సమ్మక్క-సారలమ్మ వందనం అమ్మలు | special story to sammakka -sarakka | Sakshi
Sakshi News home page

సమ్మక్క-సారలమ్మ వందనం అమ్మలు

Published Tue, Feb 9 2016 10:23 PM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

సమ్మక్క-సారలమ్మ  వందనం అమ్మలు - Sakshi

సమ్మక్క-సారలమ్మ వందనం అమ్మలు

మేడారం జాతర.
రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నమి) రోజుల్లో జరిగే జాతర.
గిరిజన సంప్రదాయాలకు పట్టం కట్టే జాతర.
ఆసియాలోనే అతి పెద్ద వనజాతర.

 
ఈ జాతర సమయంలో కోటి మందికిపైగా వచ్చే భక్తులతో అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది. మొక్కులతో ముడుపులతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఈ నెల ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది.
 గిరిజనుల గుడులు నిరాడంబరమైనవి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మల గుళ్లు కూడా గుడిసెలుగానే ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్తగా కప్పడం (గుడి మెలిగె) ఆనవాయితీ. ఈ ప్రక్రియతోనే జాతర తొలి పూజా కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడెసెలు లేకున్నా జాతరకు రెండు వారాల ముందు ‘గుడి మెలిగె’ను నిర్వహిస్తారు. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీన్ని ‘మండ మలిగె’ అంటారు. గుడి మెలిగె, మండ మెలిగె కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. ‘మండ మెలిగె’ మరుసటి రోజున గొర్రెను దేవతలకు బలి ఇచ్చి పూజారులు (వడ్డె), గ్రామపెద్దలు పండగ నిర్వహిస్తారు. ఇదే రోజున సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు.
 
విగ్రహాలు లేని పూజ
మేడారం జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. సమ్మక్క-సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండకపోవడమే ఆ ప్రత్యేకత. ఇక్కడున్న రెండు గద్దెల్లో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తారు. వీటి మధ్య ఉండే చెట్టు కాండాల (నారేప)నే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంకమొదళ్లు ఇక్కడ దేవతామూర్తులు. వీరు పసుపు, కుంకుమల స్వరూపాలు. దేవతల గద్దెపై లభించే కుంకుమతో మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. దేవతామూర్తులను తోడ్కొని వచ్చే వడ్డెలు తమ పైనుంచి దాటుకుంటూ వెళితే జన్మ సార్థకమవుతుందని భక్తులు సాష్టంగపడతారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు ఎత్త్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. ఇది దేవతలకు ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు. మేడారం వచ్చే భక్తుల్లో గిరిజనులు, పేదలే ఎక్కువగా ఉంటారనే భావనతో విలువైన కానుకలు, మొక్కులు ఇక్కడ లేవని చెబుతుంటారు. మొక్కులు ఫలించి సంతానం కలిగినవారు జాతర వచ్చినప్పుడు ఎత్తు బంగారం సమర్పిస్తారు. కోర్కెలు తీరితే ఎడ్ల బండ్లు కట్టుకుని జాతరకు వస్తామని అమ్మవారి రూపంలో మొహానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడి బియ్యం), ఎదురు కోళ్లు (దేవతను తీసుకు వచ్చేటప్పుడు ఎదురుగా గాల్లోకి ఎగరవేసిన కోళ్లు), లసిందేవమ్మ మొక్కు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ ఉంటాయి.
 
వనం నుంచి వనంలోకి
సమ్మక్క-సారలమ్మ జాతర నాలుగు రోజులు జరుగుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు) ఈశాన్య దిశగా ఉన్న చిలుకల గుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వరంగల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం ప్రాంతం మొత్తం శివసత్తుల శివాలుతో, భక్తిపరవశంతో ఊగిపోతుంది. మూడోరోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉంటారు. ఈ రోజు మేడారంలో లెక్కలేనంత మంది భక్తులు మేడారానికి వస్తారు. మొక్కులు సమర్పిస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
 - పిన్నింటి గోపాల్,  సాక్షిప్రతినిధి, వరంగల్
 
సమ్మక్క కథ

సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కోయగిరిజనుల కథనం ఇలా ఉంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం అడవికి వెళ్లినప్పుడు అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టాడు. ఆ పసిపాప గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయి. యుక్త వయసు వచ్చిన సమ్మక్క మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడింది. పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు-సమ్మక్కలకు సారలమ్మ, నాగులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజులతో పెళ్లి జరిగింది. మేడారం ప్రాంతం గోదావరి నదికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడున్న సారవంతమైన భూములును ఆక్రమించేందుకు కాకతీయరాజు రుద్రదేవుడు మేడారంపై దండెత్తాడు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు కాకతీయుల శక్తికి పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. శత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తెల మరణవార్త విన్న సమ్మక్క ధైర్యం కోల్పోకుండా, యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడింది. ఆమె దాటికి తట్టుకోలేని శత్రువర్గంలో ఒకడు వెనుక నుంచి బల్లెంతో పొడిచాడు. తన రక్తంతో తడిస్తే ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుందనే ఉద్దేశంతో తన గాయానికి కట్టు కట్టుకుని శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. గిరిజనులు సమ్మక్క కోసం అరణ్యమంతా గాలించగా నాగవృక్షపు నీడలో ఉన్న పాముపుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణె కనిపించింది. గిరిజనులు ఈ భరిణే సమ్మక్కగా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ జాతర చేసుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement