
ఎప్పుడూ కనిపించే అమ్మాయి కూడా దుపట్టా మార్చగానే కొత్తగా కనిపిస్తుంది! దుపట్టాలోని విశేషమే అది. అయితే, మీరెంతో ఇష్టపడే దుపట్టాపై టమాటో సాసో, గ్రేవీనో, చాక్లెట్ మరకో పడితే వాటిని తేలిగ్గా తొలగించే ఉపాయాలు కూడా తెలిసుండాలి. అప్పుడే మీ దుపట్టా కొంచెం కూడా హర్ట్ అవకుండా మీరు ఆ మరకల్ని తొలగించుకోగలరు.
కాటన్ దుపట్టాపై మరక పడితే: ఓ కప్పు గోరు వెచ్చని నీళ్లలో రెండు టేబుల్ స్ఫూన్‌ల బేకింగ్ సోడా వేసి బాగా కలియదిప్పండి. ఈ నీళ్లను దుపట్టాపై మరక పడిన చోట పోయండి. పదిహేను నిముషాలు ఆగాక చల్లటి నీటితో కడిగేయండి. అంతే. మరక మాయం!
సిల్క్ దుపట్టాపై మరక పడితే: మరక పడిన చోట మొదట కొన్ని చుక్కల నీళ్లు పొయ్యండి. (చన్నీళ్లే). తర్వాత నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో మృదువుగా మరకపై రుద్దండి. తర్వాత ఎప్పటిలా ఉతికేయండి. అయితే అందుకు మీరు ఉపయోగించే బట్టల సబ్బు, లేదా పౌడర్ మరీ శక్తిమంతమైనది కాకుండా ఉండాలి. లేదా అది సిల్క్ దుస్తుల కోసమే తయారు చేసిన సబ్బు గానీ పౌడరు గానీ అయి ఉండాలి.
నెట్ దుపట్టాపై మరక పడితే: ఒక పాత్రలోకి ఒక కప్పు చల్లటి నీటిని, ఒక టీ స్పూను (టేబుల్ స్పూను కాదు. గుర్తుంచుకోండి) తేలికపాటి డిటర్జెంట్ పౌడర్‌ను వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని దుపట్టాపై మరకపడిన చోట పోసి, వలయాకారంలో వేళ్లతో మృదువుగా రుద్దండి. మామూలుగానే మృదువుగా రుద్దాలి. ఇది నెట్ క్లాత్ కనుక మరి కాస్త మృదువుగా రుద్దాలి. టీ మరకలను, జ్యూస్ మరకలను కూడా ఈ మిశ్రమం పోగొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment