క్రిస్మస్‌ కేకు | Special Story About Christmas In Funday On 22/12/2019 | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ కేకు

Published Sun, Dec 22 2019 12:00 AM | Last Updated on Sun, Dec 22 2019 12:00 AM

Special Story About Christmas In Funday On 22/12/2019 - Sakshi

ఉత్కంఠత భరించలేక పోతున్నాను. మూత తీసి చూసేద్దామంటే  అమ్మ సంగతి తెలుసుకదా.  ‘‘నేను రాకుండా నిన్నెవడు మూత తియ్యమన్నాడురా రాస్కెల్‌’’ అని నావీపు చిట్లగొట్టినాకొడుతుంది.  
ఊపిరి బిగబట్టి చూస్తున్నాను, అమ్మ ఎప్పుడొచ్చి మూత తీస్తుందా అని.

పాపం మా నాన్న...తాతయ్యకీ నానమ్మకీ సొంతకొడుకు కాదట. పెంచుకున్నారట. తెచ్చుకున్న కొన్నాళ్ళకి పెంచుకున్నావిడ హఠాత్తుగా చనిపోయిందట. చక్కగా తిరుగుతూ  ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆవిడలా అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం  మా నాన్నే అనీ, అందుకని  ఆయన్ని ఇంకెవరికైనా  ఇచ్చేస్తే బాగుంటుందనీ బంధువులంతా అనుకుంటుంటే, మా తాత మాత్రం  వాళ్లని వీరోచితంగా ఎదుర్కొని  అందరి నోళ్ళూ ముయ్యించాడట.  
మా నాన్నని పెంచే బాధ్యత తన భుజస్కంధాలమీదే వేసుకొని పెంచేడట కూడానూ. అందుకే  మా నాన్నకి  తాతంటే చెప్పలేనంత ఇష్టం.  
తాత కొంచెం పెద్దాడైపోయాక తనని మా దగ్గరకి తీసుకొచ్చేసారు నాన్న. తీసుకొచ్చేముందు మమ్మల్నందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకొని ‘‘తాత రేపు సాయంత్రానికి మనింటికి వచ్చేస్తాడు. ఇంకెప్పుడూ ఇక్కడే మనతోనే ఉంటాడు. అందరం తాతని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. ఎవ్వరూ ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు’’ అని చాలా గట్టిగా హెచ్చరించారు.  సరేనని బుద్దిగా తలలూపేం అందరం. 
కాకపోతే నాన్న చెప్పినట్టు తాతని ప్రేమగా చూసుకోవడం, అంత ‘వీజీ’ కాదని తాత వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలిసిపోయింది నాకు. ఎలాగంటే, వచ్చిన దగ్గరనుండీ కనిపెడుతున్నాను కదా  మా తాతకి నాకంటే మా తమ్ముడంటేనే ఎక్కువిష్టం. 
 ‘‘ఆడి నడకా ఆడి నవ్వూ, అచ్చు మీ నాన్నేరా అబ్బాయ్‌’’ అనేవాడు  మురిసిపోతూ. 
 ‘‘ఆడ్ని చూస్తుంటే చిన్నప్పటి మీ నాన్నని చూస్తన్నట్టే ఉంటాదిరా’’  అని తెగ ఆనందిస్తూ ఉండేవాడు వాడ్నిచూసి. 
 సరే పోనీలే పాపం  ఏదో ముసలాడు ముచ్చట పడుతున్నాడని క్షమించేసేవాడ్నేమో. కాని  తాత చేసే పనులుచూస్తే మాత్రం  క్షమించడం అటుంచి  సహించడమే కష్టమైపోయేది నాకు. నాకొక పదిపైసలో పావలావో పారేస్తే, వాడికేమో అర్థరూపాయో, రూపాయో ఇచ్చేవాడు. నన్నెప్పుడైనా బయటకి తీసుకెళ్తే ఒక పకోడీపొట్లంతో సరిపెట్టేసే తాత, మా తమ్ముడికి మాత్రం, పకోడీతో పాటు, ఒక లడ్డూ గాని, రెండు జిలేబీలుగాని కొనిపెట్టేవాడు. అప్పుడప్పుడూ కూల్‌ డ్రింక్‌ కూడా ఇప్పించేవాడట.
ఇంతేకాకుండా తగరపువలస ‘శ్రీ సీతారామా పిక్చర్పాలెస్‌’ లో సినిమాలకి వాడ్ని తీసుకెళ్ళడమే కాకుండా, ‘కుర్చీ’ క్లాస్‌లో కూర్చొని మరీ సినిమా చూసొచ్చేవారిద్దరూ. నాకేమో  మా అమ్మ పుణ్యమా అని ‘బెంచీ’ టికెట్టుకి   కూడా గతిలేని బతుకు. నేల టికెట్టే. (అది కూడా సంవత్సరానికి ఒకసారే). తాత చేసే ఈ పనులేవీ  నాకు తెలియవనుకునేవాడు గాని, మనం మాత్రం ఈ సమాచారం అంతా మా తమ్ముడి దగ్గరనుండి ఎప్పటికప్పుడు సేకరించి బుర్రలో జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్న విషయం ఆయనకి తెలీదు పాపం. ఇంత తెలుసుకున్న నాకు కడుపుమండడం సహజంకదా. దాంతో తాతని ప్రేమగా చూసుకోవడం....అబ్బే జరిగేపని కాదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది నాకు. అంతే, ఇక అప్పట్నుండీ నాకూ తాతకీ మధ్య కుక్కా–పిల్లీ వైరం చోటుచేసుకుంది.  స్కూలుగ్రౌండులో ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నప్పుడో, ఇంట్లో  చెల్లెళ్ళతో చింతపిక్కలాట ఆడుతున్నప్పుడో తప్ప ఎప్పుడూ తాతని ఏదో దానికి ఏడిపించడం... రెండుమూడు రోజులకొకసారైనా దొరికిపోయి నాన్నతో తట్లుదేరిపోయేలా తన్నులు తిని ఏడుస్తూ ఓమూల కూర్చోవడం నిత్యకృత్యం అయిపోయింది. అలా ఏడుస్తూ కూర్చుంటే మా బేబీ చెల్లి కూడా నాతో పాటూ ఏడుస్తూ నా ఒంటిమీద తేరిన  తట్లుకి కొబ్బరినూనె రాయడం....అది వేరే కత.   
ఈ విధంగా మన జీవితం ముప్పైతన్నులూ, అరవై తిట్లూ చందాన వర్ధిల్లుతుండగా అక్టోబర్‌ నెల రావడం, వెళ్ళిపోవడం, దాని వెంబడే నవంబరు నెల ప్రవేశించడం చూస్తుండగానే జరిగిపోయింది.  
నవంబరు నెల వచ్చిందంటే  ఇంటిముంగిట్లోకి క్రిస్మస్‌ వచ్చేసినట్టే. ఇంటికి సున్నాలూ, ఫర్నిచర్కి పాలీషూ, వేసుకోవడానికి కొత్తబట్టలూ, తినడానికి కేకులూ. ఇలా నెల రోజులూ ఊపిరితిరగని పని. అమ్మకైతే మరీనూ. అయితే క్రిస్మస్‌కి సంబంధించిన పనులన్నీ ఒకెల్తైతే, కేకు చెయ్యడం ఒక్కటీ ఒకెత్తు. దానికి కారణాలు రెండు. క్రిస్మస్‌ కేకు బాగా పొంగి రుచిగా కుదిరితే ఆ సంవత్సరం అంతా బాగుంటుందనే నమ్మకం మా అమ్మకి ఉండడం ఒక కారణం ఐతే, కేకు రుచిగా, అందంగా చెయ్యడం అనే విద్య అమ్మకి అస్సలు రాకపోవడం ఇంకొక ముఖ్యకారణం. 
ఈ రోజుల్లో అయితే వీధికొకటీ సందుకొకటీ బేకరీలూ అందులో మనకి కావలసిన సైజుల్లో, రంగుల్లో, రుచుల్లో రకరకాల కేకులూను. అప్పుడలా కాదుకదా.  ప్రతీదీ ఇంట్లో చేసుకోవడమే.  చెయ్యడానికి కావలసిన దినుసులు  కూడా మా భీమిలీలో  దొరికేవి కాదు.  వైజాగో విజయనగరమో వెళ్ళాల్సి వచ్చేది వాటికోసం.అవి తీసుకొచ్చేస్తే కేకు తయరైపోదు కదా. చాలా కథుంది కేకు తయారవ్వడానికి.  దీపావళి మతాబులు తయారుచెయ్యడానికి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా కొలత ప్రకారం  పాళ్ళు కలుపుతామో అంతే శ్రద్ధగా దీనిక్కూడా పాళ్ళు, అంటే, పిండీ, గుడ్లూ, వెన్నాలాంటి పదార్థాలు వెయ్యాల్సిన మోతాదులో కచ్చితంగా వేసి, ఆ మిశ్రమాన్ని కనీసం  గంటసేపు చాలా బలంగా మర్దించి, అది కాటుకలాగ మెత్తగా అయిన తరవాత తగుమాత్రపు వేడిలో నెమ్మదిగా జాగ్రత్తగా ‘బేక్‌’ చెయ్యాలి. దినుసులు కొలత ప్రకారం కలపడం ఎంతముఖ్యమో, తగుమాత్రపు వేడిలో జాగ్రత్తగా ‘బేక్‌’ చెయ్యడం కూడా అంతే ముఖ్యం.  పాళ్ళు కొంచెం అటూఇటూ అయినా, వేడి కొంచెం ఎక్కువతక్కువైనా కేకు మఠాషైపోవడం తథ్యం.
ఇంత జాగ్రత్తగా చెయ్యాల్సిన కేకు తయారుచెయ్యడంలో మాఊర్లో  అందెవేసిన చెయ్యి మా వజ్రమ్మ ఆంటీదే. ఎంత బాగా చేసేవారంటే, ఆంటీ చేసిన కేకు నోట్లోవేసుకుంటే ఐస్‌క్రీమ్‌ కరిగినట్టు కరిగిపోయేది. కేకు మీద వేసే ఐసింగ్‌ అయితే మరీ రుచిగా ఉండేది. తలంచుకుంటే ఇన్ని దశాబ్దాల తరవాత, ఇప్పుడుకూడా నోరూరిపోతుంది..ఆంటీ చేసిన కేకుల ముందు  బేకరీలో కొన్న ఏ కేకైనా బలాదూర్‌ అంటే  అతిశయోక్తి కానేకాదు. అమ్మకి మంచి స్నేహితురాలు కావడంతో ప్రతీ క్రిస్మస్కీ కేకు ఆంటీనే చేసిపెట్టేవారు మాకు...ఏజ్‌ ఎ స్పెషల్‌ ఫేవర్‌ టు అమ్మ.  
క్రిస్మస్‌ వారం రోజుల్లోకి వచ్చేసింది. అమ్మ మమ్మక్కని పిలిచి ‘‘వజ్రమ్మాంటీ ఇంటికి వెళ్ళి కేకు చెయ్యడానికి  ఎప్పుడు వీలవుతుందో.....’’ అమ్మ మాట ఇంకా పూర్తికానే లేదు. రాకెట్‌ లాగ దూసుకొచ్చేసాడు తాత.
‘‘ఆవిడెందుకమ్మా పెత్తల్లీ. నేను లేనూ. నాకు రాకపోతే కదా మనకి వేరేవాళ్ళు చేసిపెట్టడం. నేను చేస్తానుకదా’’ అంటూ.  
అమ్మ ముందు ఆశ్చర్యపోయినా తాతకి కేకు చెయ్యడం వచ్చినందుకు సంతోషించినట్టే కనిపించింది.  
‘‘అలాగే. నువ్వు చేస్తానంటే అంతకంటేనా. ఏంకావాలో లిస్ట్‌ రాసివ్వు. వీడ్ని పంపించి తెప్పిస్తాను’’ అంది అమ్మ నావేపు చూస్తూ.
 సరేనని తాత లిస్టు రాయించడం, అది పట్టుకొని ఆరోజు మధ్యాహ్నమే  నేను వైజాగు వెళ్ళి లిస్టులో రాసినవన్నీ కొనుక్కొని మరసటిరోజు మధ్యాహ్నానికి తిరిగిరావడం జరిగింది.  ఇంక   కేకు తయారుచెయ్యడమే తరువాయి. సామాన్లు తెచ్చిన మరసటిరోజు మధ్యాహ్నానికి ముహూర్తం పెట్టాడు తాత. ముహూర్తం పెట్టి  అమ్మతో  ‘‘కేకు రేపు చేస్తానుగాని పెత్తల్లీ, అది చేసీటప్పుడు  ఈ బాబ్జీగాడ్ని మాత్రం ఆ చుట్టుపక్కలకి రానియ్యకు. ఆడొచ్చేడంటే మొత్తం కంగాళీ చేసేస్తాడెదవ’’ అని చెప్పాడు నావేపు వేలుపెట్టి చూపిస్తూ.  
అమ్మ వెంటనే ‘‘నువ్వా చుట్టుపక్కల కనిపించేవంటే బాగోదొరేయ్‌ బాబ్జీగే’’ అని  ఠెరిబుల్‌ వార్నింగ్‌ ఒకటి  ఇచ్చింది నాకు. ఆదెబ్బతో బడెగ్గొట్టేసి కేకు చేస్తున్న తాత పని పడదామనుకున్న నా సంకల్పం చెట్టెక్కిపోయి, ఏడుపు మొహంవేసుకొని  బడికెళ్ళాల్సి వచ్చింది. బడికి వెళ్ళేనేగాని నేనేమీ చేతులు కట్టుకొనికూర్చోలేదు. తాత చెయ్యబోయే కేకులు సర్వనాశనం అయిపోవాలని ఒక్క ‘ఏసుప్రభువు’కే కాకుండా ‘వెంకటేశ్వరస్వామికి’ కూడా  దండం పెట్టుకున్నాను బళ్ళో కూర్చొని చాలాసార్లు.
సాయంత్రం బడి నుండి వచ్చేసరికి, కేకు చెయ్యడం అయిపోయినట్టే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తాత వరండాలో మడతకుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆతృతగా గేటువైపు చూస్తూ. తాత ఒళ్ళో ఆయన ముద్దులమనవడు. అమ్మ వంటగదిలోఉంది. మధ్యగదిలో  చింతపిక్కలాటలో మునిగిపోయి ఉన్నారు చెల్లెళ్ళిద్దరూ. నాన్నింకా స్కూలునుండి వచ్చినట్టులేదు.
తాత చేసిన క్రిస్మస్కేకు ఎలా వచ్చిందో అనే ఆతృత నన్ను నిలబడనియ్యటంలేదు. మెల్లగా  చెల్లెళ్ళ పక్కకి చేరి నెమ్మదిగా అడిగాను ‘‘కేకు తయారైపోయిందా, ఎలా కుదిరిందీ?’’  అని.  ‘‘రాములు తీసుకెల్లేడన్నయ్యా ‘రొట్లోళ్ళ’ బేకరీకి. ఇంకా తీసుకు రాలేదు. దాని కోసమే చూస్తున్నారు తాతా చిన్నిగాడూను’’ అంది మమ్మక్క ఆడుతున్న ఆట నుండి కళ్ళైనా తిప్పకుండా.  
‘‘తాతతోటే తేల్చుకుంటేపోలా’’ అనుకొని నెమ్మదిగా తాత పక్కకి చేరాను.  
 ‘‘ఎందుకురా ఇక్కడికి తయారయ్యావ్‌ . పో ఇక్కడ్నుంచి’’ అన్నాడు  తాత నావేపు  అనుమానంగా చూస్తూ. 
‘‘ఇంకా కేకు రాలేదా తాతా’’ అని అడిగాను తాత మాట విననట్టుగా. 
‘‘నీకెందుకురా,  ఒచ్చిందో లేదో పో ఇక్కడ్నుండి ’’ అన్నాడు తాత  కోపంగా మళ్ళీ.
‘‘గుడ్లూ అవీ కరక్ట్‌గా లెక్క ప్రకారం వేసేవా తాతా’’ అడిగాను చిన్నగా నవ్వుతూ.
‘‘ఎన్నేయ్యాలో నాకు తెలీదా. నీకు చెప్పాలా ఎన్నేసేనో’’ అన్నాడు నా వేపు గుర్రుమని చూస్తూ.
‘‘కేకు పొంగుతుందంటావా. నిజం చెప్పూ’’ అడిగాను వేళాకోళంగా.
‘‘ఎందుకు పొంగదూ. బ్రహ్మాండంగా పొంగుతాది. అయినా నీకెందుకురా అయ్యన్నీ. పోతావా  మీ నాన్నని పిలమంటావా’’  అన్నాడు తాత మరింత కోపంగా.
‘‘ఎందుకో నాకైతే ఈసారి కేకసలు  పొంగదనిపిస్తుంది తాతా. నువ్వు బేకింగ్‌ పౌడర్‌ ఎక్కువ వేసేసుంటావని నా డౌటు’’ అన్నాను మరింత రెచ్చగొడుతూ.
‘‘నోరు మూస్తావా,  పళ్ళు రాలగొట్టెయ్యమంటావా గాడిదా’’ అంటూ కుర్చీ మీద నుంచి లేవబోయాడు తాత. 
తాత చేతికి అందనంత దూరంగా పారిపోయి  ఏదో అనబోతున్నంతలో బేకరీ నుండి వస్తున్న రాములు కనిపించాడు దూరంగా. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, బెంజిలారీలా  ముక్కులోంచీ నోట్లోంచీ ‘‘ఉష్‌‡్ష’’ అంటూ గట్టిగా గాలి వదిలి, అతిభారంగా నెత్తి మీదున్న గిన్నెలు రెండూ, అవేవో వంద కేజీల బరువున్న బియ్యంబస్తాలా,  డైనింగ్‌ టేబిల్‌ మీద దించి పక్కనే ఉన్న స్టూలు మీద చతికిలబడ్డాడు మళ్ళీ ‘ఉష్‌‡్ష’ అని గాలి వదుల్తూ.
ఆత్రంగా  రాములి మొహంలోకి చూస్తున్న నాకు అక్కడ  ఏ సూచనా కనబడి చావలేదు.  ఉత్కంఠత భరించలేక పోతున్నాను. మూత తీసి చూసేద్దామంటే  అమ్మ సంగతి తెలుసుకదా.  ‘‘నేను రాకుండా నిన్నెవడు మూత తియ్యమన్నాడురా రాస్కెల్‌’’ అని నావీపు చిట్లగొట్టినాకొడుతుంది.  
ఊపిరి బిగబట్టి చూస్తున్నాను, అమ్మ ఎప్పుడొచ్చి మూత తీస్తుందా అని.  
ఐదు నిమిషాలు భారంగా గడిచాక, అమ్మ తీరిగ్గావచ్చి గిన్నెమీద మూత తీసింది. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి క్షణం పాటూ గిన్నెలోకి చూసింది. తరవాత రెండోగిన్నెమీద మూత కూడా తీసింది గాభరాగా. ఇంతలో నెమ్మదిగా అమ్మ పక్కకు చేరి  అత్రంగా వాటిలోకి తొంగిచూసిన మాకు, గిన్నె నిండుగా పొంగి, చిక్కటి బ్రౌన్‌  కలర్లో నిగనిగలాడుతూ  నోరూరించే చక్కటి కేకులు రెండింటికి బదులు......నల్లజీడిపిక్కలా మాడిపోయి, కుంచించుకుపోయి, గిన్నె అడుక్కి బంకలా అంటుకుపోయిన నల్లటి  లింగాకారాలు రెండు  దర్శనమిచ్చాయి. వాటిని చూసిన  తాత మొహం కూడా అచ్చు  వాటిలో ఒకదానిలా  మాడిపోయింది. నా ఆనందానికి అంతేలేకుండా పోయింది. పొట్టచేత్తోపట్టుకొని, గట్టిగా...ఇంటిపెంకులు ఎగిరిపోయేలా గెచ్చాళీగా నవ్వుతున్న నన్ను చూసిన చెల్లెళ్ళిద్దరూ కూడా  నవ్వడం మొదలుపెట్టారు. అమ్మ మాత్రం వస్తున్న నవ్వు బలవంతాన  ఆపుకుంటూ త్వరత్వరగా వెళ్ళిపోయింది అక్కడ్నుంచి.  తాతా, తమ్ముడూ కనుచూపుమేరలో అబ్బే........ 
క్రిస్మస్‌ ఎప్పుడూ ఒంటరిగా రాదు. గతించిన బాల్యాన్నీ దానితో ముడిపడి ఉన్న అనేకమైన జ్నాపకాల్నీ మోసుకొస్తుంది. మోసుకొచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ఇట్‌ మేక్స్‌ ఒన్‌  నాస్టాల్జిక్‌. అయితే నాస్టాల్జియా ఎప్పుడూ సంతోషాన్నే కలిగించదు. అప్పుడప్పుడూ  ‘అప్పుడలా ఎందుకుచేసేను. అలా చెయ్యకపోతే ఎంత బాగుండేది’ అనే పశ్చాత్తాపాన్ని కూడా కలిగిస్తుంది.  అలాంటప్పుడు ‘తప్పుచేసేను. క్షమించు’ అని చెప్పాలనిపిస్తుంది.తాతతో అదే చెప్పాలనుందిప్పుడు. కాని చెప్దామంటే తాత ఏడీ. లేడు కదా. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇంక తిరిగిరాడు కూడా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement