‘‘కనీసం భోజన సమయంలోనైనా ఫోన్‌లను పక్కన పెట్టండి’’ అని ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం! సందేశంగా ఇవ్వలేదు. అడిగారు. పోప్ అంతటివారే అడిగితే టైమ్ ఇవ్వలేమా?! కుటుంబ సభ్యులతో కూర్చుని భోంచేసే ఆ కొద్ది టైమ్!
మాధవ్ శింగరాజు
కొత్త రోజులోకి.. కొత్త సంవత్సరంలోకి.. కొత్త దశాబ్దంలోకి వచ్చేశాం! చివరి రెండంకెల్లోని ఒకటీ తొమ్మిది వెళ్లిపోయి, రెండూ సున్నా వచ్చాయి కనుక కొత్త దశాబ్దమే. విడిగా విలువ లేకపోయినా, పక్కవాటికి విలువ తెస్తుంది కనుక సున్నా కూడా అంకె కిందికే వస్తుంది. కాలం ముందు మనిషి కూడా సున్నానే. గుండు సున్నా. ఐనా ఆ సున్నా లేకపోతే కాలానికి విలువ లేదు. కాలం నిలువ లేదు. ఊపిరులు లేకపోతే వాయువనేది ఒకటుందని తెలుస్తుందా? కాలమూ అంతే. పక్కన మనిషి లేకుండా కాలాన్నీ చూడలేం, కొలవలేం. ఆ మనిషి కూడా ఊరికే కూర్చొని ఉంటేనో, ఊరికే నిలుచుని ఉంటేనో, ఊరికే పడుకుని ఉంటేనో కాలానికి కౌంట్ ఉండదు. గోడ మీది గడియారం ఆగిపోయినట్లు ఆగిపోతుంది. మనిషి పని చేస్తుండాలి. పరుగులు తీస్తుండాలి. అప్పుడే ఉత్సాహం. ఆరోగ్యం. మనిషికీ, కాలానికీ. ఈరోజు సాయంత్రానికి ఇవాళ మన రోజెలా గడిచిందో తెలుస్తుంది.
నిన్న సాయంత్రం ఏడాదంతా ఎలా గడిచిందో పడమటి గది తలుపులు తెరిచి ఉదయిస్తున్న మసక చీకటిలో చూసుకునే ఉంటాం. పది ఏడాదులు ఉండిపోయిన దశాబ్దాన్నీ.. ఈ కొత్త దశాబ్దపు తొలి రోజున.. జ్ఞాపకాల వత్తిని కాస్త పెద్దది చేసి కాలాల నీడల్ని ఒకసారి తడుముదాం.‘నిర్భయ’తో మొదలై, ‘దిశ’తో ముగిసింది ఈ దశాబ్దం! అమానుష ఘటన నుంచి.. అభయమిచ్చే చట్టం వరకు. మధ్యలో మిగతావన్నీ కాలానుగతంగానో, కాలంలో భాగంగానో జరిగినవే. వాటిని బట్టి చూస్తే.. ఉల్లిపాయల కరువుతో మొదలై ఉల్లిపాయల కరువుతో ఈ దశాబ్దం ముగిసినట్లు! 2010 డిసెంబర్‌లో ఉల్లిపాయల కోసం దేశం తల్లడిల్లడం ఆ ఏడాది ప్రధాన విశేషం. ఉత్తరప్రదేశ్‌లో ఒకే నెలలో ఆరు రైలు ప్రమాదాలు జరగడం, పదిహేనవ జనాభా లెక్కల సేకరణ, బాలలకు నిర్బంధ ఉచిత విద్య.. మిగతావి. ‘నిర్భయ’ ఘటన 2012 డిసెంబరులో జరిగింది. ఆ ముందువరకు.. అజ్మల్ కసబ్ ఉరితీత, ‘అండర్ అచీవర్’ అని ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ‘టైమ్’ పత్రిక రాయడం, ఇండియా పార్లమెంటు 60వ వార్షికోత్సవం.. ప్రధానంగా గుర్తుండే విషయాలు.
స్వామీ వివేకానంద 150 వ జయంతి, పబ్లిక్ టెలిగ్రామ్ సర్వీస్ నిలిచిపోవడం, ఇస్రో ‘మార్స్’ ప్రయోగం, స్వచ్ఛభారత్, జీఎస్టీ, ఇరోమ్ షర్మిల పదహారేళ్ల నిరశన దీక్ష విరమణ, పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, కర్తార్‌పూర్ కారిడార్, అయోధ్య తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం.. ఇవన్నీ నిర్భయ ఘటన తర్వాత ఈ పదేళ్ల పరిణామాలు. ఒక దశాబ్దంలో ఇన్ని జరిగినా నిర్భయతో మొదలైన దశాబ్దంగానే 2010–2019 మిగిలిపోవడానికి కారణం.. నిర్భయ చట్టం వచ్చాక కూడా దేశంలో అఘాయిత్యం జరగని రోజు, జరగని ప్రాంతం లేకపోవడం. ఒక దశాబ్దంలో ఎన్ని చట్టాలు వచ్చినా ‘దిశ’ యాక్ట్‌తోనే ఈ దశాబ్దం నిలిచిపోవడానికి కారణం.. శిక్షకు ‘డెడ్ లైన్’ పెట్టడం. నిర్భయ యాక్ట్ ఆ పని చేయలేకపోయింది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ (ఇదే నిర్భయ యాక్ట్), వర్క్‌ప్లేస్ హెరాస్‌మెంట్ యాక్ట్.. రెండూ ఈ దశాబ్దంలో(2013) వచ్చినవే. పురుషుల్ని సవరించే చట్టాలివి. ఈ సవరణ లాభం లేదని తేలిపోయింది.
ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘చక్కదిద్దే’ దిశ యాక్ట్ ఒక్కటే ఇప్పుడు భరోసా. ఈ కొత్త దశాబ్దపు ఆరంభం నుంచే భరోసాలు ప్రసాదించే మరికొన్ని మార్పులు కూడా సంభవిస్తే బాగుంటుంది. పేషెంట్‌లను ఎదురుగా పెట్టుకుని వాట్సాప్ చూస్తుండే డాక్టర్లు మారాలి. క్లాస్‌రూమ్‌లో పిల్లల్ని వాళ్ల కర్మకు వాళ్లను వదిలేసి ఫేస్‌బుక్‌లోకి వెళ్లిపోయే టీచర్లు మారాలి. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినవాళ్లను ‘ఆ.. ఏంటి?’ అని ఒక మాట అడిగేసి, ఫోన్‌లో మీమ్స్‌ని చూస్తూ నవ్వుకుంటుండే పోలీసులు మారాలి. ఇంకా.. సమస్త వృత్తుల సకల జనులు తమ చేతిలోని ఫోన్‌కి తమ ఉద్యోగ బాధ్యతల్ని, పౌర విధుల్ని బలి చేయడం మారాలి. ‘‘కనీసం భోజన సమయంలోనైనా ఫోన్‌లను పక్కన పెట్టండి’’ అని ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం! సందేశంగా ఇవ్వలేదు. అడిగారు. పోప్ అంతటివారే అడిగితే టైమ్ ఇవ్వలేమా?! కుటుంబ సభ్యులతో కూర్చుని భోంచేసే ఆ కొద్ది టైమ్! ∙
Comments
Please login to add a commentAdd a comment