమ్మకు ఓ కన్ను కనిపించడం లేదని ఓ అబ్బాయి బాగా ఏడ్చాడు. ‘రేయ్‌... నాకూ ఓ కన్ను కనిపించదు. ఒకటి లేకపోతే ఇంకొకటి ఉంది కదా. పని చేస్తుంది కదా’ అని లైట్‌ నోట్‌లో చెప్పా. నేనన్నీ లైట్‌ నోట్‌లోనే తీసుకుంటా. నేను చేయించుకున్నన్ని మోకాళ్ల సర్జరీలు ఇంకెవరూ చేయించుకుని ఉండరేమో. అన్నీ షూటింగ్‌లో తగిలిన గాయాలే. లైఫ్‌లో ప్రతిదాన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. ఉన్నది ఓ జీవితం... హ్యాపీగా మనం చేయాల్సిన పనులు చేసేసి వెళ్లడమే. సినిమా కంటే ఎగ్జయిటింగ్‌ వర్క్‌ ఎక్కడా ఉండదు. ఓ రోజు వారియర్‌గా, ఓ రోజు సబ్‌ మెరైన్‌ కెప్టెన్‌గా, ఇంకో రోజు రాజకీయ నాయకుడిగా లైఫ్‌లో వివిధ రకాల పాత్రలు పోషించగలిగిన ఏకైక ప్లేస్‌. దాన్ని కరెక్టుగా చేసుకుంటూ వెళ్లడమే.

అవునూ.. బిజీ బిజీగా కనిపిస్తున్నారు... ఎందుకంత హడావిడి?
అంతా ‘నేనే రాజు నేను మంత్రి’ కోసమే. వచ్చే నెల 11న రిలీజ్‌ కదా.. డబ్బింగ్‌ చెబుతున్నా. ఒక్క లాంగ్వేజ్‌ అయితే ఫర్వాలేదు.. అటు తమిళ్, మలయాళంలో కూడా చెప్పాలి కదా. తమిళ్‌ వచ్చు. మలయాళం అస్సలు రాదు. వచ్చీ రాక నానా తంటాలు పడుతున్నా (నవ్వుతూ).

ఈ సినిమాలో పొలిటీషియన్‌గా చేశారు.. ట్రైలర్‌లో ‘చీమల పుట్ట...’ సామెత కూడా చెప్పారు...
యాక్చువల్లీ వెరీ ఎంటర్‌టైనింగ్‌ క్యారెక్టర్‌. జోగేంద్ర అనే వ్యక్తి జీవితకథ ఇది. అనంతపురం, కర్నూల్‌ వంటి ఊళ్లలో ఉండే జోగేంద్ర వ్యక్తి కొన్ని పరిస్థితుల వల్ల మారాల్సి వస్తుంది. ఆ మార్పు ఎలా వస్తుందంటే... బిగ్‌ బ్యాంగ్‌ వరల్డ్‌ అంటుంటారు కదా! అంత పెద్ద మార్పు. రాజకీయాలు, డబ్బులు, పవర్, క్రైమ్‌ అనే ప్రపంచంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ కథనంతా దర్శకుడు తేజగారు వినోదాత్మకంగా చెప్పారు. ప్రతిదానికి ఓ సామెత చెప్పి, జోగేంద్ర మాట్లాడతాడు.

సినిమా కోసం పంచె కూడా కట్టుకున్నారు.. మీకు బాగా సూట్‌ అయింది...
థ్యాంక్స్‌ అండి. ఫస్ట్‌ టైమ్‌ పంచె కట్టుకున్నా. నాకెంతగా నచ్చిందంటే ఇప్పుడు ఎక్కువగా పంచె కట్టుకునే తిరుగుతున్నా.

తేజగారి దర్శకత్వం ఎలా అనిపించింది?
ఆయన ఐడియా చెప్పినప్పట్నుంచి ఓ తొమ్మిది నెలలు కథపై కసరత్తులు చేశాం. నేనిప్పటి వరకు కలసిన రచయితల్లో (రైటర్స్‌) చాలా గొప్ప వ్యక్తి తేజగారు. అందులో సందేహం లేదు. ఎప్పట్నుంచో సినిమాల్లో ఉన్నారు. ఎంతో నాలెడ్జ్‌ ఉంది. ఆయన దగ్గర్నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఒక యాక్టర్‌కు ఆయన ఇచ్చేంత డీటేయిలింగ్‌ ఇంకెవరూ ఇవ్వరు. ఓ నటుడిగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చేసినందుకు గర్వపడుతున్నా.

ఈ మధ్య తేజాగారు తీసినవి సరిగ్గా ఆడలేదు కాబట్టి, ఈ సినిమా ఒప్పుకోవడానికి ఏమైనా ఆలోచించారా?
ఏ సినిమాకైనా దర్శకుడి పేరుతో నాకు సంబంధం ఉండదు. రాజమౌళితో సినిమా (బాహుబలి) చేశా, సంకల్ప్‌రెడ్డితో సినిమా (ఘాజీ) చేశా. ఇద్దరితోనూ హిట్స్‌ అందుకున్నా. పేరు చూసి ఫలనా దర్శకుడితో చేయాలనుకోను. నా జీవితంలో అది జరగదు. కథ ముఖ్యం. ‘బాహుబలి’ అనేది రాజమౌళి, ప్రభాస్, రానాల కంటే పెద్దది. ‘ఘాజీ’ అనేది రానా, సంకల్ప్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డిల కంటే పెద్దది. కథే అందర్నీ ముందుకు నడిపిస్తుంది. హిట్టూ ఫ్లాపులతో నాకు సంబంధం లేదు. కథ చెప్పే ఇంటిగ్రిటీ నాకు కావాలి. తేజాగారిలో నాకది కనిపించింది.

ఫైనల్లీ పెళ్లెప్పుడు?
ఎక్కడికెళ్లినా ఇదే అడుగుతుంటారు. చెన్నై వెళితే అక్కడివాళ్లు నాకో గర్ల్‌ ఫ్రెండ్‌ ఉందని అంటుంటారు. మలయాళం వాళ్లయితే పెళ్లి చేసుకుని కాపురం పెట్టాననుకుంటారు. నేను సింగిల్‌ అండి అంటుంటాను (నవ్వుతూ).

‘లీడర్‌’ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’లో పొలిటీషియన్‌గా చేశారు.. పాలిటిక్స్‌లోకి ఏమైనా వస్తారా?
మా తాత (డా. డి. రామానాయుడు)గారికి పాలిటిక్స్‌ తెలియదు. అయిష్టంగానే రాజకీయాల్లోకి వెళ్లారు. నాకూ పాలిటిక్స్‌ తెలియదు. అసలు అర్థం కాదు. ఒకవేళ వెళితే కంప్లీట్‌గా దానికే డెడికేట్‌ అయిపోవాలి. సినిమాలూ చేస్తాను.. అక్కడ కూడా ఉంటానంటే అది కుదరదు. సమాజానికి సర్వ్‌ చేయడానికి పాలిటిక్స్‌ అనేది రూట్‌ అనుకుంటే వెళ్లొచ్చు.

 మీ ‘నం. 1 యారీ’ షో బాగుంది.. ఈ షో చేయడానికి కారణం ఏంటి?
టీవీలో ఏదైనా చేయాలని ఎప్పటినుంచో ఉంది. ‘నం. 1 యారీ’ షో కాన్సెప్ట్‌ బాగా నచ్చింది. ఫ్రెండ్స్‌తో సాగే టాక్‌ షో ఇది. నాగచైతన్య, సుమంత్‌ అన్న నా షోలో చాలా విషయాలు చెప్పారు. అఖిల్, కార్తికేయ రియల్‌గా మంచి ఫ్రెండ్స్‌. వాళ్లిద్దరూ వచ్చి, బోలెడన్ని విషయాలు చెప్పారు. మేం అంతా ‘అరేయ్‌ ఒరేయ్‌’ అని మాట్లాడుకోవడం కూడా ప్రేక్షకులకు చూడ్డానికి బాగుంటుంది.

ఒకవేళ ఇలాంటి షోకి వెళ్లాలంటే మీరు ప్రిఫర్‌ చేసే ఫ్రెండ్‌ ఎవరు?
ఇంకెవరు? రామ్‌చరణ్‌తో వెళతా. మా ఫ్రెండ్‌షిప్‌ ఏళ్ల తరబడి కొనసాగుతోంది.

ఎన్టీఆర్‌ చేస్తెన్న ‘బిగ్‌ బాస్‌’, మీ ‘నం. 1 యారీ’ని కంపేర్‌ చేసుకుంటారా?
ఈ రెండు షోల ఫార్మాట్‌ వేరు. నాది టాక్‌ షో కిందకు వస్తోంది. వారానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ‘బిగ్‌ బాస్‌’ షో ఫుల్‌ డిఫరెంట్‌. నేనా షో చూశా. అలాగే, తమిళంలో కమల్‌హాసన్‌గారు చేస్తోన్న ‘బిగ్‌ బాస్‌’ చూశాను. చాలా బాగున్నాయి.

సినిమా ప్రభావం ప్రజల మీద చాలా ఉంటుంది కాబట్టి... మీరంతా పెద్ద రేంజ్‌లో డ్రగ్స్‌ని వ్యతిరేకిస్తే బాగుంటుంది కదా?
ఒక్క సినిమా ఇండస్ట్రీవాళ్లే ఏంటి? అందరూ ముందుకు రావాలి. మొన్నా మధ్య చిన్నాన్న (హీరో వెంకటేశ్‌) నో డ్రగ్స్‌ అంటూ ఓ వీడియో పెట్టారు. దానికి బాగా రెస్పాన్స్‌ వచ్చింది. అలాగని ఫిల్మ్‌ పీపుల్‌ అన్నీ చేయలేరు. జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడం మా జాబ్‌. వార్‌ మూవీ, కామెడీ సినిమా, యాక్షన్‌ ఫిల్మ్‌.. ఇలా రకరకాలు చేసి, ఎంటర్‌టైన్‌ చేస్తాం. అయితే సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులుగా మంచి కోసం ఎవరైనా ఏమైనా ఇన్షియేట్‌ తీసుకుంటే, దాన్ని సపోర్ట్‌ చేయడానికి మేం ముందుకొస్తాం. కానీ, ప్రజలందరూ రారు. కొంతమందే వస్తారు. పాపులేషన్‌ హండ్రెండ్‌ పర్సెంట్‌ అంటే.. అందులో 14 నుంచి 18 శాతం సినిమాలు చూస్తారు. అంటే.. 20 శాతం కన్నా తక్కువే. మరి.. సొసైటీలో ఉన్న మిగతావాళ్లందరూ ఏమయ్యారు? సమాజం కోసం వాళ్లూ ఏదైనా చేయాలి కదా.

 – డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement