గిరిజన బాలిక ఎక్కడ బాబూ? | Girl missing during TDP rule but Pawan was silent: AP | Sakshi
Sakshi News home page

గిరిజన బాలిక ఎక్కడ బాబూ?

Published Tue, Jul 16 2024 3:53 AM | Last Updated on Tue, Jul 16 2024 3:53 AM

Girl missing during TDP rule but Pawan was silent: AP

పది రోజులైనా ఆచూకీ లేని చిన్నారి.. ఈ ఒక్క బాలికనైనా తెచ్చి చూపించు పవన్‌

నాడు ప్రగల్భాలు పలికి నేడు మౌనముద్రలో సీఎం, డిప్యూటీ సీఎం 

బాధిత కుటుంబాన్ని కనీసం పలకరించని హోంమంత్రి అనిత

అసలు కుటుంబం దగ్గరకే వెళ్లని నంద్యాల జిల్లా మంత్రులు 

నిందితులకు కొమ్ముకాస్తున్న జిల్లా టీడీపీ పెద్దలు.. కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులు  

వారం రోజులుగా పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు 

బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపిన నిందితులు?  

బాలిక అదృశ్యం వెనుక టీడీపీ సన్నిహితులు 

అసలు దోషులను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం

రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది..  – ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 

రాష్ట్రంలో 34వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు. వలంటీర్లు ఎత్తుకుపోయారు. వాళ్ల ఆచూకీ తెలియాలి. మేం అధికారంలోకి వస్తే అదృశ్యమైన బాలికలను సురక్షితంగా వెనక్కి రప్పిస్తాం. – ఎన్నికలకు ముందు పవన్‌కళ్యాణ్‌  

సాక్షి, అమరావతి/నందికొట్కూరు
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నానా యాగీ చేసిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక అదృశ్యంపై నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికి పది రోజులైంది. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు.

ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు మీడియాకు లీకులివ్వడం విడ్డూరంగా ఉంది. వారంరోజులుగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు సాగిస్తున్న డ్రామా వెనుక పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. బాలిక అదృశ్యం వెనుక ఉన్న టీడీపీ పెద్దల కుటుంబ సభ్యులను కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ముగ్గుర్ని అరెస్టుచేశామని హోంమంత్రి అనిత సోమవారం చెప్పగా.. నంద్యాల పోలీసులు మాత్రం అరెస్టుచేసినట్లు చెప్పనేలేదు. అంటే ఆ ముగ్గుర్ని అరెస్టు చూపించడం ద్వారా అసలు దోషులను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నాగం పన్నిందన్నది సుస్పష్టమవుతోంది. 

బాలిక తల్లిదండ్రుల మొర వినిపించిందా?
అదృశ్యమైన గిరిజన బాలిక ఎక్కడుంది చంద్రబాబు? మీరు పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అయిదో తరగతి విద్యార్థిని ఈనెల 7న అదృశ్యమైందనే విషయం తెలుసా అసలు? శ్వేతపత్రాల పేరుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే హడావుడిలో ఉన్న మీకు ‘మా అమ్మాయిని సురక్షితంగా తీసుకురండి.. కనీసం బతికుందో లేదో చెప్పండి’.. అన్న ఆమె తల్లిదండ్రుల మొర వినిపించనే లేదు. కనీసం హోంమంత్రిని పంపించి ధైర్యం చెప్పాలనిపించలేదు. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డితోనైనా ధైర్యం చెప్పించారా? 

ఈ ఒక్క బాలికనైనా తీసుకురండి పవన్‌..
రాష్ట్రంలో వలంటీర్లు ఏకంగా 34వేల మంది బాలికలను అదృశ్యం చేశారని ఎన్నికల ముందు నానా యాగీ చేసిన పవన్‌.. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నోరెందుకు మెదపడంలేదు!? తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించాలని బాలిక తల్లిదండ్రులు ప్రాథేయపడుతు­న్నారు. మరి మీరెందుకు ఆ బాధిత తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు? పోలీసు అధికారులను ఎందుకు ప్రశ్నించలేదు? గిరిజన బాలిక విషయంలో మీరెందుకు చిత్తçశుద్ధి చూపించలేదు? ఈ ఒక్క బాలికనైనా తీసుకొచ్చి చూపించండి పవన్‌!

దర్యాప్తు పక్కదారి పట్టిస్తున్న పోలీసులు..
ఇక గిరిజన బాలిక అదృశ్యం కేసును పోలీసు శాఖ ఉద్దేశపూర్వకంగా కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈనెల 7న ఉదయం నుంచి బాలిక కనిపించడంలేదు. అదేరోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటలపాటు పోలీసులు పట్టించుకోలేదు. రెండ్రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారం రోజులుగా విచారిస్తున్నారు. అయినా,  బాలిక ఆచూకీపై పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడం సందేహాలకు తావిస్తోంది.

ఎందుకంటే ఆ ముగ్గురే బాలికను అత్యాచారం చేసి హత్యచేసినట్లు పోలీసులే మీడియాకు లీకులివ్వడం ప్రశ్నార్థకంగా మారింది. మృతదేహం కోసం పోలీసుల గాలింపు సందేహాస్పదంగా ఉంది. నిందితులు చెప్పారంటూ మూడుచోట్ల గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రభుత్వం సోమవారం చేసిన హడావుడితో ఈ కేసులో అసలు దోషులను కాపాడేందుకు సిద్ధమైందన్నది తేలిపో­యింది.

బాలిక అదృశ్యం వెనుక కొందరు టీడీపీ ప్రజా­ప్రతినిధి కుటుంబ సభ్యులుగానీ సన్నిహితుల పాత్రగాని ఉందని ముచ్చుమర్రిలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బాలిక సురక్షితంగా ఉందా.. అత్యాచారం చేశారా.. హత్య చేశారా అన్నది ఇప్పటివరకూ పోలీసులు తేల్చలేదు. 

ముగ్గురు నిందితులు అరెస్టు : హోంమంత్రి
ఇక నంద్యాల జిల్లాలో గిరిజన బాలిక ఘటన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేశామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. బాలిక మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదని ఆమె సోమవారం మీడియాకు చెప్పారు. ఈ ఘటనలో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షలు, విజయనగరం జిల్లాలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయంగా చంద్రబాబు ప్రకటించారని ఆమె తెలిపారు. మరోవైపు.. నంద్యాల జిల్లా పోలీసులు మాత్రం నిందితులను అరెస్టుచేసినట్లు సోమవారం అర్థరాత్రి వరకు వెల్లడించలేదు.

చంద్రబాబు, పవన్‌పై జనాగ్రహం..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇప్పటివరకూ ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. వారెందుకు మౌనం వహించారని ప్రజలు, ప్రజా సంఘాల వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ దత్తత తీసుకున్న కొణిదెల గ్రామానికి కూతవేట దూరంలో బాలిక అదృశ్యమై పది రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో లా అండ్‌ ఆర్డర్‌ అంటే ఇదేనా పవన్‌ అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లభించకపోవడం విడ్డూరం.

ఆ ముగ్గుర్ని చంపేయాలి
పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’.. అని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement