కలిపి చుడితే కలదు సుఖం | special story to High heels | Sakshi
Sakshi News home page

కలిపి చుడితే కలదు సుఖం

Published Thu, Jan 18 2018 11:39 PM | Last Updated on Thu, Jan 18 2018 11:39 PM

special  story to  High heels - Sakshi

హై హీల్స్‌ నడకకు అందాన్నిస్తాయి. కొంచెం నొప్పిగా కూడా అనిపిస్తాయి. ఈ నొప్పి.. హీల్స్‌ సరిపడకపోవడం వల్ల కాదు. పాదాల్లోని నరాలపై పడే ఒత్తిడి వల్ల! ఇది తెలిసిన విషయమే. తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. చిన్న టెక్నిక్‌తో నొప్పిని తప్పించుకుని హై హీల్స్‌తో ఈ భూమిని ఏలేందుకు అమ్మాయిలు సిద్ధం కావచ్చని! ఈ గొడవంతా ఎందుకు? చక్కగా చెప్పల్స్‌ లేదా స్లిప్పర్స్‌ వేసుకుంటే సుఖం కదా అనుకోవచ్చు. సుఖమే.. కానీ హై హీల్స్‌ హైïß ల్సే! ఒక్కసారి వేసుకుని చూడండి. ‘చూడండి’.. అంటే మిమ్మల్ని మీరు చూసుకొమ్మని కాదు. హై హీల్స్‌ వేసుకుని మీరు నడుస్తున్నప్పుడు మిమ్మల్ని చూసేవాళ్లను చూడండీ అని. ఎంత ఆరాధన ఆ కళ్లల్లో! ఉండదా మరి? మీరేం తక్కువగా కనిపిస్తారా! ఏ దేశపు యువరాణిగారో మీలోకి ప్రవేశిస్తారు. తన హొయలును మీ కదలికల్లో అనువణువునా ఒలికిస్తారు. కానీ హై హీల్స్‌తో  ఆ కాసేపు మీరు పడే బాధ మీకు మాత్రమే తెలుస్తుంది. పాదాలు నొప్పెడతాయి. కొంతమందికైతే నడుము నొప్పి కూడా వస్తుంది. రోజూ హై హీల్స్‌ వేసుకునేవారికైతే పర్వాలేదు కానీ, కొత్తల్లో కాస్త ఇబ్బందే. ఆ ఇబ్బందిని ఈ స్మాల్‌ టిప్పుతో భలేగా తప్పించుకోవచ్చు. 

ఎలాగంటే... చిన్న టేప్‌ తీసుకోండి. అడ్హెసివ్‌ టేప్, స్కాచ్‌ టేప్, న్యూడ్‌ కలర్‌ మెడికల్‌ టేప్‌.. ఏదైనా సరే. అవన్నీ లైట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. అతికించడానికి, అతికించాక తొలగించడానికీ అవి తేలిగ్గా ఉంటాయి. ఆ టేప్‌తో బొటన వేళ్ల పక్కన ఉండే రెండు వేళ్లను కలిపి గట్టిగా చుట్టేయండి. (ఫొటోలో చూపిన విధంగా). తర్వాత మెల్లిగా మీ పాదాలను హై హీల్స్‌లోకి దూర్చేయండి. ఆ తర్వాత నడవండి. వెంటనే మీకు ఆశించినంత సౌఖ్యం కలగకపోవచ్చు. నమ్మండి. కొద్దిరోజుల్లోనే మీ హై హీల్స్‌ మీకు మంచి ఫ్రెండ్స్‌ అవుతాయి. 

ఏమిటీ మాయ?
మాయ కాదు, మంత్రం కాదు. బొటనవేలి తర్వాతి రెండు, మూడు వేళ్ల మధ్య ఒక నరం ఉంటుంది. హై హీల్స్‌ వల్ల ఆ నరం నొక్కుకుపోయి, నొప్పికలుగుతుంది. ఆ నొప్పి ఎక్కువైతే నడుము వరకు పాకుతుంది. అలా కాకుండా ఉండేందుకే రెండు వేళ్లకూ కలిపి టేపు చుట్టేయడం! ఇలా చుట్టడం వల్ల ఆ నరం మీద ఒత్తిడి తగ్గి హై హీల్స్‌ వేసుకుని నడుస్తున్నప్పుడు నొప్పి అనిపించదు.  అయితే హై హీల్స్‌ వల్ల భవిష్యత్తులో రాగల అవకాశం ఉన్న ఆరోగ్య సమస్యలకు మాత్రం ఈ టేపు టిప్పు ఔషధంలా పనిచేయదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అప్పటికప్పుడు అనుకోకుండా పార్టీకి రెడీ అయినప్పుడు సరదాగా కొద్దిసేపు హై హీల్స్‌తో నొప్పి లేకుండా నడిచేందుకు టేప్‌ చుట్టుకుని వెళ్లొచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement