ఉజైనీ | special story to Ujjaini | Sakshi
Sakshi News home page

ఉజైనీ

Published Tue, Jun 7 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

ఉజైనీ

ఉజైనీ

ఉజ్జయిని దక్షిణాభిముఖుడికి జై

 

భూగర్భంలో కొలువుదీరిన పరమేశ్వరుడు
భస్మహారతితో సంతుష్టుడయ్యే భవుడు
జన్మజన్మల పాపాలను హరించే లోకనాయకుడు
ఉజ్జయిని నగరాధీశుడు... మహాకాళేశ్వరుడు.

 

ఉజ్జయిని నగరానికి చరిత్రలో ‘అవంతి’ అని పేరుండగా, చరిత్రకు పూర్వమే ఉన్న నగరంగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జాన్ అంటే ఉద్యానవనం. నేటికీ ఈ నగరం సుందర ప్రకృతి రామణీయకతకు మారుపేరుగా నిలుస్తోంది. ఆనాటి లెక్కల ప్రకారం ముఖ్య కాలమాన రేఖాంశం ఉజ్జయిని మీదుగా ఉండేది. అక్కడ వెలసిన మహాకాలుడే కాలానికి అధిపతిగా పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వదైన శివలింగం మహాకాళేశ్వరుడు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి - ఇద్దరూ కొలువున్న క్షేత్రం ఉజ్జయిని. ఈ పన్నెండు క్షేత్రాల్లోనూ శంకరుడు దక్షిణాభిముఖుడిగా కొలువై ఉన్న తీర్థం ఇదే. మరే జ్యోతిర్లింగానికీ ఈ ప్రత్యేకత లేదు. దక్షిణాభిముఖంగా స్వయంభువై వెలసిన మహాకాళేశ్వర ఆరాధనలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ లింగానికి ప్రతీరోజు శిప్ర నదీ జలాలలతో అభిషేకం, ఆ తర్వాత చితాభస్మంతో అలంకరణ జరగడం విశేషంగా చెప్పుకోదగినవి.

 
ఉజ్జయిని ఆలయం ఐదు అంతస్థులుగా, ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉంటుంది. అందులో ఒక అంతస్థును భూమికి క్రింద అంటే నేలమాళిగగా కట్టారు. ఆ క్రింది అంతస్థులో స్వయంభువు అయిన మహాకాళేశ్వర లింగం ఉంటుంది. దానిపైన అంతస్థులో ఓంకారేశ్వర మహాదేవ లింగం, మూడవ అంతస్థులో నాగచంద్రేశ్వర లింగం ఉంటాయి. ఈ 3 శివలింగాలే కాకుండా ఇంకా అనాది కల్పేశ్వరుడు, త్రివిశ్తపేశ్వరుడు, చంద్రాదిత్యేశ్వరుడు, స్వప్నేశ్వరుడు వంటి అనేక శివలింగాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. తూర్పు, పశ్చిమ దిక్కులలో కార్తికేయ, వినాయకుల ఆలయాలు ఉన్నాయి. శివుడు దక్షిణ దిశగా తిరిగి వెలిశాడు కనుక, నందీశ్వరుడు దక్షిణ దిక్కులోనే దర్శనమిస్తాడు. ఈ ఉజ్జయిని మందిరాన్ని ఒక తాంత్రిక మందిరంగా భావిస్తారు.

 

వర్ణనలకు అందని ఆలయం
పురాణాల ప్రకారం ప్రజాపిత బ్రహ్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో చంద్రప్రద్యోతుడు ఆలయ నిర్వాహకునిగా కుమారసేనుని నియమించాడు. క్రీ.పూ 4వ శతాబ్ది నాటి ఉజ్జయిని నాణేలపైన ఈ మహాకాలుని చిత్రం ఉంటుంది. కాళిదాసు తన రఘువంశం, మేఘదూతం వంటి కావ్యాలలో ఈ మందిరం గురించి అద్భుతంగా చేసిన వర్ణనలు ఉన్నాయి. ఆ ఆలయ నిర్మాణ కౌశలం అలనాటి ఉత్తమస్థాయి వాస్తుకళకు అద్దం పడుతుంది. విక్రమార్కుడు ఈ నగరాన్నే తన రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. భర్తృహరి మహారాజు ఇక్కడే తన సుభాషితాలను లిఖించాడు. కాళిదాసు ఈ అమ్మవారి కటాక్షంతోనే మహాకవిగా మారాడు.

 

ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇండోర్ పట్టణం నుంచి దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్షిప్రానది గలగలలు, రుద్రాసాగర్ సరస్సుతో ఈ ప్రాంతం ప్రకృతి రామణీయకతకు మారుపేరులా ఉంటుంది. ఖగోళశాస్త్ర అధ్యయనాల కేంద్రంగానూ ఉజ్జయిని పేరుగాంచింది. విక్రమ్ విశ్వవిద్యాలయం, కాళిదాస్ అకాడమీ ఇక్కడ చెప్పుకోదగినవి. శివరాత్రి, మహాకుంభ, అర్ధ కుంభ మేళా వంటి ఉత్సవాలకు ఈ నగరం ప్రసిద్ధి గాంచింది.

 

హర హర మహాకాళ
పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు నిరంతరం శివార్చనలో ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. వీరు రోజు శివార్చనే ఊపిరిగా ఉన్నవారు. ఓ రోజు వీరంతా శివార్చనలో ఉండగా పర్వత శిఖరాలలో ఉన్న దూషణుడు అనే రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతూ ఈ నలుగురి వద్దకూ వచ్చాడు. కానీ వారు బెదరలేదు. శివార్చనను వీడలేదు. అంతలో దూషణుడు ఆ బ్రాహ్మణుల మీదకు కత్తి ఎత్తాడు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారానికి దూషణుడు బూడిదరాశియై పడి ఉన్నాడు. ఆ నలుగురు బ్రాహ్మణ కుమారులు బెదరకుండా మహాకాళ రూపానికి స్త్రోతం చేశారనీ, భస్మహారతితో స్వామి ప్రసన్నుడు అయ్యాడనీ, వారి ప్రార్థన మేరకు శివుడు మహాకాళలింగ రూపంలో వెలిశాడనీ కథనం.

 

శిల్పాల సొగసు చూడతరమా!
సరస్సు సమీపంలో గల ఈ దేవాలయం పైకి మూడు అంతస్థులుగా కనపడుతుంది. భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం... శిఖరం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. సాయంసంధ్యా సమయంలో ఈ మందిరం అత్యంత మనోహరంగా భాసిల్లుతుంది. ఇత్తడి దీపాలు భూగర్భగుడిలోకి పోయే మార్గాన్ని చూపిస్తాయి. ఇక్కడ పరమేశ్వరుడికి సమర్పించిన నైవేద్యం తిరిగి దేవతలందరికీ సమర్పించవచ్చని భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో ఒక చిత్రం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందు ‘వర్షన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఈ తంతు కొనసాగతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే ‘శంఖుయంత్రం’ ఉందని పెద్దలు చెబుతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని అందుకే ఊదుతారని ప్రతీతి. మూడవ అంతస్థులో ఉన్న ‘నాగచంద్రేశ్వర’ విగ్రహం దర్శనానికి నాగపంచమి రోజున మాత్రమే తెరుస్తారు. మహాకాళేశ్వరుడి వద్దకు వెళ్లి దర్శనం చేసుకున్నవారు ఎటువంటి విజయాన్నైనా పొందుతారని భక్తుల అపార నమ్మకం.

 

చితాభస్మంతో అభిషేకం
వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్న భూగర్భాలయంలో రెండు జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలంటారు. ఇక్కడే భస్మమందిరం ఉంది. ఆవులను లోపలికి తొలుకువచ్చి, వాటి పేడతో అక్కడే విభూతిని తయారుచేసి, ఆ విభూతితో స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తారు. ఇక్కడ చేసే విభూతి అభిషేకాలు రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసి మూట కడతారు. ఆ మూటను శివలింగంపైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం ఆలయం అంతా భస్మంతో నిండిపోతుంది. ఆ సమయంలో శంఖాలు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను మోగిస్తారు. అప్పుడు అక్కడి అలౌకిక స్థితి గురించి మాటల్లో చెప్పలేం. రెండవ రకం అభిషేకం అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మంతో చేస్తారు. రోజూ ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా ఈ భస్మహారతి (అస్థికల సమర్పణ) జరుగుతుంది. పది మంది నాగసాధువుల చేత జరిగే ఈ భస్మహారతి సయమంలో సాక్షాత్తూ కైలాసనాథుని దర్శనం అయినంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మపూజ చేశాడంటారు. ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని ‘మహా శ్మశానం’ అని కూడా పిలుస్తుంటారు. భస్మహారతికి కేవలం మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మండపంలో, బారికేడ్ల వెనుక వరకే అనుమతిస్తారు. శిప్రానదిలో స్నానం, మహాకాళేశ్వరుని దర్శనం అకాలమృత్యువు నుంచి రక్షణ ఇస్తుందని, మరణానంతరం జీవనం ఉండదని భక్తుల అపారవిశ్వాసం. 12 ఏళ్ల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతోంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.

 - ఎన్.ఆర్

 

 

అమ్మలగన్న అమ్మ గర్‌కాళిక
అజ్ఞానం, చీకటి, శత్రు భయాలను పోగొట్టడానికి శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు మహాకాళి రూపంలో ఉజ్జయినిలో కొలువై ఉన్నారు. గర్‌కాళికగా పూజలందుకుంటున్నారు. మహాకవి కాళిదాసు నాలుకపై అమ్మవారు బీజాక్షరాలు రాసింది ఇక్కడే. గర్భగుడిలో లింగం అగ్రభాగాన ‘ఓంకారేశ్వర మహాదేవ’ అని ఉంటుంది. గణేష్, ఓంకారేశ్వర్ శివ, పార్వతి, షణ్ముఖుడు, నంది విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకం.  ఇక్కడి దేవాలయ సముదాయం  క్రీ.శ.1234-35లో ముసల్మానులు దాడి చేసిన సందర్భంలో ధ్వంసం అయ్యింది. తర్వాత క్రీ.శ.1736లో శ్రీమంత్ పీష్వా బాజీరావు, ఛత్రపతి షాను మహారాజ్‌లు ఇప్పుడు ఉన్న నిర్మాణం చేశారు. ఆ తర్వాత శ్రీనాథ్ మహాడ్జి షిండే మహారాజ్‌చే అభివృద్ధి జరిగినట్టు చరిత్ర చెబుతోంది.

 

గిరిజనుల నగలు ప్రత్యేకం
ఉజ్జయిని నగర వీధులలో టవర్ చౌక్‌లో దొరికే ఆహారాన్ని పర్యాటకులు బాగా ఆస్వాదిస్తుంటారు. నోరూరించే స్థానిక వీధి ఆహారాలైన చాట్లు, పానీపూరి, బేల్‌పూరీ, నెయ్యితో మొక్కజొన్న అల్పాహారం పదార్థాలు ఇక్కడ ప్రత్యేకం. ఉజ్జయిని నగరం గిరిజనుల నగలు, వస్త్రాలు, వెదురు ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని టూరిజం వారు నగరంలో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి నగర పరిధిలో ఆటో రిక్షాలు, బస్సులు, టాంగాలు అందుబాటులో ఉంచారు. నగరంలో ప్రయాణించడానికి ఎక్కువ శాతం పర్యాటకులు షేర్ ఆటో రిక్షాల వైపే మొగ్గుచూతారు.

 

 

ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఇండోర్ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం నుంచి ఉజ్జయిని కేవలం 55 కి.మీ దూరం.ఉజ్జయిని రైల్వేస్టేషన్‌తో భారతదేశంలోని అన్ని పెద్ద నగరాలనూ అనుసంధానించారు.  {పయాణికులు ముంబై, భోపాల్, ఢిల్లీ, ఇండోర్, అహ్మదాబాద్, ఖజురహో నుండి బస్సుల ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు. ఇండోర్, భోపాల్, గ్వాలియర్ నుండి రోజువారీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఉజ్జయిని రైల్వే స్టేషన్ దగ్గర్లో హోటల్ వసతి సదుపాయాలున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement