యుద్ధానికొస్తుందనో, ఆంక్షలు విధిస్తుందనో ఒక దేశం ఒక దేశానికి భయపడుతుంది. మహిళలకు భద్రత లేదన్న ఒకే ఒక విషయానికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి భయపడుతున్నాయి! అయితే మన దేశ ప్రతిష్టను రేప్‌ల కన్నా కూడా, రేప్‌లపై మన నాయకులు ఇస్తున్న స్టేట్‌మెంట్‌లే ఎక్కువగా ధ్వంసం చేస్తున్నట్లనిపిస్తోంది!
ఇటీవల బిహార్ పోలీసులు ఒక ప్రిన్సిపాల్‌నీ, ఒక టీచర్‌నీ, ఇద్దరు విద్యార్థుల్నీ అరెస్ట్ చేశారు. ఇంకో టీచర్ కోసం, పదిహేను మంది విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మొత్తం పద్దెనిమిది మంది! బాధితురాలు ఆ స్కూల్లోనే పదో తరగతి చదువుతోంది. క్లాస్‌మేట్స్ తననేం చేశారో వెళ్లి టీచర్లకు చెబితే టీచర్లూ అదే పని చేశారు. టీచర్లు తననేం చేశారో వెళ్లి ప్రిన్సిపాల్‌కి చెబితే, ప్రిన్సిపాల్ కూడా అదే పని చేశాడు. డిసెంబర్ నుంచీ జరుగుతోంది ఇలా. ప్రైవేట్ స్కూల్ అది. స్కూల్ ల్యావెట్రీలో, స్కూల్ అయిపోయాక స్కూల్ గదుల్లో ఆరు నెలలు ఆ బాలిక ప్రాణాలు ఆర్చుకుపోయాయి. వీడియో తీశారు. బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. అశ్రువులు, అశువులు ఆఖరి చుక్క దగ్గరికొచ్చాక ఇక ఓపిక లేక బయట పెట్టేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. ఇటీవలే ఢిల్లీ దగ్గరి గుర్‌గావ్‌లో ఒక బిజినెస్‌మేన్ తన కూతుర్ని, ఆమె ఫ్రెండ్‌ని సైబర్ హబ్‌కి తీసుకెళ్లాడు. కూతురు ‘లా’ స్టూడెంట్. ఈమధ్యే కెనడా నుంచి వచ్చింది. కూతురు ఫ్రెండ్ హరియాణాలోని ఒక యూనివర్సిటీలో చదువుతోంది. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచీ వీళ్లింటికొస్తుంటుంది ఆ అమ్మాయి. ‘అంకుల్’ అంటుంటుంది అతడిని. హబ్‌కి తీసుకెళ్లాక కూతుర్ని, కూతురి ఫ్రెండ్‌ని ఆల్కహాల్ తాగమని బలవంత పెట్టాడు. ‘ఏమైనా అయితే నేనున్నాగా’ అన్నాడు. ముగ్గురూ ఇంటికొచ్చారు. తర్వాత ఏం జరిగిందీ కూతురుకి గుర్తు లేదు. ఏం జరిగిందో ఆమె ఫ్రెండ్ ఎప్పటికీ మర్చిపోలేదు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. స్పృహ తెలియకుండా ఉన్నప్పుడు కూతురి గదిలోంచి కూతురి ఫ్రెండ్‌ని తన గదిలోకి నడిపించుకుని వెళ్లాడు అతడు.
ఘోరం అనిపిస్తాయి ఇలాంటివన్నీ. ఎవరు చేసినా ఘోరమే అయినా.. గురువులు, తండ్రులు చేసినప్పుడు ఇంతకన్నా ఘోరం లేదనిపిస్తుంది. కానీ ఉన్నాయి! యు.పి.లోని బల్లియాలో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.. ‘‘ఆ శ్రీరాముడే దిగి వచ్చినా ఇలాంటివి ఆపలేడు’’ అన్నప్పుడు ఆ మాట ఘోరాతిఘోరం అనే అనిపిస్తుంది. రెండేళ్ల క్రితం బెంగళూరులో డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకుంటున్న యువతుల ఒంటి మీద మూకుమ్మడి తాకిళ్లు పడినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ లీడర్ అబూ అజ్మీ ఇలాగే మాట్లాడారు. ‘‘ఒళ్లెంత కనిపిస్తే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు అమ్మాయిలు. చక్కెర ఉంటే చీమలు చేరవా?’’ అన్నారాయన! ఛత్తీస్‌గఢ్ హోమ్ శాఖ మంత్రి నంకీ రామ్ కన్వర్ అయితే ఇలాంటి అకృత్యాలకు ఒక పెద్ద కారణాన్నే కనిపెట్టారు! గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఇలాగే జరుగుతుందట! కంకర్ జిల్లాలోని ఝలియమరి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో టీచరు, వాచ్‌మన్ ఇద్దరు బాలికలపై ఆఘాయిత్యానికి పాల్పడినప్పుడు కన్వర్ ఆకాశంలోకి చూసి చెప్పిన మాట ఇది.
2013లో ముంబై శక్తి మిల్స్ కాంపౌండ్‌లో 22 రెండేళ్ల ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్కడే మళ్లీ ఓ 19 ఏళ్ల యువతి లైంగిక దాడికి గురైంది. రెండు ఘటనల్లో దోషులు కొందరికి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ వార్త ఉత్తరప్రదేశ్ వరకు ప్రయాణించి, ములాయం సింగ్ యాదవ్ చెవిలో పడింది. చాలా బాధపడిపోయారు ఆయన. ‘‘అబ్బాయిలన్నాక తప్పు చెయ్యకుండా ఉంటారా! ముంబైలో చూడండి. పాపం వాళ్లకు డెత్ పెనాల్టీ వేశారు. ఈ చట్టాల్ని మార్చాలి. తప్పుడు కంప్లయింట్ ఇచ్చిన వాళ్లకు కూడా శిక్ష పడాలి’’ అన్నారు ఈ మాజీ ముఖ్యమంత్రి.
హరియాణాలో ఆమధ్య అత్యాచారాలు వరుసగా జరిగినట్లు జరిగాయి. నెల రోజుల వ్యవధిలో 19 రేప్‌లు జరగడంతో రాష్ట్రం చేష్టలుడిగిపోయింది. ఎందుకిలా జరుగుతోందని ప్రభుత్వం తలపట్టుకుంది. జితేందర్ ఛతార్ అనే ఖాప్ పంచాయితీ లీడర్ మాత్రం పాయింట్ పట్టుకున్నారు. అబ్బాయిలు ఫ్రయిడ్ నూడిల్స్ తినడం వల్ల అమ్మాయిల మీదకు ఎగబడుతున్నారట! నూడిల్స్.. హార్మోన్లను ప్రేరేపించి, అబ్బాయిల చేత ఇలాంటి పనులు చేయిస్తున్నాయి తప్ప, వాళ్ల తప్పేమీ లేదట. ‘నిర్భయ’ విషయంలోనైతే ఎన్ని థియరీలు వచ్చాయో లెక్కేలేదు. ఇలాంటివి భారతదేశంలో జరగవట. ఇండియాలో మాత్రమే జరుగుతాయట. ఈ మాటన్నది ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భాగవత్. ‘‘గ్రామాలకు వెళ్లండి. అక్కడ ఈ గ్యాంగ్ రేపులు, సెక్స్ క్రైమ్‌లు ఉండవు. పట్టణాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి’’ అని ఆయన అబ్జర్వేషన్. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఈ సీన్‌లోకి వస్తారని ఎందుకనుకుంటాం? వచ్చారు! ‘‘చిన్న ఇన్సిడెంట్ వల్ల మనపై దుష్ప్రచారం జరిగి ఎన్ని బిలియన్ డాలర్‌ల టూరిజం డబ్బును పోగొట్టుకున్నామో తెలుసా?’’ అని వాపోయారు జైట్లీ. బాబుల్ గౌర్ యాదవ్ అని మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ ఒకరుండేవారు. ఇప్పుడూ ఉన్నారు. నిర్భయ ఘటన జరిగినప్పుడు ఆయన వయసు 82 ఏళ్లు. ‘‘నేరం అనేది స్త్రీ మీద, పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది (!). కొన్నిసార్లు అది తప్పవుతుంది. కొన్నిసార్లు ఒప్పవుతుంది. కంప్లైంట్ ఇవ్వనంత వరకు అది తప్పూకాదు, ఒప్పూ కాదు’’ అన్నారాయన. మీకేమైనా అర్థమైందా?!
సరస్వతి మంత్రం జపించినా, ‘భయ్యా’ అని పిలిచినా, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లకపోయినా ఇంతపని జరిగి ఉండేది కాదని ఆషారామ్ బాపూ థియరీ! ఒక టీనేజర్‌ని రేప్ చేసిన కేసులో జైల్లో ఉన్న ఆయన ఇప్పుడు బెయిలు కోసం ఏం మంత్రం జపిస్తున్నారో!రెండు రోజుల క్రితం యు.పి.లోని అంబేడ్కర్‌నగర్ బి.జె.పి. ఎంపీ హరి ఓం పాండే.. ఈ రేప్‌లకు, హత్యలకు ముస్లిములే కారణం అని ఓ ప్రెస్‌మీట్‌లో అన్నారు!! వాళ్ల జనాభా పెరిగిపోయి, దేశంలో అరాచకం రాజ్యం ఏలుతోందట! చెన్నైలో పన్నెండేళ్ల అమ్మాయిపై 17 మంది, చండీఘర్‌లో ఒక యువతిపై 50 మంది కొన్ని రోజులుగా లైంగిక దాడి చేశారంటూ వస్తున్న వార్తలు భారతదేశమంటేనే ప్రపంచానికి దడపుట్టేలా చేస్తుంటే..రేప్‌లకు కారణాలపై మన నాయకులు ఏమాత్రం ఆలోచన లేకుండా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ‘ఇంకో రేప్ ఎక్కడా జరక్కుండా ఉంటే బాగుండు దేవుడా..’ అని వేడుకోవాలనిపించేంత భయోత్పాతం సృష్టించేలా ఉంటున్నాయి. రేపిస్టులకు శిక్షలు ఉన్నట్లే, రేప్‌లపై బాధ్యత లేకుండా మాట్లాడే నాయకులకు శిక్షలు కాకున్నా, కనీసం శిక్షణా తరగతులున్నా బాగుండునన్న ఆలోచనలు కలిగించేలా కూడా ఉంటున్నాయి.
మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment