అదే నీకూ నాకూ ఉన్న తేడా! | special story on zen teacher | Sakshi
Sakshi News home page

అదే నీకూ నాకూ ఉన్న తేడా!

Jul 2 2017 12:10 AM | Updated on Sep 5 2017 2:57 PM

అదే నీకూ నాకూ ఉన్న తేడా!

అదే నీకూ నాకూ ఉన్న తేడా!

ఓ ధనవంతుడు తన ఇంటికి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేయడమే కాదు, వెళ్ళే ముందు వారికి చేతినిండా కానుకలు ఇచ్చి పంపుతారు.

ఓ ధనవంతుడు తన ఇంటికి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేయడమే కాదు, వెళ్ళే ముందు వారికి చేతినిండా కానుకలు ఇచ్చి పంపుతారు.

 ఓ రోజు ఓ జెన్‌ గురువు ఆ ఊరుకి వచ్చారు. ఆయనను ఆ ధనవంతుడు ఎంతో అభిమానంతో తమ ఇంటికి తీసుకువచ్చారు.
 ఆయనకు విందు ఏర్పాటు చేసారు. పాయసం, పచ్చడి, కూర, పులుసు, ఇలా అనేక వంటకాలు చేయించారు. ఆయనకు విస్తట్లో చేసిన పదార్థాలన్నీ వడ్డించారు. తీరా ఆ జెన్‌ గురువు మొత్తాన్నీ అమాంతం తినేశాడు. ధనవంతుడు అదంతా చూస్తూనే ఉన్నాడు. జెన్‌ గురువు తీరు చూసి ఆయన విస్తుపోయాడు.

‘‘ఈయనేదో పెద్ద గురువని అందరూ చెప్తుంటారు. ఏడుగురు తినే తిండిని ఒక్కడు లాగించేసాడు...?! ఆశ్చర్యంగా ఉందే...?! రకరకాల పదార్థాలను చూసి నోటిని కట్టడి చేసుకోలేకపోయిన ఈయన ఇక మనసునేం నియంత్రించగలడు?’’
ధనవంతుడి మనసులోని భావాన్ని గ్రహించిన జెన్‌ గురువు ‘‘ఏమిటి నీ సందేహం?’’ అని అడిగాడు.

అప్పుడు ధనవంతుడు ‘‘స్వామీ! నేనొకటి అడుగుతాను. తప్పుగా అనుకోకండి’’ అన్నాడు.
‘‘అడుగు. ఏమీ అనుకోను. ఆలోచించకు. అడుగు’’
‘‘ఇప్పుడు మీరు రుచి చూసి తిన్నారా? మిమ్మల్ని సాధువు అని ఎలా ఒప్పుకోవడం? మీకూ నాకూ ఏమిటి తేడా?’’
గురువు ఓ నవ్వు నవ్వారు.

‘‘ఈరోజు ఇలా రుచికరమైన పదార్థాలు ఎలా తిన్నానో అలాగే రేపు ఉప్పులేని వంట చేసి పెట్టినా దాన్నీ ఆస్వాదిస్తూ తింటాను. కానీ నువ్వలా తినగలవా? నీ నాలుక ఒప్పుకుంటుందా?’’ అని అడిగాడు.

ధనవంతుడు ఆలోచించి ‘‘ఊహూ... అదసలు జరగనిపని. రుచికరంగా ఉంటేనే తింటాను. ఏ మాత్రం రుచి తగ్గినా తినలేను...’’ అన్నాడు.
జెన్‌ గురువు ‘‘అదే నీకూ నాకూ ఉన్న తేడా!’’ అంటూ వంటకాలలో ఏవేవి ఎంత రుచికరంగా ఉన్నాయో చెప్పుకొచ్చాడు.
‘‘అన్నీ తృప్తిగా తిన్నానీ రోజు. మరో కప్పు పాయసం ఉంటే ఇవ్వు తాగుతాను... చాలా బాగుంది’’ అన్నాడు.
దేనినైనా ఉన్నది ఉన్నట్టు స్వీకరించాలి– అని చెప్తుంది జెన్‌.
అందుకు ఈ జెన్‌ గురువు ఉదంతం తార్కాణం! – యామిజాల జగదీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement