జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా
నర్సాపూర్(జి)(నిర్మల్) : నేరాల నియంత్రణకు పోలీసులు పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో గ్రామాల్లోనూ వీటిని ఏ ర్పాటు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయిం చారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా రు.
దీంతో గ్రామాల్లో నేరాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. పోలీసులు ఆయా గ్రామాభి వృద్ధి కమిటీలు, వ్యాపారులతో చర్చించి సీసీ కెమెరా లు ఏర్పాటు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నారు.
అనుమానితులను పట్టేయొచ్చు..
పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కె మెరాలు ఏర్పాటు చేయడంతో అనుమానిత వ్యక్తులను పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల వివరాలు ఆరా తీస్తున్నారు. దీంతో నేరా ల సంఖ్య తగ్గుతోంది. వ్యాపార సముదాయాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల ని పోలీసులు వారికి సూచిస్తున్నారు. ఈ మేరకు వారికి ఆయా పోలీస్‌స్టేషన్లలో అవగాహన కల్పిస్తున్నారు.
నిఘా నేత్రాల ఏర్పాటుతో వ్యాపార సముదాయాల్లో దొంగతనాలు జరగకుండా నివారించే వీలుంది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రతీవారం అంగడి ఉంటుంది. సంతలోనూ ఎలాంటి దొంగతనాలు, అక్రమాలకు తావు లేకుండా నిఘానేత్రాలు సహకరిస్తున్నాయి.
శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం..
శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కొన్ని కేసుల్లో సీసీ కెమెరా పుటేజీలు సాక్ష్యాలుగా కూడా ఉపయోగపడుతున్నాయంటే సీసీ కెమెరాల ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు దొంగతనాలు, కిడ్నాప్ కేసుల్లో సీసీ కెమెరాల సాయంతో పోలీసులు కేసులను ఛేదించారు. అలాగే చైన్‌స్నాచింగ్ కేసుల్లో సీసీ కెమెరాలే కీలకపాత్ర పోషిస్తున్నాయి.
చైన్‌స్నాచింగ్ చేసిన వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివ్వడం సీసీ పుటేజీలు సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయి. జాతీయరహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లోనూ కీలక సాక్ష్యాలను పోలీసులు సేకరించగలుగుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. హైస్పీడ్ డ్రైవ్, ట్రిపుల్ రైడ్, ఓవర్ లోడ్‌వాహనాలపై సీసీ కెమెరాల సాయంతో పోలీసులు దృష్టి సారిస్తున్నారు.
వ్యాపారస్తులకు అవగాహన..
జిల్లాలో దొంగతనాలను పూర్తిగా నివారించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్లు, కాలనీలు, రహదారులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం వ్యాపారులు, గ్రామస్తులకు సీసీ కెమెరాల వినియోగం, వాటి పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. వీటితో కలిగే లాభాలను వారికి వివరించి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా పోత్సహిస్తున్నారు.
వ్యాపారులు సీసీ కెమెరాలు సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకుంటుండగా, గ్రామాల్లో ప్రజల నుంచి విరాళాలు, వీడీసీల సహకారంతో నిఘానేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, ప్రయాణ ప్రాంగణాలు తదితర రద్దీ ప్రాంతాలు, మండల కేంద్రాల ముఖద్వారంగా ఉన్న గ్రామాల్లో సుమారు 400 వరకు సీసీ కెమెరాలు సేవలందిస్తున్నాయి. అలాగే వీటికి అదనంగా వ్యాపార సముదాయాల్లోనూ సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నాయి.
కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం..
జిల్లాలోని నిర్మల్, భైంసా సబ్‌డివిజన్ పోలీస్ కార్యాలయాల్లోని కమాండ్ కంట్రోల్‌రూంతో ఆయా డివిజన్ కేంద్రాల్లోని సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. అలాగే ఆయా మండలకేంద్రాల్లోని సీసీ కెమెరాలను ఆయా పోలీస్‌స్టేషన్లలోని కంట్రోల్‌రూంకు అనుసంధానం చేశారు.
దీంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పోలీసులు తెలుసుకుని స్పందించగలుగుతున్నారు. దీంతో నేరనియంత్రణ వారికి సులువవుతోంది. ఏదేమైనా శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment