
∙క్షురకవృత్తిలో ఉన్న భర్త అకస్మాత్తుగా మరణిస్తే అంతులేని కష్టాలను ఎదుర్కొని నేడు విశాఖలో అతి పెద్ద సెలూన్‌ను యజమానిగా మారిన ఆతవ పద్మావతి... తన కుటుంబ సభ్యులతో...
కష్టం అలివిగాని జుట్టులా అదేంటో నెత్తి మీదే మొలుస్తుంది. పెద్ద భారమైపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చిక్కులుగా తయారవుతుంది. అలాగే భరిస్తూ కూచుంటే ఊడల్లాగా పాకుతుంది. ఎక్కడో మనలో దాగున్న మనోధైర్యాన్ని బయటికి తీసుకొస్తే ఆ కష్టాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చేయొచ్చు.
‘అమ్మా... బిడ్డల మొహం చూసి బతకాలమ్మా... కష్టం ఎప్పుడూ శాశ్వత చుట్టం కాదు.. ఏదో ఒక రోజు అది పెట్టె సర్దుకొని వచ్చినదారినే వెళ్లాల్సిందే’ అని ఆమె ఇచ్చిన మానసిక ధైర్యంతో ఆలోచన విరమించుకున్నా.
మా స్వస్ధలం చీరాల. చిన్న వయసులోనే మా అమ్మానాన్నలు నాకు లోకేశ్వర్రావుతో పెళ్లి చేశారు. నా భర్తది బార్బర్ పని. ఆరుగురు పిల్లలు పుట్టారు. అందరూ కొడుకులే. నా భర్త ఉమ్మడి కుటుంబంలో ఉంటూ బార్బర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయిన కొన్నాళ్లు మా జీవితం సజావుగానే సాగింది. మూడో పిల్లాడు కలిగేనాటి నుంచి నా భర్తలో మార్పులొచ్చాయి. చెడు అలవాట్లలో పడి ఇంటికి ఆలస్యంగా రావడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం చేసేవాడు. అతని బాధ్యతారాహిత్యంపై ఆయన అన్నదమ్ములు విసిగిపోయారు. నా భర్త మారతాడని ఎన్ని రకాలుగానో ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి కుటుంబం నుంచి దూరంగా పెడితే బాగుపడతాడని మమ్మల్ని దూరం పెట్టారు.
స్కూలు ఉప్మాయే భోజనం
నా భర్త, నేను, పిల్లలం విశాఖ వలస వచ్చేసి పాతగోపాలపట్నంలో చిన్నపాక అద్దెకు తీసుకుని బతకడం ప్రారంభించాం. మా ఆయన చిన్నబడ్డీ పెట్టుకుని క్షౌరవృత్తితో సంపాదనకు ప్రయత్నించాడు. కొంతకాలం తిండికి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని నెట్టుకు వస్తుండగా కష్టం నా నెత్తి మీద పడింది. ఆయనకు హటాత్తుగా క్యాన్సర్ సోకింది. నాకేం అర్థం కాలేదు. ఇంత పెద్ద కష్టమా అనుకున్నాను. కేజీహెచ్‌లో ఆయనకు వైద్యం ఇప్పిస్తూ ఇంకో వైపు పిల్లలను పోషించడానికి నానా ప్రయాశలు పడ్డాను. చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. భయంకరమైన ఆకలి. చివరకు శనక్కాయలు అమ్మి పిల్లలకు పట్టెడన్నం పెట్టడానికి చాలా కష్టపడ్డాను. చాలామార్లు పస్తులుండేదాన్ని. పాతగోపాలపట్నం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పెట్టే ఉప్మాయే తప్ప ఇంట్లో భోజనం ప్రతి రోజూ ఉండేది కాదు. పాఠశాలకు సెలవిస్తే ఆ రోజు నాతో పాటు పిల్లల పరిస్ధితి రోదనగానే ఉండేది. నా వేదనను మా బావ బోసుబాబు, మరిది అప్పారావు అర్థం చేసుకున్నారు. పెద్దకొడుకు వరప్రసాద్‌ను చీరాల తీసుకువెళ్లారు. రెండో కొడుకు శ్రీనుని తొమ్మిదో ఏటే గత్యంతరం లేక గోపాలపట్నంలో ఓ సెలూన్‌లో చేర్పించాను. శ్రీను నాకు తోడుగా రోజుకి రూపాయి సంపాదన తెచ్చిపెడుతుండేవాడు. అదే చాలా పెద్ద మొత్తంగా ఉండేది నాకు. నా మూడో కొడుకు విజయకుమార్ అప్పటికి ఒకటో తరగతి చదువుతుండగా, బలరాం నాలుగో సంవత్సరంలో అడుగులేస్తున్నాడు. కవలపిల్లలుగా ఉన్న రామ లక్ష్మణులకు రెండేళ్ల వయసు. ఆ సమయంలో నా భర్తకి ఆపరేషన్ చేసినా బతకలేదు. చనిపోయాడు. ఆ రోజు పాతగోపాలపట్నంలో భోరున వర్షం. క్యాన్సర్ రోగి అని నా భర్తని మోయడానికి గ్రామస్తులు ముందుకు రాలేదు. అంత్యక్రియలు చేయడానికి నా చేతిలో చిల్లిగవ్వలేదు. ఆ కష్టం ఒకటి ఈ కష్టం ఒకటి. చివరికి గ్రామస్తుల్ని ప్రాధేయపడితే నలుగురు వ్యక్తులు వచ్చారు. వారితో నేను కూడా పాడి మోశాను. పదేళ్ల వయసున్న నా కొడుకు శ్రీను తలకొరివి పెట్టాల్సి వచ్చింది.
మళ్లీ సొంతూరికి ప్రయాణం...
నా భర్త మరణంతో తేరుకోలేకపోయాను. ఒంటరి బతుకు ఎలా బతకాలా అని భయపడిపోయాను. బతుకు సాగించలేక పిల్లలతో స్వస్ధలం చీరాల వెళ్లిపోయాను. మా బావకు ఇద్దరు కొడుకుల్ని, మరిదికి ఇద్దరు కొడుకుల్ని అప్పగించి రామలక్ష్మణులతో అదే ఊళ్లో కన్నవారి ఇంటికి వెళ్లిపోయాను. చీరాల వెళ్లాక ఎన్నో అవమానాలు, సూటిపోటి మాటలు, నిందలూ భరించాను. తండ్రిలేని బిడ్డలతో ఎన్నాళ్లిలా కాలం గడిపేదని కుమిలిపోతుండేదాన్ని. ఆ రోజుల్లో భర్త లేని ఆడవాళ్లను సమాజంలో ఆదరించే పరిíస్థితి లేదు. విధవరాలి మొహం చూడకూడదని, ఎదురు పడితే ఛీఛీ అంటూ కొంతమంది ఈసడించుకుంటుండే వారు. మనోధైర్యం చెప్పేవారు ఉండేవారు కాదు. బంధుమిత్రుల్లో ఆదరణలేదు. ఇలాగైతే బతకలేమని, బతికి ఉన్నా జనం బతకనిచ్చేలా లేరని కుంగిపోయేదాన్ని. ఒకదశలో ఆత్మహత్యే శరణ్యమనుకున్నా. కానీ, ఆ సమయంలో ఓ ముసలామె ఓదార్పు నాకు బతకాలనిపించేలా చేసింది. ‘అమ్మా... బిడ్డల మొహం చూసి బతకాలమ్మా... కష్టం ఎప్పుడూ శాశ్వత చుట్టం కాదు.. ఏదో ఒక రోజు అది పెట్టె సర్దుకొని వచ్చినదారినే వెళ్లాల్సిందే’ అని ఆమె ఇచ్చిన మానసిక ధైర్యంతో ఆలోచన విరమించుకున్నా. మున్ముందు మంచి రోజులొస్తాయని ఆమె చెప్పిన మాటలు ఇపుడు నిజమయ్యాయి.
కొత్తజీవితం పెద్ద ఫ్యామిలీగా...
పిల్లలు ఎదిగొచ్చాక కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి మళ్లీ పిల్లలతో విశాఖ వలస వచ్చేశాను. గోపాలపట్నం శివారు చంద్రనగర్‌లో కుటుంబాన్ని నిలబెట్టుకున్నాను. ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో కష్టార్జితంతో కమ్మలిల్లు కట్టించాను. పిల్లలు సెలూన్‌లలో చేరి నాకు అండగా నిలిచారు. ఇలా ప్రతిరూపాయినీ పొదుపు చేసి బుచ్చిరాజుపాలెంలో చిన్నసెలూన్ పెట్టించాను. పిల్లలకు వరుసగా పెళ్లిళ్లు చేశాను. కోడళ్లు, కొడుకులతో ఉమ్మడి కుటుంబాన్ని బలోపేతం చేశాను. పిల్లల రెక్కల కష్టంతో కమ్మలింటిని కాస్తా మేడ ఇల్లుగా చేసుకున్నాం. పిల్లలు ఇపుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు సెలూన్‌లని నిర్వహించడంతో అవి ‘ఎంహెచ్yీ ఫ్యామిలీ∙సెలూన్’ పేరిట విస్తరిస్తున్నాయి. గోపాలపట్నంలో ఎంహెచ్‌డీ సెలూన్ నగరంలో అతిపెద్దదిగా పేరుపొందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మా ఆలోచనలకు తోడుగా కోడళ్లు కూడా ఊరికే కూర్చోకుండా ఫ్యామిలీ సెలూన్‌ని నడుపుతున్నారు. ఇలా కొడుకులు, కోడళ్లు మనుమలు, మనువరాళ్లతో ఒకేతాటిపై పెద్ద కుటుంబంగా ఉన్నామని చెప్పడానికి ఇపుడు గర్వంగానే ఉంది. కష్టాలొస్తే జీవితం లేదన్న భావన ఉండకూడదు...ఓర్పు, శ్రమ, విలువలే జీవితమని నన్ను ఉదహరిస్తూ జనం చెప్పుకుంటుంటే సంతోషంగా ఉంది.
– ఉద్దండం హరేకృష్ణగాంధీ, గోపాలపట్నం
Comments
Please login to add a commentAdd a comment