నిఘా నీడలో తాండూరు!
ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు జిల్లాలోనే మొదటిసారి..
తాండూరు: కర్ణాటక సరిహద్దులోని తాండూరులో పోలీసులు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. నేరాలను అరికట్టడంతో పాటు నేరస్తులను గుర్తించేందుకు కొత్తగా జిల్లాలోనే మొదటిసారిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలను గుర్తించేందుకు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరస్తులతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య చెప్పారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్, శాంత్‌మహల్ చౌక్, మల్లప్ప మడిగే తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను రెండు రోజులుగా ఏర్పాటు చేసినట్టు సీఐ చెప్పారు.
మరో 30 సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు. హెచ్‌డీ టెక్నాలజీతోపాటు రాత్రిపూట సైతం దృశ్యాలను ఈ కెమెరాలు క్లియర్‌గా రికార్డు చేస్తాయన్నారు. కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి సుమారు 40 మీటర్ల దూరంలోని దృశ్యాలను సీసీ కెమెరాలు బంధిస్తాయన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.