కేకు శిల్పాలు | Special Story About Cake Designs By Nirmala Reddy | Sakshi
Sakshi News home page

కేకు శిల్పాలు

Published Tue, Nov 5 2019 2:59 AM | Last Updated on Tue, Nov 5 2019 2:59 AM

Special Story About Cake Designs By Nirmala Reddy - Sakshi

కేక్‌ తయారీలో ఢాకా రాధ

సైరా సినిమా సక్సెస్‌మీట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది ఎదురుగా ఉన్న శిల్పం. అది శిల్పం కాదని, కేక్‌ అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసముండే ఢాకా రాధ ఆ కేక్‌ రూపకర్త. ఇంట్లో పుట్టినరోజు నుంచి సెలబ్రిటీల ఫంక్షన్ల వరకు రాధ అందించే రకరకాల శిల్పాకృతులను పోలిన కేక్‌ తయారీకి ఆమె చేసిన కృషి గురించి ఆమె మాటల్లోనే...

సైరా సక్సెస్‌మీట్‌లో..కేక్‌!

‘ఈ బేకింగ్‌ ఆర్ట్‌లో నైపుణ్యం సాధించడానికి కొన్నేళ్లు పట్టింది. రాత్రింబవళ్లు కష్టపడితే తప్ప ఈ రూపాలు రాలేదు. మొదట్లో మా పిల్లలిద్దరి పుట్టిన రోజులకు కేక్స్‌ తయారుచేసేదాన్ని. వాటిల్లోనూ బయట కొనే కేకుల మాదిరి కాకుండా ఏదైనా భిన్నంగా ఉండాలనుకున్నాను. వాటిని చాలా అందంగా డెకొరేట్‌ చేసేదాన్ని. వచ్చిన బంధుమిత్రులు చూసి వారిళ్లలో వేడుకలకు కేక్స్‌ తయారుచేసి ఇవ్వమనేవాళ్లు. ఆ తర్వాత్తర్వాత కేక్‌తోనే చిన్న చిన్న బొమ్మలను తయారుచేసి అలంకరించేదాన్ని. గతంలో వంటల పుస్తకాలు చూస్తూ వంటలు చేసేదాన్ని. తర్వాత్తర్వాత ఇంటర్నెట్‌లో ఇలాంటి కళ కోసం, కళాకారుల కోసం వెతుకుతూ ఉండేదాన్ని. సాధనతో ఆకృతులు చేయడం వచ్చింది.

థీమ్‌కు తగినట్టు
చదివింది పోస్టు గ్రాడ్యుయేషన్‌. కానీ, పెయింటింగ్‌ మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి. క్యారికేచర్స్‌ వేసేదాన్ని. తంజావూర్, వాటర్‌ కలర్‌ పెయింటింగ్స్‌ చేసేదాన్ని. ఆ కళ ఇలా కేక్‌ మీదకు తీసుకురావడానికి ఉపయోగపడింది. పెళ్లి రోజు, రిసెప్షన్, షష్టిపూర్తి.. ఇలా ఏ కార్యక్రమమైనా ఆ థీమ్‌కు తగ్గట్టు బొమ్మల కేక్‌ తయారు చేసి ఇస్తూ ఉండేదాన్ని.

సింగర్‌ సునీతకు.. కేక్‌ ఆకృతి

వంటల పోటీలు
కేక్‌ ఆర్ట్‌లో నిరంతర సాధన, ప్రయోగాలు చేస్తూనే దేశంలో ఎక్కడ బేకింగ్‌ పోటీలు జరిగినా వాటిలో పాల్గొంటూ వచ్చాను. దేశంలో యుకెకు చెందిన కేక్‌ మాస్టర్స్‌ మ్యాగజీన్, గ్లోబల్‌ షుగర్‌ ఆర్ట్‌ ఆన్‌లైన్‌ మ్యాగజీన్స్‌ ప్రతియేటా టాప్‌ టెన్‌ అవార్డులను ఇస్తుంటాయి. కిందటేడాది ఆ అవార్డు నన్ను వరించింది.

వంటగదిలోనే..
మా అమ్మగారికి ఎనభైమూడేళ్లు. ఇప్పటికీ తను వంట చేస్తారు. ఇంట్లో వంటవాళ్లు ఉన్నప్పటికీ వండి వడ్డించడంలో ఆమెకున్న ఆసక్తి నన్నూ వంటవైపుగా నడిపించింది. ఆమె దగ్గరే నేనూ రకరకాల పదార్థాల తయారీ నేర్చుకున్నాను. మా ఇంట్లోని వంటగదే ఈ కేక్‌ వ్యాపారానికి కేంద్రబిందువు. మా పిల్లలు కూడా కేక్‌ బేకింగ్‌లో పాల్గొంటారు. ఈ తరం వాళ్లలో ఉండే ఆలోచనలు, సృజన కేక్‌ తయారీ రూపకల్పనకు ఉపయోగపడుతుంది. అటు అమ్మ నుంచి ఇటు మా అమ్మాయి నుంచీ సూచనలు తీసుకుంటాను. ఆర్డర్స్‌ ఎక్కువ వచ్చాయంటే మా ఇంట్లో వాళ్లూ సాయం చేస్తారు. ఇదంతా మా ఇంటి సభ్యుల టీమ్‌ ఎఫర్ట్‌.

పదేళ్లుగా బిజినెస్‌
బిజినెస్‌ చేయాలనే ఆలోచనతో కాకుండా బేకింగ్‌ ఆర్ట్‌ ఆసక్తితో నేర్చుకున్నాను. ముందు బంధు మిత్రులు అడిగితే కేక్స్‌ చేసి ఇస్తూ వచ్చిన నేను పదేళ్ల క్రితం బిజినెస్‌ మొదలుపెట్టాను. బేకింగ్‌ క్లాసులు కూడా తీసుకుంటున్నాను. ఆ క్లాసులు రెండు రోజుల నుంచి నెల రోజుల వరకూ ఉంటాయి. ఆన్‌లైన్‌ ద్వారా ఈ కేక్‌ తయారీ గురించి తెలుసుకుంటూ బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వచ్చి ఈ బొమ్మల కేక్‌ తయారీలో మెలకువలు నేర్చుకొని వెళుతుంటారు. గృహిణిగా ఉంటూ ఇష్టం కొద్ది మొదలుపెట్టిన ఈ కేక్‌ తయారీ ఇప్పుడు నాకో ప్రత్యేక గుర్తింపును తెచ్చింది’ అంటూ రాధ ఆనందంగా తెలిపారు.
– నిర్మలారెడ్డి,ఫొటో: ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement