నో కామెంట్‌ ప్లీజ్‌! | special story to crime story | Sakshi
Sakshi News home page

నో కామెంట్‌ ప్లీజ్‌!

Published Tue, Apr 3 2018 12:27 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

special story to crime story - Sakshi

దురుసుగా పరుగెడితే  కాలు మడత పడొచ్చు మన కాలేగా. రిపేర్‌ చేసుకోవచ్చు. కానీ, అదే దురుసుతో  నాలుక పరిగెడితే  మడత పడదుగానీ మడతలు పెట్టొచ్చు బీ కేర్‌ ఫుల్‌.. నో కామెంట్‌ ప్లీజ్‌! 

కాల్‌డేటాయే కాదు సెల్‌టవర్‌ టెక్నాలజీ కూడా నేరస్తుడిని పట్టిస్తుంది అని నిరూపించారు కాజిపేట పోలీసులు ఏసీపీ జనార్ధన్‌ అండ్‌ టీం (మడికొండ ఇన్స్‌పెక్టర్‌ సంతోష్, సిబ్బంది జి. దేవేందర్, బి. సాంబయ్య, కె.కిషన్, రవి, శ్రీకాంత్‌). నేరస్తుడికి శిక్ష పడేలా వృత్తిధర్మం నిర్వహించారు.

మాట హత్యకు దారి తీయవచ్చు.మాట హంతకుణ్ణి పట్టి ఇవ్వవచ్చు కూడా.మిట్టమధ్యాహ్నం.కాజీపేట స్టేషన్‌.ఏసీపీ ఎదురుగా ఓ కేసు తాలూకు ఫైల్‌ ఉంది. ఆ ఫైల్‌ను చూస్తే అతనికి కోపం. చికాకు. అసహనం. ఏడాది నుంచి అది అతని టేబుల్‌ మీద పడి ఉంది. కేసు తేలదు. ఫైల్‌ క్లోజ్‌ కాదు. క్లోజ్‌ కాని ఏ ఫైల్‌ అయినా పోలీసు గుండెల మీద ఫిరంగే.ఇన్‌స్పెక్టర్‌ వచ్చి రొటీన్‌గా సెల్యూట్‌ చేశాడు. ఏసీపీ ఆ ఫైల్‌ వైపు చూపుడు వేలు ఆడించి అన్నాడు–‘ఏంటయ్యా ఇది. ఒక్క క్లూ కూడా దొరకుండా అంత పకడ్బందీగా మర్డర్‌ ఎలా చేశారు? ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చోట దొరికి తీరాల్సిందే కదా. అసలు నేరస్తుడు ఎవరో ఇంతవరకూ పట్టుకోకపోతే ఇక మనమెందుకు. ఏం... రిజైన్‌ చేసి వెళ్లిపోదామా’...ఇన్‌స్పెక్టర్‌ ఏమీ అనకుండా స్టడీగా నిలుచున్నాడు.ఏసీపీ కే సు తాలూకు ఫైల్‌ మీద చేత్తో గట్టిగా తడుతూ మళ్లీ ఓపెన్‌ చేశాడు. 

కేస్‌ ఫైల్‌ తేదీ: 2016 సెప్టెంబరు 14. 
మృతుడు: పులిగిల్ల చందు. వయసు: 19
జరిగింది: హత్య. 
చేసినవారు: ఆధారాలు లభించలేదు.  మూసేశాడు. ‘ఛాన్సే లేదు. ఏదో ఒక క్లూ దొరకాల్సిందే. ఏంటా క్లూ. సాక్ష్యాధారాలతో  నేరస్తుడిని పట్టుకుతీరాలి. ఎలా?’ తనలో తనే అనుకుంటూ గట్టిగా పైకే విసుక్కున్నాడు. 
 

2016 సెప్టెంబర్‌ 13.గణేష్‌ నిమజ్జనంలో పోలీసులకు ఊపిరి సలపనంత పనిగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బృందమంతా వేయికళ్లతో పహారా కాస్తోంది. తెల్లవార్లూ నిమజ్జన హడావిడితో కంటి మీద కునుకు కూడా లేదు.మరుసటి రోజు. నిమజ్జనం సజావుగా సాగినందుకు పోలీసులు అప్పుడప్పుడే ఊపిరి తీసుకుంటున్నారు. ఇంతలో ఫోన్‌ మోగింది.ఎత్తి ‘హలో’ అన్నాడు కానిస్టేబుల్‌.అటువైపు ఎవరో అపరిచితుడు.‘భట్టుపల్లి కోటచెరువు దగ్గర ముళ్లపొదల్లో ఎవరిదో బాడీ పడి ఉందండీ. చూస్తే కుర్రాడిలా ఉన్నాడు’పోలీసులు వెంటనే అలెర్ట్‌ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకునే సరికి చాలామంది పోగై ఉన్నారు. పంతొమ్మిది ఇరవై ఏళ్ల కుర్రాడి శవం పడి ఉంది. శవం పడి ఉన్న తీరు చూస్తే ఏదో ఆయుధంతో హత్య చేసినట్టు అర్థమవుతోంది.కాసేపటికి ఆ కుర్రాణ్ణి జనంలో ఎవరో గుర్తించారు.‘వీడు చందులా ఉన్నాడే’వెంటనే చందు తల్లిదండ్రులకు సమాచారం అందింది. చెట్టంత కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి వాళ్ల దుఃఖానికి అంతులేదు. ‘మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరిపైన అయినా అనుమానం ఉందా’ పోలీసులు అడిగిన ప్రశ్నకు తల్లి ‘అయ్యా! నా బిడ్డ ఎవరితోనూ గొడవకు పోయే రకం కాదు’ ఏడుస్తూనే చెప్పింది. తల్లీదండ్రి నుంచి వివరాలు తీసుకొని, శవాన్ని పోస్టుమార్టానికి పంపించారు. 

చందు ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఆ రోజు అతనితో ఫోన్‌లో మాట్లాడిన వారి వివరాలను సేకరించారు. దర్గా కాజీపేట సెల్‌ఫోన్‌ టవర్ల పరిధిలోని అన్ని ఇన్‌కమింగ్, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ను సేకరించి, విశ్లేషించారు. అనుమానితులుగా అనిపించిన 12 మందిని విచారించారు. వారికి ఏ సంబంధం లేదని తేలింది. చందు నివసించే దర్గా కాజీపేటలో ఇరుగుపొరుగు వారినీ ప్రశ్నించారు. ‘ఆ పిల్లాడు చీమకు కూడా హాని తలపెట్టే రకం కాదు’ అని జవాబు వచ్చింది. కేసు ఇంకా క్లిష్టంగా మారింది.ఫైల్‌ చూస్తున్న ఏసీపీ కళ్లు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. మృతుడి స్నేహితులను, ఇరుగుపొరుగును విచారించినా ఏమీ తెలియలేదు. కాల్‌డేటా ద్వారా కూడా ఎటువంటి క్లూ లభించలేదు.. ఇంకేమిటి దారి అనుకుంటూ ఉంటే ‘టవర్‌ లొకేషన్‌ టెక్నాలజీ’ గుర్తుకొచ్చింది.ఇన్‌స్పెక్టర్‌ని పిలిచాడు.హతుడు పడి ఉన్న చోట ఆ సమయంలో అక్కడి టెలిఫోన్‌ టవర్‌ పరిధిలో యాక్టివ్‌గా ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలను టవర్‌ లోకేషన్‌ టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ యాంగిల్‌లో ట్రై చేద్దాం’ అన్నాడు.ఇన్‌స్పెక్టర్‌ తల ఊపాడు.పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం హత్య జరిగినట్లుగా భావిస్తున్న సమయం రాత్రి 11 గంటలు. శవాన్ని చెరువు దగ్గర పడేశారంటే మరో అరగంట పట్టే ఉంటుంది. ఆ సమయంలో అక్కడున్న సెల్‌ టవర్‌ లోకేషన్‌ మ్యాప్‌ను టెలికాం ఆపరేటర్ల నుంచి తెప్పించారు. ఆ సమయంలో సెల్‌టవర్‌ పరిధిలో యాక్టివ్‌గా ఉన్న వేలాది నెంబర్లను తరచి తరచి చూశారు. అన్నింటిని వడపోయగా హత్య జరిగిన సమయంలో, సంఘటనా స్థలానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి ఫోన్‌ సిగ్నల్‌ యాక్టివ్‌గా ఉన్నట్టు తేలింది.అతని పేరు గుగులోతు శివ.శివను విచారించారు పోలీసులు. అతను చెప్పినది విన్నాక చందూకి, గుగులోతు శివకు ఎటువంటి çశతృత్వమూ లేదని తెలిసింది. కానీ, పోలీసులకు అనుమానం పోలేదు.శివ చెప్పిన వివరాలతో వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు.గుగులోతు శివ మరో యువకునితో హోండా అక్సెంట్‌ కారులో పదే పదే తిరగడం కనిపించింది.ఎవరా అని ఆరా తీస్తే అతని పేరు రాంకీ అని తేలింది. కాల్స్‌ అన్నీ వీళ్లిద్దరి మధ్య నడిచాయి.ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు పోలీసులు. ‘ఎందుకు చంపారు’ అడిగారు పోలీసులు.రాంకీ వైపు చూశాడు శివ.‘ఏమిటి కారణం?’ రాంకీని అడిగారు.‘నా గర్ల్‌ఫ్రెండ్‌ను కామెంట్‌ చేశాడు’ అన్నాడు రాంకీ.ఒక కామెంట్‌ హత్య దాకా వచ్చింది.

వర్థన్నపేటకు చెందిన రెడ్డిమల్ల రాంకీ దర్గా కాజీపేట లో ఉండే తన బావ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అక్కడే ఒకమ్మాయితో ప్రేమలోపడ్డాడు. 2016 సెప్టెంబరు 13న వినాయక నిమజ్జనంలో రాంకీ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డాన్స్‌ చేశాడు. ఆ టైంలో చందు అక్కడే ఉన్నాడు.చూసి ఊరుకుని ఉంటే బాగుండేది.అమ్మాయిని కామెంట్‌ చేశాడు.‘ఏంట్రా కూశావ్‌’ అని రాంకీ చందూ కాలర్‌ పట్టుకున్నాడు. ఏదో మామూలు నిమజ్జనం గొడవ అనుకున్న  చుట్టుపక్కలవాళ్లు వాళ్లను విడిపించారు. కాని రాంకీ తన కోపాన్ని వీడలేదు. తన లవర్‌ని కామెంట్‌ చేసినవాడిని హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దర్గా కాజిపేటలో ఉండే ఫ్రెండ్‌ గుగులోతు శివ ద్వారా చందును పిలిపించాడు. ‘‘గొడవలొద్దు, అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్‌లా కలిసిపోదాం. పార్టీ చేసుకుందాం’’ అన్నాడు. చందు సరే అనడంతో ముగ్గురూ కలిసి వర్థన్నపేట వరకు వెళ్లారు. అక్కడ తన ఇంట్లో పదునైన ఇనుప చువ్వను చందు చూడకుండా కారులో పెట్టాడు రాంకీ. కారులోనే ముగ్గురూ మద్యం సేవించారు. చందును రెచ్చగొట్టి బాగా తాగించారు శివ, రాంకీలు. చందు మత్తులోకి వెళ్లాడు. వెంటనే ఇనుప చువ్వతో చందు మెడ, గొంతు భాగంలో   విచక్షణారహితంగా రాంకీ దాడి చేశాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత కారులోనే రోడ్లన్నీ తిరిగి తిరిగి చివరకు భట్టుపల్లి కోటచెరువు ముళ్ల పొదల్లో మృత దేహాన్ని పడేసి వెళ్లిపోయారు. హత్య చేయడానికి ఉపయోగించిన ఇనుపచువ్వను స్వాధీనం చేసుకొని, 2017 అక్టోబరు నాటికి నిందుతులకు బేడీలు వేసి కోర్టుముందు హాజరుపరిచారు పోలీసులు.
– కృష్ణ్ణగోవింద్, బ్యూరో ఇంచార్జీ, సాక్షి, వరంగల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement