చావి చేవ సేవ | special story on Chhavi Rajawat | Sakshi
Sakshi News home page

చావి చేవ సేవ

Published Sun, Jul 30 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

చావి చేవ సేవ

చావి చేవ సేవ

చావి రజావత్‌ ఎంబీఏ చేసింది పెద్ద పెద్ద కంపెనీలు రజావత్‌కి అవకాశాన్నిచ్చాయి ఆ పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కాదని తన ఊరి ఉద్యోగానికి ఇంటర్వ్యూకెళ్లింది జీన్స్‌ ప్యాంటు వేసుకునే అమ్మాయిని సర్పంచ్‌గా ఒప్పుకుంటామా... అని అగ్రకులాలే ప్రశ్నించాయి నిమ్నకులాలు గొప్ప మనసును చూపించాయి చావి సర్పంచ్‌ అయింది ఆ ఊరి పేరు సోడా ఇప్పుడది గాలి బుడగల సోడా కాదండీ... గొప్ప అడుగుల సోడా అదీ... చావిలో ఉన్న చేవ తన ఊరికి ఆమె చేస్తున్న సేవ

సూర్యుడు పడమరకి తరలి వెళ్తున్నాడు. వెలుగు ప్రతాపాన్ని చీకటి మెల్లగా బలహీనపరుస్తోంది. 20, 25, 30, 35, 40... ఇలా పలురకాల వయస్సున్న మగవాళ్లు కొంతమంది చెరువు కట్ట మీదకు వెళ్తున్నారు. అనువైన.. చాటు చోటు చూసుకొని ఒక్కొక్కళ్లే కూర్చుంటున్నారు. వాళ్ల వెనక కాస్త దూరంలో పదేళ్ల లోపు పిల్లలు అయిదారుగురు అక్కడున్న పొదల మాటున నక్కి వాళ్లు కూర్చోగానే అరుపులు, ఈలలు, కేకలు, గోల, గేలి చేస్తున్నారు. ఉలిక్కిపడి పెద్దాళ్లు లేస్తున్నారు. లేవగానే ఒక్కసారిగా పిల్లల గోల ఆగిపోతోంది. అటూఇటూ చూసి మళ్లీ కూర్చుంటున్నారు పెద్దాళ్లు. వాళ్లు అలా కూర్చోగానే పిల్లల గోల షురూ! వచ్చిన పనికానివ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పెద్దాళ్లు వెనక్కి తిరిగిపోతున్నారు.

ఇలా జరిగింది ఏ ఒక్కరోజో కాదు. పెద్దాళ్లు అలా చెరువుకట్ట మీదకు రావడం ఆగేవరకూ కొనసాగింది. విసిగివేసారిన పెద్దాళ్లు వెళ్లడం మానేశారు. ‘హమ్మయ్య... ఇప్పుడు ఊళ్లోని అన్ని ఇళ్లకూ టాయ్‌లెట్స్‌ వచ్చేశాయి’ ప్రశాంతంగా అనుకుంది  చావి రజావత్‌. అసలు ఆ పిల్లల దండుకి, ఊళ్లో టాయ్‌లెట్స్‌కు, చావి రజావత్‌కు ఏంటి సంబంధం? చాలానే ఉంది. ఈ అక్షరాల వెంట ప్రయాణం చేస్తే రాజస్థాన్‌లోని సోడా వస్తుంది.

సోడా.. రాజస్థాన్‌లోని టోంక్‌ జిల్లాలోని గ్రామం. మన దేశంలోని చాలా గ్రామాల్లాగే సోడా కూడా పితృస్వామ్య విలువలనే పాటిస్తోంది. ఆ ఊరికి తొలి మహిళా సర్పంచ్‌ చావి రజావత్‌. ఒక్క సోడాకే  కాదు దేశంలోనే తొలి ఏంబీఏ సర్పంచ్, అతి పిన్న వయసులో సర్పంచ్‌ అయిన తొలి మహిళ కూడా. అంతకు ముందు ఆ ఊరికి 20 ఏళ్లు ఆమె తాత రఘుబీర్‌ సర్పంచ్‌. రాజకీయం వారసత్వంగా అబ్బినా.. సర్పంచ్‌ పదవి మాత్రం వారసత్వంగా రాలేదు. అసలు రాజకీయాల్లోకి రావాలనేది ఆమె లక్ష్యం కూడా కాదు. అందుకే ఏంబీఏ చేసింది.. కార్పొరేట్‌ కెరీర్‌లోనే స్థిరపడాలనుకుంది. మలుపెలా తిరిగింది?

అందరిలా కాదు.. ఎందరికో స్ఫూర్తి పంచేలా..
చావి రజావత్‌ పుట్టింది సోడాలోనే. రాజ్‌పుత్‌ కుటుంబం. తండ్రి నరేంద్రసింగ్‌ రజావత్‌ మిలిటరీ ఆఫీసర్‌. దాంతో దేశంలోని అన్ని కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో పెరిగింది చావి. ఆంధ్రప్రదేశ్, మదనపల్లిలోని రిషీ వ్యాలీ స్కూల్లో చదువుకుంది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌లో డిగ్రీ చేసింది. పుణేలోని బీఐఎమ్‌ఎమ్‌ (బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మోడర్న్‌ మేనేజ్‌మెంట్‌)లో ఏంబీఏ పూర్తి చేసింది. ఏంబీఏలో మంచి పర్సెంటేజ్‌తో బయటకు వచ్చిన చావీకి టైమ్స్‌ ఇండియా గ్రూప్‌ ఫస్ట్‌ చాన్స్‌ ఇచ్చింది. తక్కువ సమయంలోనే చావి పనితీరు మేనేజ్‌మెంట్‌ ఉన్నతాధికార వర్గం దృష్టిలోకి వెళ్లింది. ప్రమోషన్‌తో ఆమె సేవల పరిధిని విస్తృతం చేసింది మేనేజ్‌మెంట్‌. చావి సమయస్ఫూర్తి, వేగంగా నిర్ణయాలు తీసుకోగలగడం, దూరదృష్టి... బయట కార్పొరేట్‌ సెక్టార్‌లోనూ చర్చకు వచ్చాయి.

భారతి ఎయిర్‌టెల్‌ సంస్థ చెవినా పడ్డాయి. తమ సంస్థలో చేరాలనే ఆహ్వానాన్ని పంపాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ను అందుకొని అందులో చేరింది. ఓ వైపు కమ్యూనికేషన్‌ సంస్థలో కొనసాగుతూ ఇంకోవైపు హోటల్‌ బిజినెస్‌లోకి ప్రవేశించింది. కర్ల్‌సన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌లో జాయిన్‌ అయింది. ఉత్సాహంతో పని చేస్తోంది. కానీ జీతం కోసం కాదు.. పదిమంది మంచి కోరే పని కావాలి.. అని తపన చెందింది. రిషీవ్యాలీలో నేర్పించింది ఏంటీ? నీ కోసం కాదు.. నీ సమాజం గురించి ఆలోచించాలి.. అని బడి రోజులను గుర్తుచేసుకుంది.. అందరిలా కాదు.. ఎందరికో  స్ఫూర్తి పంచేలా బతకాలి.. అని నిర్ణయించుకుంది.

విమెన్‌ రిజర్వేషన్‌
ఇది 2010నాటి సంగతి. అప్పుడే సోడా గ్రామాన్ని మహిళా సర్పంచ్‌ కోటా కింద కేటాయించారు. చావి సోడాలో పెరగక పోయినా.. ప్రతి సెలవులకు ఆ ఊరు వెళ్తూ ఉండేది. వాళ్లది భూస్వామ్య కుటుంబమే అయినా ఊహ తెలిసినప్పటి నుంచే ఆ ఛాయలేవీ తన మీద పడకుండా చూసుకుంది. రిషీ వ్యాలీ స్కూల్‌ నేర్పిన సంస్కారాన్ని ఒంటబట్టించుకుంది. ఊళ్లోని బడుగు వర్గాలకు దగ్గరైంది. వాళ్లలోని ప్రతి కుటుంబమూ ఆమెను తమ సొంత బిడ్డలాగే ఆదరించింది. అందుకే మహిళా రిజర్వేషన్‌ తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు అనగానే వాళ్లందరికీ గుర్తొచ్చిన పేరు చావి. ఒకరోజు ఆమె ఆ ఊరొస్తే ఆ మాటే ఆమెతో చెప్పారు కూడా. ‘రాజకీయాల్లోకా?’ అని మనసులోనే నవ్వుకొని ఏ సమాధానమూ చెప్పకుండా మౌనంగానే తిరుగు ప్రయాణమైంది. అయితే గమ్యం చేరేవరకు మెదడు ఆమెను మౌనంగా ఉండనివ్వలేదు.

ఎన్నో దృశ్యాలు..
చిన్నప్పటి నుంచి అప్పటిదాకా తను చూసిన సోడాను కళ్ల ముందు నిలబెట్టింది. ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఊరు అలాగే ఉంది. తాత 20 ఏళ్లు సర్పంచ్‌ పదవిలో ఉన్నా ఊళ్లో ఏ మాత్రం మార్పులేదు. టాయ్‌లెట్‌కి వెళ్లాల్సి వస్తే సూర్యోదయానికి ముందన్నా, సూర్యాస్తమయం తర్వాతైనా వెళ్లాలి. ఈ మధ్యలో అర్జెంట్‌ అయితే సూర్యుడి నిష్క్రమణ దాకా ఆగాలి. డయేరియా, విరేచనాల వంటివి వస్తే ఆ పరిస్థితి ఊహించుకోవడానికే భయం. ఏ ఇంటికీ టాయ్‌లెట్‌ లేదు. ప్రతి ఇంట్లోని ఆడ, మగ, పిల్లాజెల్లా, ముసలి, ముతక అందరూ చెరువు కట్టకు వెళ్లాల్సిందే. ఊరంతటికీ ఒకే ఒక్క మంచి నీటి వనరుగా ఉన్న ఆ చెరువును, దాని పరిసరాలను మలినం చేయాల్సిందే. సురక్షితమైన నీటి పథకం లేదు. కరెంట్‌? ఊళ్లో ఎన్ని గంటలు కరెంట్‌ ఉంటోంది? మహా అంటే నాలుగు గంటలు.

అంతకన్నా ఎక్కువుండదు. అసలు ఊళ్లో వాళ్లకు చేతి నిండా పనేది? అందుకే కదా అన్ని ఎండిపోయిన డొక్కలు? ఆడ, మగ పిల్లలకు చదువేది? అసలు అభివృద్ధి అనే పదం తెలుసా ఊళ్లో వాళ్లకి? రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కి కేవలం 70  కిలోమీటర్ల దూరంలో ఉన్న సోడా.. ప్రగతికి మాత్రం కొన్ని వందల కిలోమీటర్ల ఆవల ఉంది. విలాసాల ముచ్చట అటుంచి కనీస సౌకర్యాలు లేని దుస్థితి... జైపూర్‌ వచ్చింది. మెదడు చేసిన డిజిటల్‌ ప్లే ఆగింది. వెంటనే సోడాకు తిరుగు ప్రయాణమైంది. సర్పంచ్‌ పదవికి పోటీ చేయడానికి తాను సిద్ధమే అని చెప్పింది. సంతోషంతో ఆమెను భూజాలకెత్తుకున్నారు.  తల్లిదండ్రులకూ వినిపించింది తన నిర్ణయాన్ని. ఆనందంగా ఆశీర్వదించారు.

స్వచ్ఛ్‌ సోడా..
స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌ రాకముందే.. దానికి మూడునాలుగేళ్ల ముందే స్వచ్ఛ్‌ సోడా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది చావి. దీనికి ఊరు ఊరంతా ఆమెకు వ్యతిరేకమైంది. అవాక్కయినా అధైర్యపడలేదు చావి. బయట మలవిసర్జన చేస్తే గాలి, నీళ్లు, పరిసరాలు ఎలా మలినం అవుతాయో చెప్పింది. ఆరోగ్యకర్తలతో చెప్పించింది. అర్థం చేసుకున్న ఆడవాళ్లు చావి పక్షాన చేరారు. అందుకు రెండేళ్లు పట్టింది. 900 ఇళ్లున్న ఆ ఊళ్లో 800 ఇళ్లు టాయ్‌లెట్లు కట్టుకున్నాయి. మిగిలిన వంద ఇళ్లల్లోని వాళ్లు తరతరాలుగా వస్తున్న అలవాటును మానుకోవ డానికి ఇష్టపడలేదు. మాన్పించడానికి పిల్లలను ఉసిగొల్పింది చావి. పిల్లల దండును తయారు చేసి ఇందాక ఈ కథనం మొదట్లో చెప్పు కున్నట్టు చెరువు కట్టమీదకు తోలింది. ఇప్పుడు సోడాలోని 900 ఇళ్లల్లో టాయ్‌లెట్లున్నాయి.

వెల్‌కమ్‌ టు సోడా..
సోడా చరిత్రలో లేనిది, ఎవరూ చేయనిది.. ఒకరకంగా సోడాలో విప్లవం అని చెప్పుకోదగ్గదీ... ఆ ఊళ్లో బ్యాంక్‌. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా! జైపూర్‌–టోంక్‌ హైవే మీదున్న సోడా ఊళ్లోకి ఎంటర్‌ కాగానే పెద్ద హోర్డింగ్‌ కనబడుతుంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాళ్లది.. వెల్‌కమ్‌ టు సోడా అని! దానికి పది అడుగుల దూరంలోనే ఉంటుంది బ్యాంక్‌ విత్‌ ఏటీఎమ్‌. ఆ ఊరికే కళ తెచ్చే కూడలి అది. బ్యాంక్‌ ఏర్పాటుతో ఊళ్లో ఆడవాళ్లకు పొదుపు గురించి తెలిసింది. సోడాలోని ప్రతి వ్యక్తి ఇప్పుడు ఆ బ్యాంక్‌ ఖాతాదారుడే. బ్యాంక్‌కి వందమీటర్ల దూరంలో సెల్‌టవర్‌ పెట్టించింది. ఊళ్లోని వాళ్లంతా ట్వంటీ ఫోర్‌ బై సెవెన్‌ మొబైల్‌ఫోన్‌ను, ఉచిత డాటా సౌకర్యాన్నీ పొందుతున్నారు.

మృత్యుభూమి
సోడాలో ఎవరైనా చనిపోతే.. పలకరించ డానికి వచ్చిన బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అందరికీ ఆ ఇంటి కుటుంబం భోజనం పెట్టి మర్యాదలు చేసే ఆచారం పేరే మృత్యుభూమి. చిన్నప్పుడే దీనిపట్ల వ్యతిరేకత ఏర్పడింది ఆమెకు. మనిషి పోయిన బాధలో ఆ కుటుంబముంటే పరామర్శించడానికి వచ్చిన వాళ్లకు ఆ కుటుంబమే విందుతో మర్యాద చేయడమేంటి? అది ఎంత ఆర్థిక భారం? ఇంకెంత మానసిక క్షోభ? చనిపోయిన వాళ్ల కుటుంబంతో అలాంటి మర్యాద చేయించుకో వడానికి వీల్లేదని నియమం పెట్టింది. ఆ మృత్యుభూమి ఆచారాన్ని మాన్పించింది.

అభద్రతతో అడ్డంకులు
అన్ని అవరోధాలను తట్టుకొని మొదటి అయిదేళ్లు సోడా అభివృద్ధికి కృషి చేసిన చావికి ఆ ఊరి ప్రజలు ఉన్నత వర్గాలతో సహా రెండో టర్మ్‌లోనూ సర్పంచ్‌గా గెలిపించారు. ఇప్పుడు ఆమె లక్ష్యం.. ఆ ఊళ్లో స్త్రీ, పురుష సాధికారత సాధించడం. సమకాలీన అభివృద్ధి ఫలాలు సోడా ప్రజలూ అందుకునేలా చేయడం. సోడాకు సంబంధించి ఏ సంక్షేమ పథకం గురించి తాను ఆలోచించినా ఎన్నో అడ్డంకులు, దాడులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా అదే చిరునవ్వు, సహనంతో నెగ్గుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చావి.

జీన్స్‌ వేసుకునే పిల్లా?
‘‘చావి.. సర్పంచ్‌ పదవికి పోటీ చేయనుందట..’’ అప్పటిదాకా చావిని కూతురిలాగే భావించిన కొంతమంది అగ్రకుల పెద్దలకు ఈ మాట మింగుడు పడలేదు. ఆ సాహసాన్ని వాళ్లు భరించలేకపోయారు. కారణం.. ఘూంగట్‌ (తల మీదుగా పైట కప్పుకోవడం). ఆచారాన్ని గౌరవించని చావికి సర్పంచ్‌గిరీనా? అన్నారు. జీన్స్‌ ప్యాంట్, కుర్తా, మెడచుట్టూ స్కార్ఫ్‌తో కనపడుతుంది. ఇలాంటి పిల్లను ఆ గద్దెమీద కూర్చోబెడితే ఊరి ఆడపిల్లలు పాడై పోరూ? అదీగాక ఆ అమ్మాయి ఏ రాజకీయ పార్టీకి చెందిన మనిషి కాదు. ఆమెకు అధికారం ఎలా ఇస్తాం? ఈ భావాలన్నీ ఎన్నికల్లో చావికి వ్యతిరేకంగా పనిచేశాయి. కాని బడుగు, బలహీన జనం మెజారిటీతో ఆమెను గెలిపించారు. సర్పంచ్‌గా పంచాయతీ ఆఫీస్‌లో కూర్చోబెట్టారు. వాళ్లకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాననే దీక్షనే ప్రమాణంగా స్వీకరించింది.


మంచినీరు.. కరెంట్‌.. రోడ్లు..
ప్రధాన సమస్య తీరిపోయాక కనీస అవసరాల మీద దృష్టి పెట్టింది చావి. గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క మంచి నీటి చెరువు మలినాల కంపు. అంతకుముందు తను పనిచేసిన కార్పొరేట్‌ సంస్థలను సంప్రదించి వాటి సాంఘిక బాధ్యత కింద ఆ చెరువును శుభ్రం చేయించింది. ఆ చెరువులోకి వ్యర్థాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంతకుముందే ఉన్న రిజర్వాయర్‌ను బాగు చేయించి వాన నీటిని నిలువచేసే సామర్థ్యాన్ని పెంచింది. ఇప్పుడు ఊళ్లో అందరికీ సురక్షితమైన మంచి నీరు అందుతోంది. అలాగే కరెంట్‌ కూడా. అంతకుముందు నాలుగు గంటలు ఉండే కరెంట్‌ ఇప్పుడు 22 గంటలు ఉంటోంది. అంతేకాదు చుట్టుపక్కల ఊళ్లకూ సహాయం చేస్తోంది. సోలార్‌ ప్లాంట్స్‌ పెట్టుకోవడానికి కార్పొరేట్‌ సంస్థల నుంచి, ప్రభుత్వం నుంచి  ఆర్థిక సహాయం అందించింది. తర్వాత ఆమె చూపు రోడ్ల మీదకు వెళ్లింది. ఊళ్లో ప్రతి వాడకు.. వాడల నుంచి కూడళ్లకు, కూడళ్ల నుంచి హైవేకు కలుపుతూ నలభై రోడ్లను నిర్మించింది. సోడా స్వరూపమే మారిపోయింది.

గ్రామాలను మరిచిపోతున్నారు...
మన దేశంలోని 75 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే బతుకున్నారు. పాలసీ మేకర్స్‌ ఆ విషయాన్ని మరిచిపోయి.. దేశ ప్రగతికి సంబంధించి పాలసీల్లో గ్రామాలను ఇన్‌క్లూడ్‌ చేయట్లేదు. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగకుండా దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి పాలసీ మేకర్స్‌ గ్రామాలు, వాటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని పాలసీలను చేయాలి. నేటి తరానికీ గ్రామాల మీద పట్టు ఉండట్లేదు. పెద్ద చదువులు చదువుకుంటున్నామంటే మన మూలాలను మరిచిపొమ్మని కాదు అర్థం. ఆ చదువులను మన రూట్స్‌ బలపడేలా ఉపయోగించమని. తల్లిదండ్రులు కూడా డబ్బు సంపాదన ధ్యేయంగానే పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. అలా కాకుండా మన గ్రామాల కోసం మనమేం చేయగలమనే ఆలోచనను పిల్లల్లో కలిగించాలి. థ్యాంక్స్‌ టు రిషీ వ్యాలీ స్కూల్‌. అక్కడ అలవర్చుకున్న విలువలు నా గ్రామ సంక్షేమానికి ఎంతో తోడ్పడుతున్నాయి.
– శరాది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement