గాంధీ గిరిపుత్రిక | special story to old movie 'mouna poratam' | Sakshi
Sakshi News home page

గాంధీ గిరిపుత్రిక

Published Fri, Aug 18 2017 12:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

గాంధీ గిరిపుత్రిక

గాంధీ గిరిపుత్రిక

నాటి  సినిమా

రెండు నెలల క్రితం... తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి. ఒక అమ్మాయి ఒక ఇంటి ముందు కూర్చుంది. మాట లేదు. పలుకు లేదు. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. లోపల ఉండాల్సిన మనుషులు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయినా ఆ అమ్మాయి కదల్లేదు. మెదల్లేదు. అక్కడే కూర్చుంది. అక్కడే నిద్రపోయింది. అక్కడే భీష్మించింది. కారణం– ఆ ఇంటి కుర్రాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తావన చేసే సరికి కాదు పొమ్మన్నాడు. అతడే కావాలని ఆ అమ్మాయి ఆ ఇంటి ముందు పోరాటానికి కూర్చుంది.

ఆ పోరాటం పేరు ‘మౌన పోరాటం’.
కేవలం రెండు రోజుల్లోనే మీడియా ద్వారా ఆ అమ్మాయికి మద్దతు లభించింది. మహిళలంతా ఏకమయ్యారు. పారిపోయిన ప్రబుద్ధుణ్ణి పట్టి తెచ్చి పెళ్లి చేశారు. ఈ ఘటనే కాదు. గత ఇరవై ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. వందల మంది ఆడపిల్లలు తమను మోసం చేసిన అబ్బాయిల ఇళ్ల ముందు బైఠాయించి వారిని దారికి తెచ్చుకున్నారు. తాము న్యాయం పొందారు. వీటన్నింటికి స్ఫూర్తి ఒకే ఒక సినిమా. ఆ సినిమాయే ‘మౌనపోరాటం’.

1988.
ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్‌పూర్‌ గ్రామంలో సబితా బధేయి అనే పదమూడేళ్ల అమ్మాయి సాధారణ బీడీ కార్మికురాలు. బీడీ వ్యాపారి సోమనాథ్‌ ఆ అమ్మాయిని ప్రేమించాడు. వాళ్లిద్దరి ప్రేమ సంవత్సరం పాటు సాగింది. సబిత గర్భవతి అయ్యింది. బిడ్డకు జన్మనిచ్చింది. కాని సోమనాథ్‌ ఆమెనూ ఆమెకు పుట్టిన బిడ్డనూ అంగీకరించలేదు. పైగా సబితను కులట అని ఆమె బిడ్డను కులట సంతానమని అవమానించాడు. తనకు జరిగిన అవమానం కంటే తన బిడ్డకు జరిగిన అవమానాన్ని సబిత సహించలేకపోయింది. వెంటనే సోమనాథ్‌ ఇంటి ముందు ఒడిలో బిడ్డతో బైఠాయించింది. మౌన నిరసనకు దిగింది. మొదట ఎవరూ పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. మొత్తం 14 నెలల పాటు సోమనాథ్‌ ఇంటి ముందు సబిత తన ‘మౌన పోరాటం’ కొనసాగించింది. అప్పుడు కదలిక వచ్చింది. పత్రికల్లో వార్తలు వచ్చాయి. జనం కదిలారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. చినికి చినికి గాలివానై చివరకు ఇది ‘లోక్‌ అదాలత్‌’ దృష్టికి వెళ్లింది. స్వయంగా జడ్జిగారే సబిత దగ్గరకు వచ్చి ఆమె కేసును విచారించారు. తీర్పు వెలువడింది. సోమనాథ్‌తో చట్టప్రకారం జడ్జిగారే పెళ్లి జరిపించారు. అప్పటికి ఇది ఎవరూ ఎరగని పెద్ద విజయం. ఎందుకంటే ప్రేమ పేరుతో ఆడపిల్లలను అబ్బాయిలు మోసం చేసి ఆ తర్వాత వదిలస్తే ఆ ఆడపిల్లలు ఏడ్చి వదిలేసేవారు. లేదంటే కొంత అలజడి సృష్టించి ఊరుకునేవారు. కాని పట్టుదలగా ఇలా మౌనపోరాటంతో సాధించి గెలిచిన వారు లేరు. ఒక రకంగా ఇది అహింసాయుతమైన పెద్ద ఆయుధంగా సబిత ప్రపంచానికి అందించింది. ఇది చిన్న వార్తగా ఉండగా ఉషాకిరణ్‌ మూవీస్‌ దృష్టి దీని మీద పడింది. అది సినిమా రూపు దాల్చింది. అలా 1989లో తెలుగులో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా ‘మౌన పోరాటం’.

‘మౌనపోరాటం’ కోసం కథను కొంత స్వేచ్ఛగా అల్లుకున్నారు. కథ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగినట్టుగా చూపించారు. అమాయకురాలైన గిరిజన యువతిగా యమున, ఆమెను మోసం చేసే ఫారెస్ట్‌ అధికారిగా వినోద్‌ కుమార్‌ కనిపిస్తారు. అయితే మైదాన ప్రాంతం నుంచి గిరిజన ప్రాంతానికి వచ్చి, గిరిజన యువతలను పెళ్లాడి, గిరిజనుల బెనిఫిట్స్‌ను తాము ఆరగించే గిరిజనేతర మోసగాళ్లను కూడా కోట శ్రీనివాసరావు రూపంలో ఈ సినిమా చూపించింది. గిరిజనులు ఎప్పటికీ అమాయకులే. వారిని ‘నాగరికులే’ మోసం చేస్తుంటారు. ఈ సినిమాలో యమునను మోసం చేసిన వినోద్‌ కుమార్‌ ఆమె పట్ల క్రూరంగా వ్యవహరిస్తాడు. జైలుకు పంపుతాడు.

జైలులోనే యమున బిడ్డకు జన్మనిస్తుంది. తిరిగి వచ్చి అతని ఇంటి ముందే కూర్చుంటుంది. ఎవరు ఏం అడిగినా ఏం మాట్లాడదు. మౌనమే సమాధానం. మౌనమే దీక్ష. మౌనమే న్యాయం కోసం చేసే ఆక్రందన. ఇంటి ఎదురుగా ఒక మనిషి కూర్చోవడం ఆ ఇంటి మనుషులకు ఎంత అశాంతి కలిగిస్తుందో అనుభవిస్తే తెలుస్తుంది. అందుకే అత్త, ఆడపడుచు దీనిని సహించలేకపోతారు. యమునను హింసించడానికి ఆమెపై వేడి నీళ్లు పోస్తారు. బిడ్డను వదిలించుకోవడానికి ఆ బిడ్డ నోట్లో యమున కన్నుగప్పి వడ్లగింజలు పోస్తారు. వీటన్నింటిని తట్టుకుని యమున నిలబడుతుంది. తన బిడ్డను కాపాడుకుంటుంది. చైతన్యం కలిగిన కాలేజీ ఆడపిల్లలు ఈ సినిమాలో యమునకు అండగా నిలవడాన్ని చూపి దర్శకుడు ఏ వర్గాల్లో మెసేజ్‌ పాస్‌ చేయదలుచుకున్నాడో ఆ వర్గాలకు పాస్‌ చేస్తాడు. నిజ జీవితంలో సబితకు మద్దతు లభించినట్టే సినిమాలో యమునకు కూడా మద్దతు లభిస్తుంది. లోక్‌ అదాలత్‌ కదిలి వస్తుంది. జడ్జిగారు వినోద్‌ కుమార్‌ను ఆమెను పెళ్లి చేసుకోమని ఆదేశిస్తూ తీర్పు చెబుతారు. యమునకు కావలసింది ఈ గెలుపే. ఆమె తాళి కట్టించుకుంటుంది. అయితే అత్తగారి ఇంటిలోకి వెళ్లదు.

‘నా భర్త ఒక సామాన్యుడిగా నా గూడేనికి వచ్చినప్పుడే అతణ్ణి భర్తగా స్వీకరిస్తాను’ అని చెప్పి వెళ్లిపోతుంది. యమున అతణ్ణి అలా నిరాకరించి ఆత్మాభిమానం చాటుకోవడం కూడా ప్రేక్షకులకు నచ్చింది. చిన్న వార్తను ఆధారంగా చేసుకొని  పరుచూరి బ్రదర్స్‌ పకడ్బందీ  రచన చేసి సినిమాను ఆర్ట్‌ ఫిల్మ్‌ ధోరణిలో పడకుండా కాపాడారు. మరో విశేషం ఏమిటంటే ఇది స్త్రీ ప్రధాన చిత్రం కనుక ఈ సినిమాకు ఒక మహిళ సంగీత దర్శకత్వం వహించడం. ఆమె ఎస్‌.జానకి. సంగీత దర్శకురాలిగా జానకికి ఇది తొలి సినిమా. అయితే ఆమెకు సహాయంగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పని చేసి రీ రికార్డింగ్‌ బాధ్యతలు నెరవేర్చారు. రాళ్లపల్లి, మల్లికార్జునరావు, సుత్తి వేలు తదితరులు కొంచెం రిలీఫ్‌ కోసం ఉపయోగపడ్డారు. నటుడు, రచయిత సంజీవి ఈ సినిమాలో అమాయక గిరిజనుడిగా యమున ఆరాధకుడిగా ఆకట్టుకుంటాడు.

మౌన పోరాటం రిలీజయ్యాక సంచలన విజయం సాధించింది. అబ్బాయిల మోసం శృతి మించిన ఆ రోజుల్లో ఈ సినిమా ఆడవాళ్లందరికీ పెద్ద ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. నటి యమునకు, దర్శకుడు మోహన గాంధీకి ఈ సినిమా మంచిపేరు తెచ్చి పెట్టింది. అంతే కాదు ఉత్తమ తెలుగు చిత్రంగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. ఈ సినిమా వచ్చిన దాదాపు పాతికేళ్లకు హిందీ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి ‘గాంధీగిరి’ పేరుతో ‘లగే రహో మున్నాభాయ్‌’ తీశాడు. కాని దానికి ఎంతో కాలం ముందు అదే గాంధీగిరిని మౌన పోరాటంలో చూపించిన మనమే నిజంగా గొప్పవాళ్లం. దొడ్డవాళ్లం. ఇది తెలుగు సినిమా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం.
– కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement