దాల్చినచెక్క (Cinnamon)
తిండి గోల
దాల్చినచెక్క పేరు వినగానే ఘుమఘుమలాడే బిర్యానీ గుర్తుకు వస్తుంది ఎవరికైనా. మసాలా వంటకాల్లో దాల్చిన చెక్క లేనిదే వాటికి రుచి, సువాసన రాదు. సంస్కృతంలో దీనిని త్వక్ అని దారుసితా అనీ అంటారు. భారతదేశంలో ఇది చాలా ప్రాచీనకాలంగా ఉన్నప్పటికీ, అరబ్బుల మూలంగానే మనదేశంలోకి వచ్చింది. ఇది తేజవత్ అనే ఒక చెట్టు పట్ట. దానిని ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి విక్రయిస్తారు. మొదట్లో దీనిని మాంసాన్ని నిల్వచేయడానికి ఉపయోగించేవారట. తర్వాత్తర్వాత మాంసాహార వంటకాలలోనూ, ఆ తర్వాత శాకాహార వంటకాలలోనూ ఉపయోగించడం మొదలెట్టారు.
ఔషధపరంగా దీని ఉపయోగాలు చెప్పలేనన్ని ఉన్నాయి. నోటిదుర్వాసన, దగ్గు, పంటినొప్పులను తగ్గించడానికి ఇది పెట్టింది పేరు. స్వరపేటిక వాపు, గొంతు బొంగురు పోవడం, గొంతులో గురగురలు వంటి వ్యాధులు ఉన్నవారు దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని, ఆ ఊటను నమిగిలి మింగుతూ ఉంటే నివారణ జరుగుతుంది.
కల్తీ తినుబండారాల వల్ల తిన్న ఆహారం విషమై, అస్వస్థతకు లోనయినప్పుడు దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేద ఔషధాల తయారీలో దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగిస్తారు. అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టీకప్పు నీటిలో వేసి, ఐదు నిమిషాలు మరిగించి, తేనెతో కలిపి తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది.