ప్రేమ గుడ్డిదని, అది చిగురించినప్పుడు సరిహద్దులు కనిపించవని అంటారు. ఇది ‘బాబు’ ప్రేమకథతో మరోమారు నిజమని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన బాబు తాను ప్రేమించిన పాక్ యువతి కోసం సరిహద్దులు దాటి, తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.
బాబు సోషల్ మీడియా(Social media)లో చూసి, ఒక పాక్ యువతిని ప్రేమించాడు. తొలి చూపులోనే ప్రేమలో పడిన బాబు ఆ యువతి కోసం వీసా, పాస్‌పోర్టు లేకుండా దేశ సరిహద్దులు దాటేశాడు. ప్రస్తుతం బాబు పాకిస్తాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ ప్రేమికుని అసలు పేరు బాదల్, అయితే బాబు అని ముద్దుగా ఇంట్లోనివారు పిలుస్తుంటారు. ఇప్పుడు అతని కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాబును సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.
అలీగఢ్ జిల్లా బార్లా పోలీస్ స్టేషన్(Police station) పరిధిలోని నాగ్లా ఖిత్కారీ గ్రామానికి చెందిన బాదల్ అలియాస్ బాబు(30) సోషల్ మీడియాలో చూసి, ఒక పాక్ యువతి ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమలో బాబు ఎంతగా మునిగిపోయాడంటే.. వెంటనే ఇంటిని వదిలి పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సరైన వీసా, పత్రాలు లేకుండా సరిహద్దులు దాటాడు. పాకిస్తాన్‌లోని మోజా మోంగ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన బాబును పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన 2024, డిసెంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పోలీసుల విచారణలో బాదల్ తాను సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ యువతి ప్రేమలో పడ్డానని, ఆమెను కలిసేందుకే పాకిస్తాన్ వచ్చానని చెప్పాడని సమాచారం.
బాదల్ ఢిల్లీలోని గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుటుంబంలోని ముగ్గురు సోదరులలో అతను రెండవవాడు. బాబు ఓ పాకిస్తానీ యువతితో ఫేస్‌బుక్‌లో చాట్ చేస్తుంటాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీపావళికి ముందు బాబు ఇంటికి వచ్చాడని, తిరిగి ఢిల్లీకి వెళ్లే ముందు తన గుర్తింపు కార్డు(Identity card), ఇతర పత్రాలను ఇంట్లో పెట్టి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి బాబుకు సంబంధించిన సరైన సమచారం అందలేదన్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ పోలీసులు.. బాబును వీసా, ఇతర పత్రాలు అడిగినప్పుడు, అతను ఏమీ చూపించలేదు. దీంతో అతను పాకిస్తాన్ ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 13, 14 కింద అరెస్టయ్యాడు. కాగా బాబు గతంలో రెండుసార్లు భారత్-పాక్ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడని, అయితే అతని ప్రయత్నం సఫలం కాలేదని పాక్ పోలీసులు చెబుతున్నారు.
బహౌద్దీన్ ప్రాంతంలో పట్టుబడిన బాబును అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. బాబు పాక్‌లోకి ప్రవేశించడం ప్రేమ కోసమేనా లేదా మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచి కానీ, భారత రాయబార కార్యాలయం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ నూతన సంవత్సరంలోనైనా తమ బాబు తమ ఇంటికి వస్తాడని అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆలయాల్లో నూతన సంవత్సర సందడి
Comments
Please login to add a commentAdd a comment