మనం నిద్రపోయేటప్పుడు ఇవాళ ఏ మంచి మాట ఎవరికి వినిపించాం అని ఆలోచిస్తే ఎంత మంచి ఆవరణంలో మనం ఉంటున్నామో అర్థమవుతుంది.
‘వినదగు నెవ్వరు సెప్పిన’ అన్నాడు సుమతీ శతకకారుడు. ఇప్పుడు అందరూ చేస్తున్నది అదే. ఎవరు ఏం చెప్పినా వింటున్నారు. అయితే తర్వాతి లైను ఒకటి ఉంది. ‘వినినంతనే వేగపడక వివరింపతగున్’... విన్న వెంటనే వేగంగా ఒక అభిప్రాయానికి రావొద్దని, విన్న దానిలో మంచి ఏదో చెడు ఏదో తేల్చుకుని, విశ్లేషించుకుని, అజా పజా చూసుకొని, సరైన దారిలో వెళ్లేవాడే నీతిపరుడు అని ఈ పద్యం చెబుతుంది. సరైన మాట పలకడం ఎంత ముఖ్యమో సరైన మాట వినడం, చెవికెక్కించుకోవడం అంతే ముఖ్యం. ఏ నీటి కోసం ముంత పట్టుకుంటే ఆ నీరే దొరుకుతాయన్నట్టు చెప్పుడు మాటలకు చెవిని విడిచి పెడితే ఆ మాటలే చెవి దాకా వస్తాయి. రామాయణంలో మందర మాటలను కైక చెవికెక్కించుకుంది. దాని వల్ల ఒక నష్టం. లంకలో రావణుడు విభీషణుడి మాటలు చెవినెక్కించుకోలేదు. అదొక నష్టం. చెవికి చేరిన మాటను పుటం పెట్టి తీసుకోవడంలోనే మన విజ్ఞత, లౌక్యం, బతుకు సజావుతనం ఉంటాయి.
అంతఃపుర కాంతలు ఇందరు ఉండగా సైరంధ్రీ పై మక్కువ ఏలరా అని కీచకుణ్ణి అతడి సోదరి హెచ్చరిస్తుంది. వినలేదు. ఐదు ఊళ్లు వదిలి పెట్టు... గొడవ ఆగుతుంది అని కృష్ణుడు మాటవరస ప్రతిపాదన చేస్తే దుర్యోధనుడు చెవికేసుకోలేదు. చెవి శుభ్రంగా ఉండి ఉంటే కీచకుడు బతికేవాడు. దుర్యోధనుడు ఆ ప్రతిపాదన కాకపోతే మరో ప్రతిపాదన చేసి నష్టనివారణ చేసుకుని ఉండేవాడు. యుద్ధంలో, దొమ్మీలో, అల్లర్లలో రణగొణ ధ్వనులు అధికం. సత్యం పలుచనైపోతుంది. దాని డెసిబల్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ‘అశ్వత్థామ హతః’ అని వినపడ్డాక ఆ తర్వాత లో గొంతుకతో పలికిన ‘కుంజరః’ను కూడా ద్రోణుడు సరిగా విని ఉంటే చనిపోయింది తన కొడుకు అశ్వత్థామ కాదని, ఆ పేరుతో ఉన్న ఏనుగు అని తెలుసుకొని ప్రాణాలు కాపాడుకుని ఉండేవాడు.
జనుల చెవి ఎప్పుడూ మాయలో పడుతూనే ఉంటుంది. చెడు శబ్దాల ఊబిలోకి దిగుతూనే ఉంటుంది. వారికి మంచి చెప్పడానికి మహాత్ములు, ప్రవక్తలు దిగి రావడాన్నే పనిగా పెట్టుకున్నారు. కొందరు గుడి గోపురం ఎక్కి మరీ చెప్పారు. కొందరు ఊరు వాడలు తిరిగి చెప్పారు. చెడు చెవి ఉన్నవారంతా ఈ మంచి వినిపించడానికి వచ్చిన వారిని పరీక్షలు పెట్టారు. రాళ్లతో కొట్టారు. కడకు కొందరి ప్రాణాలే తీశారు. కాని వారు ఒక్కసారి పలికిన మంచి శతాబ్దాలు గడిచిపోయినా వినబడుతూనే ఉంటుంది. మంచిని వినిపించాలి అనే సంకల్పానికి ఉన్న శక్తి అది. మనం నిద్రపోయేటప్పుడు ఇవాళ ఏ మంచి మాట ఎవరికి వినిపించాం అని ఆలోచిస్తే ఎంత మంచి ఆవరణంలో మనం ఉంటున్నామో అర్థమవుతుంది.
శారీరక బధిరత్వానికి వైద్యం ఉంది. మానసిక బధిరత్వానికి లేదు. ప్రేమను వినకుండా పగను వినేవారు, స్నేహాన్ని వినకుండా ద్వేషాన్ని వినేవారు, శాంతిని వినకుండా యుద్ధాన్ని వినేవారు, ఐకమత్యాన్ని వినకుండా విభజన తత్వాన్ని వినేవారు, మానవత్వాన్ని వినకుండా మతాన్ని వినేవారు, క్షమను వినకుండా శిక్షను వినేవారు నిజమైన, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నామని చెప్పలేము. చేతులు, కాళ్లు మెదడుకు దూరంగా ఉంటాయి. గుండె కూడా మెదడుకు దూరమే ఉంటుంది. చెవే చాలా దగ్గర. ఇది నింపుకునే జాలి, కరుణ, ఆర్ద్రత మెదడులోకి త్వరగా చేరి మనల్ని దయామూర్తులను చేస్తాయి.
వినలేకపోయే వారి మీద జోకులు వేయడానికి మించిన కుసంస్కారం లేదు. ‘చెవిటి మాలోకం’, ‘సౌండ్ ఇంజనీర్’... ఈ పేర్లు పెట్టడం నవ్వు వచ్చే విషయం ఏ మాత్రం కాదు. నిజానికి వారు అదృష్టవంతులు. ‘వాడెంత వీడెంత’, ‘వాడి సంగతి చూస్తా’, ‘ఫలానా వాళ్లని చంపేయాలి’, ‘ఆమెను ఏం చేస్తానో చూడు’, ‘వాడు తక్కువ నేను ఎక్కువ’, ‘పో.. వెళ్లి చంపు’ లాంటి మాటలు వాళ్ల చెవికి వినిపించవు. ఆ మేరకు వాళ్లు చెడుకు దూరంగా ఉన్నారు. ఈ మాటలను సంపూర్ణంగా వినగలిగే గ్రహణశక్తి ఉన్నా అవి వినక్కర్లేని వివేచనతో ఉండటమే ఇప్పుడు కావలసింది.
చెవికి మంచి ఆహారం ఇవ్వడం అవసరమని గ్రహించండి. ఒక పాట వినిపించండి. సితార్ కచ్చేరిలో మునకలేసేలా చేయండి. ఒక భక్తి గీతానికి పరవశం కానివ్వండి. ఒక ప్రార్థనలో నిమగ్నం అవనివ్వండి. ఒక ఆత్మీయుని పలకరింపుతో తబ్బిబ్బు కానివ్వండి. ఒక మంచి పని చేశాక ఎదుటివారు ‘కృతజ్ఞతలు’ అని చెబుతుంటే ఆ మాటను మూడు పూటలా మాత్రలా మింగించండి. చెవి ఆరోగ్యం అంటే సమాజ ఆరోగ్యం. దేశ ఆరోగ్యం. చెడు శబ్దాల స్వచ్ఛభారత్ చేసి మంచి మాటల సమోన్నత భారత్‌గా మలచడమే ఇప్పుడు మన విధి.
Comments
Please login to add a commentAdd a comment