నిజం చెప్పించడానికే ఇంటరాగేషన్. ఎవర్నుంచి నిజం? నిందితుల నుంచి. బాధితులకు ఇంటరాగేషన్ ఉండదు. అడగడం వరకే... స్టేట్‌మెంట్ వరకే. అత్యాచారాల్లో మాత్రం ఇది రివర్స్. ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు... అన్నీ విచారణకు కావలసిన ప్రశ్నలే. బాధితురాలికి మాత్రం.. ఇంటరాగేషన్ చేసినట్లే ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్... వాళ్ల బిహేవియర్ మీద తీర్పులు! ఇటీవలి రెండు రేప్ కేసులు ఇవి. కర్ణాటకదొకటి.. బిహార్‌ది మరొకటి.
ఆమె అతడిపై కేస్ పెట్టింది. అతడు ముందస్తు బెయిలుకు పిటిషన్ పెట్టుకున్నాడు. ‘బెయిల్ గ్రాంటెడ్’ అంది కోర్టు! ‘ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇస్తే సమాజం సురక్షితంగా ఉండలేదు మిలార్డ్’ అన్నాడు ఆమె తరఫు లాయర్. జడ్జి ఆ లాయర్ వైపు చూశారు. ‘అతడికి బెయిల్‌ను నిరాకరించేందుకు తగిన కారణమేదీ ఆమె దగ్గర కనిపించడం లేదు’ అన్నారు! రేప్ కేసు అది. జడ్జిగారు అడిగిన ఏ ప్రశ్నకూ బాధితురాలు సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయింది.
‘‘రాత్రి పదకొండు గంటలకు మీరు ఆఫీస్‌కు ఎందుకు వెళ్లవలసి వచ్చింది?’’
‘‘ఆయన మా బాస్. ఫోన్ చేసి పిలిస్తే కాదనలేకపోయాను’’
‘‘ఆయనతో కలిసి ‘డ్రింక్స్’ ఎందుకు తాగవలసి వచ్చింది?’’
‘‘ఆయన ఆఫర్ చేశారు. వద్దంటే బాగోదనీ..’’
‘‘తెల్లవారుజాము వరకు ఆఫీస్‌లోనే ఎందుకు ఉన్నారు?’’
‘‘ఈ టైమ్‌లో బయటికి వెళ్లడం మంచిది కాదు. ఉండిపొమ్మన్నారు.’’
‘‘ఆయన మీపై అత్యాచారం చేసిన మర్నాడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?’’
‘‘నేను కదిలే స్థితిలో లేను. తెలియకుండానే మగతలోకి జారిపోయాను’’
జడ్జిగారు ఇంకేమీ ప్రశ్నలు వెయ్యలేదు. అతడికి బెయిల్ ఇస్తూ ఆమె గురించి ఒక మాట అన్నారు.
‘‘అత్యాచారం జరిగినప్పుడు భారతీయ స్త్రీకి నిద్రపట్టదు. ఈమె మాత్రం తను నిద్రపోయానని చెబుతోంది. వినేందుకే ‘అన్‌బికమింగ్’ గా ఉంది’’ అన్నారు. అన్‌బికమింగ్ అంటే ‘తగని విధంగా’, ‘సమ్మతించలేనిదిగా’ అని. అయితే కేసులోని తీవ్రతను గమనించి అతడికి బెయిలును తిరస్కరించవలసిందిగా ఆమె లాయరు జడ్జి గారికి విన్నవించుకున్నారు.
‘‘కేసులోని తీవ్రత మాత్రమే నిందితుడి స్వేచ్ఛను నిరాకరించడానికి ప్రాతిపదిక అవదు’’ అన్నారు జడ్జి. జూన్ నాలుగో వారంలో కర్ణాటక హైకోర్టుకు వచ్చిన ఒక కేసు ఇది. ప్రతి రెండు, నాలుగు శనివారాల్లో బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సంతకాలు పెట్టి వస్తున్నాడు అతడు. ఉద్యోగం పోయి, ఇంకోచోట ఉద్యోగం రాక తిప్పలు పడుతోంది ఆమె.
ఆమె వారిపై కేసు పెట్టింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసినవారు ఆ నలుగురూ. జూలై 6న అత్యాచారం జరిగింది. మర్నాడు ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలిసిన మనిషే, బైక్ నేర్పిస్తానంటే వెనుక కూర్చుంది. సాయంత్రం అది. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. ఆక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. మరో ముగ్గురిని ఫోన్ చేసి పిలిచి ఆమెను ఆప్పగించి వెళ్లిపోయాడు. స్పృహలేని స్థితిలో ఆమె ఎలాగో తప్పించుకుని వచ్చేసింది. జూలై 10న జడ్జిగారి ఎదుట స్టేట్‌మెంట్ ఇవ్వడానికని ఆమెను పిలిపించారు. ఆమెకు చదువురాదు. కల్యాణి, తన్మయి అనే ఇద్దరు సామాజిక కార్యకర్తల్ని వెంటబెట్టుకుని వెళ్లింది. వాళ్లిద్దరూ ‘జన జాగరణ శక్తి సంఘటన’ అనే ఎన్జీవో సభ్యులు. స్టేట్‌మెంట్ కాగితం మీద సంతకం పెట్టమని అడిగారు జడ్జిగారి దగ్గర ఉండే అధికారి. చదివించుకుని సంతకం పెడతానంది బాధితురాలు. అధికారి ఒప్పుకోలేదు. ‘స్టేట్‌మెంట్‌లో ఏమున్నదీ తనకు తెలియాలి కదా. మేము చదివి వినిపిస్తాము. మాకు ఇవ్వండి’ అని అడిగారు ఆ ఇద్దరు మహిళలు.
‘‘బాధితురాలి స్టేట్‌మెంట్‌లో ఏ విధంగానైనా వేరొకరి జోక్యాన్ని చట్టం అంగీకరించదు’’ అని అన్నారు అధికారి. ‘‘దయచేసి ఇవ్వండి’’ అని అడిగారు వీళ్లు. ఇదంతా చూస్తున్న జడ్జిగారు ఆగ్రహించారు. ‘‘ఏంటీ మిస్‌బిహేవియర్’’ అంటూ.. బాధితురాలికి, ఆమెతో పాటు వచ్చిన వాళ్లకు జైలు శిక్ష విధించారు. వాళ్లున్నది అరేరియా డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో. వాళ్లను పంపించింది అక్కడికి 225 కి.మీ. దూరంలోని సమస్తిపూర్ జైలుకు! న్యాయం కోసం వెళితే శిక్షపడింది! ప్రస్తుతం ఈ ముగ్గురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. న్యాయ సిబ్బంది విధులకు అడ్డు తగిలారన్న నేరంపై స్వయంగా జిల్లా మేజిస్ట్రేటే వారిపై ఎఫ్.ఐ.ఆర్. రాయించారు. ఐపీసీ సెక్షన్ 353 (దాడి లేదా విధులలో ఉన్న ప్రభుత్వోద్యోగిని అడ్డుకోవడం), సెక్షన్ 228 (అవమానించేందుకు ప్రయత్నించడం, న్యాయ ప్రక్రియకు అంతరాయం కలిగించడం), సెక్షన్ 188, 180, 120బి (కోర్టు ధిక్కారం) ల కింద కేసు నమోదు చేయించారు. ఆ ముగ్గురు మహిళల మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బిహార్‌లో జరిగిన ఈ సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలిని, ఆమె తనకు సహాయంగా తెచ్చుకున్న ఇద్దరి మహిⶠలను జైలుకు పంపడంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మంచి పరిణామమే. ఇప్పటికే ప్రసిద్ధ సీనియర్ అడ్వొకేట్‌లు ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్, ఇంకా మరికొందరు.. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ విషయమై లేఖ రాశారు. అత్యాచార బాధితురాలికి ఉండే మానసిక క్షోభ రీత్యా ఈ కేసులో సున్నితంగా వ్యవహరించేలా చూడమని వారు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. అరెస్టయిన జన జాగరణ శక్తి సంఘటన సభ్యులు కూడా తమ స్టేట్‌మెంట్‌లో ఇదే చెప్పారు.
‘‘ఆమె భయాన్ని కోర్టు వారు ధిక్కారంగా అపార్థం చేసుకున్నారు’’ అని. కోర్టులు సున్నితంగా ఆలోచిస్తాయి. ‘రేప్’ అనేది మరింత సున్నితంగా ఆలోచించవలసిన కేసు. అయితే దురదృష్టవశాత్తూ కర్ణాటక కేసులో జడ్జికి బాధితురాలు ‘అన్‌బికమింగ్’గా అనిపించింది. బిహార్ కేసులో జడ్జికి బాధితురాలి భయం ‘మిస్ బిహేవియర్’గా కనిపించింది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేవి నేరమూ–శిక్షలో ఎప్పుడూ ముఖ్యమైన విచారణాంశాలే. అయితే అత్యాచార బాధితురాలికి జరగాల్సిన న్యాయానికి ఇవేవీ అడ్డొచ్చే అంశాలు కాకుండా ఉంటేనే.. ‘దేవుడున్నాడు..’ అన్నంత ధైర్యంగా.. ‘న్యాయస్థానం ఉంది’ అన్నంత ధీమా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment