నవ్వండి బాస్‌.. మహా అయితే తిరిగి నవ్వుతారు  | National Smile Power Day Special Story | Sakshi
Sakshi News home page

నవ్వండి బాస్‌.. మహా అయితే తిరిగి నవ్వుతారు 

Published Mon, Jun 15 2020 8:37 AM | Last Updated on Mon, Jun 15 2020 8:37 AM

National Smile Power Day Special Story - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశ్వ శ్రేయః హాస్యః అని ఓ సంస్కృత వాక్యం ఉంది. అంటే.. ప్రపంచ శ్రేయస్సు కోరేది ఏదైనా ఉందంటే అది కేవలం నవ్వు మాత్రమే. ఒకరినొకరు ద్వేషించుకునే బదులు నవ్వుతూ పలకరించుకుంటే అసలు యుద్ధాలే రావంటారు అరిస్టాటిల్‌. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా.. మీరు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా..? అంతలా ఆలోచిస్తున్నారేంటి.?  అలా బిక్కమొహమేసుకొని చిరాగ్గా ఉండకుండా కాస్తా నవ్వండి. నవ్వుతూ ఈ కథనం చదివేయండి.. 

నవ్వులనేవి మంచి మనసుకు చిరునామాలు. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే వారి నవ్వును కొలమానంగా తీసుకోవచ్చంటారు వైద్య నిపుణులు. ఉదయాన్నే లేచినవెంటనే.. అద్దం చూస్తూ.. చిరునవ్వు నవి్వతే చాలు. ఆరోజంతా ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. మనసును విశ్రాంతపరుస్తూ.. కొత్తలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఒత్తిడి, కోపం, నొప్పులకు దివ్యౌషధంలాంటిదని వైద్యులు ధ్రువీకరించారు. నవి్వనప్పుడు విడుదలయ్యే హార్మోనులు మీలో చిరాకును దూరం చేస్తాయి. దీని వల్ల వునం ఆరోగ్యంగా జీవించగలం. జీవితంలో మిమ్మల్ని స్థిరంగా ఉండేటట్లుగా సహాయపడుతూ.. పాజిటివ్‌ ఆలోచనలతో జీవించేలా ప్రోత్సహిస్తుంది. మీ బాధల్ని తగ్గించి ఎంకరేజ్‌ చేస్తూ..  

గాజువాకకు చెందిన శ్రీకర్‌.. కోట్ల రూపాయలు సంపాదించినా ఎప్పుడూ జీవితంలో ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తుంటాడు. ఇంట్లో వాళ్ల సలహా మేరకు డాక్టర్‌ దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకున్నాడు. బీపీ, సుగర్‌ ఇలా వ్యాధుల చిట్టా చెప్పుకొచ్చాడు. మొత్తం విన్న డాక్టర్‌ శ్రీకర్‌ని కాసేపు తీక్షణంగా చూసి మందులు రాసిచ్చారు. హాస్పిటల్‌ బయటకు వచ్చి మందులు కొందామని చీటీ చూడగా... అందులో.. రోజూ మూడు పూటలు మనసారా నవ్వుతూ ఉండండి అని రాసి ఉంది. అప్పటి నుంచి అది ఫాలో అయిపోయాడు శ్రీకర్‌. సరిగ్గా నెల తర్వాత చూస్తే బీపీ, సుగర్‌ కంట్రోల్‌లోకి వచ్చాయి. ముఖారవిందం మారిపోయింది.

ఇప్పుడు శ్రీకర్‌ హాయిగా ఉన్నాడు. ఎందుకంటే.... నవ్వు.. మనిషి అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. నవ్వు.. వ్యక్తి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. నవ్వు.. ఒత్తిడిని జయిస్తుంది. నవ్వు.. ఆహ్లాదాన్ని పంచుతుంది.  నవ్వు.. శరీరానికి కావాల్సిన శక్తినందిస్తుంది. ఇంతటి మహత్తర శక్తి ఒక్క చిరునవ్వుకే సాధ్యం. సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉందో లేదో తెలీదు కానీ.. నవ్వుకు మాత్రం వ్యా«ధులు నయమవుతాయన్న నిజం శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాంటి నవ్వుకు ఉన్న శక్తిని తెలిపే రోజే స్మైల్‌ పవర్‌ డే. 

నవ్వడం ఒక భోగం... 
నవ్వు భౌతిక, మానసిక, భావోద్వేగ, సమతుల్యతకు సహాయకారి. నవ్వు వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. దీనివల్ల శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కేలరీలు కరిగించి ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడుతుంది. మరికొన్ని పరిశోధనలు డయాబెటిక్‌ పేషెంట్స్‌లో సుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేసే శక్తి నవ్వుకు ఉంటుందని నిరూపించాయి. 

స్మైల్‌ సైకాలజీ ప్రకారం
స్మైల్‌ సైకాలజీ ప్రకారం చూస్తే.. రోజువారీ మనలోని శక్తిని మార్చే గుణం నవ్వులో ఉంటుంది. రోజూ ఉదయాన్నే గంటసేపు నవి్వతే.. ఆ రోజంతా మనకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. కొత్త స్నేహాల్ని పరిచయం చేస్తుంది. మనలో ని శక్తి సామర్థ్యాల్ని మరింత ఇనుమడింపజేస్తుంది. సక్సెస్‌కు చిరునామాగా నవ్వు ని లుస్తుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. చాక్లెట్‌కు మె దడు పనితీరుని చురుకుదనంగా మార్చే శక్తి ఉంటుంది. అలాంటి చాక్లెట్‌ బార్లు 2,000 తింటే.. మెదడు ఎంతటి చు రుకుదనంగా మారుతుందో.. ఒక్క నవ్వు అంతటి చురుకుదనాన్ని ఇస్తుందని బ్రిటిష్‌ పరిశోధకుల పరిశోధనల్లో తేలింది. 

శరీర శోభను పెంచే శక్తి నవ్వుకే..
నవ్వు మానవ జీవితానికి పలువిధాల శోభనిస్తుంది. చిరునవ్వుతో ముఖంలోని దాదాపు 150 కండరాలు కదిలించగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
అనేక రుగ్మతల్ని రూపుమాపగలిగే శక్తి నవ్వుకి ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొన్ని రకాల వ్యాధుల్ని నవ్వుతోనే నయం చేసుకోవచ్చు. అనవసరంగా మందులు వాడాల్సిన పని లేకుండా వ్యాధులు తగ్గే అవకాశాలు నవ్వుతోనే సాధ్యం. 
మానసిక ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గిస్తుంది.  
మనం నవి్వనప్పుడు అంటువ్యాధుల్ని నిర్మూలించే కణాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి. ఏబీ ఇమ్యునోగ్లోబిన్స్‌ని కూడా నవ్వు వృద్ధి చేస్తుంది. ఈ ఇమ్యునోగ్లోబిన్స్‌ వృద్ధి చెందితే.. శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసి శ్వాసకోశాన్ని కాపాడుతుంది. 
సహజంగా నొప్పి తగ్గించే ఎండారి్పన్‌ను నవ్వు పెంచుతుంది. ఆర్థరైటిస్, స్పాండిలైటిస్‌ కండరాలకు సంబంధించిన నొప్పులు, మైగ్రేన్‌ ఉద్రిక్తతకు సంబంధించిన తలనొప్పుల్ని తగ్గించేందుకు ఈ ఎండార్ఫిన్‌ ఎంతగానో దోహదపడుతుంది. 
ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. బ్రాంకైటిస్, ఉబ్బసం ఉన్నవారికి నవ్వు వైద్యుడిగా సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి రక్తంలో ప్రాణవాయువు స్థానాన్ని పెంచుతుంది. 
మానసిక ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 
పది నిమిషాల పాటు నవి్వన తర్వాత చెక్‌ చేస్తే.. బీపీ పేషెంట్‌లో రక్తపోటు తగ్గుముఖం పట్టినట్టు పరిశోధనలు తెలిపాయి. 
మనసారా రోజూ నవ్వుకోండి. మీ ముఖంలో ఎలాంటి వృద్ధాప్య ఛాయలు కనిపించవు. మన ముఖ కండరాల్ని టోన్‌ చెయ్యడంతో పాటు ముఖ కవళికల్ని మెరుగుపరచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. మీరెప్పుడైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వినప్పుడు మన ముఖం ఎర్రబడటాన్ని గమనించారు. దీనికి కారణం రక్త సరఫరా వేగవంతం కావడమే. ఇలా రక్త ప్రసరణ వేగవంతమైతే.. ముఖ చర్మానికి పోషణ లభించి మెరుపు సంతరించుకుంటుంది. ఈ సీక్రెట్‌ను తెలుసుకునే.. చాలా మంది నవ్వుతూ ఉంటారు.  
ఇంత పవర్‌ నవ్వులో ఉన్నప్పుడు ఈ వార్తని కూడా సీరియస్‌గా చదువుతారెందుకు.. ఇప్పటి నుంచే నవ్వుతూ.. నవ్విస్తూ.. హాయిగా ఆరోగ్యంగా జీవించండి. 

ఒత్తిడి దూరం..
గంటల తరబడి చదువుతున్నప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతుంటాను. ఆ సమయంలో ఒక్క అరగంట సేపు కామెడీ షోలు చూస్తుంటా. అంతే ఒత్తిడి మొత్తం మాయమైపోయి రిలాక్స్‌గా మారిపోతుంటా. ఇంట్లో అంతా ఇదే ఫాలో అవుతున్నాం. 
– శైలజ, పీజీ విద్యార్థిని 

కామెడీ షోలకు ప్రాధాన్యం...
నవ్వు ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడో చదివాను. అప్పటి నుంచి కామెడీషోలు, సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాను. క్లాసులు విన్నాక.. కాసేపు ఫ్రెండ్స్‌ అంతా కూర్చొని ఎవరికి తెలిసిన జోకుల్ని చెప్పుకుంటూ నవ్వుకుంటాం.
– బండారు స్వరాజ్యం, బీటెక్‌ విద్యార్థిని 

నవ్వే ఆయుధం...
ఎదుటి వారు ఏ విషయంలోనైనా కోపంగా మాట్లాడితే.. వారికి నేను చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంటాను. దీంతో.. వారు కూల్‌ అయిపోతారు. నాపై కోపాన్ని మరిచిపోయి ఫ్రెండ్స్‌ అయిపోతారు. నా స్మైల్‌ నా పవర్‌ అని చాలా మంది చెబుతుంటారు. 
– తమ్మినేని దర్శిని,డిగ్రీ విద్యార్థిని

లాఫర్‌ థెరపీ మంచిదే... 
మా దగ్గరికి చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతూ వస్తుంటారు. వాళ్లందరికీ ఫిజియోథెరపీ చేశాక ఇంటికి వెళ్లి అరగంట పాటు నవ్వమని సలహా ఇస్తుంటాను.లాఫర్‌ థెరపీతో ఎలాంటి నొప్పులనైనా మాయం చెయ్యొచ్చు.
– ఎస్‌.స్వాతి, ఫిజియోథెరపిస్ట్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement