ఆటపిల్లలు | Special story to sports womens | Sakshi
Sakshi News home page

ఆటపిల్లలు

Published Sat, Jun 9 2018 12:02 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Special story to sports womens - Sakshi

సాగరిక గట్గే

లైఫ్‌లో గెలుపు, ఓటమి ఉంటుంది కానీ మగవాడు, ఆడపిల్ల అని వ్యత్యాసం ఉండకూడదు. లైఫే ఒక గేమ్‌ అయినప్పుడు ఆడపిల్ల ఆటపిల్లగా గెలవడం చాలా అవసరం. రియల్‌ లైఫ్‌లో మేరీ కామ్, కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, మిథాలీ రాజ్, సింధు, జ్యోతి సురేఖ.. వీళ్లంతా హిట్లు కొట్టిన వాళ్లే.  ఇప్పుడు సినిమాల్లో కూడా ఆడపిల్లలు ఆటపిల్లలుగా హిట్లు కొట్టబోతున్నారు. 

‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’... మంచి పాజిటివ్‌ ఫీల్‌ కలుగుతోంది కదూ. దాదాపు 70ఏళ్ల క్రితం శ్రీశ్రీ రాసిన పాట ఇది. 1980 తర్వాత హీరోయిన్లంటే గ్లామర్‌కే అనే రోజులు వచ్చాయి. ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. అవును.. కథానాయికలకు మంచి రోజులొచ్చాయి. హీరోయిన్లంటే ‘ఆటా పాట’లకే కాదు.. అనే రోజులు పోయాయి. ఆటాపాటల నుంచి ‘ఆట’లోనూ బెస్ట్‌ అని ప్రూవ్‌ చేసుకునే రోజులు వచ్చాయి. సుకుమారానికి చిరునామా కాదు మేం... వీర వనితలం మేం అని కథానాయికలు గ్రేట్‌గా చెప్పుకునే రోజులు వచ్చాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై ‘ఆట పిల్లలం మేం’ అని గొప్పగా చెప్పుకునే కాలం వచ్చింది. పాటలకే కాదు ఆటలకు కూడా ‘సై’ అంటున్నారు గ్లామర్‌ గర్ల్స్‌. సిల్వర్‌ స్క్రీన్‌పై చాకచక్యంగా ఆటాడేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నాయికలు స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీస్‌ చేసి, తమలో మంచి ప్లేయర్‌ ఉందని రీల్‌పై నిరూపించుకున్నారు. ఇప్పుడు మరికొంతమంది నాయికలు ఆ పని మీద ఉన్నారు.

గోల్‌పై గురి
ఏం సక్కగున్నవ్‌రో.. సొట్ట సెంపలోడ... ఫస్ట్‌ సినిమా ‘ఝుమ్మంది నాదం’లో హీరో మనోజ్‌ని కవ్వించారు తాప్సీ. ఆ సినిమాలో ఈ ఢిల్లీ భామ మొహమాటపడకుండా గ్లామరస్‌గా కనిపించారు. అఫ్‌కోర్స్‌ బాగా నటించారు కూడా. అయినా అప్పటి నుంచి కంటిన్యూస్‌గా గ్లామరస్‌ రోల్సే. ‘షాడో’ సినిమాలో అయితే ఏకంగా బికినీలో కనిపించారు. సీన్‌ డిమాండ్‌ చేసింది మరి. అలాంటి తాప్సీ ఇప్పుడు మరో విధంగా రెచ్చిపోతున్నారు. చెట్టు చెట్టూ పాటలు పాడుకుంటూ ఎన్నాళ్లు తిరుగుతారు. చేతిలో హాకీ బ్యాట్‌ పట్టుకుని గురి చూసి, గోల్‌ పోస్ట్‌పై గురి పెట్టారు. ‘పింక్‌’, ‘నామ్‌ షబానా’ వంటి హిందీ సినిమాల్లో గ్లామర్‌ వైజ్‌గా బ్యాక్‌ సీట్‌ తీసుకుని, పెర్ఫార్మెన్స్‌కి ఫ్రంట్‌ సీట్‌ ఇచ్చారు. ఇప్పుడు ‘సూర్మా’లో హాకీ ప్లేయర్‌ హర్‌ప్రీత్‌గా నటిస్తున్నారు. భారతీయ హాకీ క్రీడాకారుడు సందీప్‌ సింగ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఫిమేల్‌ హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నారు తాప్సీ. ‘‘మా నాన్నగారు హాకీ ప్లేయర్‌. నా చిన్నప్పుడు ఆయన ఢిల్లీ యూనివర్సిటీ కోసం హాకీ ఆడారు. ఒకవేళ నేను హీరోయిన్‌ కాకపోయి ఉంటే స్పోర్ట్స్‌లో ఉండేదాన్ని. ఏదేమైనా మా నాన్నగారి ఫేవరెట్‌ ఆటను నేను సినిమా కోసం ఆడతానని అనుకోలేదు’’ అన్నారు తాప్సీ. ‘సూర్మా’ షూటింగ్‌ మొదలు కాక ముందు ఆమె కొన్నాళ్లు హాకీ ఆటలో ట్రైనింగ్‌ తీసుకున్నారు. నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్‌ చేయాలనే తాప్సీ గోల్‌ను ఈ చిత్రం కొంతవరకూ తీర్చింది. వచ్చే నెల 13న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

లవ్‌.. లవ్‌...
విలన్‌ కూతురు లేడీ విలన్‌ అవ్వాలా? ఎవరన్నారు? హీరోయిన్‌ అవ్వొచ్చు. మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఇందుకు శ్రద్ధా కపూర్‌ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. తండ్రి శక్తి కపూర్‌ ఎంత పెద్ద విలనో తెలిసిందే. కూతురిలో మాత్రం మంచి హీరోయిన్‌ ఉంది. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ‘ఆషికీ 2’లో అద్భుతంగా నటించారు శ్రద్ధా కపూర్‌. ఎవరైనా మంచి చాన్స్‌ ఇస్తే చాలు.. వర్కవుట్‌ చేసేసుకుంటారు. కొన్ని సక్సెస్‌లు, ఎక్కువ ఫ్లాపులతో శ్రద్ధా జర్నీ సాగుతోంది. ‘సాహో’తో తెలుగుకి పరిచయం కానున్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఖాతాలో మరో మంచి అవకాశం పడింది. ‘లవ్‌ లవ్‌..’ అంటూ ఈ సినిమాలో లవ్వాడాలనుకుంటున్నారు శ్రద్ధా. లవ్‌స్టోరీ కాదండీ.. బ్యాడ్‌మింటన్‌ ప్లేయర్‌గా ‘లవ్‌ 1, లవ్‌ 2’ అనబోతున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తీయబోతున్న సినిమాలో శ్రద్ధా కథానాయికగా నటించనున్నారు. ఎంతో శ్రద్ధగా బ్యాడ్మింటన్‌ నేర్చుకున్నారు. సైనాని కలిశారు. ఆ సమయంలో టిప్స్‌ తీసుకునే ఉంటారు. కానీ అనుకున్న సమయానికి సినిమా ఆరంభం కాలేదు. శ్రద్ధా ఇతర సినిమాల షెడ్యూల్స్‌ ఓ కారణం అయితే, బ్యాడ్మింటన్‌ ఆటలో ఇంకా పట్టు సాధించాలనుకుంటున్నారట. అదొక కారణం. ఈ ప్రాజెక్ట్‌ని ఎప్పుడో అనౌన్స్‌ చేశారు. ఈ నెల మొదలవుతుందని వార్త వచ్చింది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా మొదలవుతుందట. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పట్టాలెక్కడమే ఆలస్యం. ర్యాకెట్‌తో షెటిల్‌ కాక్‌ను రఫ్ఫాడించడానికి శ్రద్ధా ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు.

ఫోర్లు.. సిక్సర్లు...
మేల్‌ క్రికెట్‌ అంతగా పాపులర్‌ అవ్వలేదు ఉమెన్‌ క్రికెట్‌. ఇక్కడ శ్రీశ్రీ పాటను గుర్తు చేసుకోవాలి. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’. మహిళా క్రికెట్‌కి కూడా బోలెడంత పాపులార్టీ వస్తుందని ఆశిద్దాం. ఆ సంగతలా ఉంచితే క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ప్రస్తుతం రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. అట్టకత్తి, కాక్కముటై్ట.. వంటి పలు చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసిన ఐశ్వర్యా రాజేష్‌ క్రికెటర్‌గా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ‘‘చిన్న పట్టణానికి చెందిన ఓ యువతి క్రికెటర్‌గా ఎంత పేరు తెచ్చుకుంది? అనేది ఈ సినిమా కథ. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ నేను ఉమెన్‌ క్రికెట్‌ని చూడలేదు. ఈ సినిమా ఒప్పుకున్నాకే చూశాను. గేమ్‌ తెలియకుండా ఆడటం చాలా కష్టం. అందుకే క్రికెట్‌ కోచింగ్‌కి వెళ్లాను. లేడీ క్రికెటర్‌ పాత్ర చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్‌. రజనీకాంత్‌ ‘కబాలి’లో ‘నెరుప్పుడా..’ (నిప్పురా..) పాట రాసిన అరుణ్‌ రాజా కామరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో క్రికెట్‌ బేస్డ్‌ మూవీ విషయానికొస్తే.. ఇది తెలుగు సినిమా. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ విజయ్‌ దేవరకొండ, ‘ఛలో’ ఫేమ్‌ రష్మికా మండన్నా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక క్రికెటర్‌గా కనిపించనున్నారు. ‘‘నా జీవితంలో నేను క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకోలేదు. ఈ సినిమా కోసం ట్రైనింగ్‌ తీసుకున్నాను. క్రికెట్‌ ఆట అంత సులువు కాదని అర్థమైంది. ట్రైనింగ్‌ తీసుకున్నాక ఉమెన్‌ క్రికెటర్లపై నాకు గౌరవం పెరిగింది’’ అని రష్మికా మండన్నా పేర్కొన్నారు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సిల్వర్‌ స్క్రీన్‌పై ఐశ్వర్య, రష్మిక కొట్టబోయే సిక్సర్లు చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.

గురి చూస్తే..
సాగరిక గట్గే ఓ సినిమాలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా చేయనున్నారు. తొలిసారి ఆమె సిల్వర్‌ స్క్రీన్‌ పై కనిపించింది స్పోర్ట్స్‌ మూవీ ద్వారానే. షారుక్‌ ఖాన్‌ ‘చక్‌ దే ఇండియా’లో సాగరిక హాకీ ప్లేయర్‌గా సపోర్టింగ్‌ రోల్‌ చేశారు. ఇప్పుడు ‘మాన్‌సూన్‌ ఫుట్‌బాల్‌’ మూవీలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా నటించనున్నారు. రియల్‌ లైఫ్‌లో సాగరికకూ, క్రికెట్‌కు అవినాభావ సంబంధం ఉంది. క్రికెటర్‌ జహీర్‌ ఖాన్, సాగరిక గతేడాది లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సంగతలా ఉంచి.. ‘మాన్‌సూన్‌ ఫుట్‌బాల్‌’ విషయానికొస్తే... కొందరు గృహిణులు ఫుట్‌బాల్‌ టీమ్‌గా ఏర్పడడానికి ఎలాంటి కృషి చేశారు? అనే కథతో దర్శకుడు మిలింద్‌ ఉకే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ మధ్య ముంబైలో జరిగిన ‘ఉమెన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌’ ఈవెంట్‌లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఆట ఆడుతున్న అమ్మాయిలను సాగరిక చీరప్‌ చేశారు. ఆ ఈవెంట్‌కి చీర కట్టుకుని వెళ్లిన సాగరిక కాన్వాస్‌ షూస్‌ వేసుకుని, సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు. కానీ, సినిమా కోసం సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేశారు. వీళ్లలానే మరికొందరు స్పోర్ట్స్‌ మూవీస్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని హీరోయిన్లు కష్టపడుతున్నారు. భేష్‌ అనాల్సిందే.    

మేరీ కామ్‌తో మూవ్‌మెంట్‌
స్పోర్ట్స్‌ బ్యాక్‌ మూవీస్‌ ఈ మధ్య ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఫిమేల్‌ స్పోర్ట్స్‌ మూవీస్‌ ఎక్కువ అవ్వడానికి ముఖ్య కారణం ‘మేరీ కామ్‌’ అని చెప్పొచ్చు. బాక్సర్‌ మేరీ కామ్‌ జీవితం ఆధారంగా తీసిన ‘మేరీ కామ్‌’లో ప్రియాంకా చోప్రా టైటిల్‌ రోల్‌ చేశారు. ‘ఫ్యాషన్‌ గర్ల్‌’ అనిపించుకున్న ప్రియాంకా చోప్రా ఆ సినిమాలో బాక్సింగ్‌ రింగ్‌లో రెచ్చిపోయిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. ప్రియాంకలో మంచి నటి ఉందని నిరూపించిన సినిమాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. అలాగే, ‘గురు’ సినిమాలో రితికా సింగ్‌ గురించి చెప్పాలి. ఈమె రియల్‌ కిక్‌ బాక్సర్‌. దర్శకురాలు సుధ కొంగర కావాలనే ఆమెను ‘ఇరుది సుట్రు’ సినిమాకి తీసుకున్నారు. ఇదే సినిమా హిందీలో ‘సాలా ఖడూస్‌’గా రూపొందింది. తెలుగులో ‘గురు’గా రీమేక్‌ చేశారు. రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ని రీల్‌పై సునాయాసంగా చేసేశారు రితికా. ‘గురు’లో వెంకటేశ్‌ కోచ్‌గా నటించారు. ప్రముఖ మల్లయోధుడు మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘దంగల్‌’. తండ్రిలానే మంచి రెజ్లర్స్‌ అనిపించుకున్న మహావీర్‌ సింగ్‌ కుమార్తెలు గీత ఫోగట్, బబితా ఫోగట్‌గా ఈ చిత్రంలో  ఫాతిమా సనా షేక్, జైరా వసీమ్, మహావీర్‌గా ఆమిర్‌ ఖాన్‌ నటించారు. ఫాతిమా, వసీమ్‌ ఈ సినిమాలో జరిగిన మల్లయుద్ధంలో ఎలాంటి పట్లు పట్టారంటే...‘దంగల్‌’ చిత్రం చైనా, జపాన్‌ వంటి ఇతర దేశాల్లో ఆడియన్స్‌ కూడా చప్పట్లు కొట్టేంత గట్టి పట్టుపట్టారు. బాక్సాఫీస్‌ రాజ్యాన్ని రాజులే కాదు. రాణులు కూడా పరిపాలించగలరని నిరూపించారు. ఇక ‘సుల్తాన్‌’ సినిమాలో రెజ్లర్‌గా అనుష్కాశర్మ అదుర్స్‌. అనుష్కా బరిలోకి దిగితే ఎంతటి రెజ్లర్‌ అయినా మట్టికరవాల్సిందే అనేలా చేశారు. 
– డి.జి.భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement