ప్రతీకాత్మక చిత్రం
అవర్ హీరో సినిమాల్లో గాల్లోకి దూకి పదిమందిని ఒక్కవేటుతో వందమందిని ఒక్క ఊపుతో వెయ్యిమందిని ఒక్క ఫైటుతో చితక్కొట్టేసే హీరోలను చూశారు. మాకైతే ఈ హీరోయే నచ్చింది. గద్దలు తన్నుకుపోతున్నఇద్దరి బాల్యాన్నిసింగిల్ హ్యాండ్‌తో కాపాడింది!! షీ ఈజ్ అవర్ హీరో.
మార్చి 4, 2018. ఆదివారం. ముంబైలోని వర్సోవా. ఎప్పటిలాగే తెల్లవారింది. ఉదయం పది గంటలు. అప్పుడే టీ తాగి బద్దకంగా అలా సోఫాలో కూర్చుండిపోయింది 27 ఏళ్ల ప్రీతి సూద్.. సెలవు తీరికను మనసారా ఆస్వాదించేందుకు. సెల్ ఫోన్ మోగింది. ‘‘అబ్బా.. మొదలైందా’’ అని విసుక్కుంటూ ఫోన్‌ను చేతులోకి తీసుకుంది. క్లోజ్ ఫ్రెండ్ నంబర్ అది. లిఫ్ట్ చేసింది. ‘‘హలో’’ అంది. అవతల నుంచి వినపడ్డ విషయంతో ప్రీతికి బద్దకం వదిలింది. గబగబా తయారై తన ఫ్లాట్‌కు దగ్గర్లో ఉన్న బ్యూటీపార్లర్‌కు పదిహేను నిమిషాల్లో చేరుకుంది.
‘‘మాటలు తిన్నగా రానియ్’’.. ప్రీతిని బెదిరించాడు ఆగంతకుడు. ఆ తీవ్రతకు బ్యూటీపార్లర్‌లోనిసిబ్బంది అదిరిపడ్డారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా బిక్కమొహం వేశారు. ఇంకోవైపు ప్రీతి ఫ్రెండ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు పదే పదే ఫోన్ చేస్తోంది. టీమ్‌ను పంపిస్తాం అన్నారు కాని ఆ జాడే లేదు!
పార్లర్‌లో ఇద్దరు బాలికలు!
ఓ కస్టమర్‌లాగే లోపలికి వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్ ఉంది. ఆమె ఎవరో తెలియనట్టే నటిస్తూ ఆ పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చుంది. వాళ్ల వయసు ఏడూ పదకొండేళ్ల మధ్య ఉంటుంది. ‘‘క్యా హోనా మేడం?’’ అడిగింది పార్లర్‌లో అమ్మాయి. ‘‘క్లీనప్’’ చెప్పింది ప్రీతి. ‘‘థోడా టైమ్ లగేగా’’ ఆ పక్కనే ఉన్న ప్రీతి ఫ్రెండ్‌కు థ్రెడింగ్ చేయడానికి దారాన్ని పంటి కింద పెట్టుకుని సిద్ధమవుతూ చెప్పింది పార్లర్ అమ్మాయి. ‘‘కోయి బాత్ నహీ.. వెయిట్ కరూంగీ’’ అంది ప్రీతి తన ఫ్రెండ్ మొహం చూస్తూ. ఇద్దరూ అపరిచితుల్లా ఉండాలని కళ్లతోనే చెప్పుకున్నారు. ఆదివారం అవడంవల్ల పార్లర్‌లో వర్కర్స్ తక్కువగా ఉన్నారు. కస్టమర్స్ కూడా పెద్దగా లేరు. ప్రీతి, తన ఫ్రెండ్, ఆ ఇద్దరు అమ్మాయిలు. అంతే.అదే అనుకూలమైన సమయం అనుకొని ఆ పిల్లలిద్దరితో మాట్లాడ్డం మొదలుపెట్టింది ప్రీతి.‘‘పన్నెండేళ్లు కూడా లేవు.. దేనికోసం వచ్చారు మీరు?’’ అడిగింది. ‘‘మేకప్ కోసం’’ చెప్పారు పిల్లలు.‘‘ఏదైనా ఫంక్షనా?’’ అడిగింది. ‘‘పెళ్లి’’.. ‘‘అమెరికా వెళ్తున్నాం’’ ఇద్దరి నుంచి ఒకేసారి.. సంబంధం లేని జవాబులు వచ్చాయి. ఏదో అర్థమైంది ప్రీతికి. ‘‘ఎక్కడుంటారు మీరు?’’ ‘‘మాది గుజరాత్’’ చెప్పింది ఇద్దరిలోకి కాస్త పెద్దపిల్ల. ఇద్దరూ అమాయకంగా, వినయంగా ఉన్నారు. ‘‘మీ వెంట వచ్చినవాళ్లెవరు?’’.. మాటల్లేకుండా తన వెనక విజిటర్స్ లాంజ్‌లో కూర్చున్న వాళ్లవైపు బిగించిన పిడికిలిలోని బొటనవేలును చూపిస్తూ అడిగింది. ఆ పిల్లలిద్దరూ మొహాలు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే తన ఫ్రెండ్ ఫోన్‌లో వ్యక్తం చేసిన అనుమానం నిజమేనన్నమాట.
ప్రొటెక్షన్ టీమ్ కోసం నిరీక్షణ
ఇంకేవో వివరాలు అడగడానికి ప్రయత్నించింది ప్రీతి. లాంజ్‌లో ఉన్న మగవాళ్లిద్దరూ అసహనంగా కదలసాగారు. గొంతు పెంచి‘‘ ఔర్ కిత్నా టైమ్ లగేగా? జల్దీ కరో... ఫంక్షన్‌కా టైమ్ హోరారాహై’’ అరిచాడు ఒకడు పార్లర్ అమ్మాయి మీదకు. ఈలోపు తన ఫ్రెండ్‌కు మెసేజ్ పెట్టింది ప్రీతి. ‘‘నేను వీళ్లను మాటల్లో పెడ్తా.. నువ్వు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు కాల్ చెయ్’’ అని. పిల్లల వైపు తిరిగి ఏదో అడగబోతుంటే ఆ ఇద్దరు మగవాళ్లు విసురుగా దగ్గరకొచ్చారు. ‘‘ఇందాకటి నుంచి చూస్తున్నా.. ఏంటీ ఆరాలు తీస్తున్నారు. మీకెందుకు వివరాలు?’’ అన్నాడు ఒక వ్యక్తి. ‘‘పిల్లలు కదా.. ముచ్చటనిపించి పలకరిస్తున్నా.. మీకెందుకు అంత ఉలుకు?’’అన్నది ప్రీతి. ‘‘మాటలు తిన్నగా రానియ్’’ ప్రీతిని బెదిరించాడు ఇంకో వ్యక్తి. ఆ తీవ్రతకు బ్యూటీపార్లర్‌లోని సిబ్బంది బెదిరారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా బిక్క మొహం వేశారు. ఇంకోవైపు ప్రీతి ఫ్రెండ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫోన్ చేస్తోంది. టీమ్‌ను పంపిస్తాం అన్నారు కాని ఆ జాడే లేదు. ఈలోపు ఆ ఇద్దరు వ్యక్తులు పిల్లలిద్దర్నీ తీసుకుని పార్లర్ బయటకు వెళ్లబోయారు. ప్రీతి అడ్డుకుంది. ‘‘ఈ పిల్లలు మీకేమవుతారు?’’ అంటూ. ‘‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు’’ అని తోసి ముందుకెళ్లబోయారు. తూలిపడబోయిన ప్రీతి తమాయించుకుని, వాళ్లను వెళ్లనివ్వకుండా దారికి అడ్డంగా నిలబడింది. ఈ పిల్లలు మీకు సంబంధించిన వాళ్లే అయితే.. పదండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం. నాకెందుకో మీ మీద డౌట్‌గా ఉంది’’ అంది. ‘‘ఏం రుజువులు కావాలి? డీఎన్‌ఏనా?’’ అంటూ గారపట్టిన పళ్లను బయటపెడుతూ నవ్వాడు ఆ ఇద్దరిలో ఒకడు. ‘‘పోలీసులు అడుగుతారు ఏం వివరాలు కావాలో’’ అంటూ ఇంకోవైపు తన స్నేహితురాలికి సైగ చేసింది.. ఏౖమైంది? అంటూ. నో రెస్పాన్స్ అన్నట్టుగా ఆమె ప్రతిసైగతో ఆన్సర్ ఇచ్చింది, ఆందోళనగా.
ట్రాఫికింగ్ నుంచి విముక్తి
‘‘పదండి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు’’ అని ఇద్దరు మగవాళ్లతో అంటోంది ప్రీతి, ఇన్‌డైరెక్ట్‌గా తన ఫ్రెండ్‌కు పోలీస్‌కు ఫోన్ చెయ్ అనే హింట్ ఇస్తూ. వాళ్లను వెళ్లనివ్వకుండా కాలయాపన చేయడంలో భాగంగా వాళ్లతో సంభాషణ పొడిగిస్తోంది. ‘‘భయ్యా.. మీ పిల్లలే కావచ్చు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంలో తప్పు లేదుగా. ఒకవేళ మీ పిల్లలే అని తేలితే నేను క్షమాపణ కూడా చెప్తా. ఒక్కసారి పదండి’’ అని ప్రీతి బతిమాలుతుంటే బయట నుంచి ఇంకెవరో దారికి అడ్డంగా ఉన్న ప్రీతిని తోసేస్తూ ఆ పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్లిపోయాడు. ఆ పరిణామానికి హతాశురాలైంది ప్రీతి. ‘‘పోలీసులకు ఫోన్ చెయ్’’ గట్టిగా అరిచింది తన స్నేహితురాలిని ఉద్దేశించి. మళ్లీ ఒకసారి ఫోన్ కలపబోతుంటే పోలీస్ వ్యాన్ వచ్చింది. అది చూసి పారిపోబోయారు ఆ ఇద్దరు మగవాళ్లు. వాళ్లను పట్టుకొమ్మని పోలీసులను వారించింది ప్రీతి.పట్టుకున్నారు. ప్రీతి స్నేహితురాలు అనుకున్నట్టుగానే ఆ ఇద్దరు చిన్నపిల్లలిద్దరినీ ట్రాఫికింగ్ చేయబోతున్నారు. పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన వ్యక్తిని దాదాపు 45 నిమిషాలు చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఆ పిల్లల్లో పెద్దమ్మాయి వయసు పదకొండేళ్లు. చిన్నమ్మాయి వయసు ఏడేళ్లు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వాళ్లు చెప్పినట్టుగానే.. గుజరాత్ నుంచి వచ్చారు. ఆడపిల్లలని వాళ్ల అమ్మానాన్న ఆ పిల్లలను లక్షరూపాయలకు అమ్మేశారు. వీళ్లు ఇంకో లక్షకు ఈ పిల్లలను ఇంకో వ్యక్తికి అమ్మేశారు. ఆ కొన్న అతను ఆ రాత్రి ఈ పిల్లలను అమెరికా తీసుకెళ్లబోతున్నాడు. ప్రీతి అడ్డు పడటంతో వీళ్ల ప్రయత్నాలు ఫలించలేదు.
నాకెందుకులే అని ఊరుకోకండి
ఇంతగా ధైర్యసాహసాలు కనబర్చిన ప్రీతీ సూద్.. సినిమా, టెలివిజన్ నటి. ఆమె చొరవతో ఆ పిల్లల కథ సుఖాంతం అయింది. ‘‘తర్వాత ఈ విషయం తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్.. అందరూ తిట్టారు. ముంబైలో ఒంటరిగా ఉంటున్నావ్. ఇలాంటి పనులెందుకు నీకు? అలాంటి వాళ్లకు ముఠా ఉంటుంది. నీ మీద దాడి చేస్తే? అని భయపడ్డారు. ఒక్క క్షణం భయమేసినా.. పర్వాలేదు అనుకున్నా. నేను మాత్రమే బాగుండాలి అని అనుకోవడంలేదు. నా చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నా. ముఖ్యంగా అమ్మాయిల రక్షణ కావాలి. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే నాకెందుకులే అని ఊరుకోవడం నాకు చేతకాదు. అడ్డుకుంటే వాళ్లు రేప్పొద్దున నన్నేమైనా చేస్తారని భయపడ్డం మరింత అన్యాయం. అందుకే భయపడకుండా కళ్లముందు ఇలాంటి అనుమానాస్పద సంఘటనలు ఏవి ఎదురైనా వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఆడపిల్లలను రక్షించండి’’ అని అంటోంది ప్రీతి సూద్.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment