పద్మావత్ సినిమా ఒక మహిళ వీరత్వానికి, చతురత్వానికి, ఔన్నత్యానికి దివిటీ అవుతుందనుకుంటే... ‘ఇది చరిత్ర కాదు. కల్పనే’ అని నొక్కి వక్కాణించిన భన్సాలీ... చివరికి పోరాడలేక నిస్సహాయురాలై నిశ్చేష్టురాలై సంక్షోభాన్ని గట్టెక్కలేక తనతో పాటు వందల మంది మహిళల్ని (గర్భిణులు, పిల్లలకు కూడా ఉన్నారు) పద్మావతి బూడిద చేస్తుందని చూపించాడు! సినిమా చూడ్డానికి బాగుంది. నిమగ్నం అవడానికి స్ఫూర్తి పొందడానికి కీర్తించుకోడానికి కూడా బాగుండాల్సింది.
రూపమా? గుణమా?
ఏది ముఖ్యమన్న ప్రశ్న ఎదురైనప్పుడు, గుణం అంటుంది రాణి పద్మావతి. ఆ గుణాన్ని నిరూపించుకోవడం కోసం తన రూపాన్ని కూడా ఆహుతి చేస్తుంది. ఇదీ ఒక్క మాటలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమా. అది ఎలాంటి గుణం? శత్రువు దగ్గర తలవంచని గుణం. శత్రువు తన గౌరవాన్ని మట్టుబెట్టడానికి వచ్చినప్పుడు ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడే గుణం. రాజపుత్రిక ఖడ్గంలో ఎంత శక్తివుందో రాజపుత్రిక గాజుల్లో కూడా అంతే శక్తి వుందని నమ్మే గుణం. ఒక స్త్రీ గౌరవం స్త్రీ శీలంతో బలంగా ముడిపడిన 13వ శతాబ్దపు నాటి కథ ఇది. చారిత్రక కల్పన. భార్య కోసం ముత్యాలు కొనడానికి సింహాళ్ వెళ్లిన మహారావల్ రతన్ సింగ్ ‘ప్రమోదవశాత్తూ’ పద్మావతి వేటాడుతుండగా ఆమె బాణపు వేటుకు గాయపడుతాడు. పద్మావతి! ఎలాంటి అపురూప సౌందర్యవతి? ‘ఆమె నీడ కూడా మోహం కలిగించేంత అందం’! అంతటి దివ్యవిగ్రహం కాబట్టే, ఆమెను వివాహం చేసుకుని చిత్తోఢ్‌కు తెచ్చిన తర్వాత, రతన్‌సింగ్ రాజగురువు కూడా తన వ్యక్తిత్వాన్నీ, తనకు రాజ్యం తరఫున అందుతున్న గౌరవాన్ని కూడా పక్కనపెట్టి పద్మావతిని దొంగచాటుగా చూడటానికి ప్రయత్నిస్తాడు. దాంతో రతన్‌సింగ్ ఆయనకు దేశబహిష్కార శిక్ష విధిస్తాడు.
అల్లాహ్ సృష్టించిన ప్రతి అందమైన దానిమీదా అల్లావుద్దీన్ ఖిల్జీకి హక్కు ఉంటుంది అనుకునేంత వాంఛాపరుడు ఖిల్జీ. పెళ్లి రోజుకూడా పరస్త్రీని కోరుకునేంత విచ్చలవిడితనం ఉన్నవాడు. పిల్లనిచ్చిన మామను సింహాసనం కోసం చంపేసినవాడు. కిరీటం ఎంత చెడ్డది, అది తలల్నే మార్చేస్తుంది అని చమత్కరిస్తాడు కూడా. ఇంకా బైసెక్సువల్ కూడా. మాలిక్ కాఫుర్ ‘ఆయనకు పెళ్లాంలాంటివాడు’ అనిపిస్తాడు దర్శకుడు ఒక పాత్రతో. అలాంటి ఖిల్జీకి తన పన్నాగంతో పద్మావతిని పొందని జన్మ జన్మే కాదనీ, ఆమె వుంటే స్వర్గం నేలమీదే వున్నట్టనీ ఊరిస్తాడు రాజగురువు. అలా విపరీతమైన లాలసను పెంచుకున్న ఖిల్జీ చిత్తోఢ్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. రతన్‌సింగ్‌ను సంధి పేరుతో కుయుక్తిగా బంధించి ఢిల్లీకి పట్టుకెళ్లడమూ, అంతే యుక్తిగా పద్మావతి మళ్లీ రతన్‌సింగ్‌ను విడిపించుకు రావడమూ, దీనికి ఖిల్జీ భార్య మల్లికయే సాయం చేయడమూ, దాన్ని అవమానంగా భావించిన ఖిల్జీ భార్యను బంధించి తిరిగి చిత్తోఢ్‌కు భారీ ఫిరంగులతో వెళ్లడమూ (ఆ ఫిరంగి సామర్థ్యం చిత్తోఢ్‌కు లేదు), రతన్‌సింగ్ యుద్ధంలో మరణించడమూ(ఇక్కడా కుయుక్తిగానే), భర్త మరణించాడని తెలిసిన పద్మావతి సహా ఏడువందలమంది రాజపుత్రికలు సతీసహగమానానికి పాల్పడటమూ గగుర్పొడిచే ఘట్టం! ఖిల్జీ కనీసం పద్మావతి కొనగోటిని కాదుగదా, కనీసం కొనచూపుతో కూడా చూడకుండానే ఆమె బూడిదైపోతుంది.
రాజపుత్ర ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి పూర్తి కంకణం కట్టుకుని తీసిన సినిమాలా అనిపిస్తుంది. దీన్ని బట్టి రాజపుత్ర కర్ణిసేన చేసిన నిరసన ప్రదర్శనలు ఎంత అర్థరహితమో అనిపిస్తుంది. ఏ వ్యక్తుల, కులాల, మతాల, జాతుల విశ్వాసాలను కించపరచడానికి ఈ సినిమా తీయలేదు అని ముందుగానే జాగ్రత్తగా ప్రకటించిన ఈ సినిమాలో నిజానికి గాయపడటానికి అవకాశం ఉన్న పాత్ర ఖిల్జీది మాత్రమే. ఒక దృశ్యంలో తన పేరులేని చరిత్ర పుటల్ని ఖిల్జీ చించేస్తాడు. ఖిల్జీ కోణంలోంచి చూస్తే గనుక ఈ సినిమా కూడా చిరిగిన పుటే. ఖిల్జీ పాత్రకు ఎక్కడా కూడా ఒక సానుకూల కోణాన్ని ఇవ్వలేదు. కొన్నిసార్లు కవిత్వాన్ని ఆస్వాదించినట్టూ, తానే స్వయంగా కవితలు అల్లినట్టూ చూపినప్పటికీ ఆ కవిత చెప్పగలగడానికి కారణమైన సున్నితత్వాన్ని ఏ దృశ్యంలోనూ చూపలేదు. అతడు మొదటినుంచీ లాలసుడే. రతన్‌సింగ్ మొదటి భార్య వ్యక్తిత్వంగానీ, రతన్‌సింగ్– పద్మావతి మధ్య అద్భుతమైన ప్రేమ పండినట్టుగానీ ఆవిష్కరణ జరగదు. దాంతో ఏ పాత్ర ఉద్వేగంతోనూ నడవడానికి ఆధారం దొరకదు. కానీ భన్సాలీ అన్ని సినిమాల్లాగే సాంకేతికంగా గ్రాండ్‌గా ఉంది. విజువల్లీ రిచ్. ఇది బాగా తీయబడిన సినిమాయేకానీ బాగా రాయబడిన సినిమా కాదు అనిపిస్తుంది. చివరి అరగంట సతీసహగమన ఘట్టంలో మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ భారంతోనే సినిమాకు తెర పడుతుంది కాబట్టి సినిమా బాగుంది అనేలా చేస్తుంది.
