రాయల్‌ ఫొటోగ్రాఫర్‌ | Special story to Royal photographer | Sakshi
Sakshi News home page

రాయల్‌ ఫొటోగ్రాఫర్‌

Published Fri, Jun 22 2018 12:25 AM | Last Updated on Fri, Jun 22 2018 12:25 AM

Special story to Royal photographer  - Sakshi

ఛాయాశిల్పి పైన ఒక ఎర్రలైటు. దాని పక్కన మరో సాధారణ లైటు. ఆ లైట్ల కింద టేబుల్‌ పైన ఒక డిష్, డెవలపర్, ఫిక్సల్, వాటర్‌.. నెగటివ్‌ను డెవలప్‌చేసిన తర్వాత కనిపించే ఫొటో! తొమ్మిదో తరగతి సైన్స్‌ క్లబ్‌లో చేసిన ఆ ప్రయోగం అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఫొటోలు డెవలప్‌చేయడం ఎలా?’ అనే ఉత్సుకతతో తన కెరీర్‌కు శ్రీకారం చుట్టారు కుసుమ ప్రభాకర్‌. ఫొటోలు డెవలప్‌ చేయాలంటే ముందు ఫొటోలు తీయాలి కదా. అలా మొదలైన అభిరుచి ప్రభాకర్‌ని ఒక ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌గా మలిచింది. 1969 నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా బీఎస్సీ పూర్తి చేయలేకపోయినా చక్కటి ఫొటోగ్రాఫర్‌గా రాణించారు. 1977లోనే ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫొటోగ్రాఫర్స్‌లో సభ్యుడయ్యారు. ‘‘షట్టర్‌ నొక్కితే బొమ్మ వస్తుంది. కానీ నాకు కావలసింది ఆ బొమ్మ వెనుక ఉన్న ఆలోచన. దానిలో భావం ప్రతిఫలించాలి. జీవితాన్ని పట్టుకోవాలి. ఈ తపనతోనే నా జర్నీ ప్రారంభించాను. అనేక ప్రాంతాలు తిరిగాను. ఈ అన్వేషణలోనే ‘ది రాయల్‌æఫొటోగ్రఫిక్‌ సొసైటీ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్‌’ గురించి తెలిసింది. 1853లో ఆవిర్భవించిన సంస్థ అది. 1984లో ఆ సంస్థలో నాకు అసోసియేట్‌షిప్‌ లభించింది.

ఆ సంస్థ నుంచే ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్‌ లభించింది’’ అని సంతోషం వ్యక్తం చేశారు ప్రభాకర్‌. 1986లో ‘లైఫ్‌ ఇన్‌ కామన్వెల్త్‌’ అనే అంశంపైన కామన్వెల్త్‌ దేశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరిగినప్పుడు ఆ పోటీల్లో ప్రభాకర్‌ తీసిన ఫొటోలకు స్పెషల్‌ మెరిట్‌ అవార్డు లభించింది. ఆ పోటీల కోసం లంబాడాల జీవితాన్ని ఆయన ఇతివృత్తంగా ఎన్నుకున్నారు. వెలుతురు లేని నీడలు! ‘‘పెయింటింగ్‌ విత్‌ లైట్, పెయింటింగ్‌ విత్‌ షాడోస్‌.. సాధారణంగా ఏ ఫొటోగ్రాఫరైనా లైట్ల వెలుతురులోనే ఫొటోలు తీస్తారు. కానీ నా ఫొటోల్లో ఆ వెలుతురు ఉండదు. నీడలు మాత్రమే కనిపిస్తాయి. తల్లీబిడ్డల అనుబంధం, లంబండాల నృత్యాలు, ఆనందోత్సాహాలు వంటి ఛాయా చిత్రాలు నా ఫొటోగ్రఫీకి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. అవన్నీ ఎలాంటి వెలుతురు అవసరం లేకుండా తీసినవే..’’ అని చెప్పారు ప్రభాకర్‌. కామన్వెల్త్‌ పోటీల్లో గెలుపొందడమే కాకుండా ప్రత్యేక ఆహ్వానంపైన నెల రోజుల పాటు ఆయన లండన్‌లోనే ఉండిపోయారు. మరిన్ని మెళకువలు నేర్చుకొన్నారు. ఆ తరువాత ఇండియాకు వచ్చి అనేక ప్రాంతాల్లో పర్యటించి జీవితాన్ని, ప్రకృతిని, సమాజ పరిణామాలను ప్రతిబింబించే అనేక చిత్రాలను షూట్‌ చేశారు. భావాల బంధనం ఫొటోగ్రఫీ కోసం వరంగల్‌లోని ఓ శరణాలయంలో చిన్నారులతో అనేక రోజులు గడిపారు ప్రభాకర్‌. వాళ్లలో లైంగిక వేధింపులకు గురైన ఓ అమ్మాయి మతిస్థిమితం కోల్పోయి తరచుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు; ఆకలో, ఇంకే బాధో తెలియని మరో చిన్నారి కంఠ నాళాలు తెగిపోతాయేమోనన్నంతగా అరుస్తున్నప్పుడు వారి ముఖకవళికలను ప్రభాకర్‌ కెమెరా వడగట్టింది ‘‘అలా 8 నెలల పాటు తీసిన ఫొటోల్లో 20 ఫొటోలను మాత్రమే పోటీకి పంపాను.

ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఆ పోటీల్లో పాల్గొన్నారు. భారత్‌ నుంచి నాకు అవార్డు లభించింది’’ అని ప్రభాకర్‌ తెలిపారు. గత నెల 24న ఆయన ఈ ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్‌ను సొంతం చేసుకున్నారు. – పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్‌ ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే! భావోద్వేగాలకు పటంలో ఘనీభవింపజేసే శక్తి ఒక్క కెమెరాకు మాత్రమే ఉంది. క్లిక్‌మనిపించే ఆ క్షణం ఒక జీవన సత్యం. అయితే ప్రతి దృశ్యం ఛాయాచిత్రం కాలేదు. దాని వెనుక ఉన్న భావం మాత్రమే ఒక అద్భుతమైన ఫొటో అవుతుంది. అలాంటి ఫొటోలను క్లిక్‌మనిపించడమే అభిరుచిగా, అలవాటుగా, వృత్తిగా, ప్రవృత్తిగా మలచుకున్నారు ప్రముఖ ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ కుసుమ ప్రభాకర్‌. ఎన్నో అవార్డులను, అభినందనలను అందుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక బ్రిటిష్‌ రాయల్‌ ఫొటోగ్రఫిక్‌ సొసైటీ ఫెలోషిప్‌ ఆయనను వరించింది. గత మూడు దశాబ్దాల్లో ఈ ఫెలోషిప్‌ను పొందిన రెండో తెలుగు ఫొటోగ్రాఫర్‌ ప్రభాకరే. 1987లో అప్పటి ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ రాజన్‌బాబుకు ఈ అవార్డు లభించింది. ఆ తర్వాత కుసుమ ప్రభాకర్‌ ఈ అవార్డును అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement