బతకడమంటే మైలురాళ్లు దాటడం కాదు!
పేతురు యొప్పే (ఇప్పటి టెల్ అవీవ్ పట్టణం)కొచ్చి సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. మధ్యాహ్నం పూట మిద్దెమీద ప్రార్థన చేస్తూ బాగా ఆకలిగొన్నాడు. అప్పుడు అన్ని రకాల జంతువులు, పురుగులు, పక్షులున్న ఒక దుప్పటి నాలుగు చెంగులతో ఆయన ముందు దించబడగా, వాటిని చంపుకొని తిని ఆకలి తీర్చుకొమ్మని చెప్పే ఒక స్వరం వినపడింది. ఎంతో నిష్ట కలిగిన యూదుడనైన తాను నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి ఎన్నడూ తినలేదని పేతురు బదులిచ్చాడు.
దేవునిలో కొచ్చిన తర్వాత మనిషి మారడం అనివార్యం. అలా దేవునిలో మారిన ప్రతి విశ్వాసీ ఒక అద్భుతమైన శక్తిగా పరిణామం చెందుతాడు. అలాంటివాళ్లే లోకాన్ని కూడా మార్చుతారు.
అలా మూడుసార్లు జరిగింది. ఆ దర్శన భావమేమిటో పేతురుకి అర్థం కాలేదు. అంతలో కైసరయ పట్టణం నుండి వచ్చిన కొందరు ఆయన్ను కలిశారు. అక్కడి కొర్నేలీ అనే భక్తిపరుడైన శతాధిపతి తన ఇంటికొచ్చి తన వారందరికీ క్రీస్తు సువార్త ప్రకటించమంటూ పంపిన ఆహ్వానాన్ని వారు పేతురుకు తెలిపారు.
పేతురులాంటి ఛాందస యూదుల దృష్టిలో సున్నతిలేని రోమీయుడైన కొర్నెలీ అన్యుడు, అంటరానివాడు. అతడిచ్చే మంచినీళ్లు కూడా ముట్టరువారు. అయితే అపవిత్రమైనవి ఆరగించమన్న దైవదర్శన భావం క్రీస్తు రక్షణ సువార్తను ఇక నుండి అన్యులకు కూడా ప్రకటించమన్న దైవాదేశంగా అర్థం చేసుకొని పేతురు దానికి విధేయుడై అప్పటికప్పుడు కొర్నేలీ వద్దకు వెళ్లి వాళ్లింట్లో బసచేసి అక్కడి ఐదుమందిని ప్రభువులోనికి నడిపించాడు. అలా అన్యులై క్రైస్తవంలోకి వచ్చిన వారందరికీ ఆద్యుడయ్యాడు (అపొ.కా. 9-43).
యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి విశ్వాసిలో మార్పు తేకుండా ఉండదు. పేతురులో కూడా క్రమంగా మార్పులొచ్చాయి. సత్యవాక్య ప్రబోధకుడుగా పేతురు జీవితంలో ముందు సత్యప్రతిష్ట జరగాలి. ‘దేవుడు పరమ తండ్రిగా గల వసుధైక కుటుంబంగా ఈ లోకాన్ని మార్చే పనిలో అతను అందరితో కలిసేవాడుగా మారాలి. వృత్తి కారణాలవల్ల చర్మకారులతో ఛాందస యూదులు కలవరు. కాని పేతురు వచ్చి చర్మకారుని ఇంట్లో బస చేసి అతని ఆతిథ్యం స్వీకరించడమే అతనిలో మార్పునకు నిదర్శనం. అయితే చర్మకారులకే కాదు సున్నతి లేని అన్యులకు కూడా ప్రభువు మార్గం బోధించమని ఆదేశిస్తే పేతురు అందుకు కూడా సిద్ధమై మరో అడుగు ముందుకేయడం ఆత్మీయంగా అతను సాధించిన ఒక గొప్ప విజయం.
ఎందుకంటే క్రైస్తవంలోకి సున్నతి కలిగిన యూదులకు మాత్రమే ప్రవేశముంటుందన్నది అతని స్థిరాభిప్రాయం. ఆ విషయంలో అపొస్తలుడైన పౌలుతో విభేదించాడు కూడా (గలతి 2:11-21). అయితే ఆ దర్శనంతో పేతురు చాలా మారాడు. దేవునిలో కొచ్చిన తర్వాత మనిషి మారడం అనివార్యం. అందుకే దేవునిలోకి వచ్చిన తర్వాత మోసగాళ్లు నిజాయితీపరులుగా, స్వార్థపరులు నిష్కామయోగులుగా, క్రూరులు ఎంతో సాత్వికులుగా మారడం చూస్తున్నాం. రంధ్రం పడిన చెంబు తనను తానెలా బాగుచేసుకోలేదో, పరిశుభ్రపర్చుకోలేదో మనిషి కూడా తనను తాను మార్చుకోలేడు, బాగు చేసుకోలేదు.
అందుకు అతని సృష్టికర్తయైన దేవుడే పూనుకోవాలి. అలా దేవుడు మార్చిన వాడే నూతనసృష్టి అవుతాడు (2 కొరింథీ 5:17). దేవునిలో మారిన ప్రతి విశ్వాసీ ఒక అద్భుతమైన శక్తిగా పరిణామం చెందుతాడు. అలాంటివాళ్లే లోకాన్ని కూడా మార్చుతారు. మనమెవరమూ పుట్టుకతోనే పరిపూర్ణులం కాదు. కాబట్టే దేవుని తోడ్పాటుతో రోజూ కొంత నేర్చుకుంటూ క్రమంగా పరిపూర్ణులవుతాం. ఆ విధంగా విశ్వాస జీవన ప్రయాణంలో ప్రతి మజిలీని ఆస్వాదిస్తాం.
అంతిమంగా యేసుక్రీస్తు స్వరూపాన్ని సంతరించుకునే అంతిమ గమ్యానికి చేరుకుంటాం. ఈ ప్రయాణంలో అందరికీ కలుపుకొంటూ పదిమందికీ చేయూతనిస్తూ ముందుకు సాగాలి. జీవించడమంటే అలా మనుషులను సంపాదించుకొంటూ ముందుకు సాగడమే తప్ప మైలురాళ్లు దాటడం కాదు. గుండెనిండా పగ, ద్వేషం నింపుకుంటే అవి చివరికి మనల్నే దహించేస్తాయి. ప్రేమ నిండిన గుండె ప్రేమనే గుబాళింప చేస్తుంది. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్