ప్రేమకు పరుగు ఉంటుంది.
పరువం తీయించే పరుగు.
భయాలు పెట్టించే పరుగు.
పరువు నీడ నుంచి పరుగు.
ప్రతిష్టల బరువు నుంచి పరుగు.
కట్టుబాట్ల ఆనకట్టలు వేస్తే..
ప్రేమ తలవొగ్గుతుందా?
ప్రేమ తలొంచుతుందా?
పెద్దవాళ్లకు పరువంటే ప్రేమ ఉంటుంది.
మరి... పిల్లల ప్రేమకు పరువుండదా?!
‘‘ఎంత పని చేశావ్‌రా...? ఇప్పుడెలాగా?’’ తన మేనల్లుడు రోహిత్ చెప్పిన మాట విని, ధారగా కాలవ కట్టిన చెమటలు తుడుచుకుంది సునంద.‘‘అలా గాబరా పడకు అత్తా... అసలే నాకు భయంగా ఉంది.. నువ్వు కంగారు పడి నన్ను ఇంకా భయపెట్టకు అత్తా!’’ అన్నాడు పందొమ్మిదేళ్ల రోహిత్.‘‘గాబరా పడక.. నువ్వు చేసిన పనేంట్రా?’’ అరిచేశాడు సునంద భర్త.‘‘నువ్వు మా దగ్గరకు వస్తున్నట్టు మీ అమ్మానాన్నలకు తెలుసా?’’ అడిగాడు అదే కోపంతో.తెలీదనట్టుగా తలూపాడు.తల పట్టుకొని కూర్చున్నారు సునంద, ఆమె భర్త మోహన్. ఆవేశం, కోపం తగ్గాక ‘ఇప్పుడేం చేద్దాం’ అన్నట్టుగా మొహాలు చూసుకున్నారిద్దరూ!ఇంతకీ వాళ్లనంతలా భయపెట్టిన ఆ విషయమేంటి?రోహిత్.. ఇంజనీరింగ్ విద్యార్థి. అతని చెల్లి సృజన. ఇంటర్ చదువుతోంది. తండ్రి మదన్.. కాంట్రాక్టర్. తల్లి లత.. గృహిణి. హైదరాబాద్‌లో నివాసం. సామాజిక పరంగా చూస్తే అగ్రకులం. డబ్బుకు కొదవలేదు. దానితో వచ్చిన హోదాకూ ఢోకా లేదు. పరువు అంటే పడిచస్తారు మదన్, లత. ఏడాదిగా సృజన ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. తరచు కలవడాలు, సినిమాలు, పిక్నిక్స్‌కు, ఫ్రెండ్స్ గాదరింగ్స్‌కు ఆ అబ్బాయితో వెళ్లడం సాధారణమైంది. ఒకరోజు అన్న కంట్లో పడింది. హెచ్చరించాడు. ఇంకోసారి తండ్రి స్నేహితుడి దృష్టిలోకి వచ్చింది. తండ్రి బెదిరించాడు. ‘అలాంటిదేమీలేదు. జస్ట్ ఫ్రెండ్’ అని కొట్టిపారేసి ఆ హెచ్చరికను, బెదిరింపును తుంగల్లో తొక్కేసింది. ఎప్పటిలాగే స్నేహం కొనసాగించింది. అయితే ఎవరికంటా కనపడకుండా జాగ్రత్త తీసుకోసాగింది. కాని రోహిత్ మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకోలేదు. మరచిపోలేదు. కాలం గడుస్తోంది. సృజనకు, ఇంజనీరింగ్ చదువుతున్న ఆ అబ్బాయికీ స్నేహం బలపడసాగింది.
ఒకరోజు...
లాంగ్‌డ్రైవ్‌కి ప్లాన్ చేసుకుంది ఆ జంట. ఇంట్లో చెప్పిన సమయం కన్నా చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకుంది సృజన. అంటే దాదాపు అర్ధరాత్రికి. తనకోసం ఎదురుచూస్తున్న ఇంటిల్లిపాదికీ తన ఆలస్యానికి కారణంగా అంతకుముందే సిద్ధం చేసి ఉంచుకున్న ఓ అందమైన కట్టుకథని వినిపించింది. ముగ్గురూ మౌనంగా విన్నారు. ఆమె నిద్రపోయాక తర్జనభర్జన పడ్డారు.
ఎందుకంటే అసలు కారణమేంటో సృజన ఇల్లు చేరకముందే ఆమె స్నేహితులకు ఫోన్ చేసి కనుక్కున్నారు వాళ్లు. ఆ ఒక్కరోజే కాదు ఆమె చాలా రోజుల నుంచే చాలా అబద్ధాలు ఆడుతోందనీ తెలిసింది. చేయకూడని తప్పు ఏదో చేస్తోందనీ చూచాయగా అర్థమై పోయింది వాళ్లకి. ‘చెల్లి విషయం మాకు వదిలెయ్.. అబ్బాయి సంగతి నువ్వు చూడు’ అనే బాధ్యతను కొడుకుకు అప్పజెప్పారు లత, మదన్.
అప్పటినుంచి..
ఆ పనిమీదే ఉన్నాడు రోహిత్. ‘‘ఒరేయ్.. వాడితో ఫ్రెండ్‌షిప్‌చేసి కంట్రోల్ చేయాలిరా’’ అని ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా చాలా సీరియస్‌గా పాటించాడు రోహిత్. ఫ్రెండ్‌పిష్ చేశాడు. ఆ అబ్బాయిని నమ్మించాడు. సేమ్ టు సేమ్ చెల్లెలిని ఆ అబ్బాయి లాంగ్‌డ్రైవ్‌కి తీసుకెళ్లినట్లే అతనిని ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌డ్రైవ్‌కి తీసుకెళ్లాడు. అలా కిడ్నాప్‌కి ప్లాన్ చేశాడు. అంతా అనుకున్నట్లుగానే జరిగింది కానీ, మధ్యలో చిన్న అపశృతి దొర్లింది.
ఇప్పుడు..మేనత్త వాళ్లింట్లో..
‘‘అత్తా.. వాడిని చంపాలని మేం అనుకోలేదు. నిజానికి వాడు చచ్చిపోయాడనే విషయం కూడా నాకు తెలియదు. టీవీలో స్క్రోలింగ్ చూసేవరకు. ఆ రోజు అసలు ప్లాన్.. వాడిని బాగా తాగించి.. మా ఫ్రెండ్‌వాళ్ల ఫామ్ హౌజ్‌లో రూమ్ అరెస్ట్ చేయాలని. సృజన జోలికి రావాలంటేనే భయపడేలా చేసి వదిలేద్దాం అనుకున్నాం. అయితే లికర్‌ను చూడగానే వాడితోపాటు ఫ్రెండ్స్ కూడా తాగడం మొదలుపెట్టారు. నాకూ మనసాగలేదు. నేనూ తాగాను. ఆ మత్తులో వాడిని కిడ్నాప్ చేయబోతున్నామనే విషయాన్ని కక్కేశాం. అంతే! వాడికి మత్తు దిగిపోయింది. అక్కడినుంచి పారిపోడానికి ట్రై చేశాడు. తెలివి తెచ్చుకుని మేం పట్టుకోవడానికి ప్రయత్నించి, పట్టుకున్నాం. ఆ పెనుగులాటలో కొట్టుకున్నాం కూడా. వాడు ఆవేశంతో సృజను మరిచిపోయి బతికేదే లేదు. త్వరలోనే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుంటాం అన్నాడు. ఆ మాటకు కసితో వాడి తల మీద బాటిల్‌తో కొట్టాను. అత్తా.. వాడు మన కులం కాదు. మనకన్నా తక్కువ కులం. నా చెల్లెతో తిరగడమే తప్పు.. పైగా పెళ్లి చేసుకుంటాననడంతో నాకూ కోపమొచ్చింది. అందుకే కొట్టాను. వాడి తల నుంచి రక్తం కారేసరికి భయమేసి నేను పారిపోయాను. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా పారిపోయారట ఎక్కడివాళ్లక్కడ. నేను ఇంకో ఫ్రెండ్ వాళ్లింట్లో ఉన్నా. అక్కడే టీవీలో చూశా. వాడు చచ్చిపోయాడని. ఫ్రెండ్స్ ద్వారా నా గురించి పోలీసులకు తెలిసిందని. అమ్మానాన్న పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారట. ఇంకో ఫ్రెండ్ చెప్పాడు. వాళ్ల ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయేమోనని నాతో మాట్లాడ్డానికే ఎవరూ ఇష్టపడట్లేదు. ఇక షెల్టర్ ఎవరిస్తారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చాను అత్తా..!’’ అంటూ వివరించిన రోహిత్ కళ్లల్లో పశ్చాత్తాపం కన్నా భయమే కనిపించింది సునందకు.భర్త వంక చూసింది అయోమయంగా!
‘‘తక్కువ కులం.. ఎక్కువ కులమేంట్రా?’’ అన్నాడు మోహన్.‘‘అవును మామయ్యా.. అమ్మా, నాన్న తక్కువ కులం వాళ్లతో, మనకన్నా తక్కువ డబ్బున్న వాళ్లతో మాట్లాడొద్దని.. చెప్పేవాళ్లు. చిన్నప్పుడు రెండుమూడుసార్లు నేనలా మాట్లాడితే.. కొట్టారు కూడా. అది నా మైండ్‌లో పడిపోయింది మామయ్యా.. అందుకే అప్పటి నుంచి మాట్లాడ్డం మానేశాను. మనకన్నా అన్నిట్లో తక్కువున్న వాళ్లంటే నాకు అసహ్యం కూడా. కాని సృజన అమ్మానాన్న వాళ్ల మాట ఎప్పుడూ వినలేదు. ఎంత కొట్టినా.. తిట్టినా అది వాళ్లతోనే మాట్లాడేది. ఇదిగో ఇప్పుడు ఆ అలగా జనంతో సంబంధాలు కలుపుకునే దాకా వెళ్లింది. వాడితో తిరగొద్దని అందరం చెప్పాం. అయినా వినలేదు. పైగా వాడికి బుద్ధి చెప్పమని నాన్నవాళ్లే అన్నారు. ముందు బెదిరిద్దామనే అనుకున్నా.. కాని ఇలా..’’ అని ఆగిపోయాడు. హతాశుడయ్యాడు మెహన్. ఖంగుతిన్నది సునంద.‘ వీడు మారాలంటే పోలీసులకు అప్పగించాల్సిందే సునంద’’ అంటూ ఎవరి సమాధానమూ చూడకుండా పోలీసులకు ఫోన్ చేశాడు మోహన్. రోహిత్ తేరుకుని తప్పించుకునే ప్లాన్ వేసుకునేలోపే పోలీసులు అక్కడికి వచ్చేశారు.ఏడుస్తూ చేతులతో ముఖం కప్పుకున్న సునంద భుజం మీద ఓదార్పుగా చేయి వేశాడు మోహన్.(హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఈ మధ్య తెలంగాణాల్లోనూ ఎక్కువైన పరువు హత్యల ఆధారంగా అల్లిన కథనం ఇది. వీటిని వ్యతిరేకిస్తూ హిందీలో ‘ఇషక్ జాదే’ వంటి సినిమాలూ వచ్చాయి).
బాల్యం నుంచే బీజం వేయండి !
పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారన్న విషయంపై మీకు మీరే ముందే ఒక నిర్ణయానికి వచ్చేయడం తప్పు. వారేం చెప్పాలనుకుంటున్నారో చెప్పే అవకాశం ఇవ్వాలి. ప్రేమ అనేది కుల, మతాలకు అతీతం అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. అలాగే పిల్లలు తమ ప్రేమ విషయాన్ని వ్యక్తపరిస్తే, ‘వీరితో మాట్లాడొద్దు’, ‘ప్రేమించడం తప్పు’ లాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మంచిది కాదు. పిల్లలతో వారిలోని చెడు గురించి మాట్లాడే ముందు మంచిని ప్రస్తావించాలి. అలాగే ఒకరితో కంపేర్ చేస్తూ మాట్లాడడం కూడా వారిపై చెడు ప్రభావం చూపిస్తుంది. కులాల ప్రస్తావన, కొందరిని తక్కువ చేసి చూడడం లాంటివి ఒక తరం నేర్చుకోకూడదంటే ఇప్పటినుంచే తల్లిదండ్రులు అలాంటి ఆలోచనలకు దూరంగా పిల్లలను పెంచాలి. వారిలో బాల్యం నుంచే సానుకూల భావనలు నింపడానికి ప్రయత్నించండి. సంతోషంగా ఉండడం అంటే ఏంటో, అలా ఉండాలంటే మనం ఏం చేయాలో వాళ్లకు అలవాటు చేస్తే బాగుంటుంది. పిల్లలతో యోగా, ధ్యానం లాంటివి చేయిస్తే, వారి ఆలోచనలు కూడా స్థిరంగా, పాజిటివ్‌గా ఉంటాయి.
- డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
లూసిడ్ డయాగ్నస్టిక్స్
– శరాది
Comments
Please login to add a commentAdd a comment