టాప్‌క్లాస్ విజువల్స్
రాజ్‌పుత్ రతన్‌సింగ్‌కు తాను పంపిన వర్తమానానికి సమాధానం కోసం ఎదురుచూస్తుంటాడు అల్లావుద్దిన్ ఖిల్జీ. ఆ వర్తమానంలో ఏం పంపాడో చూసిన పద్మావతి దాన్ని కాల్చేస్తుంది. అల్లావుద్దీన్ ఎదురుచూస్తూనే ఉంటాడు. ఈ సన్నివేశాల్లో షాట్ కంపోజిషన్స్ ఒక చిన్న ఉదాహరణ మేకింగ్ పరంగా ‘పద్మావత్’ టాప్‌క్లాస్ అని చెప్పడానికి. యుద్ధం మొదలైందని తెలిశాక, పద్మావతి పరిగెత్తుకుంటూ కోట గుమ్మం వరకూ వెళ్లే సన్నివేశంతో పాటు చాలా చోట్ల కొన్ని అన్‌కట్ లాంగ్ టేక్స్ చూడొచ్చు. ఇలాంటివి సంజయ్ లీలా భన్సాలీ లాంటి మాస్టర్స్‌కే సాధ్యమనిపించే షాట్స్. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీలో అన్నీ మెరుపులే!
కాస్ట్యూమ్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటి. భన్సాలీ సినిమాల్లో కాస్ట్యూమ్స్ వేరే లెవెల్ అనేలా ఉంటాయి. ఇందులోనూ అది కనిపిస్తుంది. అదేదో మెయిన్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాకుండా ప్రతీ క్యారెక్టర్‌కూ కాస్ట్యూమ్స్ టాప్‌క్లాస్ ఉండేలా చూసుకున్నారు. కాస్ట్యూమ్ కలర్స్ కూడా కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. టెక్నికల్ అంశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువ చెప్పుకోవాలి. క్లైమాక్స్ ఎలివేట్ అయ్యేదంతా స్కోర్‌తోనే! పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, అదితిరావు హైదరి లాంటి స్టార్స్ ఉన్నారు ఈ సినిమాలో. వాళ్లను చూస్తేనే ఏదో మ్యాజిక్ చెయ్యగలరన్న నమ్మకం కలిగించే స్టార్స్ అంతా. ఆ నమ్మకాన్ని ఎవ్వరూ వమ్ము చెయ్యలేదు. ప్రతీ ఒక్కరిదీ టాప్‌క్లాస్ పర్‌ఫార్మెన్స్. రణ్‌వీర్ సింగ్ వరుసగా తాను నెక్స్›్ట జనరేషన్ సూపర్‌స్టార్ అనిపించుకునేలానే నటించేశాడు.
ఎన్నో జీవిత కాలాలు వెనక్కి
‘‘ఈ చిత్రం సతీసహగమనాన్ని ఏవిధంగానూ సమర్థించడం లేదు.’’ అనే కార్డ్‌తో మొదలవుతుందీ సినిమా. అది సమర్థించాల్సిన విషయం కాదన్నది అందరూ ఒప్పుకోవాల్సిందే! మరి సినిమా ఏం చెప్తోంది? సమర్థ్ధించాల్సిన విషయం కాదన్న రోజు ఈకథ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా? ఈ ప్రశ్నలు రాకుంటే సినిమా ఎలాగూ మెప్పించడానికి చాలా సెల్లింగ్ పాయింట్స్‌నే పెట్టుకుంది. వస్తేనే.. ఎన్నో జీవిత కాలాలు వెనక్కి వెళ్లిన, ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదన్న సినిమాగా కనిపిస్తుంది. మరోరకంగా ఆలోచిస్తే హిస్టారికల్ ఫిక్షన్‌లో ఇదిలా ఉండాలని కోరలేని అవసరంగా కూడా కనిపించొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment