ఇటీవల హైదరాబాద్‌లో సంధ్య అనే అమ్మాయి మీద కార్తిక్ అనే ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సంఘటన ఆధారంగా రాసిందే ఈ కథనం!
మండిపోతోంది! కని, పెంచిన అమ్మ కడుపు మండిపోతోంది. గుండెలకు హత్తుకున్న నాన్న గుండె మండిపోతోంది. అనురాగాన్ని పంచిన అన్న మనసు మండిపోతోంది. నిస్సహాయంగా చూస్తున్న సమాజానికి ఒళ్లు మండిపోతోంది. వన్‌సైడ్ లవ్.. అమ్మాయిల చితిగా మండిపోతోంది! థూ.. ఛీ.. అని ఎంత ఊసినా ఈ వన్‌సైడ్ లవ్ మండిపోతూనే ఉంది!
‘‘జాబ్ మానేయమని చెప్పాగా? వినిపించట్లేదా?’’ ఓ మగాడి హుకుం! ‘‘ఎందుకు మానెయ్యాలి?’’ ఓ అమ్మాయి అమాయకమైన ప్రశ్న! ‘‘నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు కాబట్టి నువ్వూ మానేయ్యాలి’’ అతని అహంకారం!‘‘నిన్ను తీసేస్తే నేనెందుకు మానెయ్యాలి?’’ మళ్లీ అదే అమాయకత్వం అమ్మాయిది!‘‘నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి’’ ఆ పురుషుడి ఆధిపత్యం!‘‘నీకు ఇష్టమైతే నాకు నువ్వు ఇష్టం కావద్దా? నువ్వు పెళ్లిచేసుకోవాలనుకుంటే సరిపోతుందా? నేను ఒప్పుకోవద్దా?’’ మళ్లీ మళ్లీ అదే అమాయకత్వం ఆ పిల్లది. ‘‘యేడాది నుంచి అడుగుతున్నా.. పెళ్లి చేసుకుంటానని! ఒప్పుకో’’ హక్కుగా అతను.‘‘నేనూ యేడాది నుంచి చెప్తున్నా.. చేసుకోను అని. నాకిష్టంలేదు’’ స్పష్టంగా ఆమె.‘‘ఎందుకు ఇష్టంలేదు’’ అహం దెబ్బతిన్న అతను.
‘‘నాకు నువ్వు నచ్చలేదు’’ అదే స్పష్టతతో ఆమె.అప్పుడు సమయం సాయంకాలం ఆరున్నర. స్థలం.. హైదరాబాదు. ఆ టైమ్‌లో ఆమె తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి ఇంటికి వెళ్తోంది. దారికాపు కాసి మరీ ఆమెను విసిగిస్తున్నాడు అతను. అదే మొదలు కాదు. అప్పటికి చాలాకాలంగా వేధిస్తున్నాడు. పెళ్లిచేసుకోమని సంవత్సర కాలంగా.. ఉద్యోగం మానెయ్యమని గతకొంతకాలంగా. ఆమె అతను అడిగిన అన్నిటికీ ‘నో’ అనే సమాధానమిచ్చింది. నో అంటే నో అనే. కాదు అంటే ఔననే అర్థంలో కానేకాదు. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరు కాదు. నానార్థాలు అసలే లేవు.వద్దు అంటే వద్దు అనే. అది తట్టుకోలేకపోయాడు అతను. వద్దు అంటుందని తెలిసే.. చాలా ప్లాన్‌తో వచ్చాడు ఆ రోజు. ఆమెనుంచి నో అనే సమాధానం రాగానే తన కోటు జేబులో దాచుకున్న పెట్రోల్ బాటిల్ తీసి ఆమె మీద పోసి నిప్పంటించి పారిపోయాడు. నడి రోడ్డు మీద.. జనసమ్మర్థం మెండుగా ఉన్న చోట! ఆమె విలవిల్లాడింది. అక్కడున్న జనం సహాయంతో ఆసుపత్రికి చేరింది. 64 శాతం కాలిన గాయాలతో ఆ రాత్రంతా పోరాడి తెల్లవారి ప్రాణాలు విడిచింది.
అతను పారిపోయిన రోజు రాత్రే దొరికాడు. కాని అతని అహంకారం ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. తప్పు ఎక్కడ ఉంది? అతని పెంపకంలోనా?! కావచ్చు! ఒక్కసారి ఆ రెండిళ్ల నేపథ్యం తెలుసుకుందాం!
అతని పేరు నిరంజన్. డిగ్రీ డిస్‌కంటిన్యూ చేశాడు. ఇంటికి అతనే పెద్దకొడుకు. తన తర్వాత ఓ తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. ఆ ఇంట్లో అతని తండ్రి ఏది చెబితే అదే శాసనం. ఆ తర్వాత ఆ అధికారం నిరంజన్, అతని తమ్ముడిదే. వాళ్లింట్లో ముగ్గురు ఆడవాళ్లు ఈ ముగ్గురు మగవాళ్లు చెప్పినట్టు వినాలి. లేదు, కాదు, కూడదు అనడానికి వీల్లేదు. అన్నిటికీ తలూపాలి తప్ప ఎదురు సమాధానం ఇవ్వకూడదు. అయితే ఇది నిరంజన్ వాళ్లమ్మకూ సమ్మతమే. ఆమెకే ఏంటి వాళ్ల అమ్మకు, అత్తమ్మకూ అంగీకారమే. ఆ కాలం నుంచీ వాళ్లు పాటిస్తున్న నియమమే! అందుకే నిరంజన్‌కు ఆడవాళ్లు నో చెబితే తట్టుకోలేని నైజం అలవడింది. నో అంటే ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రతికూల ఆలోచనా డెవలప్ అయింది. ఇటు అమ్మాయి స్వర్ణ కుటుంబమూ అదే భావజాలంలో ఉంది. వాళ్లది ఉమ్మడి కుటుంబం. ప్రేమానురాగాల మధ్య పెరిగినా.. పెత్తనం పురుషుడిదే. నో అనే హక్కు ఆడవాళ్లకు ఆ ఇంట్లోనూ తక్కువే. ఆర్థిక అవసరాల దృష్ట్యా స్వర్ణ ఉద్యోగంలో చేరింది. బయట వాతావరణం, మనుషుల ప్రవర్తనను చూసి కాస్త లోకజ్ఞానం అలవర్చుకుంది. ధైర్యంగా ఉండడం నేర్చుకుంది. తనకు నచ్చని వాటికి నచ్చలేదు అని చెప్పడం తెలుసుకుంది. అలాగే నిరంజన్‌కూ చెప్పింది కుదరదు, కూడదు, నచ్చలేదు అని.
సంఘటనకు ముందు నేపథ్యం
నిజానికి నిరంజన్, స్వర్ణ ఒకటే కంపెనీలో పనిచేస్తారు. స్వర్ణ ఒంద్దికైన పిల్ల. చేస్తున్న పని పట్ల నిబద్ధత, నిజాయితీ ఆమె స్పెషల్ క్వాలిఫికేషన్స్. డిసిప్లిన్ విషయంలోనైతే చెప్పే పనేలేదు. నిరంజన్ ఆమెకు పూర్తి వ్యతిరేకం. ఆకతాయి. పనంటే నిర్లక్ష్యం. ఏదైనా క్షణాల మీద కావాలనే తత్వం. క్రమశిక్షణ, పని విషయంలో పైవాళ్లతో చాలాసార్లు చీవాట్లు తిన్నాడు. స్వర్ణను చూసి కావాలనుకున్నాడు. పెళ్లి చేసుకుంటాను ఒప్పుకో అని ఒత్తిడి చేశాడు. మొత్తానికి ఆఫీస్‌లో అతని క్రమశిక్షణారాహిత్యం వల్ల ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి స్వర్ణనూ ఉద్యోగం మానేయమనే నస మొదలుపెట్టాడు. అసలు అతనిని కనీసం స్నేహితుడిగా కూడా గుర్తించని స్వర్ణ నిరంజన్ చేష్టలను బేఖాతరు చేసింది. అర్థం చేసుకోవాల్సింది పోయి అహంకారంతో ఆమెను అంతమొందించాడు అతను. దానికి చట్టం నిరంజన్‌కు శిక్ష వేస్తుండొచ్చు. కాని మగపిల్లలు అలాంటి ప్రవర్తనతో పెరగకుండా శిక్షణ ఇంట్లో కావాలి.
బాల్యంలోనే సరిదిద్దాలి
యూత్ ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. వాళ్లకి ఏమాత్రం ఓపిక, సహనం ఉండవు. ఆలస్యాన్ని ఏమాత్రం భరించలేరు. అయితే, తల్లిదండ్రులు చిన్నప్పటినుంచే పిల్లలకు ఓపిక, సహనం ప్రాముఖ్యతను తెలియజెయ్యాలి. ఓపిక పట్టలేకపోతే, సహనం లేకపోతే జీవితంలో విజయం సాధించలేవు అని చెప్పాలి. గెలుపు, ఓటమి అనేవి సర్వసాధారణమని, రెండూ బొమ్మా బొరుసు వంటివనీ, గెలిస్తే ఎంత సంబరపడతామో, ఓడిపోతే అంతకన్నా ఎక్కువ సహనం వహించాలని, దానిని అంగీకరించి తీరాలని వారికి తెలియజెప్పాలి. ఎదుటివారి ముఖ్యంగా స్త్రీలకు కూడా అభిప్రాయాలు ఉంటాయనీ, వాటిని కూడా గౌరవించాలని గట్టిగా చెప్పాలి. పిల్లలకు స్త్రీల పట్ల, తోటి బాలికలు, అక్కచెల్లెళ్ల పట్ల చులకన భావం ఉన్నట్లు గమనిస్తే దానిని చిన్న వయస్సులోనే సరిదిద్దాలి. ఇటువంటి సంఘటనలు అంటే ఆడవాళ్ల పట్ల చెడుగా, దుర్మార్గంగా ప్రవర్తించిన సంఘటనలు ఏమైనా జరిగితే, వాటి గురించి వారి అభిప్రాయం ఏమిటో కనుక్కుని, ఒకవేళ తప్పుడు అభిప్రాయం ఉంటే దానిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. క్యూలో ఆడవాళ్లు ఉంటే వారిని గౌరవించి, ముందే పంపడం, బస్సుల్లో, రైళ్లల్లో మనం కూర్చుని ప్రయాణించేటప్పుడు ఆడవాళ్లెవరైనా వస్తే, లేచి నిలబడి వాళ్లకి మన సీట్ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించడం వంటి మంచి పద్ధతులను అలవాటు చేస్తే, పెద్దయ్యాక వాళ్లు సంస్కారవంతులవుతారు. సమాజంలో స్త్రీల పట్ల చులకన భావం ఉండకుండా ఉంటుంది. వారి అభిప్రాయాన్ని గౌరవించడం అలవాటవుతుంది.
– డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,
లూసిడ్ డయాగ్నోస్టిక్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment