అన్ని ధర్మాలకూ యువ శక్తే ఆధారం | Special Story About Swatmanandendra Saraswati In Family | Sakshi
Sakshi News home page

అన్ని ధర్మాలకూ యువ శక్తే ఆధారం

Published Mon, Jun 22 2020 12:38 AM | Last Updated on Mon, Jun 22 2020 12:38 AM

Special Story About Swatmanandendra Saraswati In Family - Sakshi

తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాల్లో ఒకటైన విశాఖ శ్రీ శారదాపీఠానికి సరిగ్గా ఏడాది క్రితం ఉత్తరాధికారి బాధ్యతలను చేపట్టారు స్వాత్మానందేంద్ర సరస్వతి. గడిచిన సంవత్సర కాలంలో ఆయన నేర్చుకున్నదేమిటి? ఇకపై నేర్చుకోవాలనుకున్నదేమిటి? హిందూ ధర్మ ప్రచార యాత్ర ద్వారా గ్రహించినదేమిటి? సన్యాసాశ్రమ జీవితం గురించి ఏమంటారు? స్వామీజీని అడిగి తెలుసుకుందాం.

► చిన్నప్పటి నుంచి పీఠంలోనే పెరిగారు. ఇపుడదే పీఠానికి ఉత్తర పీఠాధిపతి అయ్యారు. అప్పటికి, ఇప్పటికి వ్యత్యాసం ఏమైనా ఉందా?
ఎటువంటి వ్యత్యాసం లేదు. నా బాల్యమంతా పీఠంలోనే గడిచింది. ధార్మిక విషయాలు తప్ప భౌతిక ప్రపంచం నాకు తెలియదు. గురువులు స్వరూపానందేంద్ర స్వామి ప్రవచనాలు వింటూ పెరిగా. ఇక ఉత్తరాధికారి పదవి గురించి అంటారా! అది ప్రత్యేకమైన అధికారమేమీ కాదు. అదొక బాధ్యతాయుతమైన పాత్ర. ఎప్పటిలాగే పీఠం కోసం మరికొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. పీఠానికి దేశ నలుమూలలా ఉన్న భక్తులను సమన్వయపరచడంలో తలమునకలయ్యా.

► పిన్న వయసులోనే ఉత్తర పీఠాధిపతి బాధ్యతలు చేపట్టారు కదా! నిష్ణాతులైన ఆధ్యాత్మిక వేత్తలు తారసపడినపుడు ఏమనిపిస్తుంది?
 సన్యాసాశ్రమం వయసుకు సంబంధించింది కాదు. అలాంటివారు ఎదురుపడినపుడు వారి నుంచి జ్ఞానాన్ని ఎలా సముపార్జించాలన్న ఆలోచన తప్ప ఇతర విషయాలు జ్ఞప్తికే రావు.

► బ్రహ్మచర్యాన్ని వీడి సన్యాసాశ్రమంలోకి వచ్చారు. అప్పటికి, ఇప్పటికీ గల వ్యత్యాసం గురించి చెప్పండి?
 మంచిప్రశ్న. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, యవ్వనం, వృద్ధాప్యం... ఈ ప్రస్థానాలన్నీ భౌతిక జీవనవిధానంలో ఉండే వారికి సంబంధించినవి. ధార్మిక జీవితాన్ని గడపాలనిఎపుడైతే మనసా వాచా కర్మణా నిర్ణయించుకుంటామో, అపుడే మా శబ్ద ధాతువులన్నీ ధార్మిక జీవనం వైపు ఏకీకృతం అవుతాయి. మా వర్తన, మా ఉనికి, మా నడక ధార్మిక అంశాలపైనే ఉంటుంది. మామూలు మానవ స్వభావానికి ఏ మాత్రం దగ్గరగా ఉండవు.

► శ్రీ శారదాపీఠానికి ఉత్తరాధికారి హోదాలో ఏడాది కాలంగా మీరు ఏం నేర్చుకున్నారు?
 నా గురువులు స్వరూపానందేంద్ర స్వామి సాక్షాత్తూ సరస్వతీ దేవి ప్రతిరూపం. వారికి దగ్గరగా మెలగడం నా అదృష్టం. ఆర్ష సంస్కృతి, గ్రంథ పఠనం, ధర్మశాస్త్రంపై మరింత గా అవగాహన పెంచుకునే సదవకాశం ఇపుడు నాకు దక్కింది. పురాణేతిహాసాలను ఆకళింపు చేసుకుని, వాటి సారం గ్రహించటానికి ఇప్పుడు సానుకూలత వచ్చింది. జనబాహుళ్యంలో పర్యటించడం ద్వారా వర్తమాన కాలానికి తగ్గట్టు నవీకరించుకుంటున్నాను. వేద సమ్మతమైన తులనాత్మక అధ్యయనం చేసే అవకాశం ఇపుడు చిక్కింది.

► ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?
 వేదసారమంటేనే అన్వేషణ. సత్యాన్వేషణ ద్వారా ధర్మసమ్మతమైన విషయాలను మరింతగా గ్రహించాలనుకుంటున్నా.

► మీ భవిష్యత్‌ కార్యాచరణ..? 
 ఆధునిక మానవ జీవితం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సనాతన ధర్మం నిత్యనూతనమై వెలగడానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. భారతీయధర్మానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. భేదభావాలను తొలగించి, అసమానతలను రూపుమాపి, అంతా ఒక్కటేనన్న భావన పెంచడం నా విధ్యుక్త ధర్మం. ఆమేరకు గురువుల ఆదేశాలను శిరసావహిస్తూ ముందుకు సాగుతా.

► పీఠం కార్యకలాపాల విస్తృతికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి?
ప్రస్తుతం అంతటా చదువు ఉంది. కానీ, అందులో సారం లేదు. ధార్మిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి విశాఖ శ్రీ శారదాపీఠం ఇప్పటికే కృషి చేస్తోంది. సాంప్రదాయాలను నిలబెట్టేందుకు గురుకులాలను ఏర్పాటు చేయదలిచాం. గుంటూరు, విశాఖల్లో పీఠానికున్న వేదశాఖల ద్వారా ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ధార్మికజీవనం వైపు మళ్లించేలా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది.

► మీరు చేపట్టిన హిందూధర్మ ప్రచారయాత్ర తెలుగురాష్ట్రాల్లో దాదాపు పూర్తి కావచ్చింది కదా! ఈ యాత్రలో మీరేం గ్రహించారు?
⇒ హిందూధర్మం పట్ల ప్రజలు సుముఖంగానే ఉన్నారు. సర్వత్రా సానుకూల దృక్ప«థమే కనిపించింది. కరోనా కారణంగా సమాజమంతా అతలాకుతలమై పోతుంటే సాటి మనిషికి సాయపడాలన్న దృక్పథం అందరిలోనూ అగుపించింది.

► యువతకు మీరిచ్చే సందేశం?
⇒ సామాజిక మాధ్యమాలను విజ్ఞానాన్ని పెంపొందించడానికి వినియోగించండి. పెడదోవ పట్టకండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని మించిన పరమానందం మరొకటి లేదని గుర్తించండి. సనాతన ధర్మంలోని కీలక అంశాలను గ్రహించండి. గుళ్లు–గోపురాలు తిరుగుతూ హిందూ సాంప్రదాయాలను తెలుసుకోండి. వాటిని ఆచరణలో పెట్టండి. సంకల్పం బలంగా ఉంటే సాధించలేనిదేమీ ఉండదు. యువత తలచుకుంటే ఖచ్చితంగా హిందూధర్మం గొప్పగా పరిఢవిల్లుతుంది. దేశానికే కాదు, అన్ని ధర్మాలకూ యువతే వెన్నెముక. – డి.వి.ఆర్‌.

గురువులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారితో స్వాత్మానందేంద్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement