వీధి బొమ్మలు | Special story to Street toys | Sakshi
Sakshi News home page

వీధి బొమ్మలు

Published Fri, Oct 12 2018 12:02 AM | Last Updated on Fri, Oct 12 2018 12:02 AM

Special story to Street toys - Sakshi

వీధి బొమ్మలు.. అయ్యో.. తప్పు రాశామే!  విధి బొమ్మలేమో కదా!విధాత రాసిన విధి కాదు. కొందరు దురాగతుల రాత ఇది.రాలిన పూలను నులిమి ఆ రంగులు పూసిన వీధులివి. మన వీధులే. మన పిల్లలే. మన సమాజమే. కానీ.. వీధిలో వదిలేశారు.అదే వీధి బొమ్మలు ఇవాళ మన సంస్కారాన్ని వెక్కిరిస్తున్నాయి. కోల్‌కతా రెడ్‌లైట్‌ ఏరియాలోని చెల్లెళ్లు గీసిన ఈ బొమ్మలు అమ్మవారి మంటపాల ముందు కొలువయ్యాయి. 

దసరా నవరాత్రులకు పుట్టిల్లు కోల్‌కతా. ఈ నవరాత్రుల్లో దుర్గాపూజలో పాల్గొన్నారీ కోల్‌కతా మహిళలు. కోల్‌కతాలో వీళ్లు నివసించే ప్రదేశం ‘సోనాగచ్చి’ గురించి నూటికి తొంభై మందికి తెలిసే ఉంటుంది.. కానీ తెలియనట్లు ముఖం పెడతారంతే. ఆ ప్రదేశం పేరు పలకడానికి కూడా ఇష్టపడనంత విముఖతను కూడా వ్యక్తం చేస్తుంది సభ్యసమాజం. మరి వాళ్ల జీవితాలు అక్కడికి చేరడంలో సభ్యసమాజం పాత్ర లేదా? లేదా కాదు, పూర్తి బాధ్యత సమాజానిదే. దేహంతో వ్యామోహం తీర్చుకోవచ్చనే కుత్సిత బుద్ధికి, దేహం మీద వ్యాపారం చేయవచ్చనే కుటిలనీతికి పుట్టిన వృత్తి వారిది. ఇప్పుడీ మహిళలు దుర్గామాతకు అర్పిస్తున్న నైవేద్యం ఏమిటో తెలుసా? వారి మనోవేదన! తమ జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి మాటలు కావాలి. చెప్పడానికి మాటలు చాలని బాధను వాళ్లు కుంచెతో చెప్పారు. నోరు విప్పడానికి ధైర్యం లేని తమ దుస్థితిని బొమ్మల్లో చూపించారు. 

వీధే వేదిక
కోల్‌కతా సోనాగచ్చి మహిళలు ‘అహిరోతోలా’ లో మూడు వందల అడుగుల పొడవున్న వీధిలో బొమ్మలు వేశారు. ఆ వీధి వెంట నడుస్తూ ఆ బొమ్మలను చూస్తుంటే కొద్ది నిమిషాలు మాటలు రావు. ప్రతి బొమ్మా మౌనంగా మాట్లాడుతుంటుంది. ఆ మాటలను నిశ్శబ్దంగా వింటూ ముందుకు సాగిపోవాల్సిందే. ఒక బొమ్మలో... తలుపు కొద్దిగా తెరుచుకుని ఉంటుంది, ముగ్గురమ్మాయిలు ఒకరి వెనుక ఒకరు నిలబడి బయటకు తొంగి చూస్తుంటారు. అది విటుడు వచ్చినప్పుడు వేశ్యాగృహం నిర్వహకుల పిలుపుతో బయటకు వచ్చి చూసే దృశ్యం. ఆ బొమ్మకు పైన  మూడు బొమ్మలున్నాయి. మొదటి బొమ్మలో ఒక అమ్మాయి అద్దంలో చూసుకుంటూ అలంకరించుకుంటోంది, రెండవ బొమ్మలో అదే అమ్మాయి అలంకరణ పూర్తి చేసుకుని చేతి విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. ఇక మూడవ బొమ్మలో అమ్మాయి ముఖాన్ని సగం మేర చీర కొంగు కప్పేసి ఉంది. మిగిలిన సగం ముఖంలో బొట్టు కూడా సగం మేరకే కనిపిస్తోంది. ఆ బొమ్మ చెప్తున్న విషయం ఏమిటంటే.. ఆ బొట్టు చెరిగి ఉందన్న వాస్తవాన్ని గమనించమని.

కన్నీటి మడుగు
ఒక బొమ్మలో ఒక టీనేజ్‌ దాటని అమ్మాయి.. కళ్ల నుంచి నీరు ధారాపాతంగా కారిపోతోంది. అలా కారిన నీళ్లు ఆమె ముందే మడుగు కట్టి ఉంది. తన దుర్భర జీవితాన్ని తలుచుకుని కడివెడు కన్నీళ్లు కార్చిందని చెబుతోందా బొమ్మ. మరొకమ్మాయి ఒంటి మీద ఉండాల్సిన చీర నేల మీద పరుచుకుని ఉంది. ఆమె చేతులతో దేహాన్ని కప్పుకుంటోంది. మరికొన్ని బొమ్మలు కేవలం పెదాలే.. వాటికి తాళం కప్పలు వేసి ఉన్నాయి. మరికొన్ని బొమ్మల్లో కేవలం చేతులు.. మా దేహం మీద దాష్టీకం వద్దు అడ్డు చెబుతున్నట్లున్నాయి. మరో బొమ్మలో ముగ్గురమ్మాయిలు ఒకరి కన్నీళ్లు మరొకరు తుడుచుకుంటున్నారు. ఇదీ.. సోనాగచ్చి మహిళలు చెప్పదలుచుకున్న వారి జీవితం. వంద వాక్యాల్లో కూడా చెప్పలేని దైన్యాన్ని బొమ్మల్లో చూపించిన వైనం. అమ్మవారిని శక్తిస్వరూపిణిగా పూజించే సమాజమే... అమ్మాయిని మాత్రం వ్యామోహం తీర్చుకోవడానికి, ఆమె దేహంతో వ్యాపారం చేయడానికి వాడుకుంటుంది. ఆమె పొట్ట నింపుకోవడానికి ఆమె దేçహాన్నే పెట్టుబడి వనరుగా మారుస్తుంది. ఈ ద్వంద్వ ప్రవృత్తి రూపుమాసిపోనంత కాలం ఈ వీధి బొమ్మలు కూడా చెరిగిపోవు.

చెప్పడానికే ఇదంతా
సెక్స్‌ వర్కర్‌ల జీవితంలో ఉన్న దౌర్బల్యాన్ని సమాజానికి తెలియచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు జుబాక్‌బృంద దుర్గాపూజ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌ సాహా. ఒక మహిళ సెక్స్‌ వర్కర్‌గా మారిందంటే... అందుకు కారణం అక్రమ రవాణా కావచ్చు లేదా తన పిల్లల కడుపు నింపడానికి మరోదారి లేక కావచ్చు... అన్నారాయన.
– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement