
రాజయ్యగారి కోడలు
చేతనబడి
పేరు సునీత. మనసు నవనీత.
పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చింది ఆ అమ్మాయి.
అంతా కొత్త. అలవాట్లు కొత్త. పద్ధతులు కొత్త.
తిట్లు, చీవాట్లు.. మళ్లీ మళ్లీ పొరపాట్లు.
పుట్టినిల్లు ఫ్రెండ్లీ... మెట్టినిల్లు మిలటరీ!
తేడా తెలుస్తోంది.
తట్టుకోవడం కష్టమైంది!
పసుపు కుంకుమలతో కోడలిగా వచ్చిన సునీత...
చివరికి ఆ డిప్రెషన్‌లో ఊరికే అరిష్టమైంది!
అసలేం జరిగింది?
నల్గొండ జిల్లా కేంద్రం. ఆర్.డి.ఓ ఆఫీసులో సమావేశం. పరిస్థితి కొంచెం వేడిగానే ఉంది. ఎం.ఆర్.వోలు ఉన్నారు. ఆర్.డి.వో టేబుల్ మీద న్యూస్ పేపర్ ఉంది. చర్చ ఆ పత్రికలోని ఓ విషయం మీదనే సాగుతోంది. ‘ఎంతకాలంగా జరుగుతోందిలా’ అడిగారు ఆర్.డి.వో తిప్పర్తి ఎం.ఆర్.వోని చూస్తూ. ఎం.ఆర్.వో చెప్తున్న వివరాల్లో స్పష్టత లోపిస్తోందనిపించింది. ‘వి.ఆర్.వో ఉంటే పిలిపించండి’ అనగానే బంట్రోతు వెళ్లి వరండాలో తచ్చాడుతున్న వి.ఆర్.వోని పిలుచుకొచ్చాడు. వి.ఆర్.వో చెప్పినదంతా విన్న ఆర్.డి.వో ‘ఇది సున్నితంగా వ్యవహరించాల్సిన అంశం. నేనే వస్తాను. గ్రామంలో దండోరా వేయించి గ్రామస్థులందరినీ రేపు ఉదయాన్నే సమావేశ పరచండి’ అంటూ ముగించారు.
తిప్పలమ్మ గూడెం రచ్చబండ దగ్గర ఆర్.డి.వో ఇతర అధికారులు కూర్చుని ఉన్నారు. వారి ఎదురుగా రాజయ్య, రంగమ్మ, వాళ్ల కొడుకు రాజు, నెలల పాపాయిని ఎత్తుకుని కోడలు సునీత ఉన్నారు. పెద్ద అధికారి ముందు నోరు తెరవడానికి భయపడుతున్నారు. ‘ఏం జరిగిందో చెప్పు’ అంటూ రాజును చూశాడు వి.ఆర్.వో. ‘పొద్దుగుంకిందంటే భయమైతాందయ్యా. ఎక్కడ నుంచి పడుతున్నాయో తెలియదు, నట్టింట్లో రాళ్లు పడుతున్నాయి, ఒక్కోరోజు పసుపు, కుంకుమ పడుతున్నాయి. ఒక్కో రోజైతే... అశుద్ధం కూడా ఉంటోంది’ అంటూ ఆగాడు రాజు. అతడి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ‘ఒక్కో రాత్రి మా కోడలి జడ కాలిపోతోందయ్యా’ అంటూ బావురుమంది రంగమ్మ. ఆమెను ఊరుకోమని భుజం మీద తడుతూ ‘ఇంటికి ఎవరో చేతబడి చేశారయ్యా, అరిష్టం పట్టిందని పూజలు చేయించాం. మేము రోజంతా పొలం పనులు చేసుకుంటాం. ఇంట్లో పగలంతా కోడలొక్కటే చంటిబిడ్డతో ఉంటుంది. ఏ గాలిసోకిందో, ఎవరు కళ్లలో నిప్పులు పోసుకున్నారో, పచ్చటి కాపురం, గుల్లవుతోంది. పొద్దుగాలం కష్టపడి వస్తాం, తిండి తిని పక్క మీద వాలాలంటే వెన్నులో నుంచి వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎక్కడ నుంచి రాయి పడుతుందో తెలియదు, కళ్లు తెరిచి కప్పువైపు చూడాలంటే పసుపుకుంకుమలు కళ్లలో పడతాయేమోనని భయం, ఆఖరుకు అశుద్ధం కూడా పడుతుంటే ఇంట్లో ఎట్లాగుండాలో తెలియట్లేదు. ఇల్లు విప్పేసి ఎటైనా దూరంగా పోవడమే మార్గం అనిపిస్తోందయ్యా’ ఆవేదనతో చెప్పిందే చెప్పుకుపోతున్నాడు రాజయ్య.
అతడి మాట పూర్తయిందో లేదో ఊరి వాళ్ల గొంతులన్నీ ఒక్కసారిగా లేచాయి. ‘‘వాళ్లింటికేదో అరిష్టం పట్టింది. అది అక్కడితో ఆగుతుందో లేక మా ఇళ్లంటినీ తగులుకుంటుందో తెలియక భయంతో చచ్చిపోతున్నాం. ఇక వాళ్లు ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతే ఆ చేతబడి మా ఇళ్లకు పాకుతుంది...’’ అంటూ గొడవకు దిగారు. రాజయ్య కోడలు సునీత... తాను మాట్లాడాల్సిందేమీ లేనట్లు నిర్లిప్తంగా ఉండిపోయింది. ఇదేమీ తెలియని ఆమె చంకలో బిడ్డ అందరినీ పరికించి చూస్తోంది.
ఊరు అట్టుడుగుతోంది!
ఆర్.డి.వోకి పరిస్థితి ఎంత క్లిష్టతరమవుతోందో అర్థమవుతూనే ఉంది. ఊరు ఊరంతా ఉడికి పోతోంది. మూఢనమ్మకం జడలు విప్పింది. పరిస్థితి చేయిదాటిపోయేటట్లుంది. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని ఊహించారాయన. పక్కనే ఉన్న అధికారిని ఆదేశించారు. ముదాం పెద్దగా అరుస్తూ ‘ఎవరూ మాట్లాడవద్ద’ని గదుముతున్నాడు. ఆర్.డి.వో లేచి రాజయ్య ఇంటికి హాని జరిగినా, ఆ కుటుంబంలో ఎవరిమీదనైనా దాడి జరిగినా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇంట్లో రాళ్లు, పసుపు, కుంకుమల వంటివి పడడానికి కారణాన్ని కనుక్కుంటామని రెండు- మూడు రోజుల్లో మళ్లీ వస్తామని చెప్పారు. ఒకరిని ఒకరు నిందించుకోవడం, దాడికి పాల్పడడం చేయకూడదని ఆదేశించి, పరిస్థితిని గమనిస్తూ ఉండమని రెవెన్యూ ఉద్యోగులను ఆదేశించి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు జనవిజ్ఞాన వేదిక (జెవివి) బృందం తిప్పలమ్మ గూడెం చేరుకుంది. బృందం సభ్యులు గ్రామస్థులందరినీ ప్రశ్నలడిగి మరో రెండు రోజుల తర్వాత వస్తామని వెళ్లారు.
ఆ మూడో రోజున...
జనవిజ్ఞాన వేదిక వాళ్లు ఏం చెబుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. జెవివి వాళ్లు వచ్చిన వెంటనే మొదటగా చేతబడులు, భూతవైద్యాలు లేవని చెప్పారు. మంత్రగాళ్లు చేసే మాయలను తామూ చేసి చూపించడంతోపాటు రాజయ్య కోడలు సునీత మానసిక స్థితినీ వివరించారు. ‘అదంతా చేసింది సునీతే’ అన్నారు. ఊరు ఆశ్చర్యపోయింది! అమెను తలా ఓ మాట అనడం మొదలుపెట్టారు.
అసలేం జరిగింది?
సునీత పట్టణంలో పెరిగి, పదవ తరగతి వరకు చదువుకున్న అమ్మాయి. 16 ఏళ్లకే పెళ్లి, ఆ తర్వాత ఏడాదికి బిడ్డ. తల్లిదండ్రుల ఆదరణలో ఆటపాటల్లో గడిచిన బాల్యం నుంచి ఒక్కసారిగా కుటుంబ భారం మీద పడడం, పనిలో ఏ చిన్న లోపం జరిగినా అత్తగారు చివాట్లు పెట్టడం, చేసిన పనిని ఎవరూ గుర్తించకపోగా పొరపాటు జరిగితే ఆకాశం విరిగి మీద పడ్డట్లు గొడవ చేయడం వంటి వాతావరణంలో చిక్కుకుపోయింది. విచిత్రమైన ప్రపంచంలోకి వచ్చినట్లు, ఎవరికీ అక్కర లేని మనుషుల మధ్య జీవించాల్సి వచ్చినట్లు న్యూనతకు గురయ్యేది. దీనికి తోడు బిడ్డతో రాత్రిళ్లు నిద్ర ఉండేది కాదు. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్న భావనతో డిప్రెషన్‌కు లోనైంది. ఆ స్థితిలో గదిలో రాళ్లు వేయడం, పసుపుకుంకుమలు చల్లుకోవడం, పాపాయి విసర్జించిన మలాన్ని కాగితంలో చుట్టి గదిలోనే విసిరేయడం వంటి పిచ్చి చేష్టలు చేయడం మొదలుపెట్టింది. అలా చేసినట్లు కూడా ఆమెకు తర్వాత గుర్తుండేది కాదు. జుట్టు కాలడంతో ఇంట్లో అందరూ సునీత పట్ల సానుభూతి వ్యక్తం చేయసాగారు. భర్త, అత్తమామల నుంచి ఆదరణ లభించడం మొదలైంది. ఆ స్థితిలో ఉన్న వాళ్లు అలాంటి ఆదరణ ఇంకా ఉంటే బావుణ్నని కోరుకోవడం సహజం. దాంతో జుట్టు కాల్చుకోవడం వంటి పనులు మళ్లీ మళ్లీ చేస్తుంటారు.
అలాంటి స్థితిలో ఆమెకు మానసిక చికిత్స అవసరం అని జెవివి బృందం గుర్తించింది. అంతకంటే ముందు తనదైన, తనకు ఇష్టమైన ప్రపంచం ఆమెకు కావాలి. పుట్టింటిని చూస్తే మనసు కాస్త స్థిమితపడుతుంది. అందుకే ఆమెను పుట్టింటికి తీసుకెళ్లమని చెప్పారు. సైకియాట్రిస్ట్‌కి చూపించమని తల్లిదండ్రులకు సూచించారు. అనుకున్నట్లే ఆమె నెల రోజుల్లో మామూలైంది.
సమస్య తీరిపోయింది. సునీత ఆరోగ్యం బాగైంది. అయితే అందరూ ఆమెను దోషిలా చూస్తే... పరిస్థితి ఇంకా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే ఆమెను మామూలు మనిషిలా చూస్తూ ఎలా వ్యవహరించాలో కూడా ఇంటి వాళ్లను, ఊరి వాళ్లను ఎడ్యుకేట్ చేసింది జెవివి. ఇది జరిగి ఆరేడేళ్లయింది. సునీతకు ఇప్పుడది గతించిన పీడకల. ఇప్పుడామె ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా జీవిస్తోంది.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఎలా ఛేదించారు?
రాళ్లు, పసుపు కుంకుమ, అశుద్ధం ఏ సమయంలో పడుతున్నాయంటే... రాత్రి పూట ఎక్కువగానూ, పగలు చాలా అరుదుగానూ పడుతున్నాయన్నారు. సునీత గదిలోనే పడుతున్నాయి కాబట్టి ఆమె భర్త ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయా... అనే కోణంలో ఆరా తీస్తే... అతడు లేనప్పుడు కూడా సునీత జుత్తు కాలుతోంది. అంటే వీటికి రాజుకి సంబంధం లేదు. అత్తమామలు ఏ రాత్రి ఏం జరుగుతుందోనని ఇంటి చుట్టూ చీమ చిటుక్కుమన్నా కళ్లింత చేసుకుని చూడడంలోనే వాళ్లకు తెల్లవారి పోతోంది. సునీతతో రాళ్లు, పసుపుకుంకుమల గురించి ప్రస్తావించకుండా ఇతర విషయాలెన్నో మాట్లాడాం. వాళ్ల తల్లిదండ్రులను పిలిపించి ‘అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లి నెల రోజుల తర్వాత పంపించమన్నాం. అలాగేనంటూ అప్పుడే ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇక రాళ్లు పడవు, మా మాట మీద నమ్మకం ఉంచి హాయిగా నిద్రపొమ్మని చెప్పాం. రెండు రోజుల తర్వాత వచ్చి రాళ్లు ఎలా పడ్డాయో వివరిస్తామని చెప్పాం.
- టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి,
ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్