గాడీ నెం.6768 | special story to road Accidents | Sakshi
Sakshi News home page

గాడీ నెం.6768

Published Tue, Mar 20 2018 1:10 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

special story to road Accidents - Sakshi

‘మృత్యువు నుంచి  తప్పించు కోలేం’ అని అంటారు. కానీ, మృత్యువుకు  కారణమైనవాడిని కూడా తప్పించుకోనివ్వదు క్లూ! తప్పు జరగవచ్చు... చిన్నవి, పెద్దవి  ఎలాంటి తప్పులైనా జరగవచ్చు. ఆ తప్పును ఒప్పుకోవడంలో ధైర్యం ఉంది. తప్పు నుంచి పారిపోవడంలో ఉన్నది శిక్ష.

2016 డిసెంబర్‌ 10. హైదరాబాద్‌.తెల్లవారుజాము 6 గంటలు. మనసు కీడు శంకిస్తూ ఉంది. సాధారణంగా ఉదయాలు ప్రశాంతంగా అనిపిస్తాయి ఆమెకు. కాని ఆరోజు తెల్లవారుజాము ఏదో దుశ్శకునంగా ఉంది. అసలే రాత్రి పడ్డ పీడకల తాలుకు కలత వదల్లేదు. ఇప్పుడు ఈ గుబులు. అవునూ... ఈయన ఇంకా రాలేదేమిటి?వాకిలిలోకి వచ్చింది. గేటువైపు చూసింది. మరో అరగంట గడిచింది. గుబులు పెరిగిపోతోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. రోజూ ఐదింటికి వాకింగ్‌కు వెళ్లడం మామూలే. ఆరు లోపే వచ్చేస్తాడు. కొంచెం ఆలస్యం అయితే ఫోన్‌ చేస్తాడు. ఇవాళ రాలేదు. ఫోనూ చేయలేదు.సెల్‌ తీసుకొని కాల్‌ చేసింది. నో రెస్పాన్స్‌.. ఏమై ఉంటుంది?!  స్నేహితులు ఎవరైనా కలిసి ఉంటారులే అని మనసుకు సర్దిచెప్పుకుంది. కాని గుబులు. పేపర్‌ తిరిగేసింది. గమ్మం గుండా గేటు వరకు కళ్లను అప్పగించింది. కిచెన్‌లోకి వెళ్లింది. అప్పటికే ఒకసారి కలిపి ఉంచిన డికాషన్‌ చల్లారిపోతే మళ్లీ వేడి చేసింది. ఆయన వస్తే రోజూ కలిసి కాఫీ తాగడం అలవాటు.ఇంకా రాలేదేమిటి?గుబులు పెరిగిపోతూ ఉంది.ఫోన్‌ రింగ్‌ అయ్యింది. ఈ టైమ్‌లో ఫోన్‌ చేసేదెవరు? ఈయనే అయి ఉంటుంది. సెల్‌ చేతిలోకి తీసుకుంది.  కొత్త నెంబర్‌. ఇది కీడే... మనసు చెబుతూ ఉంది. వణుకుతన్న చేతిని కంట్రోల్‌ చేసుకుంటూ గ్రీన్‌ బటన్‌ ప్రెస్‌ చేసింది. అవతలి నుంచి విషయం వింటూనే  ఫోన్‌ జారి నేలన పడింది..
  
రాయదుర్గం గచ్చిబౌలీ రోడ్‌.రోడ్డు మీద ఆయన పడి పోయి ఉన్నాడు. కళ్లద్దాలు ఒకవైపు పడి ఉన్నాయి. చెప్పులు జారిపోయాయి. పేరు దేవదానం అని పోలీసులకు అర్థమయ్యాక ఇంటికి ఫోన్‌ చేశారు. ‘ఎలా జరిగింది?’ ఆమె అతి కష్టం మీద అడిగింది.‘హిట్‌ అండ్‌ రన్‌ కావచ్చు’ అని జవాబు వచ్చింది. ఆ గుర్తు తెలియని వాహనం ఎవరిది?  ప్రత్యక్షసాక్షులు ఎవరూ లేరు. ఓ చిన్న గోడ అడ్డు రావడంతో ఆ స్పాట్‌లో ఉన్న సీసీ కెమెరాలో యాక్సిడెంట్‌ రికార్డు కాలేదు. రోడ్లు ఊడ్చే వాళ్ళు,  పాలు పోసే వాళ్ళు, పాల ప్యాకెట్లు వేసే వాళ్ళు ఎవరిని ప్రశ్నించినా ఫలితం లేదు. ‘మాకు తెలియదు... మేం చూళ్లేదు’ అన్నారు.కేసు మిగిలిన ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసుల మాదిరిగా మిస్టరీగా మారింది. ఎవరైనా కావాలనే దేవదానంను హత్య చేసి ఉంటారా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? కుటుంబసభ్యులకు ఎడతెరిపిలేని సందేహాలు.వాటిని పోలీసుల ముందుంచారు. 
  
‘సార్‌... ఈ కేసులో అనఫీషియల్‌గా ఇన్‌వాల్వ్‌ కావడానికి నాకు పర్మిషన్‌ ఇవ్వండి’ అన్నారు సీసీఎస్‌ స్పెషల్‌ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్యాంబాబు.‘ఏం అవసరం శ్యాంబాబు... లోకల్‌ పోలీసులు ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నారుగా’ అన్నాడు పై అధికారి.‘చనిపోయింది మా నాన్న సార్‌. నేనొక పోలీసై ఉండి అతణ్ణి పట్టుకోలేకపోతే మనసుకు కష్టంగా ఉంది. మా నాన్న కోసమే కాదు... ఇలా హిట్‌ అండ్‌ రన్‌ చేసితప్పించుకోవచ్చు అనుకునేవారందరికీ ఈ కేసొక గుణపాఠం కావాలి’ పట్టుదలగా అన్నారు శ్యాంబాబు.‘ఓకే... గో అహెడ్‌’ పర్మిషన్‌ దొరికింది.శ్యాంబాబు ఘటనాస్థలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.దేవదానం మృతదేహం దొరికిన ప్రాంతంలో ఓ చిన్న ప్లాస్టిక్‌ ముక్క కనిపించింది. అది తప్ప ఇంకేమీ దొరకలేదు. ఈ కేసుకు ఇదే ముఖ్యమైన క్లూ అని శ్యాంబాబుకు అనిపించింది. దానిని పరీక్షగా చూశారు. ‘ఫోర్డ్‌’ అనే అక్షరాలు ఉండటం వల్ల అది ఫోర్డ్‌ కారుకు చెందిన మడ్‌గార్డ్‌ కుడివైపు లైనర్‌దిగా గుర్తించారు. దీన్ని తీసుకుని షోరూమ్‌కు వెళ్ళిన ఆయన దాన్ని అక్కడి మెకానిక్స్‌కు చూపించారు. ‘ఇది 2012 మోడల్‌కు చెందిన ఫోర్డ్‌ ఫిగో కారుది సార్‌’అని తేల్చారు వాళ్లు.
 
తండ్రి మరణానికి ఈ ఫోర్డ్‌ ఫిగోకి లంకె ఉందని శ్యాంబాబుకు అర్థమైంది. వెంటనే గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం మార్గంలో ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. యాక్సిడెంట్‌ అయిన రోజు అనేక కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించి పరిశీలించారు. ముఖ్యంగా ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య వెళ్ళిన ఫోర్డ్‌ ఫిగో మోడల్స్‌పై దృష్టిపెట్టారు. ఓ సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్‌ మరికొంత క్లూ ఇచ్చింది.‘నెంబర్‌ జూమ్‌ చేయండి’ ఆదేశించారు శ్యాంబాబు.జూమ్‌ అయ్యింది.ఏపీ 10 బీసీ 6768.ఎస్‌. ఈ కారే అయి ఉండాలి. వెంటనే ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న అడ్రస్‌ దొరికింది. 2017 జనవరి 2.తన తండ్రిని చంపింది ఎంటెక్‌ విద్యార్థి గుత్తికొండ ప్రశాంత్‌కుమార్‌గా శ్యాంబాబు తేల్చారు. 

ఆ రోజు ఏమైందంటే...
ప్రశాంత్‌ ముందురోజు రాత్రి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నాడు. తెల్లవారుజామున ఇంటికి బయల్దేరాడు. నిద్ర, మద్యం మత్తు.... ఎక్స్‌లేటర్‌ మీద అదుపులేని కాలు.. దారిలో వాకింగ్‌ చేస్తున్న దేవదానాన్ని ప్రశాంత్‌ గుర్తించలేదు. దారుణంగా యాక్సిడెంట్‌ చేసి ఆయన మృతికి కారకుడయ్యాడు. అయితే ఆ యాక్సిడెంట్‌ని ఎవరూ చూడలేదని గ్రహించి నేరుగా సికింద్రాబాద్‌లోని బాపుబాగ్‌కాలనీలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్‌ తండ్రి గుత్తికొండ రమేష్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ దుకాణం నిర్వహించడంతో పాటు ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టులు చేస్తుంటారు. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్‌ తాను కూకట్‌పల్లి నుంచి వస్తుండగా కారు గుంతలో పడి మడ్‌గార్డ్‌ దెబ్బతిందని తల్లిదండ్రుల్ని నమ్మించాడు. కొన్ని రోజులపాటు బండిని బయటకు తీయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రశాంత్‌ బోయిన్‌పల్లిలోని ఓ గ్యారేజ్‌లో కార్‌ రిపేర్‌ చేయించాడు. రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించుకోవడానికి కారు నెంబర్‌ ప్లేట్‌తో పాటు మడ్‌గార్డ్‌ తదితరాలను మార్చేందుకు పూనుకున్నాడు. ఈ క్రమంలోనే బోయిన్‌పల్లిలోని గ్యారేజ్‌లో ఉన్న కారును స్వాధీనం చేసుకున్న శ్యాంబాబు ఘటనాస్థలిలో దొరికిన లైనర్‌ ముక్కను దానికి అమర్చి చూడగా సరిగ్గా సరిపోయింది. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రమాదం జరిగిన సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడనేది నిరూపించడం కోసం పోలీసులు ఆ రోజు అతడు వెళ్ళిన పబ్స్‌లో నమోదైన సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు అతడు తన డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లించిన బిల్లుల్నీ సేకరించారు. సాక్ష్యాల తారుమారుకు యత్నించిన ప్రశాంత్‌పై నమోదైన కేసులో ఆ సెక్షన్లనూ జోడించి అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది.

ఎవరీ దేవదానం?
నాయబ్‌ సుబేదార్‌ హోదాలో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించిన దేవదానం ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్‌ యుద్ధాల్లో పాల్గొన్నారు. సంగ్రామ్‌ మెడల్, వార్‌ మెడల్, ‘25 ఇయర్స్‌ ఇండిపెండెన్స్‌ మెడల్‌’ పొందారు.  పదవీ విరమణ తర్వాత  రాయదుర్గంలో తన భార్యతో కలిసి నివసిస్తూ 72 ఏళ్ళ వయస్సులోనూ ఫస్ట్‌మ్యాన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌లో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేసేవారు.. ముగ్గురు కుమారులూ ఉన్నత స్థితిలోనే ఉన్నప్పటికీ తాను మాత్రం ఖాళీగా కూర్చోనంటూ ఉద్యోగం కొనసాగించారు. హైదరాబాద్‌ దర్గా ప్రాంతంలో అందరికీ సుపరిచితుడైన దేవదానం ఎప్పటిలాగే 2016 డిసెంబర్‌ 10 తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్ళారు. వాకింగ్‌ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న ఆయన్ను 5.30 గంటల ప్రాంతంలో మాతా మందిర్‌ వద్ద ఓ కారు ఢీ కొట్టి వెళ్ళిపోయింది. తీవ్రగాయాల పాలైన ఆయన అక్కడే రక్తపు మడుగులో మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలారు. 

క్లూ కథనాలు పంపండి
రెండు రాష్ట్రాలలో ఎందరో గొప్ప పోలీస్‌ ఆఫీసర్లు ఉన్నారు. ఎన్నో గొప్ప కేసులను క్లూల ద్వారా సాల్వ్‌ చేసి ఉంటారు. అలాంటి ఆఫీసర్లకు ఇదే మా ఆహ్వానం. మీరు సాల్వ్‌ చేసిన కేసులను సాక్షి పాఠకులతో పంచుకోండి. నేరస్తుడు తప్పించుకోలేడన్న భావన నేరాన్ని సగం నిరోధిస్తుంది. నేరం లేని సమాజం కోసం సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని ఆశిస్తూ... మీరు సాల్వ్‌ చేసిన కేసు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్‌: sakshiclue@gmail.com
ఇన్‌పుట్స్‌: కామేశ్, సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement